Saturday, August 31, 2019

ఆరు గజాల స్త్రీ తత్వం..

ఆరు గజాల స్త్రీ తత్వంలో.. 
ఎన్నెన్నో వర్ణాలు 
గుండెకు కళ్ళు అతికించుకొని చూడాలే కానీ 
మూలాధారం నుంచి గగన చక్రం వరకు
అంతటా నీవే..!!

వర్షించడం మబ్బుకు మహదానందకరమైతే 
ప్రత్యూష వేళలో విచ్చి పరిమళించడం నీ సహజత్వము..!!

అందుకేనే నచ్చేస్తావ్..!

ఎన్ని పర్యాయములు 
నీ అధర తాళపత్రాలపై 
నా చుంబన సంతకములు లిఖించినా 
ఆ మధురమెప్పుడూ నవీనముగానే ఉదయిస్తుంది..!!

విపంచి సైతం పలికించలేని వేవేల అలౌకిక భావాలను 
వెచ్చని నీ పరిష్వంగపు స్పర్శ సునాయాసంగా స్పృశించగలదు..!!

నాలో మనోభావోద్వేగాలను పురివిప్పి 
తనువూ, మనసు తమకముతో నర్తింపనూ గలదు.. !!

నా
ప్రపంచానికి మరోవైపున నువ్వున్నా
నా హృదయం నిర్మల గంగా ప్రవాహమై 
పారుతున్న క్షణాల్లో.. 
నీవు విడిచిన జ్ఞాపకాల్లో .. 
నా ఊపిరిని వెతుక్కుంటూ వస్తున్నా...!!

కనిపించిన ప్రతీ కళ్ళలో కళ్ళు పెట్టి 
వినిపించే ప్రతీ గుండె గుండెనీ స్పృశించి 
పొంగిపొరలే నా కన్నీళ్ళ మధ్యన 
అంతులేని అఘాతమై వర్తమానము వచ్చి నిల్చుంది.. !!

నీ గుండె ధ్వనిస్తున్న విరహ గీతాల్ని 
నా గుండె గుప్పెట్ల నుంచి వింటున్నా.. 
అమాస పున్నముల మధ్యన 
నా కళ్ళు కాంతిని కోల్పోతున్నట్లనిపిస్తుంది..
అయినా వస్తున్నా.. 
నా చూపుల్ని పిండుకుంటూ, 
అమాంతం నేలను తాకే పక్షిలా వస్తున్నా.. 
నీ గుండె కుటీరములో నన్ను నేను ¬దాచుకునేందుకై..!!

Written by : Bobby Nani

Tuesday, August 20, 2019

పద్మముఖి

పద్మముఖి
**********

ఏమా కన్నులు 
కులుకు చూపులు చిలుకరించు
చతుర్ధశి నాటి నెలవంకల వోలె.. !
ఏమా కనుసోగలు
మన్మధుని గాండీవమ్ములు 
ఎక్కుపెట్టిన సమ్మోహనాస్త్రమ్ముల వోలె.. !
ఏమా కురులు 
అమాస చీకట్లను తలపే 
జటాజూటుని నీల తరంగిణి వోలె..!
ఏమా వదనము 
అనంతాకాశమ్మున 
ప్రకాశించు గగనమణి కిరణము వోలె...!


ఏమాటకామాటేలే 
ఆ చూపుల శరములు ... రసికతతో కూడిన విలాస చలనాలు.. 
ఆ నును బుగ్గలు ... సిగ్గులతో కూడిన సుగంధ మకరికాపత్రములు.. 
ఆ లలాట సౌందర్యములు .. పసుపు ఛాయను మించిన పసిడికాంతులు..

ఏమని వర్ణింప ? మరేమని శ్లాఘింప ?

