Monday, May 29, 2017

//// స్వప్న సుందరి \\\\


ఒకపక్క సుందరాంగిణి వర్ణిస్తూ, మరోపక్క ప్రకృతి కాంతను వర్ణించడం అనేది కత్తిమీద సామువంటిదే.. రెండిటిలో ఏది తగ్గినా ఆ మధురం, మాధుర్యం గప్చుప్ గా మాయం అవుతుంది.. సృష్టిలో ప్రకృతి తరువాత అంత అందమైనది ఒక్క స్త్రీ నే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. వర్ణనలో చాలా రకాలు ఉన్నాయి.. ఇప్పుడు నేను చేసిన వర్ణన మాధుర్యంతో కూడినది.. ప్రతీ చదువరికి నచ్చే జుంటే తేనెవంటి మాధుర్యం కలది... 

కొంచం పెద్దదిగా వచ్చేసింది.. మన్నించేసి చదివెయ్యండి.. చదివి ఊకో కుండా అభిప్రాయాలను వెలిబుచ్చండి .. అవే నా మార్గదర్శకాలు.. ఆయ్ ...!!! 


//// స్వప్న సుందరి \\\\
*****************


ఆమె చూపుల్లో ఏదో చమత్కారం దాగుంది.. 
ఏదో మాయాజాలం కమ్మినట్లు మది అంతయూ ఓ వింత 
పొర ఆవరించింది.. !!
ఆమె దివ్య నయనములు అవిరామముగా చూసే కొద్ది, 
నా నేత్రములు స్థిరంగా ఒక దగ్గర నిలవలేకపోయాయి..!! 
ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడాలనిపించింది .. 
ఆమె మధుర పలుకుల కోసం నా హృదయం వెంపరలాడింది..
అందుకు కారణం.. ఒకటే 
ఆమెకు జన్మతః వచ్చిన చక్కని చిరునవ్వు.. 
హృదయం లోనుంచి మృదువుగా, నిర్మలంగా 
నాజూకుగా పెదవుల మీదకు పాకి, 
లే లేత చెక్కిళ్ళ నునుపుతో కలిపి, 
మరింత రసికత్వాన్ని అమరి ఉండటమే..!! 
ఇక తాళలేక పోయాను.. తనతో మాట కలిపాను.. 
ఆమె మాటల మాధుర్యములో సర్వం మరిచి, 
ఆ అందాలకు అర్ధాలు, 
ఆ ఆనందానికి అవధులను వెతుక్కున్నాను 
నా మది పుస్తక కవాటాలను తెరిచి .. 
ప్రతీ అక్షరానికి వికసించి ముడుచుకునే ఆ 
యెర్రని దోర పెదవులనే చూస్తూ వుండిపోయానలా 
నిస్తేజంగా.. !!
కళ్ళు భారంగా మూతలు పడుతున్నాయి.. 
మూత పడే క్షణంలో ఆమె శృంగార శిఖరాల కొనలపై దృష్టి ఆగింది... 
తన్మయత్వంతో రెప్పలు మూల్గుతూ వాలాయి.. 
ఆశ్చర్యంగా ... !!
తన ఒడిలో తలపెట్టి పవళించి వున్నాను.. 
ఆమె ఒడి ఓ మధుర పర్యంకము..
ఆమె ఓ ప్రేమ ప్రవాహము.. 
ఎన్నో కబుర్లు చెప్తూనే వుంది .. 
నా కళ్ళు తెరవలేకున్నాను...
తన అమృత హస్తములతో సుకుమారంగా 
నా నుదురును నిమురుతూ, 
కేశములలో మునివ్రేళ్ళు జొప్పించి మెల్ల మెల్లగా.. 
కదిలిస్తూ వుంది..!! 
ఆ సుందర మైకముతో, 
కనురెప్పలు రెండూ భారంగా, బరువుగా మారిపోయాయి..!! 
తన పెదవులనుంచి రాలుతున్న ఒక్కో అక్షర శబ్దాలు నా 
హృదయాన్ని సూటిగా తాకడంతో, 
నా రెండు శ్రవణములు తమకముతో తల్లడిల్లుతున్నాయి..!!
శరీరమంతా శృంగారపొర కప్పివేసింది.. 
కామ వికారంతో, 
స్మరప్రియ కాపంతో,
సంయోగ వాంఛతో,
భగ భగమని రగులుతోందీ దేహం.. 
ఇంతలోనే,
క్రమంగా తూర్పు ఆకాశం ఎర్రబడింది..!! 
పక్షులు మేల్కొని అరుస్తూ ఆకాశంలో అడ్డంగా ఎగురుతున్నాయి..!! 
పొదల్లోంచి లేళ్ళు, కుందేళ్ళు బయటికి దూకాయి..!! 
రక రకాల పువ్వుల గుత్తులు, గుత్తులుగా విచ్చుకున్నాయి ..!!
ఆ ఆహ్వానాన్ని అప్పుడే అందుకున్నాయి తుమ్మెదలు.. !!
గరిక అటూ, ఇటూ వయ్యారంగా ఊగుతూ నాట్యం చేస్తోంది..!!
చెట్ల కొమ్మల్ని పెనవేసుకున్న లతలు, 
ఆకాశానికి ఎగబాకాలని ఆరాటపడుతున్నాయి..!! 
మంచు తుంపరులు ముత్యాల్లా మెరుస్తున్నాయి..!! 
సమస్తం అందంగా, అపురూపంగా, 
చైతన్యవంతంగా వెలిగిపోతూ వుంది..!! 
ప్రకృతి పవిత్రంగా తన శుభాగమనాన్ని అనేక విధాలుగా 
వ్యక్తపరుస్తోంది.. !!
ఎక్కడా కల్మషం అనేది లేదు..!!
సమస్త చరాచరం ఆనందంతో తొణికిసలాడుతోంది..!! 
ఆ ఉదయం ప్రకృతే ఓ ప్రేయసి పిలుపులాగా వుంది..!! 
ఆకాశాన తెల్లని మబ్బుల్ని పరుగెత్తిస్తూ గాలి వీస్తోంది..!!
లేలేత సూర్య కిరణాలు నను ముద్దాడుతున్నాయి.. 
మెల్లిగా కళ్ళు తెరిచి చూసాను.. ఆమె మోము చూద్దామని.. 
ఎవరూ కనిపించలేదు.. 
అప్పుడు అర్ధమయ్యింది..
కవ్వించి, కనిపించి, కనుమరుగైంది స్వప్న సుందరి అని.. 
రేయి మారినా.. 
కల నన్ను వీడినా ..
హృదయం మాత్రం ఆమె పట్టుకుపోయిందని..!!!!

