నేటి రచయితలకు /కవులకు ఈ వ్యాసం కాస్త అయినా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ..
“వ్యాసం”వ్రాసి చాలా రోజులు
కాదు కాదు నెలలు..
తప్పు తప్పు సంవత్సరం పైగానే అయింది..!!
కవితలతోనే ఎక్కువశాతం కాలం గడుపుతున్నాను..!!
కారణం ఒక్కటే ... ఒక “వ్యాసం” వ్రాయాలంటే పుట్టుపూర్వోత్తరాలు దగ్గరనుంచి ప్రస్తుత స్థితిగతులదాకా చాలా లోతుగా అధ్యయనం చెయ్యాల్సి వుంటుంది.. ఏదో వ్రాసమంటే వ్రాయడం మనకు చేతకానిపని .. అందుకే ఈ “వ్యాసాలకు” తాత్కాలిక విశ్రాంతి కల్పించాను.. ఇకపోతే కవితలంటారా ఒకభావాన్ని తోవ్వుకుని ఇక దానిపై ఆడుతూ పాడుతూ యదేచ్చగా రాసేయ్యొచ్చు.. ఇక విషయంలోకి వెళ్తాను..
చాలా మందికి మన తెలుగు గురించి తెలియని విషయాలపై ఓ చిన్న వివరణ “వ్యాసం” ఇవ్వదలిచాను.. చదివి అభిప్రాయం చెప్పాలి మరి..!!
మాట్లాడేభాషను లిఖిత పూర్వకముగా గుర్తించడాన్ని లిపి అని అంటారు.. ఒక్కొక్క భాషకు ఒక్కొక్క లిపి వుంటుంది. లిపి లేని భాషలు కూడా ఎన్నో వున్నాయి ... ఇంగ్లీషు లిపివేరు అలానే ఉర్దూ లిపివేరు.. మన తెలుగు లిపి కూడా వేరు..
అసలు మన లిపి పూర్వం ఎలా వుండేది ??
ఇప్పటిలా అయితే అస్సలు లేదు.. మన దేశంలో భాషాలిపులు అన్నీ కూడా క్రీ.పూ. 250 నాటి బ్రహ్మలిపి నుంచే పుట్టాయి.. ఆయా కాలాల్లో అనేక విధాలుగా మారుతూ ఇప్పటికి ఈ రూపాన్ని సంతరించుకుంది.. పదిహేనవ శతాబ్ది దాకా తెలుగు లిపి కన్నడ లిపి (దీన్నే తూర్పు చాళుక్యలిపి అంటారు) రెండూ ఒకే విధంగా ఉండేదని చెప్తారు.. ఆ తర్వాతే వేర్వేరు లిపులుగా మారిపోయాయి. మన పరిశోధకులు లిపిలో వచ్చిన మార్పుల్ని ఇలా సూచించారు
మొదట బ్రహ్మలిపి తరువాత అది గుహలిపిగా మారింది
ఆ తరువాత చాళుక్య లిపి, వేంగి లిపి
తదుపరి పశ్చిమ చాళుక్య, తూర్పు చాళుక్య దీన్నే తెలుగు-కన్నడ లిపి అనేవారు , తరువాత ప్రాచీన జావా లిపి
సంధికాలపు లిపి మరియు పాత తెలుగు లిపి
ఆ తరువాతే కన్నడ లిపిగాను మరియు తెలుగు లిపి గాను మార్పు చెందింది..
పూర్వం తెలుగు లిపిలో అరసున్న కనిపించదు. మొదట్లో తలకట్టులు లేవు. దీర్ఘాల్ని తెలపటానికి చిన్న అడ్డుగీతలు పెట్టేవారు.. ఒక నిలువు గీత, రెండు నిలువుగీతలు కామా, ఫుల్ స్టాఫ్ గా వాడేవారు. సున్నాకి బదులు అనునాసికాలు ఎక్కువుగా కనిపిస్తాయి. అసలు కొన్ని వాక్యాలు కలిపి మహావాక్యంగా ఉండేవి. రాళ్ళమీద, రాగి రేకులమీద రాయడం మొదలై ఆ తరువాత తాటాకులమీదకు వచ్చింది. అప్పటినుంచి తెలుగు అక్షరాలకు ఒక కుదురు, ఒక క్రమం వచ్చింది..తాటాకుల మీద వ్రాయడానికి ప్రత్యేకంగా వ్రాయసగాళ్ళు వుండేవారు.. అప్పటికే దస్తూరి కి ప్రాముఖ్యం వుండేది... ముత్యాల కోవాలా రాయడం ఒక గొప్పగా భావించబడేది. దస్తూరికి మనవాళ్ళు ఎంతో ప్రాముఖ్యం ఇవ్వబట్టే చూచి కాపీ లు కాపీ పుస్తకాలు అలవాటయ్యాయి.. లిపిలో విడి విడి అక్షరాలతో పాటు కొందరు గొలుసుకట్టుగా రాసేవారు.. ఇలాంటి వ్రాతలను వాటికి సంబంధించిన అనువాదాలను నేను ఇదివరకే వ్రాసి వున్నాను.. గొలుసుకట్టు వ్రాత చదవడం అంత ఆషామాషీ కాదు.. కాని అది నేను చదవగలగడం నాకో అదృష్టమే అని చెప్పుకోవచ్చు..