తుమ్మెద రెక్కలవంటి కనురెప్పలు..
మకరందాన్ని చిప్పిల్లే 
బంధూకముల వంటి అధరములు .. 
యువకుల హృదయక్షేత్రాలను సున్నితాన మీటి 
వలపులు పండించే కోటేరు వంటి నాసికము.. 
ఇంద్రధనువు వంటి కనుసోగలు ... 
వాటి మధ్యన అరుణారుణ తిలకము ..
చతుర్విధ పురుషార్థాలు పద్మముఖమున ధరియించిన ఓ ప్రమిదా ?? 
నిన్నేమని శ్లాఘింప ?? 

ఒక పర్వమున సత్యలా కదనరంగమున యుద్దమునూ, 
మరు పర్వమున ప్రణయినిలా ప్రియుని కౌగిళ్ళలోని సరసమునూ,
ఏక కాలమున పండించగల విదగ్ధవి.. 

Written by: Bobby Nani

Friday, August 16, 2019

నెల్లూరు లోని కొన్ని హాస్పిటల్స్


నెల్లూరు లోని కొన్ని హాస్పిటల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు.. తాజాగా నా విషయంలో జరిగిన ఒక సంఘటన చెప్పాలనిపించింది.. నాకు న్యాయం జరుగుతుందని కాదు.. నాలా మరో కుటుంబం నష్టపోకుండా తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటారనే సదుద్దేశంతో ఈ వ్యాసం రాస్తున్నాను..

తప్పు జరిగితే ప్రశ్నించడం ఈ దేశం,
మన రాజ్యాంగం మనకు కల్పించిన  హక్కు, బాధ్యత ..

నువ్వు ప్రశ్నించు ... నీ గోడు మరొకరికి వినిపించేదాకా .. !
గొంతెత్తి అరువు.. నీ గళం మూగపోయే దాకా...!
సంధించు అక్షర శరములు .. నీ కలంలో సిరా కరిగేదాకా.. !

వైద్యవృత్తి ఎంతో గొప్పది.. “ప్రార్ధించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న” అని గొప్ప గొప్పవారు వాగ్దాటించారు..  ఆ సాయం చేసే మొట్ట మొదటి చేతులు వైద్యులవే .. అందుకే సాయం పొందిన వారి చేతులు నమస్కరించి వారిని సత్కరిస్తుంటాయి ..  అంతటి గొప్ప వైద్యవృత్తిలో కొందరి వైద్యులు తలమానికం గా నిలుస్తున్నారు..

అలాంటి వారిలో వీరు ఒకరు...

నెల్లూరు కిమ్స్ (బొల్లినేని) హాస్పిటల్ కు చెందిన డాక్టర్ కె. బాలకొండయ్య గారు.. ఆర్థోపెడిక్ సర్జన్ ఎంతో అనుభవం, మరెంతో పేరు గడించారు.. కాని ఏం ఉపయోగం.. ?? కావాలని రెండోసారి మళ్ళి డబ్బు గుంజడానికి చేస్తున్నారో లేక నిజంగానే వీళ్ళకు చేతకాక సర్జరీలు చేస్తున్నారో అర్ధం కావట్లేదు.. మా నాన్న గారికి నెల క్రితం సదరు డాక్టర్ కె. బాలకొండయ్య గారు కుడి కాలుకు రాడ్ వేసి ఆపరేషన్ చేసారు.. ఆ ఆపరేషన్ చేసినదగ్గరనుంచి కాలు విపరీతమైన నొప్పి.... సహజంగా అందరూ ఏమనుకుంటారు ? ఆపరేషన్ చేసారు కాబట్టి నొప్పి ఉంటుందేమో అని అనుకుంటారు.. అలానే మేము అనుకున్నాం..

రోజులు గడిచేకొద్దీ నొప్పి ఎక్కువ అవుతుందే కాని తగ్గట్లేదు.. 15 రోజులు గడిచాక కాలుకు డ్రెస్సింగ్ మార్చేందుకు  నెల్లూరు కిమ్స్ (బొల్లినేని) హాస్పిటల్ కు తీసుకువెళ్ళాము అక్కడ హాస్పిటల్ సిబ్బంది x రే తీసి స్క్రూస్ పక్కకు జరిగాయి అని చెప్పారు కాని సమస్య ఏమి లేదు అని చెప్పి  తీసిన x రే మాత్రం చేతికి ఇవ్వకుండా మా దగ్గర మీ యొక్క ఫైల్ వుంది కదా అందులో పెడతాము మీరు వెళ్ళి మళ్ళి ఓ పదిరోజులతరువాత వచ్చి కనిపించండి అంటూ జవాబిచ్చారు.. డాక్టర్ గారు కూడా అదే జవాబు ఇచ్చి పంపించేసారు..

