Wednesday, September 23, 2020

వేదాంతి..


ప్రపంచం ఎప్పుడూ
నన్ను గెలవాలనే చూస్తుంది..
నా స్వార్ధం నాది నీ స్వార్ధం నీదంటుంది..!!

వయస్సు మళ్ళిన నాకు
ఇచ్చే శాశ్విత బిరుదు “ముసలివాడు”
నా అనుకున్న నా వారికి నేనంటే లెక్కేఉండదు
పోయాక మాత్రం పెద్ద పెద్ద గోరీలు,
కాంస్య విగ్రహాలు,
పత్రికలలో సంవత్సరీకాలు,
అన్నదానాలు, దాన ధర్మాలు
పోయాక ఈ భోగాల్ని ఊహిస్తూ
ఇప్పటికి వాళ్ళను నేను క్షమించాల్సిందే..!!

నా వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రేమగా
రెండు వాక్యాలు రాల్చితే చాలు
అకస్మాత్తుగా నా నేత్రాలు ప్రకాశిస్తాయి
అమ్మ పొత్తిళ్ళ మధ్య చలికి ఎర్రగా
వొణుకుతున్న కళ్ళుతెరవని శిశువులా మారిపోతాను..
ఈ వయస్సులో కావాల్సింది అదే గా మరి..!!

ఏకాంతంలో
నేనో వేదాంతిలా మారి అనంతాకాశ శూన్యంలోకి
ప్రశ్నల శరములు సంధిస్తుంటాను
మనసుకు ఎన్ని గాయాలైనా నేను మాత్రం
స్వప్నాల మధ్య విహరిస్తుంటాను..!!

నిత్యం రాలే నా అశ్రుపుష్పాల మధ్య నా ఈ జీవితం
అనంత ఎత్తులకు ఎగిరి
ఊహించని లోతుల్ని కనుక్కుంటుంది..!!

Written by: Bobby Nani

Saturday, September 19, 2020

శుభాంగి...

ఓ సెమ్మ,
నీ కెంత వయ్యారమే,
చిన్ని గన్నేరు పువ్వు చీరగట్టి
చిలుక రెక్కల రవిక బిగియ దొడిగి
కుదురు పాపట తీసి కురులు దువ్వి
నుదుట కస్తూరి కాయ చిదురుపెట్టి
పడతి చెమటగారిన యది
పన్నీరు గంధమేనే..!!

అబ్బబ్బ ఎన్నెన్ని కులుకులే
సంపెంగ రేకులే చెలియ చెక్కిళ్ళు
దానిమ్మ గింజలే రమణి పలువరుసలు
వెండి వెలుగులే సరసాక్షి నునుబుగ్గలు
నాజూకు నడుమున నడయాడు
నారీమణి బంగరు మొలతాడు
అబ్బబ్బ ఎన్నెన్ని సౌందర్య సొబగులే..!!
కాళ్ళకు లత్తుక నంటి
కన్నులకు కాటుక నంటి
చెక్కిళ్ళకు మకరికను పూసి
కబరీభరముకు మరుమల్లెలు దూర్చి
వేకువన పూచిన తంగెళ్ళ వలె భూషించు
నీ సముద్వీక్షణములు క్షణమైననూ చాలునే..!!

ఒకవైపున వీరమును
మరువైపున శృంగారమును
ఏక కాలమున చూపగల సమర్ధురాలివి శుభాంగివి..!!

Written by: Bobby Nani

 

Wednesday, September 9, 2020

శ్రీమతి ప్రేమలేఖ ...

 
శ్రీమతి ప్రేమలేఖ ...
************
 
ఓయ్ మొగుడా .. నీ పై ఓ చిలిపి కోరిక పుట్టిందోయ్..
అదీ.. అదీ.. అబ్బా చెప్పాలంటేనే సిగ్గేస్తోంది...
సరే చెప్పేస్తున్నా..
ఇన్నేళ్ళ మన ప్రయాణంలో నీపై నాకుగల భావాలను ఓ ప్రేమలేఖగా రాయాలనిపించింది..
ఓయ్ నవ్వకు ..నవ్వావో చెప్తున్నా ..
ప్రేమికులేనా లేఖలు రాసుకునేది..!
వాళ్ళేనా ప్రేమికులు ?
మనం అంతకన్నా ఎక్కువ..!!
అందుకే నా యీ చిలిపి కోరికను మన్నించి ఏకాంతంగా చదువు..!! సరేనా..!
 
