Thursday, November 30, 2023

నిశిలో శశి...


 

ఈ సృష్టిలో ప్రతిదీ అద్భుతమే.. నువ్వు మనసారా చూడగలగాలి అంతే…

ఈమె ఎవరో అప్పుడే పూచిన తంగేడు పువ్వులా అనిపించింది నాకు … అందుకే చిరు అక్షర నిరాజనం..

ఒక స్త్రీ లో మాతృత్వం మాత్రమే కాదు దాతృత్వం, రసికత్వం, ఇలా సప్త గుణ ధాతువులు వుంటాయి.. అలా ఉన్న స్త్రీ ఎవరైనా సరే ఆమె దేవతా స్వరూపమే..!

నిశిలో శశి
**********

తన
కన్నులు మాట్లాడే
కలువ భాషను
ఏ చరిత్రకారుడు వ్రాయగలడు..!
ఏ  చిత్రకర్ముడు గీయగలడు..!

అచెంచల కమలా మృద్వీయ  తన  సొంపును జూడ,
రాజీవగంధి యస్యా స్సౌరభవ తన సొబగును జూడ,
ధవళ కుసుమా వాసిత త్రివళ లలిత కళంకిత..!
నీలి వర్ణ పరిమళ మన్మంద హాసినీ విలాసిత..!
చంద్రకాంతి మయమగు ముఖస్యోభిత వదనిత..!
గాండీవమ్ముల పూబోణి కనుసోగల మకిలిత..!
సౌందర్య విలాస విభ్రమాది సౌశీల్యంబుల మాలిన్యత..!
శృంగార లీలా వినోదా లస లాలిత్య సమ్మోహనా  నిశిత..! సమ్మోహిత..! మా మనస్తిత..!!
ఇలాంటి మాటలు ఎన్ని రాసిన తన ముందు సరితూగవేమో..!!
కారణం ఏంటో తెలుసా ?
ఒకపక్క
ఉత్తరపు దిక్కు
మలయమారుతం
మరోపక్క
కార్తీక మాసపు చలి కౌగిలి
రెండూ  కలగలిపిన నిశిలో శశి తాను..!!

ప్రభాత వేళ లలితోద్యాన పిక,శుకాలాపములతో
ప్రతిధ్వనించు తన  గంధర్వ కంఠ మాధుర్యంబులు
మిన్నులతో రాయు సువర్ణ సౌధరాజములతో
ప్రకాశించు తన విశ్వంకరములు
శృంగార నారీకేళ ఫల వృక్ష నివహములతో విరాజిల్లు
తన దేహ శృంగారంగంబులు
చైత్రరథమును మించు  నీలవేణి దేహ
రమణీయోద్యానమ్ములు 
దివ్య ప్రబంధయుగాస్యములగు
ముదితనితంబి నీరజన చతుర విలాసోక్తులు
రమణీయ మధుర సుగంధ పుటరటులతో,
లేత చివురు పాదాల అందియలు మ్రోగు
ఘంటా నినాద  పటపటాత్కార క్రేంకారములతో
తన ఆపాద మస్తకం ఓ అందాల శైవాలము..!!

Written by : Bobby Aniboyina 
Mobile: 9032977985

Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr

Wednesday, November 22, 2023

ఆమె కౌగిలి ..


భార్య భర్తలు అంటేనే ఈ రోజుల్లో ఓ కామెడీ అయిపోయింది. ఆ బంధానికి విలువ ఇవ్వకపోగా అపహాస్యం చేస్తున్నారు అంటే బంధాల విలువ వారికి తెలియదు అనే అర్ధం. అన్ని బంధాలు గొప్పవే వాటికన్నా గొప్పది భార్య భర్తల బంధం.. వేరు వేరు ప్రాంతాల వారు, వేర్వేరు అభిరుచుల వారు, వేరే వేరే మనస్తత్వం కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో వుంటున్నారు అంటే కనిపించేంత సులువైన విషయం కాదది.

ఆలుమగలు అంటే రెండు శరీరాలే కాదు..

రెండు మనసులు కూడా

పూర్తిగా ఒకరికొకరు చదివిన పుస్తకం లా తెలుసుకొని వుండాలి..!!

రెండు శరీరాలు ఏకమై

రెండు మనసులతో ఒకే పుస్తకమై

తొమ్మిది రసాలను సిరాగా చేసి

ఏక కలంతో రాసుకునే రంగులమయ జీవితం వారిది..!!