మరో పదిరోజులతరువాత నొప్పి ఇంకా ఎక్కువ అయ్యి కాలు వాపు రావడంతో సదరు నెల్లూరు కిమ్స్ (బొల్లినేని) హాస్పిటల్ కు చెందిన డాక్టర్ కె. బాలకొండయ్య గారిని సంప్రదించగా వారు అర్జెంట్ గా మళ్ళి సర్జరీ చెయ్యాలి డబ్బు రడీ చేసుకోండి.. పూర్తిగా స్క్రూస్ ప్రక్కకు వెళ్ళిపోయాయి అని చెప్పారు.. అలా ఎలా వెళ్తాయి అని మేము అడిగితే బాగా నడిపించి వుంటారు మీరే ... మీదే తప్పు అంటూ రివర్స్ లో మాట్లాడటం మొదలుపెట్టారు.. ఇక్కడ మేము మాట్లాడేందుకు ఇది సమయం కాదని ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసని అక్కడనుంచి వచ్చేసాము..

మాకు తెలిసిన ఆర్థోపెడిక్ సర్జన్ మరొకరికి ఈ రిపోర్ట్స్ చూపించగా అసలు స్క్రూస్ సరిగానే అమర్చలేదు.. అదికాక చాలా సన్నని రాడ్స్ అమర్చారు .. అసలు అలాంటివి ఈ సర్జరీకి వెయ్యనే వెయ్యకూడదు ఇది నూటికి నూరు శాతం డాక్టర్ గారి వైఫల్యమే అని తేల్చి చెప్పేసారు ..

ఒక్క మా విషయమే కాదు అక్కడ ఆ హాస్పిటల్ ముందు ఓ గంట నిలబడితే వచ్చే కేసులన్నీ ఇలాంటివే.. ఒకసారి వెళ్ళినవారు మరోసారి తప్పక రావాల్సి వుంటుంది.. లబోదిబో మంటూ పది, పరక పోగేసుకొని తలో తాళో తాకట్టు పెట్టి కన్నీళ్ళతో తడిచి ముద్దైన ఆ నలిగిన కాగితాలతో ఇక్కడి హాస్పిటల్ డాక్టర్ లు ముష్టాన్నభోజనం చేస్తున్నారు..

కిమ్స్ అంటే చాలా మంచి పేరు ఉంది .. ఇప్పటికీ అదేపేరు అన్నిచోట్లా వుంది ఒక్క బొల్లినేని కిమ్స్ లో తప్ప.. అయినా నెల్లూరు బొల్లినేని గురించి ఈ రోజు నేను కొత్తగా చెప్పేదేంటి కొన్ని సంవత్సరాలకు మునుపే వందమందికి పైగానే కంటిచూపును పోగొట్టిన ఘనత ఆ హాస్పిటల్ ది.. అన్నీ తెలిసికూడా ఎందుకు వెళ్ళాను అంటే రెండు కారణాలు 1. యాక్సిడెంట్ అవ్వడం చేత దగ్గరగా ఈ హాస్పిటల్ ఉందన్న కారణం.. 2. కిమ్స్ వారి మేనేజ్మెంట్ తీసుకున్నారన్న మరో కారణం.. కాని ఇక్కడ నేను ఆలోచించనిది ఒక్కటే మేనేజ్మెంట్ మారిందే కాని అక్కడ డాక్టర్ లు సిబ్బంది మారలేదుకదా అని..ఈ చిన్న విషయాన్ని ఆ తొందరపాటులో ఆలోచించలేకపోయాను .. అందుకు పర్యవసానంగా మా  సమయం, డబ్బు, శారీరక బాధ, కన్నీళ్ళు, ప్రయాసలు అన్నీ భరించాము..

