Monday, July 26, 2021

మారని రాతలు ..


 

ఈ ప్రపంచమెప్పుడూ నన్ను ఓడించాలనే చూస్తుంది .. దాని స్వభావమదే మరి..!! అయినా ఏముందని నా వద్ద ఇంకా కోల్పోవడానికి జ్ఞాపకాలలో బ్రతుకుతున్న నాకు గతంలో నే రాసిన పుంఖానుపుంఖాల కావ్యాలు నా ఇంటి అల్మారానుంచి నా పై నిస్తేజంగా రాలి నను ప్రశ్నిస్తున్నాయి...!! వాటికి నేనంటే ఎంత లోకువో, నేనెలా వున్నా అవి నవ్వుతూనే ఉంటాయి ..! విషాదంలో అనంత విశ్వం విశాలంగాను, ఆనందంలో అదే విశ్వం అల్పంగాను కనిపిస్తుంది మరి..!! ప్రభాత, అస్తమయ కాంతులలో నే రాసే పుస్తకపు పేజీలు నిండిపోతున్నా నా కనుబొమ్మల మధ్యన ఒక చీకటి తెర ఎప్పటికీ మిగిలే వుంటుంది..!! కొన్నిసార్లు ఒక వాక్యం వ్రాయడానికి క్షణ కాలమే పడుతుంది మరోసారి యుగాలైనా ఓ అక్షరం కదలదు ఇక్కడ ప్రాణం పోసుకున్న వాక్యం మరెక్కడో కవితై తేలుతుంది దానికన్నా అచేతనంగా ప్రాణం వదిలెయ్యడమే శ్రేయస్కరమనిపిస్తుంది ఒక్కోసారి..!! ఎవరూ గుర్తించలేని ఓ అలౌకిక సౌందర్యమేదో నాకు కనిపించింది అందుకేనేమో ఊపిరిపోసుకున్న ఒక్కో అక్షరాన్ని అరిగిన పెన్సిలుతో అదిమి పట్టుకొని రాసిన రాతలను మళ్ళి నాకు గుర్తుకు తెచ్చింది..!! పొరపాటున చిన్న సంతోషమేదైనా గాలికి కొట్టుకొస్తుందేమోనని ఇంటివాకిట ఎదురుచూస్తూనే వుంటాను నాపై పుడమికెంత కోపమో కాసిన్ని కన్నీటిని కూడా నను దాచుకోనివ్వదు..! మారని రాతలు, మార్పురాని బ్రతుకులు మరి..!! Written by: Bobby Aniboyina Mobile: 9032977985

Saturday, July 17, 2021

దారితప్పిన నావ.. !



పడమటి దిక్కున
అస్తమిస్తున్న సూర్యుని
ఆఖరి కిరణాన్ని
ఆర్తిగా అందుకోవాలన్న ప్రతీసారి
నా అరచేతి రేఖల గుండా
మెల్లిగా జారుకుంటుంది..!!

వేయి పడగలు విప్పిన లోకం
నా నడినెత్తిన నెమ్మదిగా నడుస్తుంటుంది
దరిద్రదేవత భీకరాట్టహాసం
విల్లు విడిచిన బాణం లా
నను నల్దిక్కులా వెంటాడుతూంటుంది
బెదిరిపోయి గాలికెగిరే ఎండుటాకులా
గజగజమని వణుకుతూ పోతున్నానెచ్చటికో..!!

కారు మేఘాల కాల గర్జనలో
వైఫల్యపు తుఫాను ప్రళయ భీకరంలో
వీధి గుమ్మానికి వ్రేలాడే
ఎండిన మామిడాకు నా ఈ జీవితం..!

యుగాల నాటి మునిగిన ఓడ
గుప్పున వెలిగి రాలిపోతున్న వేగుఁజుక్క
కెరటం లేని కడలిలో
కదిలే తెరచాప లా నేనో
దారితప్పిన నావను..!!

నట్ట నడిరాత్రి
హెచ్చరిక లేని పెనుగాలికి
కొట్టుకుపోతున్న పూరిగుడిసె చప్పుళ్ళు
కాలు కదిపితే కుత్తుకకు బిగుసుకుంటున్న
సంకెళ్ళ గలగలలు
మండే చితిలోంచి ఫెళ ఫెళా మని
విరిగే ఎముకల పట పటాత్కారములు
మెల్లి మెల్లిగా వినిపిస్తున్న విషాద
కన్నీటి శోకాలు.. ఇదే నా జీవితం..!!

తెగిన శిరస్సుల గుట్టల్లో
నా భవిష్యత్తు ఊపిరాడక
నిరంతరం నలుగుతూ,
మూల్గుతూ వుంటుంది..!!

Written by: Bobby Aniboyina
Mobile : 9032977985

Thursday, July 8, 2021

రుచిరాంగి...


 ఉత్ప్రేక్షాలంకారముతో కూడుకున్న గజగమన వర్ణన ఇది..ఇందులో పదాలు మీకు కొన్ని అర్ధం కాకపోవచ్చు... కావు కాబట్టే అది గజగమన వర్ణన అయింది..


