ఇనుప సంకెళ్ళు
*************
పోరాటం నీ హక్కు
ఎలుగెత్తిన గొంతుకతో పోరాడు..
చేతి సంకెళ్ళు చిరకాలం వుండవు
కమ్ముకున్న చీకట్లు కలకాలం వుండవు
నువ్వు నేర్చుకున్న నడకను
నడిచేందుకు ఎందుకంత ఆలోచిస్తున్నావ్
జీవించకుండానే మరణించే
జీవితాలను జీవించేలా చెయ్యడానికి పోరాడు..!!
ప్రళయపు గాలులు వీచేలా
ఇనుప శృంఖలాలు తెగిపడేలా
అజ్ఞాన తిమిరం జడిసేలా
నినునమ్మిన గళాలు విప్లవించేలా
మసిబారిన జీవితాలు చిగురించేలా
పోరాడు.. !! నువ్వు పోరాడు..!!
నీ చేతిలోని ఉలితో
నీ చుట్టూ వున్న వారి అజ్ఞానాన్ని
చెక్కుకుంటూ ముందుకు సాగు
పుడమిపై .. పారుతున్నది నీరే కాదు
రాలిన రక్తపు బొట్లూ ఇంకుతున్నాయ్
వడ్డించిన విస్తర్లను అందకుండా
వీపులమీద మోసే ఈ దగాకోర్లు
ఉన్నంతవరకు లేనోడు ఆకలిని
మర్చిపోతూనే ఉంటాడు..!!
వయస్సు పెరుగుతున్న స్వాతంత్ర్యంలో
లేనోడేప్పుడూ ఎదగని పసిబాలుడే
కూలి దొరకని ఉదయాలు కొన్ని
కూడు దొరకని సమయాలు కొన్ని
ముప్పూటలా నోట్లోకి పోలేని చరిత్ర
రేపటి మన డెబ్బై ఐదవ స్వాతంత్ర చరిత్ర
గుండెలోని అగ్నిని గొంతులోకి రానివ్వు
మనసులోని వేదనని చేతలలో చూపించు..!!
మంత్రాలకు పరమాన్నాలు రావు మిత్రమా !!
పోరాడితేనే పరమాన్నాలు విందులౌతాయ్
జీవం వున్న ప్రతీది పోరాటం చేస్తుంది
హృదయమున్న నీవెందుకు సంకెళ్ళేసుకున్నావ్
సంకుచితత్వము లేని సమతా, మమతల కోసం
సమ సమాజం వెలిసే నవ సమయం కోసం
నీ, నా కోసం నే పోరాడుతూనే వుంటాను..
చేయి కలిపి బలగమౌతావో
వెన్నుచూపి అశక్తునివౌతావో నీ ఇష్టం..!!
రేపటి నవ సమాజ సూర్యోదయానికై ఎదురుచూస్తూ..!!
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985