నా సంగతి వదిలెయ్యండి నేనెలాగో కష్టపడి మరో డాక్టర్ చే సర్జరీ చేయిస్తున్నాను.. పూట గడవని ఓ పేదవాని పరిస్థితి ఏంటి ??
ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా సర్జరీ చేయించుకున్న వారు ఇలా మరోసారి చెయ్యాల్సి వచ్చినప్పుడు సదరు ఆరోగ్యశ్రీ వర్తించదు.. తప్పకుండా స్వంత డబ్బు పెట్టుకోవాలి.. సరిగ్గా ఇదే ఆలోచనాధోరణితో ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం పేదవాడి నడ్డివిరుస్తోంది.. అన్యాయం జరిగినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు.. డబ్బు తెచ్చి మళ్ళి సర్జరీ చేయించే స్తోమత లేదు... ఏం చెయ్యాలో వారికి దిక్కుతోచని స్థితి లో అలా కన్నీరు కారుస్తూ ఆ హాస్పిటల్ వారి కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుతూ గడిపేవారు ఎందరో..

ఓ పేదవానికి  యాభైవేల రూపాయలు ఎంత పెద్ద మొత్తమో మీకు తెలుసా.. ??
యాభైవేల రూపాయలు అప్పు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎందరో వున్నారు .. మీకు తెలుసా ??
మీ ఆలోచనా పరిధికి కూడా అందదు ఒక పూట గడవని నిరు పేదవాడు రోజుకు ఎన్ని కష్టాలు పడతాడో.. తన రోజువారి జీవితం ఎంత నరకప్రాయంగా గడుస్తుందో .. అస్సలు ఊహించలేరు మీరు వారి మనుగడను ..
వీరినా మీరు ఇంతలా బాధపెట్టేది ??
వీరినా మీరు ఇంతలా  బాధించేది.. ??
పట్టు విడుపులు ఉండాలి కదండీ.. !!

ఇంక ఆ హాస్పిటల్ యాజమాన్యం విషయానికి వస్తే.. స్లీపర్ దగ్గరనుంచి లిఫ్ట్ మాన్, వాచ్ మెన్, సర్వీస్ వారు అంటూ  వచ్చిన ప్రతీ ఒక్కరు వందో, యాభైయో అడిగి మరీ నిలువుదోపిడీ తీసుకోవడం గమనార్హం.. వారికే రోజుకు ఐదు వందలు సునాయాసంగా ఎగిరిపోతుంది..

ఇక మందులు విషయం చూస్తే .. రాసేవి పది వాడేవి రెండు .. మిగిలిన ఎనిమిది ఎమౌతున్నాయో ఆ పెరుమాళ్ళకెరుక...

రౌండ్స్ కి వచ్చే డాక్టర్ పేషంట్ బాగోగులు తెలుసుకోవాలి.. వారి వద్ద ఉన్నవారికి తగు జాగ్రత్తలు చెప్పాలి.. అక్కడ అలాంటిదేమీ వుండదు.. రన్నిగ్ రేస్ జరుగుతుంది డాక్టర్స్ మధ్యన.. ఒకరికొకరు పరుగుపరుగున వచ్చి వెళ్లిపోతుంటారు.. కేవలం ఒక్క పేషంట్ దగ్గర ఒకే ఒక్క నిమిషం ఆగితే చాలు చెప్పాల్సిన జాగ్రత్తలు అన్నీ ఆ ఒక్క నిమిషంలో చెప్పేయొచ్చు ఇదికూడా సదరు డాక్టర్ లకు తెలియకపోవడం శోచనీయం..

ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ...

భయం, బాధ్యత, భరోసా  ఈ మూడు వైద్యుని ఉండాల్సిన ముఖ్య లక్షణాలు..

భయం : పేషంట్ కి ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అనే భయం వైద్యునికి వుండాలి.

