అభిమానించే వారిని కాదు..
మనమంటే గిట్టనివారిని మెప్పించగలగడమే గొప్పవిషయం..
గడచిన ఎన్నో సంవత్సరముల నుంచి ప్రశంసలు ఎన్ని అందుకున్నానో
విమర్శలు కూడా అన్నే స్వీకరించాను..
ప్రశంసలు పక్కనపెడితే విమర్శలలో మాత్రం కొన్నిటిని పరిశీలిద్దాం..
ఆత్మ పరిశీలన చాలా గొప్పదబ్బా...
ఏంటి నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఇదేనా..? వారిని పెడత్రోవ పట్టిస్తున్నారే..
స్త్రీ ని ఎక్కడా వదలకుండా ఇంత దారుణంగా వర్ణిస్తూ రాస్తారా.. ??
ఛి ఛి ఎప్పుడూ ఆ కవితలేనా .. మరీ ఇంత ఘాటైన వర్ణనలా..
విశృంఖలత్వాన్ని ప్రభోదిస్తున్నారా ఏమి ??
ఆడవారే మీ కవితా వస్తువులా.. మగవారు అందుకు తగిన వారు కాదా..
వారిపైనే నా మీ వర్ణనలు .. మగవారు పనికిరారా..
ఆడవారిని ఎప్పుడూ అందలము ఎక్కిస్తున్నారే .. అప్పుడప్పుడు మగవారిని కూడా ఎక్కించండి..
మీకు వారి బాధలు, కన్నీళ్ళే కనిపిస్తాయా.. మగవారివి కన్నీరు కాదా..
వారేనా సౌందర్యవంతులు మీ దృష్టిలో.. వారికన్నా సౌందర్యం ఈ సృష్టిలో ఎంతో వుంది.. వాటిపై కూడా రాయండి..
అంత ముక్కుసూటిగా వుంటే ఎలా మీరు.. భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు..
నిజంగా మీరే రాస్తున్నారా .... లేదా అందరిలానే కాపీ నా
చాలా లోతైన పదాలు ఎప్పుడూ వినని పదాలు రాస్తుంటారు.. అవి మీరే రాస్తారా.. నాకెందుకో వృద్ద వయస్సు గలవారు అవి మీకు అందిస్తున్నట్లు అనిపిస్తుంది..
ఇంత చిన్న వయస్సులో ఇంత పరిపక్వతతో రచనలు చెయ్యడం అసాధ్యం అసలు.. ఇంతకీ ఆ చిత్రంలో వున్నది మీరేనా లేక ఆరుపదులు దాటిన ముసలోడా..
అసలు కవిత్వం అంటే మీకేం తెలుసు.. నోటికొచ్చింది రాస్తున్నారే
అన్నీ తెలుసు అనే గర్వమా మీకు .. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరే.. మా పోస్ట్ లకు కామెంట్ లు అస్సలు పెట్టరే ..
ఉఫ్ఫ్ .... ఇలాంటివి కోకొల్లలు..
భగవంతుడే ఇక్కడ అందరికీ నచ్చట్లేదు.. ఒక్కొక్కరు ఒక్కోలా వారికి నచ్చేలా భావిస్తూ స్తుతిస్తూ వున్నారు.
అల్పులం మనం, మన రాతలు అందరికీ నచ్చాలని లేదు.. కానీ ఈ విమర్శలు మోడుబోయిన కత్తిని సైతం అత్యంత పదునుగా చెయ్యగలవు..
కొండను ఎక్కుతూ ఎక్కుతూ .. మధ్యలో కాసేపు ఆగి వెనక్కు తిరిగి చూస్తే... నేను నడిచి వచ్చిన బాట అంతా మెలికలు తిరిగిన ఒక పెద్ద చారలా కనిపించింది..
అబ్బ..!
ఇంతదూరం నడిచానా.. అనిపిస్తుంది..
ఇక నడవ వలసిన దూరము కంటే నడిచి వచ్చినదే ఎక్కువని తోస్తుంది.. అలాగే జీవితము కూడానూ ..!!
వయస్సు పెరిగే కొలది అనుభవసారము, జ్ఞానము పెరుగుతూ పోతాయి.. వాటిని తెలిపే ప్రక్రియే జుట్టు నెరవడం, తోలు ముడతలు పడటం.. పళ్ళు రాలిపోవడం.. వెన్ను వంగిపోవడం.. ఒకటి కావాలంటే మరొకటి త్యజించాల్సిందే..
స్టేడియం లో ఓ రన్నింగు రేసు జరుగుతూ వుంది.. పందెము ప్రారంభమైన రెండు నిమిషాలలోనే ముగ్గురు విద్యార్ధులు ముందుకు సాగారు.. గెలుస్తున్న ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి అవలీలగా ముందుకు సాగిపోయాడు.. రెండవ వ్యక్తి గట్టి ప్రయత్నం చేస్తూ ముందు వెళ్ళే అతనిని సమీపించాడు.. మూడవ వ్యక్తి మరీ దూరాన వున్నాడు.. కానీ ఇంకా పరిగెత్తుతూనే వున్నాడు.. మొదటి ఇద్దరూ గమ్యస్థానానికి చేరగా.. అందరూ ఆ ఇద్దరినీ పేరుపెట్టి పిలుస్తూ హర్షధ్వానాలు చేసారు.. మూడవ అతను ఇంకా పరిగెత్తుతూనే వున్నాడు.. అతన్ని చూచి అందరూ చప్పట్లు కొడుతూ హేళన చేస్తున్నారు.. కానీ అతను అవన్నీ లక్ష్య పెట్టక ఇంకా పరుగెత్తుతూనే వున్నాడు.. చివరికి గమ్యస్థానానికి చేరుకొని కుప్పకూలిపోయాడు.. గబగబా అతని దగ్గరకు వెళ్లి అతని ప్రక్కన కూర్చుని అతని చేయి నా చేతుల్లోకి తీసుకున్నాను.. ఆయాసంతో వగురుస్తూ కళ్ళు మూసుకొనివున్న అతను నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.. ఆ చిరునవ్వు నాకో గుణపాఠం అయింది..
జీవితమే ఒక విశ్రమించని పరుగుపందెం.. అందరికీ మొదటి రెండు స్థానాలు ఎలా వస్తాయి ?? మూడవ బహుమతి లేదాయే.. కానీ యత్నము ముఖ్యము.. ఫల మెలా పరిణమించినా మనము పాటింపకూడదు అని తెలుసుకున్నాను.. ఏది చేసినా చాలా బాగా చెయ్యాలి.. మనస్సునుంచి కృషి చెయ్యాలి.. మన కృషి ఎంతో అందంగా వుండాలి.. కౌశల్యంతో చేసిన కృషే యోగమనిపించుకుంటుంది.. ఒక్కొక్కప్పుడు ఎంతటి తీవ్రమైన కృషీ, ఎంతో మనసారా చేసిన శ్రమా ఫలించకపోవచ్చు.. కానీ మనం బాధ పడకూడదు.. కొండ విరిగి శిరస్సున పడ్డా లక్ష్య పెట్టకూడదు..
నీవు వెళ్ళాలనుకున్న గమ్యం నీకు బాగా తెలుసుండాలి..
మార్గం మారినా గమ్యం చేరగలగాలి ..
ముందు గమ్యం తెలుసుకొని మార్గాన్ని అన్వేషించు..
స్వస్తి __/\__