Saturday, October 10, 2020


 

అదో చైత్రమాసపు తొలిజాము

ప్రపంచమంతా నిద్రించు సమయము

నిదురే రాక నేను..

పహారా కాస్తున్న ఆరుబయట

పూల మొక్కలను .. అప్పుడే విచ్చుకుంటున్న

లే లేత కన్నె పువ్వారులను ముద్దాడుతున్న

తుమ్మెదలను చూస్తూ..  మాటలు కలిపాను..!!

 

 

ఇంతలో..

తళుక్కుమని ఆకాశంలో ఓ మెరుపు

నింగిలోని ఓ తార ... నా ఒడిలోకొచ్చి వాలే క్షణమది

తనివితీరా కళ్ళుతో తనని చూడాలని కళ్ళు తెరిచాను

మనసారా తనని  తాకాలని చేతులు చాచాను

తానో శ్వేత మధుకమై పసిడికాతులిడు మేనుతో

నా ఒడి శయనముపై తలవాల్చి నిదురించు వేళ

నన్ను నేను మైమరిచి రెప్ప వేయక గోముగా చూచే వేళ

తామర నేత్రాలతో .. తానో అనంత సౌందర్య రాశిలా

నా ముందుకొచ్చి నిల్చుంది..!!

 

ఆమె

రెండు విశాల నేత్రాల మధ్యన

తొలి సూర్య బింబం ఉదయిస్తోంది..!!

ఆమె

నిశిర కేశ సౌందర్యములో

నక్షత్రాలు కిరణాన్ని ప్రసవిస్తున్నాయి..!!

ఆమె

అధరాలపై పూచే మందహాసములో

వెన్నెల .. మల్లెమొగ్గలై గుప్పుమని గుబాళిస్తున్నాయి..!!

 

ఎదురుగా వున్నా

పుడమికి ఒకవైపున నేను,

మరోవైపున ఆమె ..

దిక్చక్రము ... కొస అంచుల నిలబడి

ఆమెను నే చూస్తున్నా, ఆరాధిస్తున్న..ఆనందిస్తున్నా..!!

 

గోధూళి వేళా,

ఎరుపెక్కిన పారాణి అరచేతిని ముద్దాడే వేళా,

హోరెత్తే సంద్రం ఆకాశాన్ని ఆర్తిగా తడిమే వేళా,

పారే నదిలో దోనె దీపాలు మౌనగీతాన్ని ఆలపించే వేళా,

నౌక తీరాన్ని విడువలేక విడువలేక విడిచే వేళా

నింగిని తాకే అంతిమ నక్షత్రం లా గప్చిప్గా మాయమైనావు..!!

ఏమని చెప్పను,

ఎక్కడని వెతకను

భూమీ, ఆకాశం కలిసే చోట,

పారిజాతాలు రాలి పడిన చోట,

నా నవ్వును నే పారేసుకున్న చోట,

అలసి సొలసిన సూర్య నేత్రాలతో... నే వెతుకుతాను,

ప్రాణ వాయువులూది పిల్లనగ్రోవిని పలికిస్తాను..!!

వస్తావు కదూ..!!

No comments:

Post a Comment