కవిత్వం వేదననుంచి పుట్టిందని అంటారు.. అది నిజమో కాదో నాకు తెలియదు...
కానీ నా వరకు మాత్రం వేదన నుంచే పుట్టింది..
నేను మొదటిసారి కవిత రాసింది వేదనాభరితమైనదే .. అది కూడా శ్మశానంలో ఓ సమాధిపై కూర్చుని..
మీకు ఇది వినడానికి నమ్మశక్యం కాకుండా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది.. కాని ఇదే నిజం..
అది 1998వ సంవత్సరం నా వయస్సు షుమారు పన్నెండేళ్ళు ..
మా నాన్నమ్మగారి హటాన్మరణంతో మొదటిసారి శ్మశానాన్ని చూడాల్సి వచ్చింది..
అప్పటివరకు ఎంతో బాధ, దుఃఖంతో వున్న నాకు అక్కడకు వెళ్ళగానే చాలా తేలికగా అనిపించింది.. అక్కడంతా చూసేందుకు చాలా జుగుప్సాకరంగా ఉన్నా కూడా ఏదో తెలియని మధురానుభూతి ఎప్పటికైనా ఇదే మన శాశ్విత స్థావరం అని కాబోలేమో.. !!
ముందురోజు మట్టి పనులు ముగించుకొని ప్రక్కరోజు పాలకొరకు, ఆత్మ శాంతి జరిపేందుకు, తులసి వృక్షం నాటేందుకై అక్కడకు రెండవ సారి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు.. నేనేమో అవన్నీ గమనిస్తూ కాస్త దూరంగా వచ్చి ఓ చింత చెట్టు కింద వున్న సమాధిపై కూర్చున్నాను.. ఏవేవో భావాలు చుట్టుముడుతున్నాయి.. బాధ ఎక్కువైపోతుంది.. భావాలను అక్షర రూపంగా రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మొదలైంది. అనుకున్నదే ఆలస్యం గా జేబులోని రేనాల్డ్స్ బాల్ పెన్ను తీసుకున్నాను.. నా వద్ద పేపర్ లేదు.. అక్కడకు వచ్చిన కొందరు పెద్దవారిని అడిగి ఓ పేపర్ తీసుకున్నాను.. ఆలోచించకుండానే చక చకా రాసేసాను. పేపర్ నిండిపోయింది.. ఇది ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్ధం కాదు.. ఓ విద్యార్ధి 8 మార్కుల ప్రశ్న తప్పక వస్తుందని తెలిసి దాన్ని పదే పదే బట్టి పట్టి నేర్చుకుని వెళ్ళి ఎంత వేగంగా రాసేస్తాడో అదే వేగంతో నేను మొదటిసారే రాయగలగడం నాకే ఆశ్చర్యం కలిగింది.. భావాలను అక్షరరూపం దాల్చడం అదీ మొదటిసారి అంత వేగంగా వ్రాయడం అక్కడవున్న ఓ తెలుగు పండిట్ ను ఆశ్చర్యచికితుడను చేసింది.. వారు ఇచ్చిన స్ఫూర్తితోనే అక్షరాన్ని విడువక తోచిన ప్రతీ భావాన్ని, రాస్తూనే వచ్చాను...
భావ కవిత్వానికి, వచనా కవిత్వానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ,
ప్రణయాన్ని, వర్ణనను కూడా కలుపుకున్నాను..
ప్రబోధ కవితలను కూడా అప్పుడప్పుడు సంధిస్తూ, పద్య, గేయ రచనలను గావిస్తూ వచ్చాను.. దూషణా కవిత్వం, ఆశుర కవిత్వం మాత్రం గాడితప్పిన మండూకములపై ప్రయోగిస్తూ వచ్చాను.. సాహిత్యం పట్ల సాన్నిహిత్యంగా ఉంటూ, రాసిన ప్రతీ అక్షరానికి కృతజ్ఞత తెలుపుతూ, సంస్కృత, గ్రాంధిక పదజాలంపై కాస్త పట్టు సాధించి మనుగడ కోల్పోయిన, కోల్పోతున్న పదాలను అక్షరీకరిస్తూ నా ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను..
వాడుక భాష అందరికీ విదితమే .. కాని రేపటి తరానికి మనుగడ కోల్పోయిన అక్షరాలు చాలా అవసరం..ఎందుకంటె అవి మన పితృ వాఖ్యాలు.. వాటిని మరవడం అంటే వారిని తృణీకరించడమే.. ఎప్పుడైనా మానవ మనుగడకు ముఖ్యమైనది అనుభవం (జరిగిన కాలం) మాత్రమే.. దాని ద్వారానే రేపటి భవిష్యత్తును మనం చూడొచ్చు.. అందుకని గడచిన కాలాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చెయ్యకూడదు..
