Friday, August 2, 2019



మొదటిసారి 
ఈ ప్రపంచాన్ని ఎత్తునుంచి చూసింది 
నాన్న భుజాల మీంచే 
వచ్చీ రాని రెండే రెండు పల్లుతో, 
ఆ .. అంటూ బోసి బోసి నవ్వులతో,
స్వచ్ఛమైన ప్రేమను కురిపిస్తూ 
చేతికందిన జుట్టు లాగేస్తూ 
అల్లరి చేసింది నాన్న భుజాల మీంచే..!!

మొదటిసాటి 
భయమేస్తే తడబడు తప్పటడుగులతో 
దాక్కుని నక్కి నక్కి చూస్తూ నిల్చుంది 
అమ్మ చీర కుచ్చిళ్ళ వెనక నుంచే..!!

మొదటిసారి 
ప్రేమొస్తే చేతులు రెండూ పైకెత్తి 
బుడి బుడి నడలకతో, 
గోముగా అమ్మ చంకనెక్కి కూర్చుంది 
అమ్మా, నాన్నల తియ్యని ముద్దులందుకునేందుకే..!!

నాకోసం 
వారెన్ని నిద్రలేని రాత్రుళ్ళు గడిపారో 
నాకు జ్వరమొస్తే 
వారి మనసుకు నిలకడ, 
వారి కంటికి కునుకూ రెండూ వుండేవి కాదేమో.. 
నిత్యం పన్నీరు రాసుకునే వారి దేహాలపై 
నేనొచ్చాక మల, మూత్రాలే పన్నీరులైనాయి 
వారి ఎకాంతాలన్నీ నా అల్లర్లైనాయి 
వారి ఆలోచనలన్నీపూర్తిగా నావైనాయి.. !!

మొదటిసారి 
అమ్మ ఏడుస్తోంది.. 
నా చేతిని స్కూల్ టీచర్ చేతిలో పెట్టిందని.. !!

నాకు ఇప్పటికీ గుర్తుంది 
మొదటిసారి స్కూల్ లోపలకు 
భయం భయంగా వెళ్తున్న నన్ను 
జాలిగా, బాధగా చూసిన అమ్మ చూపులు 
నాకింకా గుర్తున్నాయి.. !!

నాన్నతో బజారుకెల్తుంటే 
అందరూ నన్ను ముద్దు చేస్తుంటే 
మా అబ్బాయే అంటూ గర్వంగా చెప్పుకుంటూ 
నాక్కావాల్సినవన్నీ కొనిస్తూ, 
ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది ఆయనే..!!

పెరిగి పెద్దయ్యాక 
సుదూర ప్రాంతాలకు వలసవెళ్ళి 
బాధ్యతలనడుమన
ఉద్యోగాలరీత్యా 
హిమగదుల మధ్యన 
నలగని చొక్కాతో 
ఇదంతా నా కష్టం,
అంతా నా ఇష్టం అంటూ 
కన్నవారికే హద్దులు ఏర్పరుస్తూ, 
వారెక్కి తొక్కిన మంచాలూ, 
నమిలి ఉమ్మిన ఆస్తులూ
పోగేసుకొని విర్రవీగుతున్నావ్ ..!!

ఎప్పుడూ నా గుండెలపైనే ఎక్కితొక్కుతూ ఆడుకునే 
నీకే నా గుండె లోని బాధ తెలియదట్రా అంటూ 
సున్నితంగా మందలించే తండ్రికి ఏం సమాధానం చెప్తాం ..??

వెచ్చని ఓ రెండు కన్నీటి బొట్లు రాల్చడం తప్ప..!!

Written by: Bobby Nani

No comments:

Post a Comment