బాధ్యత : పేషంట్ మరియు వారి కుటుంభీకులు ఆ డాక్టర్ పై చూపించే విశ్వాసం, నమ్మకం పట్ల సదరు డాక్టర్ ఆ పేషంట్ పై తన పనిని బాధ్యతగా నిర్వర్తించాలి ..

భరోసా : మీకేం కాదు నేను ఉన్నాను అనే ధైర్యం, భరోసా ఆ పేషంట్ కు వారి కుటుంబసభ్యులకు సదరు డాక్టర్ కలిగించాలి..
ఇవేమీ లేనివారు వైద్యవృత్తికి తీరని నష్టాన్ని చేకూరుస్తారు..

మిత్రులారా ఒక్కక్షణం ఆలోచించండి మన గురించి కాదు భావితరాల భవిష్యత్తు గురించి.. !!

దీనికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ లిస్టు నా దగ్గర వుంది..
ఇది నా ఒక్కడితో ఆగకూడదు.. ప్రతీ యువత ముందుకు రావాలి..
ఇది మామూలు విషయం అనుకోకండి .. రాష్త్రం మొత్తం మీద ఇలాంటి హాస్పిటల్స్ వల్ల ఎందరో ఇబ్బందులు పడుతున్నారు..ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు..

గొంతెత్తి గద్దిద్దాం..
పేదవాడి గుండె గంతులేసే వరకు..!!
చేయిచేయి కలుపుదాం..
చేతగానితనాన్ని తరిమేవరకు ..!!

మీరు ఉన్నారన్నా నమ్మకమే నాచే ఇలా రాసేలా చేసింది..
మీరే నా ధైర్యం.. నా తెగింపు..

మీ వంతు ప్రయత్నం చెయ్యండి .. ఈ అక్షరాలు తమ గమ్యం చేరేవరకు.. !!


Written by: Bobby Nani 

Friday, August 9, 2019

ముక్తకాశిని..



అతగాడికి ఈమెపై అలౌకికమైన ప్రేమ దాన్ని ఎలా పొందాలో, ఎలా చూపాలో తెలియదు.. ఆమెలో కూడా అపూర్వమైన ప్రీతి ఇతగాడిపై.. ఎలా వ్యక్తపరచాలో తెలియదు.. తానో వికసించిన యౌవన పద్మం ఇతడో జాగుసేయని మకరధ్వజుడు .. వీరి ఇరువురి ప్రణయాన్ని ఈ విధంగా వ్రాసాననమాట.. మీరు కూడా జాగుసేయక సాహిత్య దృక్పధముతో చదవమని అభ్యర్ధన ..!! చదివి చెప్తారు కదూ.. !!

ఓ లలనా,
గాలి వీచినా, 
ఏరు పారినా, 
మబ్బు కురిసినా, 
మంచు కరిగినా, 
నెమలి ఆడినా, 
కోయిల పాడినా, 
పూవులు పూచినా, 
అన్నిట్లో నీ అల్లరే కనిపిస్తోంది..
నన్ను కంపిస్తోంది.. !!

కలలో కూడా నీ రూపాన్నే 
కనగలిగే కన్నులు నాక్కావాలి ..!
ఇస్తావు కదూ..!!
లేక్షణా ..!
లోతైన నీ హృదయ లోయల్లోని 
వెచ్చదనపు ఉచ్చ్వాస నిశ్వాసాల్లో 
ఊయలలూగే ఊపిరిని నేను..!!

నీ 
నడుముచే నాట్యమాడించే 
వెన్నుపాముకు సమ్మోహన 
మంత్ర విద్యను నేర్పే 
సింగార సర్పమును నేను..!!

నీ 
ఘన స్తనములను 
స్థూల నితంబ పీఠములను 
సూక్ష్మ మదన దుర్గాన్ని 
సంరక్షించే విస్ఫులింగ కదనఖడ్గాన్ని నేను..!!

