Tuesday, March 5, 2019

ఆమె అందం నిరుపమానము..!!


అందం 
నా చెంతకొచ్చి 
తనమీదో కవిత రాయమని చెప్పింది..!!

ఏం రాయగలను తన గురించి 
కనిపించే సొగసులనన్నింటినీ 
మగువై మలచుకొని 
అల్లుకున్న స్వప్నాలనన్నింటినీ 
ఆకృతులుగా నింపుకొని 
తాకిన పూ రేకులన్నీ
తరుణి అధరములనుకొని
సోకిన గాలితెమ్మెరలన్నీ
సురభిళ సువాసనలనుకొని 
కరిగిపోతున్న కాలాన్ని
పరిష్వంగంలో బంధించి
పరవశించిన ప్రతీ క్షణాన్ని 
మధురానుభూతిగా దాచుకొని 
యవ్వన గగనాన్నంటిన ఆమె రూపం 
సుమనోహర దివ్య దీపం..!!

తనని దర్శించిన నా కలం 
కాగితాల పూదోటలో 
కవిత్వ నారింజరసాన్ని 
చిల్కరిస్తూ వెళ్తుంటుంది.. 
ఆమె కనురెప్పల కదలికల్లో 
ఆవిష్కరింపబడుతున్న అద్భుత 
సూర్యోదయాల్ని దర్శిస్తూ వెళ్తుంటుంది..!!

చిలిపి వలపులకోసం, 
లేలేత చింతచిగురు కోసం 
మధుర ఫలములకోసం వెదికే ఆమె 
అల్లరి తనాన్ని నా కళ్ళతో చూస్తూ,
మనసులో చిత్రించుకుంటున్నాను 
కళ్ళాపి జల్లిన ఇళ్ళూ, 
పళ్ళు తోముకుంటున్న వేపకోమ్మలూ 
అరమోడ్పు కళ్ళతో రాత్రంతా నిరీక్షించిన రెమ్మలూ 
ఇంటి ముంగిట ఆమెరాకకై గుప్పిళ్ళతో 
పుప్పోళ్ళు వెదజల్లుతుంటాయి..!!

ఎక్కడనుంచో ఓ సుగంధ పరిమళం 
నన్నాహ్వానిస్తూ గుప్పుగుప్పుమంటోంది 
చెంపపిన్నులు, చెవిపోగులూ సంగీతం ఆలపిస్తున్నాయి 
బుగ్గలూ, మల్లెమొగ్గలూ అత్తరుచుక్కల్ని ఆరబెట్టుకుంటున్నాయి 
సువాసనలు నా ముందే మాలలల్లుకుంటూ కూర్చున్నాయి 
వాలు కుర్చీ చొక్కా విప్పుకొని గాలిపోసుకుంటోంది 
నా కళ్ళు మాత్రం కలల్ని వొంపుకుంటూ నిస్తేజంగా 
అలానే ఉండిపోయాయి..!!
నిజంగానే ఆమె అందం 
నిరుపమానము..!! 

Written by: Bobby Nani

1 comment:

  1. బుగ్గలూ, మల్లెమొగ్గలూ అత్తరుచుక్కల్ని ఆరబెట్టుకుంటున్నాయి
    సువాసనలు నా ముందే మాలలల్లుకుంటూ కూర్చున్నాయి
    వాలు కుర్చీ చొక్కా విప్పుకొని గాలిపోసుకుంటోంది - చాలా కవితాత్మకత ఉంది ఈ వాక్యాలులో. కానీ కవిత్వ నారింజ రసం అంటే ఎమిటి బయ్యా.

    ReplyDelete