Tuesday, June 14, 2022

కవిత్వం కోసం నా అన్వేషణ ...


 కన్నీరు ఇంకిపోయింది

కవిత్వం కరిగిపోయిందనుకొని
కొద్ది కొద్దిగా హిరణ్మయ రశ్మిని ఏరుకుంటూ
గతించిన అనుభవాలను తవ్వుకుంటూ వున్నాను..!!

ఎవరిని పలకరిద్దామనుకున్నా
వారి నోటెమ్మట కవి(పి)త్వాలే రాలుతున్నాయ్
ఏ పుస్తకం తిరగేద్దామనుకున్నా
కాపీ అక్షర ఖజానాలే కనిపిస్తున్నాయ్
ఈ పదాలను మార్చి రాసే అక్షర శిథిలాల మీంచి
ప్రకృతి ప్రాకారముల నడిమి లోనికి పారిపోయినది మొదలు
నాలో నిస్పృహాజనిత నిర్లిప్తత తాండవించింది..!!

ఎలుఁగెత్తి అరచిన అరుపు
గాల్లో కలిసి ఆర్తనాదమౌతోంది
ఎందుకూ కొఱగాని
అరణ్య రోదనై మిగుల్తుంది
చిరు చెంపల మీంచి రాలే కన్నీరు
గాజు గోడల మీద నిస్సహాయంగా
జారిపోతున్న అక్షర బిందువౌతుంది..!!

కవి కోసం,
కవిత్వం కోసం నా అన్వేషణ
దేశాల్ని దాటి వెళ్ళిపోయింది..!
ఏనాడో నే విడిచిన అక్షర శస్త్రాస్త్రములు
ఏ ఆస్వాదికుడి గుండెల్ని హత్తుకొని ఉన్నాయో .. ఏమో
ఏ వార్తా తెలియ రావటం లేదు..!

అక్షర మహా వృక్షమునుంచి లేత సంకేతాల్ని
కొన్నింటిని కోసుకుందామని మానవ ప్రపంచాన్ని వీడి
మనోప్రపంచంలోని అడవులన్నీ తిరుగుతున్నా
ఎండమావుల అక్షర ప్రవాహాలే ఎదురౌతున్నాయి..!!

అయినా మరేం పర్వాలేదు
నా నేత్రాలనే మీకోసం వజ్రాలుగా పొదుగుతాను
మీరాదరించినా, ఆదరించకున్నా
నా కవిత్వం ఒక దిగులెరగని ప్రవాహం
నా చేతి వేళ్ళమీంచి మీ వైపు ఉధృతంగా పెల్లుబికే
ఒక మహాద్భుత సాహిత్య జలపాతాన్ని మీకోసం ఆవిష్కరిస్తాను
ఆవిష్కరిస్తూనే ఉంటాను..!!

గాలికి ఊగే పువ్వుల్లోంచి నాకొచ్చే సుగంధాలే నా కవితలు
పువ్వు పువ్వునీ పలకరించే మాటలమధురిమలే నా అక్షరాలు
సాహిత్యమనే మహా సర్పం నన్ను పెనవేసుకున్నంత సేపు
ధన, అధికార బలాల సింహాసనాలు నా ప్రపంచాన్ని తాకలేవు
నా ముందసలు నిల్చో లేవు..!
ఇదే నేను.. ఇది మాత్రమే నేను..!!


Written by : Bobby Aniboyina
Mobile: 9032977985

No comments:

Post a Comment