భార్య అనే ఆలయానికి

అలసి పయనించే యాత్రికుడు భర్త..

సజ్జనుడికి స్వర్గధామం భార్య...

సృష్టికర్త వ్రాసిన బంగారు చిత్రపటం భార్య,

భర్తే పరికించ గలడు..

దేవుడిచ్చిన మణిమాల భార్య,

భర్తే ధరించగలడు ..

స్వర్ణలిఖితం భార్య,

భర్తే పఠించగలడు ..

అందుకే యెంతటి వాడైనా కాంత దాసుడే అని అందరూ అంటుంటారు.. “కాంత”కు “దాసీ” అనేది పక్కన పెడితే ఆ కాంతే అన్నీ తనకు అని భావించే భర్తలు లేకపోలేదు. ఉదయం నుంచి అలసి శ్రమించిన భర్త సంధ్యాస్తమ సమయానికి ఇంటికెళ్ళి ఆ కోమలాంగి ఎదపై సేదతీరే ఓ మధుర భావన ఇది. ప్రతీ భర్త ఇంటికి వెళ్ళాక తన అర్ధాంగిపై వాలి తనతో ఎన్నో పంచుకోవాలని తపనపడతాడు.. కాని ఎన్నో అడ్డంకులు .. వాటిని అన్నింటిని పక్కన పెట్టి అలా కౌగిలిని ఆనందించే వారు నేటి కాలంలో అరుదు.. అలాంటి అరుదైన పరిణాయకులకు నా ఈ “కౌగిలి” కవిత అందజేస్తూ ...

ఆమె కౌగిలి ..

***********


ప్రాపంచిక బాధల్ని మైమరిపించే

మహాదానందముంది ఆమె కౌగిలిలో..

మలినబుద్దులన్నీ అనిగిపోయి

నిశ్చింత మాత్రమే అనుభూతి పర్చుకుంటుంది ఆమె కౌగిలిలో..

ఎన్నోసార్లు నా పగిలిన దుఃఖాలన్నీ నా మెడ వంపునే ప్రవహించాయి..

లే లేత కుసుమాలు గుచ్చుకునే ఆ ఎద మంచంపైనే

నా చంపల వ్యధలన్నీ తేరుకున్నది.. !!


ఏమీలేని ప్రపంచంలో హఠాత్తుగా

ఒక రోదన లేని ప్రత్యక్ష ప్రదేశం లభ్యమైనట్లు నా కనిపించింది .. ఆమె కౌగిలిలో...

ఇంకెక్కడా లేని నిర్భయపు స్థలం

ఆ కోమలమైన చేతుల్లోనే నిక్షిప్తమైవుంది...

మనసంటూ వున్నా..

మరీ ఇంత స్వచ్చంగా ప్రేమిస్తారా..!! నన్నెవరన్నా .. !!

మీ నుంచి జన్మించినా ..

తిరిగి నన్ను పిల్లాడిని చేస్తారా ఎవరైనా ... ఒక్క ఆమె స్పర్శ తప్ప.. !!

నా జీవన పరితాపాన్ని తొలగించి,

నా స్వాప్నిక కాలాన్ని పరిశుభ్రం చేసి,

నా దుఃఖిత భయవిహ్వాల సమయాన్ని చేత్తో తీసిపారేసి,

నా కళ్ళని ఆనందాలతో మెరిపిస్తాదా ... !! ఒక్క ఆమె తప్ప.. !!

ఆమె కౌగిట్లో విసుగులేని మాతృత్వం విస్త్రుతమై వుంటుంది..

నన్నెవరన్నా ఇలా హత్తుకున్నారా ఎప్పుడైనా ??

వ్యధా, వేదనలు చెదిరిపోయేలా... నా తల నిమిరారా ఎవరైనా ??

అమ్మా, నాన్నలు ఒక్కళ్లే అయి ... నా కళ్ళు తుడిచారా ??

అయిదేళ్ళ బాల్యాన్ని ఆమె అమ్మకు ఆపాదించి...

విరిగిపోయిన తల్లి ఆవేదనల్ని ఎదిగిన ప్రేమమూర్తిలా

ఆమె లే లేత చుంబనాలలో బాధల్ని ప్రక్షాలించింది..

