Friday, July 2, 2021

నిర్జీవ స్పటికం...


 


గుండెల్లో ఏదో తెలియని బాధ

ఎందు వల్లన ?

ఎవరి వల్లన ?

ఈ మొహమాటాల

చిరునవ్వు, మర్యాద

బురఖాల మధ్యన

ఇమడలేనితనం నాది..!!

 

నాలో ఏదో మార్పు

నాకు ప్రస్పుటంగా తెలుస్తోంది

మొహమాటపు పిలుపులు నా

వీపున తగుల్తున్న ప్రతీసారి

కొరడాతో చఱచినట్లనిపిస్తుంది

మనిషి ముఖం వదిలి

దూరంగా పారిపోవాలనిపిస్తుంది..!!

 

వెదురు తడికల తలుపుల దగ్గర

బీటలవారిన మట్టి గోడకు జారగిలి

నిర్జీవ స్పటికంలా .. నే చూస్తూ వున్నా

మేఘాలు  అసహనంగా వేచి వుండటం

గడియారాలు సోమరిగా ఆవులించడం

ఉరితాళ్ళు ఉమ్మడిగా పెనవేసుకోవడం

ఆర్ద్ర నేత్రాలతో ... నే చూస్తూ వున్నా..!!

 

గుండెకు నొప్పి తాకిన ప్రతీ సారి

కంటికి చెమ్మ తగలడం పరిపాటి అయిపోయింది

ఏ దిక్కున అరవాలో,

ఏ దారిన నడవాలో,

అనుభవాన్ని గడించిన పసితనంతో

తడిసిన గాలిపటంలా

మళ్ళి మళ్ళి

నేలకొఱుగుతున్నాను..!!


Written by: Bobby Aniboyina

Mobile: 9032977985

1 comment: