ఓ కవీ
నీ సిరా చుక్కల్ని
ఈ సమాజం మీద చిందించకు
సహించని వాళ్ళు,
మాటల తూటాలు వదుల్తారు
మమ్మల్నే కెలుకుతావంటూ
కొత్త రంకులు నీ
కంటకడతారు..!!
అందుకని
శ్రీనాధునిలా
ఏ శృంగార కావ్యాన్నో,
కాళిదాసులా
ఏ మేఘసందేశాన్నో, వ్రాసుకో
బిరుదులిస్తారు,
బొమ్మలేస్తారు,
సంస్కరిస్తారు..సత్కరిస్తారు!!
నీ అంతరంగములో
వింత లోకాలను తీర్చి
తిక్క కుదిరేంత వరకూ
తైతక్కలాడుతూ రాయడం
ముందు మానేయ్..!
విభ్రమ నేత్రాలతో
చుట్టూ పరకాయించడం
మొదలు పెట్టు..
పట్టపగలు చుక్కలు పొడిచిన
మిట్ట మద్యాహ్నపు సొగసును
నీ రాతల్లో రాయాలనుకోకు
అర్హత, రాసేనీకు మాత్రమే వుంటే సరిపోదు
చదివి అర్ధం చేసుకునే వారికి కూడా వుండాలి
అయినా నా పిచ్చి కానీ
నీ మనసు వుంది చూసావు
ఉత్తి మొండి ఘటం
దాని తోవే దానిది
దాని రాత దానిదే కానీ
అఖిలేశ్వరుడు శాసించినా
రాయడం ఆపదుగా ..!
ఇదివరకు కవులు కూడా
ఇలా ఆలోచించి వుంటే
ఇప్పుడీ దేశం ఇట్లా ఉండేదా
జనం ఎంతో కసిగా తిట్టిన తిట్లన్నీ
వారు జీర్ణించుకుని
గప్చిప్గా వ్రాసుకుంటూ
ముందుకెళ్ళడమే కవంటే..!!
కవి దాహం అనంతసముద్రం
కవి కోరిక అనంతాకాశం
ఏడు వర్ణాలు త్రాగి
ఏక వర్ణం చిమ్ముతాడు
అతడే కవి..
అతడు మాత్రమే కవి..!!
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985