మజిలీ..
******
భావాలే కరువౌతున్నాయి
ఇక భావ కవిత్వం ఏం రాయమంటావ్ ..?
నువ్వు, నేను
ఒకే కాలంతో పరుగులు తీస్తున్నాం..
కానీ మన ప్రయాణాలే వేరు
లేనిపోని పెద్దరికాలు తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది..
అయినా సాధించింది ఏమీ లేదు.
అలాగని కాలంతో పరుగు మాత్రం తప్పట్లేదు..
అయినా మనసైన సమయాలలో మనమూ,
మనం కదలని సమయాలలో కాలమూ,
ముందుకెళ్తూనే వుంది..!!
ఎప్పుడూ చీకటిని చూసే మనసు
ఒంటరితనంతో చంద్రుణ్ణి చూస్తూ,
వెన్నెలను ఆస్వాదించే సున్నితత్వం
మరిచానేమో అనిపిస్తుంది..
నిజమే బ్రతుకు పరుగులలో
భావజాలాలు, వయస్సులు, అన్నీ
గప్చిప్గా మారిపోతుంటాయి..!!
ఇన్నేళ్ళు గడిచినా
ఇప్పటికీ మార్పేదైనా మనలో ఉందా అని చూసా..
ఆలోచనల్లో లేదు కానీ,
ఒకరికొకరం సమయం కేటాయించడంలోనే వచ్చింది..
రాకేం చేస్తుంది .. ఎదురుగానే వున్నా
సంద్రానికి అటువైపున నీవు,
ఇటువైపున నేను కదా..!!
అయినా..
అవే కాలం కొలతల్లో,
నువ్వూ...!! నీతో నేను సమాంతరంగా
ప్రయాణిస్తున్నాము కదా.. !!
చూడు.. నిశితంగా !!
వెచ్చని వెలుతురును,
చిక్కని నిశీధము కప్పుతూ వస్తుంది..
నువ్వు కూడా నిశీధమనే మలుపుదగ్గర
రాతిరి మజిలీ కోసం వెళ్తున్నావు కదా..!!
అసలు మనమెక్కడైనా కలుస్తామా.. ?
ఇలానే అంతం అవుతామా.. ?
మనకంటూ నెమరేసుకోవడానికి
కొన్ని జ్ఞాపకాలైనా ఉంటాయా.. ?
ఏమో .. నేను చాలా నిర్లక్ష్యంగా ఉంటాను..
రేపటి కోసం... రేపు ఏంటి మరో నిమిషం గురించి
ఆలోచించలేని నిర్లక్ష్యం నాది..!!
ఆ చున్నీ పట్టుకు లాగి
నీకు చొరవ నేర్పి దారి చూపించాలని ఉంటుంది..
ఎందుకో నువ్వు ఎదురుపడితే
మనసు మౌనంగా మారిపోతుంది..
నిన్ను ఎవరైనా చూస్తే కోపం,
నువ్వు ఎవరితోనైనా మాట్లాడితే బాధ..
ఏంటో ఇవి .. భలే ఉంటాయి తల్చుకోవడానికి..!!
ఇప్పటికి కూడానా అని అనకు..
ఇప్పటికీ ఎప్పటికీ అవే భావాలు నీపై..
అవి చెరగనివి, చెరిగిపోనివి...!!
నిను చూడాలని ఉంటుంది.
చందమామను ఓ కన్ను గీటి అల్లరి పట్టించాలని వుంది
పండు వెన్నెల్లో తడవాలని వుంది
చెయ్యి పట్టుకుని నీతో నడవాలని వుంది..
ఈ కోరికల్ని ఇలానే ఉంచనీ
ఎందుకంటె నువ్వేగా నా తొలి, ఆఖరి మజిలీ..!!
Written by: Bobby Nani
ఏదో మ్యాజిక్ ఉంది ఈ రచనలో బాబీ. చాలా రోజుల తరువాత ఒక మంచి వచనం వ్రాశారు నానీ.
ReplyDeleteఅద్భుతమైన పరిపక్వతప్రతిఫలించిన కవిత ...
ReplyDeleteఅవార్డును అందుకోతగిన కవిత ..
బ్లాగుపేరుకి ..కవిత ఔన్నత్యానికీ పొంతన లేదు.
అయినా కవి ఎవరైతేనేం బ్లాగుపేరైతేనేం..గొప్పభావవచన కవిత