ఉగాదితో మొదలైన వసంతఋతువది
తెల్లవారు ఝాము వేళలు ఎంతో అందంగా ఉన్నాయి
తోటల్లో ఏతపు కొయ్యలను త్రొక్కుతూ తోటమాలులు
మధుర గీతాలను ఆలపిస్తూ జానపదులు
వారి పాటలకు నీటిలో మునిగే కుండ
భుంభుమ్మని ధ్వని చేస్తూ
జానపద వాద్యమైన గుమ్మెట మ్రోగినట్లుంది..!!
పాటలీ వృక్షాల క్రింద రాత్రి రాలిన పువ్వులు
దూరంనుంచి వార్తలను మోసుకొచ్చే పిల్లగాలికి
గుట్టలు గుట్టలుగా పేరి వున్నాయి..
మడవలలో నుండి నీరు ప్రవహిస్తుంటే
తడసిన నేల వాసనను రెట్టింపుచేస్తూ
యీ పూల సువాసనలు ఏసరేఁగుతున్నవి..!!
వారి పాటలు,
యీ సువాసనలు,
ఏతపు బాన చేసే వాద్యధ్వనులు
అన్నీ కలిపి యీ ప్రాతఃకాలమును
సొగసుగా చేస్తున్నవి..!!
దూరాన్నుంచి అందియల చప్పుడు
ఘల్లుఘల్లుమనుచు
గుండెను పూదండతో లాగినట్లుగ
అటుప్రక్కగా తిరిగి చూసాను
మలయపవనమున
పింఛము విప్పిన మయూరములా
పారాణి అంటిన పాదాలతో లేలేత
హిరణ్మయ రశ్మిని ముద్దాడుతూ
చెంగు చెంగుమనుచున్నది..!
నెమలిలా నడిచే ఆమె నాట్యానికి
వాయునందనుడే మద్దెల వాద్యకాడైనాడు..!!
నల్ల కల్వలవలె చక్కనైన కనుపాపలు
అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించు ఫాలము
అమృత రసాన్ని నింపిన కెంపుల కలశస్తనాలు
బంగారు కాంతితో మెరిసే ధగధగల ఉదరభాగం
భగభగల మంటలను జిహ్వతో చల్లార్చు నత నాభీ సరస్సు
నిజంగా ఆమెది సహజత్వమైన సౌందర్యం..!!
దగ్గరకొచ్చిన ఆమె
కెంపారు నేత్రాలలో
కోటి సూర్యోదయాల్నిఒక్కసారిగా దర్శించాను
మకరికల లేపనం దేహానికి పట్టించిందేమో
మంత్రించినట్లుగా నాసికనదరగొడుతూ
గుప్పున తాకే గంధపు, కస్తూరి పరిమళములు
సమ్మోహించు ఆమె ఉచ్వాస నిశ్వాసాలు
ఆమె శరీర సౌష్టవం ముందు
పండువెన్నెల సైతం వెలవెలబోతుంది..!!
తమకముతో బరువుగా రెప్పలు వాలుస్తున్న
నా నేత్రాలు నన్ను ఉయ్యాలలూపుతాయి
ఆమె నయనావీక్షనాలు సాగి లాగి విడిచిన బాణాల్లా గురిచూసి
నా గుండెల్ని తాకుతున్నాయి
లేతాకు మీది వర్షపు చినుకులా,
కొమ్మనుంచి సున్నితంగా వ్రేలాడే పిందెలా
నడుస్తూ, నాట్యమాడే మయూరి విప్పిన
వేయికళ్ళ వసంతోద్యానవనంలా
ఆమెను చూసిన నా కళ్ళు మంత్రించి వేశాయి..!!
Written by: Bobby Aniboyina
No comments:
Post a Comment