పురుషుడు శక్తి స్వరూపుడు, అనంతమయుడు, తేజోమయుడు అతడికి అందచందాలు అవసరం లేదు.. అతడు సహజంగానే సౌందర్యుడు.. ఆభరణాలు అసలే అక్కర్లేదు.. అతడి బలమైన దేహసౌందర్యమే అతడి ఆభరణం.. అలాంటి మగసిరి గురించి నా ఈ చిరు అక్షర జల్లులు.
తరస్వి
******
తల్లి పురిటినొప్పులు పంచుకొని పుట్టాడు
నాటినుంచే తన జీవితానికి తానే ఆయువు
కఠోర పరిస్థితులనే జయిస్తూ వెళ్తాడు
సూర్య చంద్రులు ఆరిపోయినా
కట్టె కాలి బూడిదగా తాను రాలేవరకు
అతడో అలుపెరగని యోధుడు
విశ్రమించని శ్రామికుడు
విరామమెరుగని తాత్వికుడు
చాణక్యుని చాకచక్యాన్ని
అల్లూరి ఆవేశాన్ని పుణికిపుచ్చుకున్నవాడు
వాడే సౌందర్యాభిలాష లేని మోహనుడు
నిక్కార్సైన మగసిరిగల మగాడు..!!
అతడి మౌనం అమాస నిశీధము
అతడి వేదన కనపడని భీకర ప్రళయ ఘోష
అతడి కోపం తీరాన్ని తాకే ప్రచండ తుఫాను
అతడి ప్రేమ అజరామర కైంకర్యము
అతడి కన్నీరు చెమ్మ తగలని మహా కడలి
అతడి ఆంతర్యం అంతుపట్టని అనంత స్వరూపం..!!
అయినా అతడంటే లోకువే
ఒక బట్ట దండెం మీద
మరో బట్ట దేహం మీద వేసుకొని తృప్తిపడతాడు
పంచభక్ష్యములు కాదు పచ్చడి మెతుకులొడ్డించినా తిని పోతాడు
ఎక్కడో గుండె పొరల మాటున ముడుచుకొని పడున్న కోరిక
పసిపిల్లాడిలా గంతులెయ్యలని..!
అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడే
మసిబారిన తనని తాను చూసి ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోతుంటాడు..!!
అతడుంటే
తల్లికి ఓ ధైర్యం
తండ్రికి ఓ భరోసా
చెల్లికి ఓ రక్షణ
భార్యకు ఓ నమ్మకం
బిడ్డకు ఓ కవచం
స్నేహానికి ఓ గెలుపు
కుటుంబానికి ఓ దిక్కు..!!
ఓయ్ మగాడా
నువ్వింత చేస్తున్నా
నీ గుండె భాండాగారాల్లో తరగని సిరుల్లా
దాచుకున్న కడలి కన్నీళ్ళు
సలసల మరిగి ఉవ్వెత్తున పొంగివచ్చి
నీ కంటి నుంచి వెచ్చగా రాలుతున్నా
ఒక్కరూ చూడలేకున్నారు
నిన్ను గుర్తించలేకున్నారు
అయినా నువ్వు మగాడివేరా..!!
Written by: Bobby Nani