Written By: Bobby Nani

Saturday, May 27, 2017

మధురమెక్కడుంది ??



తన భర్త కోసం ఎదురు చూపులతో గట్టుపై కూర్చుని వయ్యారాలు ఒలకబోస్తూ కాలం గడుపుతున్న ఈ సుందరాంగి అంతరంగాన్ని “వచన కవిత్వం” ద్వారా వర్ణించాలనిపించింది .. 

మధురమెక్కడుంది ?? 

సంధ్యవేళ ఆరుబయట సొలసి కూర్చున్న ఈ ఆడతనంలో, 
ఆణువణువునా ఇమిడివుంది..!!
బండపై కుటీరములు ఆన్చిన ఆమె నడుమొంపులలో, 
నలుగుతూ వుంది..!!
అలసిన ఆ పాదాల పద్మపుటంచులలో,
కమిలి వుంది..!!
నల్లని కురుల నయగారాలలో, 
చెరిగి వుంది..!!
మెలికల వాగు వంటి సన్నని వెన్నులో, 
నిగిడి వుంది..!! 
నెమలి నయనముల రెప్పలలో, 
వాలి వుంది..!! 
కనుబొమ్మల కవ్వింతలలో, 
కుదిరి వుంది..!! 
గాజుల గల గల లలో, 
అమరి వుంది..!! 
మువ్వల సవ్వడులలో,
మీటి వుంది..!! 
మకరందపు చక్కర చెక్కిళ్ళలో, 
తియ్యందనమై దాగుంది..!!
అమృత అధరములలో, 
మధువురసం కారుతోంది...!!
ఈమె ప్రమేయం లేకనే 
వికసించే కలువబాల కదలికలు..
గంభీర సరోవరం చుట్టూ మొలిచి 
కలకల నవ్వుతూ 
వేల కబుర్లుచేప్పే గడ్డిపరకల కంఠస్వరాలు..
పచ్చని పంట పొలాల మీదుగా 
పారాడుతూ వచ్చి
కొంగులానించి ముద్దిచ్చిపోయే 
పైరగాలి బిగి కౌగిళ్ళు.. 
అలసిపోయివచ్చే పరిణాయకుణ్ణి
అలరించడానికి 
ఎరుపెక్కిన సాయం సంధ్యారక్తిమలో 
అర్దరాత్రి తోట నదరగొడుతూ 
గుప్పున విరిసిన 
విరజాజుల సురభిళ సౌందర్యంతో...
గంధపు పరిమళంబులు ఆమె దేహమంతా ఆవరించి,
పరిణాయకునికోసం ఎదురు చూసే ఆమె 
సంధ్యావేళ సోగకన్నుల్లో నిక్షిప్తమై వుంది ఈ మధురం...!! 
అర్ధ భాద్యతను పంచుకునే ఈ అర్ధాంగి అధరములను 
అందుకునేందుకు గాడేద్దులా స్వేదం చిందించే,
పరిణేత శ్రామికత్వంలో వుంది ఈ మధురం..!!
అతడెప్పుడొచ్చునో.. !!
ఈ సతి కన్నులలో కాంతులెప్పుడు ప్రసరించునో ..!!!

Written by: Bobby Nani

Friday, May 26, 2017

జీవితం ఒక మహా కావ్యం..