నీ 
చంచల చేలాంచల తత్వానికి, 
విశాల నేత్రత్వానికి 
ప్రాపంచిక తత్వానికి 
కేతనాన్ని నేను
దశవిధ నీ గమకములకు 
స రి గ మ లద్దు 
అరుణ పాణీ చేతనాన్ని నేను.. !!

నీ 
నతనాభి రసఁస్రవంతులను
మకరధ్వజుడై గైకొను 
మకరాంకుడను నేను..!!

ఓ 
ముక్తకాశిని 
అద్వైత ప్రేమావేశంతో 
ఆనంద కేళీ సయ్యాటలలో 
పరస్పర దేహాన్వేషణ ఉద్యానవనములో 
పరవశించి పోదాం..
శివశవాభిద నాదంగా ఏకమై రవళిద్దాం.. !!

Written by: Bobby Nani

Wednesday, August 7, 2019

అవాస్తవ సదృశ్యము



అవాస్తవ సదృశ్యము
***************


నే
ఒంటరిగా ఉన్నప్పుడు 
ఓ పరిమళం నన్ను చుట్టేస్తుంది 
నా గుండెల్లోకి దూరి 
సాగర సంగీతాలు పలికిస్తుంది
నను దూరంగా తీసుకెళ్ళి 
శిఖరమంచున నిలబెట్టి 
నా కంటి కెమేరాతో 
ప్రకృతి చిత్రాలను గీయిస్తుంది.. !!


ఎక్కడో 
మా నెల్లూరు రోడ్లమీద దృశ్యాల్ని 
నిశ్శబ్దంగా ఏరుకుంటున్న నన్ను 
చిత్రంగా ఈ భావ పరిమళం 
ఎత్తైన పర్వతాల మీదకు విసిరేస్తుంది.. 
ఆకాశంలో విరిసే ఇంద్రనీలం పువ్వు సువాసనలతో 
నా ముక్కుపుటాల్ని నింపేస్తుంది..!!


ఓ అధీతి
ప్రకృతి చేసే కనికట్టును నువు చూడలేవు
సుడిగాలిని నువ్వు ఎదుర్కొనలేవు 
తుఫానును బంధించనూ లేవు 
రివ్వున వీస్తూ తెల్లవారుజాముననే వచ్చి 
గిలిగింతలు పెట్టే చల్లగాలిని నువ్వు ముట్టుకోలేవు 
కనిపించకుండా నిన్నల్లరపెడుతూ 
వినీ వినిపించకుండా శబ్దాన్ని మోసుకొచ్చే గాలిని 
ఒక్కసారైనా నీ వొళ్ళో కూర్చోపెట్టుకోలేవు 
కబుర్లు చెప్పి బుజ్జగించనూ లేవు


కానీ 
అక్షరాలతో బూరెలొండగలవు 
పదాలతో పరిమళాలద్దగలవు 
వాక్యాలతో ఊపిర్లు ఊదనూ గలవు 
అందుకే నీవంటే నాకంత ప్రీతి
ఓ కక్షావైక్షకా ..!
నీవే నా స్ఫూర్తి 
నీ క్షరమే నా మార్గదర్శి 
నీ ప్రస్థానంలో కొన్ని అడుగులైనా వెయ్యాలని 
ఒక్కడినే ఎత్తైన కొండ శిఖరం మీదకు పోయి 
కళ్ళుమూసుకు కూర్చున్నాను 
అక్కడ గాలి నా చెవుల్ని దూసుకుపోతూ విన్పిస్తుంది 
నా ముంగురుల్ని సవరిస్తూ వయ్యారాలు పోతుంది 
నా వొళ్ళో కొండ మల్లెల సువాసనల్ని తెచ్చి గుమ్మరిస్తోంది 
పొలాల్నించి, గులాబీతోటల్లోంచి 
తియ్యని తేనె సొనల్ని మోసుకొచ్చి 
నా ముఖానికి పూస్తోంది.. 
నాలో ఇంత భావుకత ఉబికిందంటే 
వేవేల నీ పాద ముద్రలలో 
ఓ రెండడుగులు నావీ పడ్డాయనిపిస్తుంది 
అందుకేనేమో నా కళ్ళలో అక్షర కాంతి 
నా ముఖములో పదాల పసితనం చిందులేస్తుంది..
ఓ కవీ 
ఏ నాటికైనా నీ ప్రస్థానంలో గమ్యాన్ని చేరుతానంటావా ..!!

