Friday, May 15, 2020

వాశిత


ఏనాటికైనా నా యీ జీవితంలో
వసంతం తొంగి చూస్తుందేమో
అన్న ధీమాతో ఎదురుచూస్తున్నాను..!

పిల్ల తెమ్మర కోసం ఎదురు చూస్తే,
ఈదురుగాలి తాకింది..
వసంతంలోని సౌరభం కోసం చూస్తుంటే,
గ్రీష్మం నడినెత్తికెక్కి మండించేసింది..!!

మహా వలయ మాయా కల్పిత యీ జీవిత జగన్నాటకం లో
అనుకోని సూత్రధారి లా తానొచ్చి నిల్చుంది..
చీకటి మొగ్గ వెలుగు రేకులు విప్పుకున్నట్లుగా
నా జీవితం ఒక్కసారిగా ప్రకాశవంతమైంది
సైకిల్ పై ఇంటికి చేరే ప్రేమ లేఖలా 
తోటలోంచి ఎగిరొచ్చే మల్లెపువ్వు లా 
నా హృదయం గంతులేస్తూ ప్రేమ ఊయల ఊగుతూ ఉండిపోయింది..!!

ఎన్ని నారింజ తొనల్ని వొలిస్తే వచ్చిందో 
ఆ మేలిమి ఛాయ..!
ఎంత బంగారాన్ని కరిగిస్తే వచ్చిందో 
ఆ పసిడి కాంతి..!
నక్షత్రముల వంటి దంత ధవళ కాంతి
పనస తొనల చక్కెరకేళి  అధరములు 
సన్నని సంపెంగ వంటి కోటేరు నాశిక
కోనేటి కలువల తామర నేత్రాలు 
ఇంద్రధనువుల కనుసోగలు
నవనీతమద్దే వెన్నెల వంటి చెక్కిలి
గుప్పుమని గుబాళించే పారిజాతపు  దేహ పరిమళం
అన్నిటికీ మించి సాత్విక సద్గుణాలు కలిగిన 
పదహారణాల స్త్రీ తత్వం..
మూడు పదులలో కూడా ఆమె నాకు మూడేళ్ళ చిన్నారే..!!

నడుస్తున్నప్పుడు తన పాదాలమీదనే నా కళ్ళంతా
అది చూచి సున్నితంగా నన్ను దగ్గరకు లాక్కుంటుంది
క్షణంలోనే నన్ను వదిలేసి గంతులేసుకుంటూ పారిపోతుంది
అందంగా తీర్చి దిద్దిన ఆమె కాటుక కళ్ళను ఊహించుకుంటూ
మురిసిపోతానే కానీ తన కళ్ళనెప్పుడూ సూటిగా చూడలేను..!!

అకస్మాత్తుగా నా చెవుల మధ్యకొచ్చి
నాలుగు వాక్యాలు ముద్దు ముద్దు గా ఊది వెళ్ళిపోతుంది
తన స్పర్శ లేతాకు మీది వర్షపు చినుకు
తన చూపు కొమ్మనించి సున్నితంగా వేళ్ళాడే లేత పిందె
తను నడుస్తున్నప్పుడు చూడాలి 
వేయి కళ్ళు విప్పిన శ్వేత మయూరము లా కనిపిస్తుంది..!!

తానెప్పుడూ నాకు ప్రత్యేకమే.. 
ఎందరున్నా,
ఎందరితో వున్నా 
తనని చూసిన ప్రతీసారి తన అందం నా 
కళ్ళను మంత్రించి వేస్తుంది..!
తన చూపులు .. ప్రతీసారి లాగి విడిచిన బాణాల్లా 
గురిచూసుకొని సూటిగా నా గుండెను తాకుతాయి..!
ఆకాశంలో విరిసిన ఇంద్రధనస్సు లా 
నా మదిలో నల్దిశలా రంగుల్ని జల్లుతాయి..!! 

వేసవి సాయంత్రపు పచ్చిక పరపులపై
అటునుంచి ఇటు ఇటునుంచి అటు దొర్లుతూ వున్నాను
రెండే రెండు తన జ్ఞాపక శకలాలకోసం 
ఆకాశంమీది చుక్కల్ని మొత్తం.. చీకట్లో వడబోస్తున్నాను..!!

Written by: Bobbynani

1 comment:

  1. పిల్ల తెమ్మర కోసం ఎదురు చూస్తే,
    ఈదురుగాలి తాకింది.
    సైకిల్ పై ఇంటికి చేరే ప్రేమ లేఖ,
    తన స్పర్శ లేతాకు మీది వర్షపు చినుకు,
    జ్ఞాపక శకలాలు - ఈ ప్రయోగాలు చాలా బాగున్నాయి.

    ReplyDelete