అదో అందమైన ఆశ్రమం..
అందులోనూ, బ్రహ్మకాల సమయము ..
ఆ ఆశ్రమ ప్రాంగణమంతా ఓ అలౌకికమైన ఆనందంతో
ప్రతీ మొక్క, చెట్టు, పశువు, మృగం, ఒక్కటేమిటి
సమస్తమూ అలరారుతున్నాయి..!
నిరంతరమూ వేదనాదం,
హోమధూపం,
నియమనిష్ఠలతో కూడిన జీవనం,
అడుగడుగునా ధర్మబద్దత,
సకల దేవతలూ అనుగ్రహించి విచ్చేసిన
పవిత్ర ప్రాంగణం లా వుంది ఆ ఆశ్రమము..!!
ఆ ఆశ్రమం లోని ఓ అమ్మాయి
అందాల అపరంజి బొమ్మ
అందరూ ఆమె అందం చూసి అబ్బురపడేవారే
తోటివారు ఆ అమ్మాయితో
ఆడాలని, పాడాలని ఆశపడేవారు
ఆమె దగ్గరకు వస్తే చాలు మాధవీలతలు,
మల్లె, సన్నజాజితీగలూ, పోటీపడి
ఆమెను పూలవర్షంతో ముంచెత్తేవి.
అక్కడ వున్న మామిడి చెట్టుకు ఆమె మహాఇష్టం కాబోలు
వంగి మరీ తియ్యటి ఫలాన్ని నోటికి అందించేది.. !!
అక్కడవున్నటువంటి పసిడి చెంబుతో
వడివడి నడకలతో ప్రతీ మొక్కకీ,
చెట్టుకీ నీరు పోస్తుంటే అవి ఆనందంగా ఊగుతూ,
ఆమె నుదుటి మీది చిరు చెమట ఆరేలా, అలసట తీరేలా,
మెలమెల్లగా గాలిని వీచేవి..!
ఆమె ఆ ఆశ్రమం బయట తిరుగుతూ వుంటే
అక్కడి లేడి కూనలు, లేగదూడలు
ఆమె చుట్టూ పరుగులు పెట్టేవి “మమ్మల్ని పట్టుకో” అన్నట్లు..
ఆమె వాటి వెంట పరుగెత్తలేక ముడుచుకొని బుంగమూతి పెట్టేది.
ఆ ముడుచుకున్న బుంగమూతి చూసి జాలి పడ్డాయా !
అన్నట్లు అవి ఆమె దగ్గరకు చేరి, ఆమెను ఒరుసుకొని నిలిచేవి.
ఆమె ఆప్యాయంగా వాటి నోటికి లేత పచ్చిక అందించేది.
ఆ పచ్చిక తిని అవి మళ్ళి పరుగులు పెట్టేవి.
ఇంకా ఇంకా తినిపించేందుకు ఆమె వాటి వెనుక పరుగెత్తేది.
ఆ పరుగెత్తడంలో ఒత్తైన ఆమె జుట్టు గాలికి ఎగురుతుంటే
నల్లని మబ్బు కమ్మినదని భ్రాంతి చెంది
నెమళ్ళు పురివిప్పి ఆనందంగా నృత్యం చేసేవి..!!
చీకటిపడితే చాలు శుక్లపక్షపు వెన్నెల్లో వెన్నెల కుప్పలూ,
కృష్ణపక్షపు రాత్రులలో చుక్కల కాంతులలో నర్తించేది.
తన స్నేహితురాళ్ళతో ఎంత అలసిపోయినా సరే
విశ్రమించే ముందు దైవ ప్రార్ధన చెయ్యడం ఆమెకు తప్పనిసరి కార్యక్రమం.
దైవప్రార్ధన చేస్తుంటే ఆమె గొంతుకలో సంగీతం అలలా లయబద్దంగా కదిలిపోయేది.
ఆమెను ఎవరెంత ప్రశంసించినా
ఆమెలో వినీతభావం, జిజ్ఞాస మరింత పెరిగేవి
కానీ అహంకారపు చాయ మాత్రం ఎప్పుడూ కనపడేది కాదు.
అందుకే ఆశ్రమంలోని పెద్దలందరికీ ఆమె అంటే అమిత వాత్సల్యం
ఆమె ఓ అద్భుత సౌందర్యమూర్తి
ప్రకృతిలోని అందాలన్నీ
ఆమెలో అలౌకికమైన సౌందర్యంతో అలరారుతున్నాయి
ఉషఃకాల పవనాంకురాల మార్దవాన్ని,
శరత్కాలపు పున్నమిలోని కాంతిని కలబోసిన దేహం ఆమెది.
వర్షాకాలపు మెరుపుల లావణ్యం,
కాసారంలోని కమలవనాలవైపు ఒయ్యారంగా
ఈదుకుంటూ పోయే హంసల చంచలాల విలాసం ఆమెది..!!
ఎప్పుడూ ఆమె ముఖములో ఓ వింత కాంతి,
అపూర్వమైన సౌందర్యశోభతో,
చెక్కిళ్ళు నునుసిగ్గుతో రాగరంజితాలై ఉన్నాయి.
చిగురుటాకుల వంటి అధరాలు
ఉండి ఉండి కంపిస్తుంటాయి తుమ్మెద రెక్కలు తగిలిన పూల రేకులవలె..!!
నల్లగా, ఒత్తుగా, సుగంధభరితమైన ఆమె కేశరాశి
హోమధూమాన్ని పోలి వున్నది.
ఆమె శరీర కాంతి హోమాగ్నుల అరుణకాంతిని తలపిస్తున్నది.
ఎగసిపడుతున్న హోమాగ్ని జ్వాలతో సన్నగా పడుతున్న
స్వచ్చమైన ఆజ్యధార మెరుపువలె వున్నది.
వేదయోక్తంగా, అత్యంత శ్రద్ధతో నిర్మించబడిన
యజ్ఞవేదికవలె పవిత్రంగా, మనోహరంగా ఉన్నదామె..!
నిజంగా అదో అందమైన కల..
అలా చూస్తూ ఉండగానే చరవాణి అలారం బోరు బోరుమని ఎగిరింది
ఇది కలా..! అని తేరుకొని వాస్తవ జీవితానికి వచ్చి
భాద్యతల కడవ నెత్తినపెట్టుకొని ముందుకు పయనించాను..!!
Written by: Bobby.Nani
No comments:
Post a Comment