Friday, June 29, 2018

చూపు పారేసుకున్నాను..



చూపు పారేసుకున్నాను.. 
ఆమెను చూచినది మొదలు.. !! 

వినీలాకాశంలో విలక్షణమైన సౌందర్యం ఆమెది.. 
అసంఖ్యాక నక్షత్ర మండలంలో రెప్పలార్పలేని రూపం తనది.. 
సూర్య చంద్రుల్లా ప్రతీక్షణం వెలిగే ఆ నయనాలు, 
సంపెంగ వంటి ఆ సన్నని నాశికాగ్రహం, 
నల్లని ఆకాశంలోని ఓ తారను తెంచి పెట్టుకున్న ముక్కు పుట, 
గులాబీ రెక్కల్లా మృదుమధురమైన ఆ యెర్రెర్రని అధరములు, 
నవనీతపు ముద్దల్లా సుతిమెత్తని చెక్కిలి 
పసిడి ఛాయవంటి యవ్వన కాంతిమయ దేహం. 
శంఖం లాంటి మెడ 
వెండి తీగలా వున్న సన్నని నడుము. 
ఆమె స్వరంలో ఉషస్సు, 
ఆమె చూపుల్లో యశస్సు, 
కళ్ళతోనే సంభాషించే సమ్మోహనం తనది..!! 

ఆమె ఎదురు పడిన ప్రతీసారి 
మౌనం మాటలకందని అనుభూతిగా మారిపోతుంది.. 
పరిమళాలు వాయువులతో మాలలల్లుకుంటూ వెళ్తుంటాయి.. 
సూర్యోదయం లా విరిసే ఆమె మోముకు 
ప్రాతఃకాల కుసుమములు వికసిస్తుంటాయి.. 
లేతాకు మీది వర్షపు చినుకులా, 
కొమ్మనించి సున్నితంగా వేలాడే పిందెలా 
నడుస్తూ నాట్యమాడే మయూరి విప్పిన వేయికళ్ళ 
ఉద్యానవనంలా నా కళ్ళు ఆమెను చూడగానే మంత్రించి పోతాయి.. 
మొదట రాలిన వర్షపు చినుకు సూటిగా ఆమె నుదుటిపై సంతకం పెడుతుంది.. 
ఆమె చేతి స్పర్శకు నూతన పత్రం కొమ్మ కొమ్మకూ చిగురిస్తుంది .. 
తన ప్రతీ సౌందర్యమూ పదమై, పద్యమై , అనుభవమై 
భవిష్యదాకాశమై గుండె గులాబి పువ్వై ప్రకృతి చిల్కరించే మంచు బిందువులై 
ప్రతీ హృదిలో ఓ పుల్కరింపై నిర్మల అంతరంగంపై ఉప్పొంగి పొరలే సముద్ర కెరటమై 
కాలం కాచి వడపోసే తెనేటి విందై పల్లవిస్తూ ప్రవహిస్తోంది..!! 

Written by : Bobby Nani

No comments:

Post a Comment