అగ్నిని సాక్ష్యముగా చేసి సప్తపది తో ఒక్కటైన దగ్గరనుంచి
నేటి వరకు ఆనందం నీదైతే చిరునవ్వు నాదిలా చూసుకున్నావు
నా మూడు పదుల ఆడతనాన్ని అమ్మతనంగా మార్చి
నన్నో పసిపాపలా ఆడించావు, లాలించావు..
నా కోసం వైతరణి పాయలు కూడా లెక్కచెయ్యక ఈదుకుంటూ వస్తావు
అందుకే .. నా పక్కన నువ్వుంటే ఓ ధైర్యం.. ప్రపంచాన్ని కాలదన్నేంత ధిక్కారం..!!
 
నేను తురుముకున్న మల్లె మొగ్గలు నీ పెదవులు తట్టి లేపినప్పటి ఆనందాన్ని
నడిరేయిన విరుచుకుపడ్డ వానలో.. పిడుగుపాటుకు అదిరిపడిన నన్ను
అమాంతం వాటేసుకున్నప్పుడు.. వణుకుతున్న నా పెదవులను అందుకున్నప్పటి ఆత్మీయతను ఎలా మర్చిపోగలను..!!
మన వసంతాలాటలలో కళ్ళకు గంతలు కట్టుకొని కవ్వించుకుంటూ
నను గడ్డివాము దాకా తీసుకుపోయి దొరికిపోయావంటూ నీ కౌగిట్లోకి లాక్కుని
గట్టిగా చుంబించిన క్షణాలు ఇంకా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి..!!
ఇలా ఒకటా రెండా రోజుకో మధురిమను నాలో మీటుతూ
తొలినాళ్ళ మన యౌవనాన్ని ఈ నాటికీ  నాలో స్పందింపజేస్తూ వున్నావు..!!



 
పొద్దున నువ్వు రాల్చిన మల్లెలను ఏరుతూ వుంటే
రాత్రంతా మనకు పహారా కాసి మన కొంటె జ్ఞాపకాలన్నిటినీ పోగేసుకొని
నిస్తేజంగా చూడు ఎలా చూస్తున్నాయో అనిపించింది..!!
బైట అందరిముందు నువ్వు నా చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా?
లోలోపల ఎంత గర్వంగా నవ్వుకుంటానో ..!!
తోటి ఆడపిల్లల దృష్టి నీపై పడకుండా వారిని కోపంగా చూస్తూ కనుసైగలతోనే
వారిని ఎంతలా కట్టడి చేసి నిను కాచుకున్నానో నీకేం తెలుసు.. నా ముందు ఓ ఫొస్ కొడుతూ వెళ్తావ్..!!
అప్పుడప్పుడు నీతో పెట్టుకునే ప్రణయ కలహాలతో నన్ను నేనే మర్చిపోయేదాన్ని
నీ ఛాతిపై నే తలపెట్టి పడుకున్నప్పుడు నా తల్లి, తండ్రినే కాదు ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను..
నాకు బాలేనప్పుడు నన్ను దగ్గరకు లాక్కొని నా నుదిటిపై పెట్టె
నీ ముద్దుకోసమైనా బాలేకుండా మంచంపై పడివుండాలనిపిస్తుంది
నాకోసం ఎన్ని త్యాగాలు చేస్తావో నువ్వు.. ఒక్కోసారి ఏడుపు కూడా వస్తుంటుంది నాకు..!
అందుకే అలసి సొలసి నువ్వొచ్చే మాపటేళకు పరిగెత్తుకుంటూ ముంగిట్లోకొచ్చి
నాలోని ఊపిరితో యెర్రని శాలువా అల్లి ఉంచాను..ప్రేమగా నీకు అర్పించేందుకు..!!
ఒకటి చెప్పనా..
ముద్దైనా, మురిపెమైనా
ప్రాణమైనా, ఊపిరైనా నీతోనే..
నీ మరణంలో కూడా ఉన్నపళంగా అన్నిటినీ వదిలేసి నీ చేయి పట్టుకొని వచ్చేస్తా..
ఒంటరిగా విడిచి వెళ్ళకు ..!!

ప్రేమతో ... కోటి చుంబన సంతకములతో నీ శ్రీమతి..!!