వాగ్దేవి
*****
ఎవరి మీద అలిగిందో గాని
ఆ మూతిని ముప్పైఆరు వంకర్లు తిప్పుతూ
బుంగమూతి పెట్టుకు కూర్చుంది..!!
అయినా ఎంత బాగుందో,
అప్పుడే విరబూసిన పారిజాతంలా
యమునానదీ తీరాన వినిపించే
మురళీ నాదస్రోతస్సును మరిపింప జేసేలా
నీరెండలో మెరిసే ఆకాశపు అంచులా
తనలో ఏదో అద్భుత శక్తి
అదే నన్ను గట్టిగా పట్టి
గుప్పెట బంధిస్తోంది..!!
భానుడను చూసిన పద్మములా
నెలరేడు జాడ తెలిసిన కలువలా
పరవశించే నా హృదయం
పున్నమినాటి సంద్రంవలె
ఉప్పొంగి పొర్లుతుంది.. !!
తన తీయని అనుభూతులేవో
నాలోలోన చెలరేగి
నను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
తన మధుర పలుకులేవో
నా చెవులకు తాకి
నను మైమరపిస్తాయి..!!
నా కళ్ళు తనని చూసిన ప్రతీసారి
నా హృదయాబ్దిపై తన రూపాన్ని
ప్రాణపదంగా ముద్రించుతుంటాయి
అరుణోదయంలో నీలి మేఘాలవంటి
చేతులు పైకెత్తి తన శిరోజాలను ముడిపెడుతుంటే
ఆ సొగసుల అనుభూతిని ఏ కలం వ్రాయగలదు..!
ఏ గళం విన్పించ గలదు..!!
మిల మిలా మెరిసే
సివిశాల తన సైకత శరీరం
బంగారు ప్రతిమలా మెరిసిపోతుంటే
చొరవగా చేయి పట్టుకొని
కాలికి తగిలే కెరటపు తీరాల వెమ్మట
కబుర్లు చెప్తూ .. తనతో కలిసి నడవాలని వుంది.. !!
ఎగురుతున్న తన ముంగురులు
నను తడుముతూ చక్కిలి గింతలు పెడుతుంటే
నిలువెల్లా నే పులకించి,
పారవశ్యము పొందు విప్పారిన నా కళ్ళను
ఏ చిత్రకారుడు గీయగలడు..!
ఏ చరిత్రకారుడు వ్రాయగలడు ..!!
Written by: Bobby Aniboyina
Mobile : 9032977985
No comments:
Post a Comment