భాషలో మాట్లాడేది వేరు.. వ్రాసేది వేరు
మాట్లాడినట్లు వ్రాయలేము .. వ్రాసినట్లు మాట్లాడలేము
ఏ భాషలో నైనా ఇది మాములే..
ఒక భావాన్ని చెప్పడానికి సామాన్యంగా ఒక మాట వాడుతాం అయితే అన్నీ సందర్భాలలో అందరూ ఒకే భావాన్ని ఒకే మాటను వాడరు. అంటే వేర్వేరు వ్యక్తులు వేర్వేరు మాటల్ని వాడుతుంటారు.. ఒకే అర్ధం గల రకరకాల మాటలు అన్నమాట. దీనినే ఎన్నో మాటలు.. అర్ధం మాత్రం ఒక్కటే అంటారు..!!
పర్యాయ పదాలు అన్నీ భాషల్లో వుంటాయి.. కానీ వీటి అవసరం ఎక్కువగా కవిత్వాలలో కనిపిస్తుంది..
అమ్మ, తల్లి, బాబు, అయ్య వంటి పదాలు ఎలా పడితే అలా వాడకూడదు.. కొన్ని చిక్కులు ఏర్పడతాయి
ఏది ఎక్కడ ఎలా వాడాలన్నది రచయితకు/కవికి చక్కగా తెలిసుండాలి.. అందులో నైపుణ్యం సాధించి వుండాలి.. లేకపోతే అక్షరం అసహనంగా కనిపిస్తుంది..రాత రక్తికట్టదు..
మీ నాన్న వున్నాడా అన్నదానికి
మీ అమ్మ మొగుడున్నాడా అన్నదానికి
చాలా తేడా వుంటుంది..
అలానే మరోరకమైన ఉదాహరణ
ఉపాధ్యాయుడు క్లాసు రూములో సంభో”ది”స్తున్నాడు దానికి
ఉపాధ్యాయుడు క్లాసు రూములో సంభో”గి”స్తున్నాడు అన్నదానికి యెంత తేడా వుంది..
ఉపన్యాసాలలో సాహిత్య రచనలో వాడిన మాటనే పదిసార్లు వాడకుండా వాటికి బదులు మరోమాట వాడితే ఔచిత్యంగా వుంటుంది.. అధికం అనటానికి ఎక్కువ, అత్యంతం, బహుళం, మిక్కిలి అనవచ్చు.. సాహిత్యంలో తద్దయు, భూరి వంటివి వున్నాయి.. “భూరి విరాళం” అని అంటూ వుంటారు, భూరి అంటే ఎక్కువ అని అర్ధం, సుందరం, సింగారం, సొబగు, కొమరు, చెన్ను, ఇవన్నీ అందం కోసమే.. పాటల్లో, ఛందస్సులో ఏ పదం సరిపోతుందో ఆ పదం వాడుకోవడానికి సులువవుతుంది. కాబట్టి మిత్రులారా ప్రతీ అక్షరాన్ని అన్వేషించండి ప్రతీ పదాన్ని శోధించండి.. మునుపటి అక్షరాలు చాలా గొప్పవి వాటిని గుర్తించండి.. అందరికీ అందించండి..
అందరూ అంటుంటారు .. ఎందుకు మీరు పదాలు చాలా కొత్త కొత్తగా రాస్తుంటారు ??
అర్ధం కాకపోయినా అందంగా వుంటాయి పలుకుతుంటే మధురంగా వుంటాయి అంటుంటారు..
నేను వాటిని మీ ముందుకు తెచ్చేది మీకు అర్ధం అవ్వాలనే.. మీరు నేర్చుకోవాలనే..
ముఖపుస్తకంలో అందరూ బాగా వ్రాస్తున్నారు.. కాని ఎక్కువశాతం ఉపయోగించేది వాడుక భాషనే.. తెలిసిన భాషనే...
భావకవిత్వాన్ని ఎక్కవ పోషిస్తున్నారు.. అఫ్కోర్స్ నాకు భావకవిత్వం అంటే మహా ప్రీతి.. ఒక్క భావకవిత్వానికే కాక వచనను, ఉత్ప్రేక్షాన్ని, వర్ణనను వ్రాయమని విన్నవించుకుంటున్నాను...
తోటి రచయితలకు శుభాశీస్సులు తెల్పుతూ.
స్వస్తి __/\__