నా మనసంతా తీసి ఆమె మెడలో వేళ్ళాడదీసినట్లు

ఆమె చేతుల్లోకి నన్ను లాక్కొని, కౌగిలించుకొని

నా తలను తనకానించుకొని

తిరిగి తిరిగి నన్ను కస్టాల్నుంచి పునర్జీవింపజేసింది ఆమె కౌగిలి..!

అవును మరి ఆమె కౌగిట్లో,

కోటి జీవితాలకు సరిపడా నిశ్చింత శాంతి సోపాలున్నాయి.. !

అందుకే ఆమె కౌగిళ్ళలో నా ప్రాపంచిక బాధల్ని గప్చిప్గా మర్చిపోతున్నాను..!!


Written by: Bobby Aniboyina

Mobile: 9032977985


Blog: http://bobbynani.blogspot.com/


Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr

Thursday, November 9, 2023

ఇదిగో అమ్మాయిలూ మీకే చెప్తున్నా యాద్ ఉంచుకోండి...!!

 


ఇదిగో
అమ్మాయిలూ మీకే చెప్తున్నా యాద్ ఉంచుకోండి...!!

మన మార్కెట్లోకి కొత్త కొత్త ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) యాప్స్ చాలా అంటే చాలా వచ్చి ఉన్నాయి.. కొందరు ప్రీమియం కట్టి మరీ వాటిని తెగ వాడేస్తున్నారు.. ఇక్కడ వరకు అంతా బానే ఉంది..

వాళ్ళు ఎలా వాడుతున్నారు అనేదే చాలా ముఖ్యం

మీరు సోషల్ మీడియాలో పెట్టే ఫోటో ఏదీ సేఫ్ కాదు ఇది గుర్తుంచుకోండి.. మీరు గుడికి వెళ్లి అక్కడ ఫోటో తీసుకొని పెట్టిన కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా పబ్బులో ఉన్నట్లు సగం సగం బట్టలు వేసుకున్నట్లు.. ఒక్కోసారి ఏమీ లేకుండా కూడా చాలా ఈజీగా క్రియేట్ చేస్తున్నారు.. అంతెందుకు ఈ టూల్ ద్వారా న్యూడ్ వీడియోస్ కి కూడా మీ ఫేస్ తీసుకొని చాలా ఈసీ గా క్రియేట్ చేస్తున్నారు..

ఇలా మీ వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా మీరే అనుకొని పొరపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.. దాని ద్వారా కొన్ని జీవితాలు కూడా కోల్పోవచ్చు.. మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యునిగా చెప్తున్నాను.. దయచేసి ఎలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టొద్దు.. ఎవరిని నమ్మి మీ ఫోటోలు షేర్ చేయొద్దు..!!

ఇక్కడ ఎవరు కరెక్ట్ గా లేరు

ఒకప్పుడు హ్యాకర్స్ కి భయపడే వాళ్ళం.. ఇప్పుడు వాళ్లను కూడా శాసిస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. రేపటి తరానికి ఇది ఒక మాయని మచ్చ నా దృష్టిలో.. ఎందుకంటే ఇందులో మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంది..!

కొన్ని రోజులుగా చాలామంది వాళ్ళ వాళ్ళ ఫొటోస్ ని వేరే వేరే బాడీలతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెట్టుకొని చాలా సంబరపడిపోతున్నారు.. ఈ సరదా ఇక్కడ వరకు ఉంటే బాగుంటుంది.. ఇది చాలా బేసిక్ మోడల్.. ఇప్పుడు దీనికి చాలా అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చి ఉన్నాయి.. ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి మా..!!

సరదా సరదా లాగే ఉంటే బాగుంటుంది అది కుటుంబంలో దుఃఖాన్ని కలిగించే లాగా ఉండకూడదు..

కొంచెం జాగ్రత్త వహించండి..

Written by: Aniboyina Bobby
Mobile: 9032977985


Saturday, November 4, 2023

శ్వేత మధుకము (White Peacock)


 

ప్రకృతి తత్వాన్ని, స్త్రీ అంతరంగాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. వాటికి తగ్గట్లు మనల్ని మనం అన్వయించుకుంటూ ఉండాలి. రెండిటిలో ఏది వికటించినా అది  ప్రళయమే అవుతుంది. అందుకే అంతర్ముఖుడనై సంధిస్తున్నానిదిగో ఉత్ప్రేక్ష, రస, భావ త్రిపుట కవిత్వాలను మేళవింపుగా..!!