నిఘంటువు దగ్గర పెట్టుకుంటే కొంతమేర అర్ధం అయ్యేందుకు అవకాశం వుంది.. ఒక స్త్రీని వర్ణించాలంటే ఆమెకు ముందుగా కృతజ్ఞతలు తెలపాలి.. ఊహల్లో ఏర్పరుచుకున్న రూపవతి అయినా సరే ఆమెకు కృతజ్ఞత చెప్పి తీరాలి.. ఎందుకంటే అంతటి సువర్ణ శోభితమైన దేహాన్ని వర్ణించే అవకాశం కల్పించినందుకు.

ఊహాజనితమైన నా “రుచిరాంగి” పై చిరు వర్ణనను ఆమెకు ప్రేమతో అర్పిస్తూ ..!!

రుచిరాంగి
*********

వెలుగు విరజిమ్ము అందాల దివ్వెవి
కవుల మనసు గ్రోలు ఘన ఘృతాచివి
దివ్యలోకాల రసమయ సుర దీప్తివి
రసికత ఉప్పొంగు జనతకు రస రాజ్ఞివి

మన్మధ బ్రహ్మను సేవింపు నర్తనమున
నాట్య విన్యాస శ్రుతి లయల్ తాండవించగన్
సరస సంగీత సాహితీ జరులు కురియ
తుచ్చమగు మేని సుఖమున తూలితూగి,
మనసు,
బుద్ది,
ఆత్మ మోహనమున మత్తిల్లు వేళ..!!

పడతి కనుదోయి వలపు క్రీగంట చూపు
ప్రణయ చెక్కిళ్ళు చనుదోయి నడుమున తీరు
పాలభాగమున ముంగురుల్ పడుచుదనము
నునుపు తీర్చిన పిరుదుల తనువుసొగసు
సిగ్గుపడని దేహమే స్త్రీకి లేదు
లేనే లేదు....లేదే లేదసలు..!!

నిచ్చెలి సొగసు నీలవేణి యశస్సు
ఏమాటకామాటేనే గజగమనా..!!
నెలవంక నడుమొంపు
పున్నమి చంద్రుని నితంబ పీఠములు
నడుము తీగపై నాభీయ కుసుమం..!!
నిక్కబొడిచి నీల్గు మిశ్రిత వర్ణ
పాలిండ్ల బింకములు
నవనీతపు మేనుతో ప్రకాశించువేళ
ఆపాదమస్తకము కన్నులతో ఆఘ్రాణించు వేళ
దందశూకమై పెనవేయ ఎద కౌగిళ్ళను ఆస్వాదించు వేళ
మునిపంటి పెదవితో పూ రెమ్మలను చుంబించు వేళ
అవ్యక్త భౌతిక ద్రవ్యాలతో తనువంతా
సమ్మోహన పరిమళాలు ప్రసవించు వేళ
నీలా వినీలాకాశ వీధుల్లో
మైమరిచి దధి మధనధ్వనులతో మిళితమై
కందళ తాళ ఆనంద తన్మయత్వ నాదములతో
తకదిమ్మి తద్దిమ్మి యను నీ యౌవ్వన కర్మాగారాన్ని
మేహనముతో దట్టించు వాడేవ్వండే..!! వాడే ధన్యుండే ..!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

Friday, July 2, 2021

నిర్జీవ స్పటికం...


 


గుండెల్లో ఏదో తెలియని బాధ

ఎందు వల్లన ?

ఎవరి వల్లన ?

ఈ మొహమాటాల

చిరునవ్వు, మర్యాద

బురఖాల మధ్యన

ఇమడలేనితనం నాది..!!

 

నాలో ఏదో మార్పు

నాకు ప్రస్పుటంగా తెలుస్తోంది

మొహమాటపు పిలుపులు నా

వీపున తగుల్తున్న ప్రతీసారి

కొరడాతో చఱచినట్లనిపిస్తుంది

మనిషి ముఖం వదిలి

దూరంగా పారిపోవాలనిపిస్తుంది..!!

 

వెదురు తడికల తలుపుల దగ్గర

బీటలవారిన మట్టి గోడకు జారగిలి

నిర్జీవ స్పటికంలా .. నే చూస్తూ వున్నా

మేఘాలు  అసహనంగా వేచి వుండటం

గడియారాలు సోమరిగా ఆవులించడం

ఉరితాళ్ళు ఉమ్మడిగా పెనవేసుకోవడం

ఆర్ద్ర నేత్రాలతో ... నే చూస్తూ వున్నా..!!

 

గుండెకు నొప్పి తాకిన ప్రతీ సారి

కంటికి చెమ్మ తగలడం పరిపాటి అయిపోయింది

ఏ దిక్కున అరవాలో,

ఏ దారిన నడవాలో,

అనుభవాన్ని గడించిన పసితనంతో

తడిసిన గాలిపటంలా

మళ్ళి మళ్ళి

నేలకొఱుగుతున్నాను..!!


Written by: Bobby Aniboyina

Mobile: 9032977985