అన్నీ పోయిన
“అనిబోయిన” వంశస్థుడను
నా జీవితమెప్పుడూ
కనుకొలనులో అశ్రువల్లె కదలని
లంగరేసిన నది ఒడ్డు నావ లాంటిది..!
చీకటి మింగిన వినీలాకాశం నుంచి
చిట్టచివరి నక్షత్రం నేల రాలడం
నే చూస్తున్నాను..!
నిశీధము కమ్మిన చిమ్మ చీకట్లో
నేనో ఒంటరినై కాళ్ళాడిస్తూ
శిఖరపు అంచున కూర్చున్నాను...!!
జేబుని తడిమి చూసాను
మూలన బిక్కమొఖమేసుకొని
ఒంటరిగా ఉందో ఏకాకి అక్షరం
అద్దంలో నన్ను నేను చూసినట్లనిపించింది
తననీ కోల్పోతా..ననేమో..!
నన్ను చూసి వణుకుతోంది..!!
చేతుల్లోకి తీసుకున్నాను
రెండుగా విరిచేసాను
పదమై నిలిచింది
మళ్ళి విరిచాను
వాక్యమై కూర్చుంది..!
వాక్యం పంక్తి యై,
పంక్తి పుట యై,
పుట కవిత యై,
కవిత కావ్యమై,
కావ్యము కనకమై
వేవేల వర్ణాలను
ఏక ఉదుటన చిమ్మింది.. !!
మరణించిన ఆశల పై నుంచి
అక్షరం మొలకెత్తింది
ఒక శుభ సూర్యకిరణమేదో
ఆశీర్వచనంలా నా పెదవిపై పుష్పించింది
కమ్మని తైలములు,
లేత చివుళ్ళు,
మిలమిలల సూర్యరశ్మి,
గాలికి ఊగులాడే నదీ ముంగురులు,
ఆకాశమంతా నక్షత్రాల వానతో
జీవితమంతా ఓ రంగులమయమయ్యింది..!!
నా
జీవితం
ఓ అక్షరంగా మళ్ళి
పునర్జీవించింది..!!
Written by: Bobby Nani
No comments:
Post a Comment