Tuesday, June 28, 2022

పద్మినీకాంత ...




పద్మినీకాంత
***********
అదో ప్రభాత సూర్యోదయం
చల్లని గాలులు వీస్తున్నాయి
పద్మాలు వికసిస్తున్నాయి
చీకట్లు కొండ గుహలలో దాక్కుంటున్నాయి
తుమ్మెదలు తమ్మిపూదేనియను త్రాగి ఆనందిస్తున్నాయి..!

అరణ్య మధ్యమమున చిరు కుటీరమున
వీణాతంత్రులను మీటుతూ ఓ పడతి
దారి తప్పిన లేడి వలే గోముగా ముచ్చట గొల్పుచున్నది
మబ్బులనడుమనుండి వెలువడిన
తొలకరిమెరుపులా వున్నదామె వదనము..!
సువర్ణచ్ఛాయ దేహముతో,
తేజోవంతమైన ద్వినేత్రములు గల్గి
నీలిమేఘపు శిరోజారిణై
అష్టమి రేయి చంద్రునివలె నున్నది.

కనుచూపులు కాదవి
కలువ తూపుల చలనాలు
విభ్రమ కనులకు
యౌవనోదయాన్నందించే
చాంచల్యములవి...!

చంపకము వలె నాసికాగ్రము
మధుబీజము వలె పలువరుసలు
చందనపూత వంటి కంబువు గల కంఠంబులు
వీణాతంత్రులను పలికించు ఆమె కృతులకు
చేతి కంకణాలు ఝుణఝుణ ధ్వనుల ప్రమాణం చెదరకుండ
తాళం వేయుచున్న నేర్పరి యామె ..!!

ఆ పడతి వీణ సంగీత, విద్య, గాత్ర మాధుర్యములకు
నన్ను నేను మైమరిచిపోయి యుంటిని
ఆమె సామాన్య స్త్రీ కాదు.
బ్రహ్మచే పంపబడిన ఒకానొక శక్తి
మన్మధ రూపిణి .. మన్మంద హాసిణీ
ఆనందరూపిణీ .. సకల శక్తి స్వరూపిణి
నమస్తే.. నమస్తే నమోస్తుతే..!!

Written by: Bobby Aniboyina
Mobile : 9032977985

No comments:

Post a Comment