Friday, July 15, 2022

మరణ పర్యంకము ....



నేలపై నిస్తేజంగా పడివున్న పూలు పాడె పై నిర్జీవంగా పడివున్న దేహం తలసి తలసి అలసిన తడి కన్నులు, తడారిన ఆక్రందపు గొంతుకలు ఎత్తేందుకు సిద్దమౌతున్న కొన్ని సేతులు సాగనంపేందుకు ఎదురుచూస్తున్న కొన్ని కళ్ళు ఇదే మానవ మరణ పర్యంకము...! అనుభవించి తీరాల్సిన చిట్టచివరి ఘట్టము..!! చావుకంటే భారమైన జీవనాన్ని ఎన్ని చూసుంటుందో ఆ పార్ధీవ దేహం నవ్వకపోయినా నొత్తలు పడిన చెంపలు మోడుబారిన ఎండు బెరడులా ముడతలు పడిన ముఖము నిర్మలత్వపు ఎండమావిలా ఎంత ప్రశాంతంగా పడివుందో..!! వెన్ను వణికించే హిమ పేటికలో సైతం ఎంత హుందాగా పవళించిందో ఒక్క చోట తిన్నగా కాలు నిలబడక కలియ తిరిగిన ఆ మేను ఇలా ఎండిన మ్రానై పడుంది చూడు..!! దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలే ప్రాణం ఉన్నప్పుడే కండ్లలో పెట్టుకోవాలే.. హృల్లేఖ నేత్రాలతో ఇప్పుడు నువ్వెన్ని కన్నీటిబొట్లు రాల్చినా ఏం ప్రయోజనం..!! Written by: Bobby Aniboyina Mobile: 9032977985

Wednesday, July 13, 2022

నాలో నేనే.. నాతో నేనే..




అదో..
ప్రాతఃకాల సమయం
గ్రీష్మఋతువు ముగుస్తూ,
వర్షఋతువు
మొదలౌతున్న సమయమది..!!

దూరపు కొండలపై
సముద్రంలా కప్పుకున్న మంచు,
ముత్యాల్లా జలజలా నేల రాలుతున్నాయి
తొలిదిక్కు సూరీడు
తన హిరణ్మయ రశ్మిని లోకమంతా
పూస్తున్న కమనీయ దృశ్యమది ..!!

యుగాలుగా నడుస్తున్న
కాలాన్ని చూస్తూ,
మహా వృక్షాలు
ప్రతీరోజు తనతో
ప్రేమలో పడుతున్నాయి..!!

తొలిజాములో తేనేలూరిన పువ్వారులను
భ్రమరములు తనువారా చుంబించుచున్నాయి
ముత్యపు చిప్పలోకి దూరిన చినుకు
తళుక్కున ముత్యమై మెరిసి మురిసి పోతోంది..!!

చెట్ల కొమ్మల్లో గూడు కట్టుకున్న
మంచు నీటి బిందువులు
బిక్కుబిక్కున వెళ్ళాడుతున్నాయి
ఆకుపచ్చని పత్రాల వెచ్చని ఊపిరి
ఆహ్లాదమై మైమరిపిస్తోంది..!!

మూతి తిప్పుకుంటూ వెళ్తున్న
ఆషాడమాసపు ఎడబాటు గాలి
శుభమగు శ్రావణమునకు
స్వాగతం పలుకుతున్నది..!!

నా ఇంటి ఎత్తైన బాల్కనీలో
నిద్రిస్తున్న నా ఫాలమును
అరుణారుణ కిరణాలు లేగదూడలా
గోముగా నాకుతూ నన్నులేపుతున్నాయి.!!

కలల కౌగిలింతలు వీడిన నిద్రతో
కళ్ళు నులుముకుంటూ
కిటికీ పక్కన కూర్చున్నాను
హృదయపు పొత్తిళ్ళలో
పొరలు పొరలుగా దాచుకున్న
పసితనాన్ని మరోసారి
కళ్ళారా చూసుకున్నాను..!
ఎంతో అపురూపంగా
పుస్తకాల్లో దాచుకున్న నెమలీకలా
నిజంగానే కొన్ని అనుభవాలకు
మాటలుండవబ్బా ...!!

వినీలాకాశం నుంచి
వెలువడే నారింజ కాంతి
భూమికి, ఆకాశానికి మధ్య
గుప్పున వెదజల్లే
ఆకుపచ్చని పరిమళములా వుంది..!!

మనసంతా ఏదో తుళ్ళింత
తనువంతా ఏదో గిలిగింత
చదివేసిన పుస్తకాన్ని
మరోసారి చదువుతున్నట్లుగా
విభ్రమ నేత్రాలతో
ఆస్వాదిస్తూ వుండిపోయానలా..!!

Written by: Bobby Aniboyina
Mobile : 9032977985

Friday, July 1, 2022

వాగ్దేవి ...


వాగ్దేవి

*****

ఎవరి మీద అలిగిందో గాని
ఆ మూతిని ముప్పైఆరు వంకర్లు తిప్పుతూ
బుంగమూతి పెట్టుకు కూర్చుంది..!!
అయినా ఎంత బాగుందో,
అప్పుడే విరబూసిన పారిజాతంలా
యమునానదీ తీరాన వినిపించే
మురళీ నాదస్రోతస్సును మరిపింప జేసేలా
నీరెండలో మెరిసే ఆకాశపు అంచులా
తనలో ఏదో అద్భుత శక్తి
అదే నన్ను గట్టిగా పట్టి
గుప్పెట బంధిస్తోంది..!!

భానుడను చూసిన పద్మములా
నెలరేడు జాడ తెలిసిన కలువలా
పరవశించే నా హృదయం
పున్నమినాటి సంద్రంవలె
ఉప్పొంగి పొర్లుతుంది.. !!

తన తీయని అనుభూతులేవో
నాలోలోన చెలరేగి
నను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
తన మధుర పలుకులేవో
నా చెవులకు తాకి
నను మైమరపిస్తాయి..!!

నా కళ్ళు తనని చూసిన ప్రతీసారి
నా హృదయాబ్దిపై తన రూపాన్ని
ప్రాణపదంగా ముద్రించుతుంటాయి
అరుణోదయంలో నీలి మేఘాలవంటి
చేతులు పైకెత్తి తన శిరోజాలను ముడిపెడుతుంటే
ఆ సొగసుల అనుభూతిని ఏ కలం వ్రాయగలదు..!
ఏ గళం విన్పించ గలదు..!!
మిల మిలా మెరిసే
సివిశాల తన సైకత శరీరం
బంగారు ప్రతిమలా మెరిసిపోతుంటే
చొరవగా చేయి పట్టుకొని
కాలికి తగిలే కెరటపు తీరాల వెమ్మట
కబుర్లు చెప్తూ .. తనతో కలిసి నడవాలని వుంది.. !!

ఎగురుతున్న తన ముంగురులు
నను తడుముతూ చక్కిలి గింతలు పెడుతుంటే
నిలువెల్లా నే పులకించి,
పారవశ్యము పొందు విప్పారిన నా కళ్ళను
ఏ చిత్రకారుడు గీయగలడు..!
ఏ చరిత్రకారుడు వ్రాయగలడు ..!!

Written by: Bobby Aniboyina
Mobile : 9032977985