నేను నమ్మిన సిద్ధాంతాలు
“తెలిసింది కాదు.. తెలుసుకొని రాయి” అది ఏదైనా సరే..
రాసే ఏ భావనలో అయినా సరే రచయితకు స్వేచ్చ ఉండాలి.. అది లేకుండా రాస్తే శవం తో సంసారం లా ఉంటుంది..
ఏదైనా సరే ఆస్వాదన చాలా ముఖ్యం .. ఆస్వాదన లేకుంటే మనిషికి మర మనిషికి తేడా ఉండదు..
అక్షరం అంటే అమ్మ.. అందుకని దానికి విలువ, గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి..
ఒకరి కొరకు, ఒకరి కోసమో ఇష్టాన్ని చంపుకొని రాయను, నాకు నచ్చితేనే రాస్తాను లేకుంటే ముక్కంటి మాట కూడా వినను.. ఇది రచయితకు ఉండాల్సిన ముఖ్య ఆభరణం..
ముఖ్యంగా ప్రశంసల కొరకు ఏది పడితే అది రాయడం ఇష్టం లేదు.. అలా రాస్తే అది వ్యర్ధమే అంటారు..
పత్రికలకు, ప్రకటనలకు పంపడం నచ్చదు.. ఏదైనా కవిత కాని కావ్యం కాని వాటంతటికి అవి ఎగిరి వెళ్లాలే కాని మనమేంటి దారం కట్టి ఎగరేసేది.. విమర్శను ఒంటరిగా ఉన్నప్పుడే చేస్తాను.. ప్రశంస మాత్రం పదిమందిలో చేస్తాను.. ఇదే నాకు ఇష్టం...
రాసిన వారికి మాత్రమే తెలిస్తే చాలదా తనని విమర్శించామని అందరికీ తెలియాల్సిన అవసరం లేదు..
ముక్కుతాడులేక బసవన్నలా చిందులేస్తున్న వారిని మాత్రం అందరిముందే ఎండకట్టడం ఇష్టం.. వారితో ముఖాముఖి సంభాషణ సాగించడం ఇష్టం..
సమయం లేక ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది..
ఈ ముఖపుస్తకం వేదికగా నిలవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.. మహామహులను కలుసుకున్నాను.. వారి గౌరవ అభిమానాలను చోరగొన్నాను.. వారిచే సత్కరించబడ్డాను.. కొన్ని కొన్ని బిరుదులు కూడా స్వీకరించబడ్డాను.. కానీ ఏదో వెలితి ఆత్మసాక్షి అనుక్షణం ప్రశ్నిస్తూనే ఉంది.. నీవు నిజంగానే ఇంత అభిమానానికి అర్హుడవా అని ?? అందుకే విద్యార్ధిగానే ఉంటున్నా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే వస్తున్నా.. ఆత్మీయులు ఎందరో ఈ ముఖపుస్తకం ద్వారా పరిచయం అయ్యారు.. వారిది ఎప్పటికీ నా హృదయంలో ఓ సముచిత స్థానమే..
ఇకపోతే కొందరు మిత్రులు ఎంత అద్బుతంగా వ్రాస్తున్నారో.. నిజంగానే వారిలా నేను వ్రాయలేనేమో.. ఆ అక్షర మాధుర్యం వారు తప్ప మరెవ్వరూ వ్రాయలేని విధంగా ఆకట్టుకుంటున్నారు.. చాలా సంతోషంగా ఉంది.. ఈ ముఖపుస్తకంలో తెలుగు వెలుగులను పంచుతోంది.. పూర్వవైభవం కనిపిస్తుంది.. రేపటి భవిష్యత్తుకు తెలుగు అంటే తెలియనిది కాదు తెలుగు అంటే తెలిసినది తల్లితో ఏర్పడ్డ అనుబంధం అది అని అవగతమౌతుందని నమ్మకం ఏర్పడింది..
అక్షరానికి వున్న శక్తి అంతా ఇంతా కాదు.. నాకు వారు ఎవరో కూడా తెలియదు పర్సనల్ గా చాలామంది సందేశాలు పంపారు.. మీరెందుకు రాయట్లేదు అని .. అందరికీ ముందు వెనుక అన్నట్లుగా ఈ పదిరోజులనుంచి తిరిగి రిప్లై ఇచ్చాను.. ఒక్కరు చదివితే చాలు అనుకుని మొదలు పెడతాను ఇందరు తెలియకుండానే చదువుతున్నారని తెలియలేదు.. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడను..__/\__
మీ కోసం తప్పకుండా వ్రాస్తూనే ఉంటాను..
ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటాను..
స్వస్తి ___/\___