అదో..
ప్రాతఃకాల సమయం
గ్రీష్మఋతువు ముగుస్తూ,
వర్షఋతువు
మొదలౌతున్న సమయమది..!!
దూరపు కొండలపై
సముద్రంలా కప్పుకున్న మంచు,
ముత్యాల్లా జలజలా నేల రాలుతున్నాయి
తొలిదిక్కు సూరీడు
తన హిరణ్మయ రశ్మిని లోకమంతా
పూస్తున్న కమనీయ దృశ్యమది ..!!
యుగాలుగా నడుస్తున్న
కాలాన్ని చూస్తూ,
మహా వృక్షాలు
ప్రతీరోజు తనతో
ప్రేమలో పడుతున్నాయి..!!
తొలిజాములో తేనేలూరిన పువ్వారులను
భ్రమరములు తనువారా చుంబించుచున్నాయి
ముత్యపు చిప్పలోకి దూరిన చినుకు
తళుక్కున ముత్యమై మెరిసి మురిసి పోతోంది..!!
చెట్ల కొమ్మల్లో గూడు కట్టుకున్న
మంచు నీటి బిందువులు
బిక్కుబిక్కున వెళ్ళాడుతున్నాయి
ఆకుపచ్చని పత్రాల వెచ్చని ఊపిరి
ఆహ్లాదమై మైమరిపిస్తోంది..!!
మూతి తిప్పుకుంటూ వెళ్తున్న
ఆషాడమాసపు ఎడబాటు గాలి
శుభమగు శ్రావణమునకు
స్వాగతం పలుకుతున్నది..!!
నా ఇంటి ఎత్తైన బాల్కనీలో
నిద్రిస్తున్న నా ఫాలమును
అరుణారుణ కిరణాలు లేగదూడలా
గోముగా నాకుతూ నన్నులేపుతున్నాయి.!!
కలల కౌగిలింతలు వీడిన నిద్రతో
కళ్ళు నులుముకుంటూ
కిటికీ పక్కన కూర్చున్నాను
హృదయపు పొత్తిళ్ళలో
పొరలు పొరలుగా దాచుకున్న
పసితనాన్ని మరోసారి
కళ్ళారా చూసుకున్నాను..!
ఎంతో అపురూపంగా
పుస్తకాల్లో దాచుకున్న నెమలీకలా
నిజంగానే కొన్ని అనుభవాలకు
మాటలుండవబ్బా ...!!
వినీలాకాశం నుంచి
వెలువడే నారింజ కాంతి
భూమికి, ఆకాశానికి మధ్య
గుప్పున వెదజల్లే
ఆకుపచ్చని పరిమళములా వుంది..!!
మనసంతా ఏదో తుళ్ళింత
తనువంతా ఏదో గిలిగింత
చదివేసిన పుస్తకాన్ని
మరోసారి చదువుతున్నట్లుగా
విభ్రమ నేత్రాలతో
ఆస్వాదిస్తూ వుండిపోయానలా..!!
Written by: Bobby Aniboyina
Mobile : 9032977985
మూతి తిప్పుకుంటూ వెళ్తున్న
ReplyDeleteఆషాడమాసపు ఎడబాటు గాలి
శుభమగు శ్రావణమునకు
స్వాగతం పలుకుతున్నది..!!
నా ఇంటి ఎత్తైన బాల్కనీలో
నిద్రిస్తున్న నా ఫాలమును
అరుణారుణ కిరణాలు లేగదూడలా
గోముగా నాకుతూ నన్నులేపుతున్నాయి.!!
👌👌👌 Good