Thursday, May 11, 2017

\\\\ నయన జలం ////



విదేశాలకు పయనమౌతూ మొదటిసారి విమానమెక్కి భయం భయం గా కూర్చొని అప్పటిదాకా తన పుడమిని అంటిపెట్టుకొని ఉన్నవారు ఒక్కసారిగా ఏదో తెలియని బంధం నుంచి దూరం అవుతున్న అనుభూతికి లోనౌతారు .... విమానం ఒక్కసారిగా గాలిలోకి లేవగానే కళ్ళల్లో తెలియకుండానే నీరు ప్రవాహ ధారలా చిమ్ముతుంది .. ఆ ఆత్మీయపు బంధాన్ని రాయాలనిపించింది..

\\\\ నయన జలం ////
***************


గాల్లో 
ఎగరడం ప్రారంభించాక గానీ 
పుడమి మీద ఏమి 
వదలి వచ్చామో 
తెలియదు.. 
నేలమీద తిరుగుతున్నంత సేపూ 
ఏమి పోగొట్టుకున్నామో తెలిసి ఉండదు .. 
విమానం లోహపు రెక్క లార్చుకుని 
రాక్షస యంత్రాల నోరు తెరిచి
వీడ్కోళ్ళ చివరి ఆనవాళ్ళను 
మింగేశాక గానీ 
మూసుకున్న కన్రెప్పల 
వెనుక
చూడలేకపోయిన దృశ్యం 
అగుపడదు.. 
చుట్టూ స్ప్రుశించలేని 
నీటిపొర దిగాలుగా వ్యాపిస్తేగాని 
వణుకుతున్న చేతులతో 
ముఖాన్ని తడిమిన 
మట్టి ఆత్మీయత 
అర్ధం కాదు... 
మనది కాని 
ఒక శబ్ద ప్రపంచం 
మన భాషయ్యాక 
పోగొట్టుకున్న 
పలకరింపుల ఆర్తి వెనుక 
అనుబంధాల గాద్గదిగత 
వినపడదు.. 
ఎన్ని ముఖాల చిరునవ్వులు 
ఎన్ని చేతుల స్పర్శలు 
ఎన్ని కంఠస్వరాల ఆర్ద్రతలు
దేన్నీ సంభాషించలేని 
“హలో” లుగా ముగిసిపోయాయో .. 
చేతుల్లోంచి 
చివరిగా జారిపోయిన 
ఇసుకరేణువు గరుగ్గా తగిలినప్పుడు 
కానీ తెలియలేదు.. 
ఇప్పుడు అంతా మాయమైనట్టే 
ఉంటుంది.. 
అన్నీ కనబడకుండా పోయినట్లే 
ఉంటాయి .. 
మళ్ళి మఖ్ మల్ తెరలు 
గరగరలాడుతూ
పైకిలేచినప్పుడు గానీ 
అర్ధం కాదు 
నాటకం కొత్త అంకం మొదలైందని...!!

కన్నీటిని రెప్పల మాటున దాచి విదేశాలలో బ్రతుకుతున్న సన్నిహితులకు నా ఈ అక్షరాలు అంకితం...

Written by : Bobby Nani

No comments:

Post a Comment