సుదతి సౌమ్య సంధ్యారుణ వర్ణితం

ముదిత సౌమ్య మాధుర్య రస శోభితం

పడతి సౌమ్య సౌదామినీ వద కేతనం

వనిత సౌమ్య తాంబూల సుమ చర్వణం !!

 అనిర్వచనీయమైన ఓ  అందాన్ని చూసినప్పుడు  ఒక కవి హృదయం సహజ సిద్ధంగానే ఉప్పొంగి, పరవళ్ళు తొక్కటమనేది పరిపాటే.. అలాంటి ఓ శుభ తరుణంలో చిత్తరువు పై రాలిన కొన్ని అక్షర సుమాలివి.. చదివి అభిప్రాయం చెప్పాలి మరి..!!

 

శ్వేత మధుకము (White Peacock)

*************************

తనని  మొదటిసారి చూసింది నీలవర్ణపు వస్త్రధారణలోనే ..

ఏమి లావణ్యమో..!

ఎంతటి సౌందర్య ఉద్దీపనమో ...!!

చూడగానే  ఓ దైవిక అనుభూతిని కలిగించింది.

చూస్తూన్నంత సేపు ఎంతో  ప్రశాంతత

మాట్లాడుతూన్నంత సేపూ  ఏదో తెలియని గొప్ప అనుభూతి .. !!

 

తన చూపుల్లోని  ఆధ్యాత్మికత

తన వదనములోని అమాయకత

తన కులుకుల్లోని వయ్యారములు

తన ధాతువుల్లోని ప్రకాశములు

తన పెదవంచుల్లోని  చిలిపి నవ్వులు

తన పాదద్వయముల్లోని లత్తుక శోభలు 

ఏ "కవి" వర్ణించగలడు..!!

 

ధనుస్సు లోని "ధనూష" మును

సూర్యుని లోని "రేతస్సు" ను

పున్నమి లోని "వెన్నెల" రజనును

క్షీరము లోని  "మధురిమ" ను

పుణికిపుచ్చుకున్న "శ్వేత మధుకము" తాను ..!!

 

ఎన్ని జన్మల తపస్సు  చేసుంటాడో ఆ బ్రహ్మ

తన దైవీక ఉలినుంచి  తగు మెళుకువలు నేర్చి

రసరమ్య మగు ఈ "అంగన"ను మలచడానికి ..!!

ఎన్ని కులుకులు నేర్పించి ఉంటాడో ఆ అంగజుడు

తన నఖశిఖ పర్యంతము నవనీత నడుమొంపుల

మిసి మిసిల మెరుపులకు, కులుకు సింగారాలు పొదగడానికి ..!!

 

ఎవరు తాను ?

నింగికి నీలిమనా

లేక

పరువానికి ప్రణయినినా ..!!

అదేంటో

తన రాకను తనకన్నా ముందు

తన దేహ పరిమళం ఇట్టే చెప్పేస్తుంది..!!

తానెప్పుడూ విచ్చుకున్న పద్మము లా,

చిరునవ్వు మోము తో .. వెన్నెల కాంతివోలె  ఉంటుంది..!!

ముంగురులేమో ఊగే మేఘాలవలె,

నెమలి పింఛములవలె ఉంటాయి ..!!

ఆ కనుబొమ్మలు చూడు గాండీవములా

ఎలా  వంగి, చూపుల శరములను ఎక్కుపెట్టి

నేరుగా  హృదయానికి సంధిస్తున్నాయో ..!!

ఆ నేత్రాలు చూడు తెల్లతామర రెక్కలను

నల్ల కలువ రేకులను కలగలుపుకొని

లేడి కన్నులను ధిక్కరించుచునట్లున్నాయి..!!

ఆ నాశిక చూడు సంపంగి మొగ్గవలె,

కాడికి కట్టిన నాగలివలె

మదిని దోచేందుకు  ఎలా సిద్దముగా ఉందొ..!!

ఆ అధరములు చూడు దోర దొండ పండ్లలా,

అమృత రసాన్ని ఎలా స్రవిస్తున్నాయో..!!

