తీరం నుంచి చూస్తున్న సముద్రం ఎంత బాగుందో…
సగం సగం తడిచిన స్త్రీపురుషుల దేహాలు…
కేరింతల కోలాహలం తో ఒడ్డున పిల్లల ఆటలు..!!
ప్రతి ఒక్కరు సముద్రాన్ని పట్టుకోవాలని ఆరాటపడేవారే..
అందులో తడిచి ముద్దవ్వాలని ఆశపడేవారే..
అందుకేనేమోఎక్కడో ఉన్న సముద్రం వచ్చి మాటిమాటికి కాళ్ళు తడుపుతోంది..
ఎంత ఇష్టమో దానికి మనమంటే…!!
కాలికి తగిలే ఆ కెరటపు స్పర్శ
ఎన్ని అనుభవాలను మోసుకొచ్చి చెప్తుందో..
కాలి కింద జర్రున జారే ఇసుక
ఎంత గమ్మత్తయిన అనుభవాన్ని ఇస్తుందో..
మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ
నురగలు కక్కుతూ నిస్తేజంగా తీరం వెమ్మట పడిపోయే ఆ కెరటాలను చూస్తుంటే
మనకోసం ఇంత చేస్తోందా అనిపిస్తుంది..!
అయినా తను అనుకుంటే ఎంతసేపు..
ప్రపంచాన్ని మొత్తం తిన్నా తీరని ఆకలి తనది..!!
ఇదంతా బానే ఉంది..
అసలు విషయం ఏంటంటే
అక్కడ ఉన్న వందలాదిమందిలో
నా కన్ను ఒక్కరి మీద ఆగింది..
ఎవరో ఆ స్త్రీ మూర్తి..
మూడు పదులు తప్పక దాటివుంటాయి
అయినా మూడేళ్ళ చిన్నారిలా ఎంత అల్లరో
పిక్కల పై ఎత్తుకు కుచ్చిళ్ళ చీరను ఎగదోపి
పద్మాల వంటి పాదాలతో లేడి పిల్లవలె గంతులేస్తూంది..
ఎవరా అని కనులారా పరికించా
చవితి చంద్రునివంటి మోము
బందూక పుష్పము వంటి సొగసు
శివుని గాండీవము వంటి కనుసోగలు
ఆమె చేస్తున్న ఆ అల్లరిలో,
ఆ నవ్వులలో ఎంత స్వచ్ఛత దాగుందో..
నిస్తేజుడనై నిలబడిపోయాను ఆమె సహజత్వమును చూస్తూ..!!
సగం చీర కప్పిన ఆ నవనీత నడుముకు
లవణజలము తగిలాయేమో
నున్నని పింగాణీ పాత్ర లా మారింది
దానికితోడు పడమట సూర్యుని ఆఖరి కిరణాలు
ఆ నడుముపై పడి నా వంటి చూపుకారులకు
ఆమె నడుము వెండి పళ్ళెము లా తళుక్కున మెరుస్తూ మైమరిపిస్తోంది..!!
నిజంగా ఎంత రమణీయతో ఆ దృశ్యం..
ఇవాళ అనుకోకుండా సముద్రతీరానికి వెళ్ళిన ఓ చిరు దృశ్యాన్ని వివరించాను..!!😊☺️
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985
No comments:
Post a Comment