ప్రకృతి అంతా నాదే,
ప్రతీ భావానా నాదే
తొమ్మిది రసాలు నాలోనే వున్నాయి, వాటిని ఈ లోకానికే కొత్తగా చూపెడతానంటూ తన కుంచెతో రంగులద్దే వాగ్దేవి తను.
రెప్ప పాటంత జీవితకాలంలో దోసిళ్లతో దొరికినంత ఆనందం నింపుకొని సంబరపడాలనే పసి తత్వం తనది.
ఒక చిత్రానికి రూపం ఇవ్వడం అనేదానికన్నా ఆ చిత్రానికి ప్రాణం పోస్తున్నారు అంటేనే బాగుంటుందేమో. చిత్రం గీయడం అంటే బొమ్మల కొలువు కాదు. హృదయంలో పల్లవించి, రంగులలో పరిమళించి, కుంచెతో భావ స్పందనకు ప్రాణం పోయడం. అలా ప్రతీ చిత్రానికి ప్రాణాన్ని పంచేవారే కె. ప్రసన్న జ్యోతి గారు.
జీవితాన్ని చూడటం స్పృహ,
సమాజాన్ని చూడటం చైతన్యం,
రెంటినీ సమన్వయపరిచేలా ప్రవర్తించడమే నిబద్దత. అలాంటి గొప్ప మనస్కురాలు తను.
కన్నీటిని సానబెట్టి రసరమ్య చిత్రాలను అవలీలగా గీయగల ఆలేఖిత తను
సుఖానుభూతి కోసం కాక, మానవ కల్యాణం కోసం గీచె వారు చాలా అరుదు...!! అందుకే తను అంటే నాకు చాలా గౌరవం.
సహనానికి చెలికత్తెగా, దుఃఖమనే కలుపుమొక్కలను ఏరుతూ ఒంటరి పోరాటం చేస్తున్నారు.. పైకి పళ్ళికిలిస్తూ, పక్కనే రాసుకు పూసుకు తిరిగే గుంటనక్కలను సైతం చిరునవ్వుతో ఎదుర్కుంటూ, వారినుంచి మీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. అన్నీ తెలిసిన అయినవారే ఎద్దు పుండు కాకికి రుచిలా మారితే పంటి బిగువున బాధను అణిచి నిశ్శబ్దమనే ఆయుధంతో, చెరగని చిరునవ్వుతో ముందుకు పయనించే మీ శక్తీ సామర్ధ్యాలను దూరంనుంచే గప్చిప్గా చూస్తున్నాను. పైకి ఒకలా, లోన మరోటి పెట్టుకొని తోకాడించే వరాహ సౌందర్యుల ఓదార్పు యాత్రలకు కుండ బద్దలు కొట్టే మీ పదునైన మాటలను నేను చూస్తున్నాను.. ఈ లోకానికి వచ్చి మీరు ఏరుకుంటున్నది పారేసుకున్న ధాన్యం కాదు. మీ చే జారిన జ్ఞాపకాలను. మీరెక్కే ఒక్కో మెట్టు ఒక్కో పురినొప్పులకు రూపం.
ఒక్కటి మాత్రం నిజం.
మీరు నిర్మించుకున్న ఈ ఆశావరూథములో...
ధైర్యమే ఒక కవచంగా సాగుతున్నమీకు...
అర్పిస్తున్నాను... ఈ అభిమాన నీరాజనం !
సమర్పిస్తున్నాను... మమకార సిరుల స్వర్ణ చందనం... !!
మనసారా అభినందనలు మీకు..
పత్రికల్లోనే కాదు మరింత అత్యున్నత శిఖరాలను మీరు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985
No comments:
Post a Comment