  కంఠం చూడు శంఖంలా..

సంపంగి చెట్టు కాండంలా ఎంత అందంగా వుందో..!!

 

తన తనువు లోని అణువణువూ ఓ  అద్భుతమే..!

తన ఆపాదమస్తకమూ ఓ అజరామరమే..!

 

స్తనములు పూర్ణకుంభములవోలె 

నడుం మడతలు తరంగములవోలె

నాభీయము తామర మొగ్గవోలె

పిక్కలు బంగారు సన్నాయివోలె

పాద పద్మమ్ములు పద్మాలవోలె

ముంజేతి మునివేళ్ళు లేత చివుర్లవోలె

తనలోని ప్రతీది ప్రతిభాసమాయములే..!!

 

ఆమె సౌందర్యాతిశయాన్ని చూస్తే

మానవ మాత్రులే కాదు..

దేవాదిదేవతలు సైతం ముగ్ధులై ముడుచుకుపోతారు.. !!

శుద్ధ సువర్ణచ్చాయ గల ఆ దేహం,

ఆ రూపురేఖా విలాసాలు,

కిన్నెర కాంతలను తల తన్నే విధంగా వున్నాయి.. !!

 

అందుకే

నిజంగానే తానొక అద్బుత క్షేత్రం,

తనది అరుదైన స్త్రీ తత్త్వం..!!

 

Written by: Bobby Aniboyina

Mobile: 9032977985

Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr

Blog : http://bobbynani.blogspot.com/

Wednesday, November 1, 2023

వర్షం వెలసిన ఓ సాయంత్రం ...

 

కొన్ని అనుభూతులకు మాటలుండవబ్బా గప్చిప్గా అనుభవించాల్సిందే .. అలాంటి వాటిల్లో ఓ దృశ్యం ..!! అప్పుడే వర్షఋతువు ముగిసి శరదృతువు మొదలౌతూవుంది తల్లి ఒడిలో పాలుతాగే పసి పిల్లాడిలా పశ్చిమ కనుమల్లో ఒదుగుతున్నాడు నారింజ సూరీడు ..!! గాలిపటం ఎగరేసే పిల్లాడు ఆకాశాన్ని అందుకున్నట్లుగా ఎంత సంబరపడి పోతున్నాడో ఎన్ని కేరింతలు కొడుతున్నాడో..!! దుమ్ముకూడా ఎగరని నిర్లిప్తమైన ఓ ప్రశాంతతని పాకుతూ ఆవరిస్తున్న చీకటి మెల్లిగా చెరిపెయ్యడం చూస్తున్నాను ..!! కొన్ని చూడటం సరిపోదు.. కానీ చూసినంత మేర ఆ ప్రపంచాన్ని మన ప్రపంచంగా మార్చేసుకోవాలంతే..!! పిల్ల తెమ్మెరకు పులకరించిన మేఘం అప్పుడే చినుకులు రాల్చి పోయింది రోమాలు నిక్కపొడిచేలా చలిగాడ్పులు మొదలయ్యాయి..!! ఆశ్వీయుజ చవితి రోజున కూడా వెన్నెల ఎందుకో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది..!! పొద్దున ఎంతో అందంగా వికసించిన పుష్పం కళ్ళముందే నిర్జీవంగా రాలడం నే చూస్తున్నా..!! నేను చెప్పాలనుకున్న మాటలన్నీ గాలి తెమ్మెరలు నాతో ఊసులాడిపోతున్నాయి.. ఎందుకో ఈ అస్తమయపు కొండగాలి హృదయాన్ని కోతపెడుతోంది ..!! వీధిలోని ఇంటి తలుపులన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి దీపాల వెలుగులు మెల్లిగా కాంతులిడుతున్నాయి ..!! పొద్దున రావాల్సిన ఉత్తరం కోసం నేనింకా ఎదురుచూస్తూనే వున్నాను.. నాకు తారసపడ్డ ఈ ఏకాంత క్షణాలలో గడచిన ఎన్నో సాయంకాలాలు గప్చిప్గా కరిగిపోయాయి..!! కాలం ముందుకు వెళ్తున్నట్లే ఉంటుంది కానీ మళ్ళి మళ్ళి మనల్ని వెనక్కు తీసుకెళ్తుంటుంది..!! Written by: Bobby Aniboyina Mobile: 9032977985 Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr