Monday, April 16, 2018

లోపాముద్ర


కలువలు నడిరేయినే వికసిస్తాయి.. అలానే స్త్రీ సహజ సౌందర్యం కూడా నడిరేయినే ఉదయిస్తుంది.. నిజమైన ఆమె సౌందర్య కాంతిని దర్శించాలంటే ఆమెను నడిరేయినుండి మొదటి జాము లోగా చూడాల్సిందే.. అలాంటి ఓ దర్శన సౌందర్యాన్ని కాస్త పాత పద్దతులను అనుసరించి ఆనాటి ఓ కొత్త లోకానికి తీసుకెళ్ళే చిరు ప్రయత్నమే ఈ కవిత.. 

వేదంలో మంత్ర ద్రష్టలయిన స్త్రీలు కొందరు ఉన్నారు.. వారినే ఋషీకలంటారు. వారు చాలా నిష్టాతులు మరియు అపరిమిత సౌందర్యులు కూడా.. వారిలో ఒకరి పేరే ఈ “లోపాముద్ర” చదివి అభిప్రాయాలు చెప్పాలి మరి.. 

లోపాముద్ర 
**********


అదో ప్రభాతసమయము
మయూరి వనమున
నేనో యవ్వన భ్రమరమునై తచ్చాడువేళ..
శ్వేత హంసలు .. రెక్కల సందున 
తలలు దూర్చి నిదురించు వేళ..
ఏపైన వరి పైరు వయ్యారాలు పోయే వేళ.. 
తీగమల్లెలు గుప్పుమని పరిమళాలు చిందించు వేళ.. 
తుమ్మెదల జుంజుముల ధ్వనితో అటు తిరిగిన నాకు 
స్నానార్ధపు దిగుడు కోనేరు గట్టున,
పసిడికాంతుల దేహమునకు, 
పలుచైన వస్త్రమును చుట్టి, 
కస్తూరి, పసుపు, చందనాదుల లేపనము 
బాహువులకు అతి సున్నిత పూత లలుకు
“లోపాముద్ర” పాణి పై దృష్టి నిలిచింది.. !!


ఆమె సౌందర్య సౌష్ఠవము కోనేరున పడి 
కోటికాంతుల వెండి వెలుగులై నల్దిశలా ప్రసరిస్తున్నాయి.. 
లేపనము అలికిన ప్రతీసారీ ఆమె చేతి గాజుల గలగలలకు 
నీటి బాతులు రెక్కలనాడిస్తూ కొలనును 
ఊయలలూయిస్తున్నాయి.. 
ఆమె చేతికంటిన పసుపు తగిలి 
వాటి రెక్కలు పసిడి కాంతి ముద్దులొలుకుతున్నాయి.. 
అదో అందమైన దృశ్యం.. 
వర్ణించలేని అద్బుతమైన అదృశ్య దర్పణం..!!


అప్పుడే మొదలైంది.. 
ఢమ ఢమల ఉరుములతో, 
ధగ ధగ ల మెరుపులతో .. 
ఆమెను ఆక్రమించాలనే తపనలతో 
వరుణుడు ఆగమేగాలపై లంఘించుచున్నాడు.. 
తన అకాల ఆగమనమును గుర్తెరిగిన ఆమె 
ఏక ఉదుటున లేచి నిల్చున్నది.. 
ఆ పడతి సౌందర్య రక్షణకు మయూరములే పురివిప్పి నిల్చున్నవి.. 
పుడమిని ముద్దాడే ఆమె నీలి కేశములు 
వ్రేల్లాడే లతల్లా ఆమె హృదయ గోపురముల పై 
నుంచి జాలువారి ఉన్నాయి.. 
మయూరముల చాటున పదయారు గజముల చీరను చుట్టి.. 
ముత్యాల హారాలు ముత్తైదుగ పెట్టి..
కస్తూరి తిలకము కడు రమ్యముగ రాసి.. 
కాటుక కన్నులతో, 
నేరేడు కనుపాపలతో, 
నెలవంక కనుసోగలతో, 
శంఖపు మెడ వంపులతో, 
మధుర తొనల అధరములతో,
లయనానందకరిలా,
పురివిప్పిన శ్వేత మయూరములా.. 
గులాబీ వర్ణ పాద సౌకుమార్యముతో.. 
చెంగు చెంగున పసిడి లేడిలా కొంగైకెత్తుకొని 
సప్త స్వరాల అందియలను మీటుతూ కళ్ళముందే కదలిపోయింది.. !!


లిప్త కాలములో జరిగిన ఆ సౌందర్య దృశ్యం
ఆఖరి కట్టె కాలేవరకు కళ్ళముందే కదులుతూ ఉంటుంది..!!

Written by : Bobby Nani

5 comments:

  1. బయ్యా ఇలాంటి అద్భుతమైన అపురూపమైన సౌందర్య పదాలు రాయడం నీకే సాధ్యం. కవి కాళిదాసు వర్ణన కనిపిస్తుంది.

    ReplyDelete
  2. బుచికి గారు కొంచెం అతి చేస్తున్నారు గానీ కవిత్వంలోని భావం బాగుంది - దృశ్యం మరీ అద్భుతం, జీరాదే వస్త్రంలో నెమలి పించం కలిపేశారు!

    ReplyDelete
  3. బాగుంది కానీ లోపాముద్ర అగస్త్య మహాముని గారి భార్య. తన భార్య సౌందర్యవర్ణన ఇతరులు చేస్తే శపించెయ్యగలడు జాగ్రత్తండి 🙂.

    ReplyDelete
    Replies
    1. లోపాముద్ర గురించి చాలా కధలు ఉన్నాయండీ.భర్తని ఆకర్షించడానికి లోపాముద్ర కోనేటిలో స్నానం చేస్తున్నపుడు అగస్థ్యముని కి కలిగిన భావననే కవి వర్ణించారనుకుంటున్నాను.

      Delete