Saturday, July 17, 2021

దారితప్పిన నావ.. !



పడమటి దిక్కున
అస్తమిస్తున్న సూర్యుని
ఆఖరి కిరణాన్ని
ఆర్తిగా అందుకోవాలన్న ప్రతీసారి
నా అరచేతి రేఖల గుండా
మెల్లిగా జారుకుంటుంది..!!

వేయి పడగలు విప్పిన లోకం
నా నడినెత్తిన నెమ్మదిగా నడుస్తుంటుంది
దరిద్రదేవత భీకరాట్టహాసం
విల్లు విడిచిన బాణం లా
నను నల్దిక్కులా వెంటాడుతూంటుంది
బెదిరిపోయి గాలికెగిరే ఎండుటాకులా
గజగజమని వణుకుతూ పోతున్నానెచ్చటికో..!!

కారు మేఘాల కాల గర్జనలో
వైఫల్యపు తుఫాను ప్రళయ భీకరంలో
వీధి గుమ్మానికి వ్రేలాడే
ఎండిన మామిడాకు నా ఈ జీవితం..!

యుగాల నాటి మునిగిన ఓడ
గుప్పున వెలిగి రాలిపోతున్న వేగుఁజుక్క
కెరటం లేని కడలిలో
కదిలే తెరచాప లా నేనో
దారితప్పిన నావను..!!

నట్ట నడిరాత్రి
హెచ్చరిక లేని పెనుగాలికి
కొట్టుకుపోతున్న పూరిగుడిసె చప్పుళ్ళు
కాలు కదిపితే కుత్తుకకు బిగుసుకుంటున్న
సంకెళ్ళ గలగలలు
మండే చితిలోంచి ఫెళ ఫెళా మని
విరిగే ఎముకల పట పటాత్కారములు
మెల్లి మెల్లిగా వినిపిస్తున్న విషాద
కన్నీటి శోకాలు.. ఇదే నా జీవితం..!!

తెగిన శిరస్సుల గుట్టల్లో
నా భవిష్యత్తు ఊపిరాడక
నిరంతరం నలుగుతూ,
మూల్గుతూ వుంటుంది..!!

Written by: Bobby Aniboyina
Mobile : 9032977985

1 comment:

  1. వీధి గుమ్మానికి వ్రేలాడే
    ఎండిన మామిడాకు

    యుగాల నాటి మునిగిన ఓడ
    గుప్పున వెలిగి రాలిపోతున్న వేగుఁజుక్క

    -👌👌👌

    కొన్ని వాక్యాలు వాడుక భాషలో కొన్ని వాక్యాలు గ్రాంథికంలో వ్రాస్తున్నారు. Consistency ఉంటే బాగుంటుంది.

    ReplyDelete