Written by: Bobby Nani

Friday, August 2, 2019



మొదటిసారి 
ఈ ప్రపంచాన్ని ఎత్తునుంచి చూసింది 
నాన్న భుజాల మీంచే 
వచ్చీ రాని రెండే రెండు పల్లుతో, 
ఆ .. అంటూ బోసి బోసి నవ్వులతో,
స్వచ్ఛమైన ప్రేమను కురిపిస్తూ 
చేతికందిన జుట్టు లాగేస్తూ 
అల్లరి చేసింది నాన్న భుజాల మీంచే..!!

మొదటిసాటి 
భయమేస్తే తడబడు తప్పటడుగులతో 
దాక్కుని నక్కి నక్కి చూస్తూ నిల్చుంది 
అమ్మ చీర కుచ్చిళ్ళ వెనక నుంచే..!!

మొదటిసారి 
ప్రేమొస్తే చేతులు రెండూ పైకెత్తి 
బుడి బుడి నడలకతో, 
గోముగా అమ్మ చంకనెక్కి కూర్చుంది 
అమ్మా, నాన్నల తియ్యని ముద్దులందుకునేందుకే..!!

నాకోసం 
వారెన్ని నిద్రలేని రాత్రుళ్ళు గడిపారో 
నాకు జ్వరమొస్తే 
వారి మనసుకు నిలకడ, 
వారి కంటికి కునుకూ రెండూ వుండేవి కాదేమో.. 
నిత్యం పన్నీరు రాసుకునే వారి దేహాలపై 
నేనొచ్చాక మల, మూత్రాలే పన్నీరులైనాయి 
వారి ఎకాంతాలన్నీ నా అల్లర్లైనాయి 
వారి ఆలోచనలన్నీపూర్తిగా నావైనాయి.. !!

మొదటిసారి 
అమ్మ ఏడుస్తోంది.. 
నా చేతిని స్కూల్ టీచర్ చేతిలో పెట్టిందని.. !!

నాకు ఇప్పటికీ గుర్తుంది 
మొదటిసారి స్కూల్ లోపలకు 
భయం భయంగా వెళ్తున్న నన్ను 
జాలిగా, బాధగా చూసిన అమ్మ చూపులు 
నాకింకా గుర్తున్నాయి.. !!

నాన్నతో బజారుకెల్తుంటే 
అందరూ నన్ను ముద్దు చేస్తుంటే 
మా అబ్బాయే అంటూ గర్వంగా చెప్పుకుంటూ 
నాక్కావాల్సినవన్నీ కొనిస్తూ, 
ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది ఆయనే..!!

పెరిగి పెద్దయ్యాక 
సుదూర ప్రాంతాలకు వలసవెళ్ళి 
బాధ్యతలనడుమన
ఉద్యోగాలరీత్యా 
హిమగదుల మధ్యన 
నలగని చొక్కాతో 
ఇదంతా నా కష్టం,
అంతా నా ఇష్టం అంటూ 
కన్నవారికే హద్దులు ఏర్పరుస్తూ, 
వారెక్కి తొక్కిన మంచాలూ, 
నమిలి ఉమ్మిన ఆస్తులూ
పోగేసుకొని విర్రవీగుతున్నావ్ ..!!

ఎప్పుడూ నా గుండెలపైనే ఎక్కితొక్కుతూ ఆడుకునే 
నీకే నా గుండె లోని బాధ తెలియదట్రా అంటూ 
సున్నితంగా మందలించే తండ్రికి ఏం సమాధానం చెప్తాం ..??

వెచ్చని ఓ రెండు కన్నీటి బొట్లు రాల్చడం తప్ప..!!

Written by: Bobby Nani