ఈ కవిత పూర్తిగా ఆవేశ పూరితమైనది.. కవి యొక్క ఆవేదనని, అంతరంగాన్ని అద్దంలో చూపించినట్లు చూపే ఆవేదనా తత్వమైనది... అందుకని ఇది ఎలా పడితే అలా చదివితే ఆ ఆవేశం, ఆ అనుభూతి మీకు అందదు .. కనుక ఈ కవితను “ఏక బిగిన” మాత్రమే చదవాలి.. కవితలంటే అన్నీ మధురంగానే ఉండవు.. ఇలా ఆవేశపూరితం కూడా వుంటాయి, ఆశుర కవితలు కూడా ఉంటాయి... 

జీవితం ఒక మహా కావ్యం.. 
*******************


ఎక్కడి నుంచి వచ్చి
ఎక్కడికి పోతున్నాడో 
ఎవరికీ తెలియని 
మనిషి జీవితం ఒక మహాకావ్యం.. 
జీవితం ఒక నిత్య సత్యం 
అయినా అది మహా స్వప్నం.. 
బాల్య యౌవన వృద్దాప్యాలు 
రుజా జరా మరణాలు 
రాగ ద్వేషాలు – త్యాగ భోగాలు
అల్లుకున్న 
సుందరతర గందరగోళం ఈ జీవితం 
అనుభవించడం తప్ప 
అర్ధం చెప్పరానిదీ జీవితం 
రండి చూద్దాం జీవితాన్ని 
రంగు రంగుల సింగిణిని 
ఎన్నో వికీర్ణ వర్ణాల ఏకరూపం ఈ జీవితం 
కామ, క్రోధ, లోభ, 
మోహ, మద, మత్సర్యాది 
అరిషడ్వర్గాల పందిరి మీద 
క్షణానికో పూవు పూచే 
చిత్ర గంధి జీవితం 
ఎక్కడ పుడుతుందో.. తెలియని 
ప్రాయేటి కెరటం ఈ జీవితం.. 
జనన మరణాల మధ్యన 
కాలం వ్రేల్లాడ గట్టిన 
కాంతి రేఖ ఈ జీవితం 
జననం ఒక మరణం లేని ప్రశ్న.. 
మరణం ఒక జననం లేని ప్రశ్న.. 
సమాధానం లేని రెండు ప్రశ్నలకు 
సమాధానం చెప్పడానికి 
సందేహాల బోనులో నిలబడ్డ 
సాక్షిలాంటిది ఈ జీవితం .. 
ఎన్ని సాక్ష్యాలో .. 
కళ్ళులేని కాలం.. 
చెవులు లేని కలంతో 
నోరులేని కాగితం మీద 
కన్నీటి అక్షరాలతో 
అన్నీ వ్రాసుకుపోతుంది.. 
అయినా తీర్పులేదు..
అభియోగంలో మార్పు లేదు.. 
అద్బుత ద్వీపం మీద 
మబ్బులా వచ్చి కురిసి 
వాగులా పొంగి పొరలి 
వారాశిలో కలిసిపోయే 
వర్ష బిందువు ఈ జీవితం 
అనుభూతి శిఖరాలనుంచి 
అవలోకిద్దాం జీవితాన్ని 
ఆలోచనా అంతరాళాలనుంచి 
పరిశీలిద్దాం జీవితాన్ని 
అనంతత్వ కిరణాలలో 
దైవత్వ దర్పణాలలో 
దర్శిద్దాం ఈ జీవితాన్ని 
రండి.. కదలండి.. 
దర్శించండి మీ జీవితాల్ని... !!!

Written by : Bobby Nani

Thursday, May 25, 2017

మా సింహపురిలో వేసవి ముచ్చట్లు.. అదేనండి మా నెల్లూరు, మన నెల్లూరు..!!


మా సింహపురిలో వేసవి ముచ్చట్లు.. 
అదేనండి మా నెల్లూరు, మన నెల్లూరు..!!

మేఘాల్లేని ఆకాశాన్ని దులపాల్సిన పనిలేనందువల్ల 
తలలకు పాత దుమ్ముని పులుముకున్న 
బూజుకర్రల్లా ఉన్నాయి కొబ్బరిచెట్లు.. !!!
యుద్ధం లేకపోయినా అనుక్షణం అప్రమత్తంగా 
విన్యాసాలిచ్చే సైనికుల్లా.. 
నిర్దిష్టమైన వరుసల్లో, 
రెప్పపాటు లేనట్లు ఆకుకదలని స్థితిలో నిలబడి ఉన్నాయి..!! 
ఊరి నించి మరోఊరికి ప్రవహించే పిల్ల కాల్వల 
నాలుకలు పిడచ కట్టుకుపోయి, 
వెల్లికిలాపడి ఏడ్చినా నీళ్ళు రాని, 
కనుగుడ్లు లేని, 
మట్టి గుంతల్లా మిగిలాయి.. !!
వేసవి పిండేయ్యగా మిగిలిన పల్లెలమ్మ గుండెల్లోకి,
కాకులు కూడా ముట్టని బురదనీరు, 
ఈ విసర్జన శరీరాన్ని శుభ్రం చేసుకునేందుకు, 
ఏదో నీటిలో బతుకు పిండుకునే రజకులకు, 
మాత్రమే పనికొస్తుంది.. !!
కడుపునిండకపోయినా కాన్పుల క్రమం తప్పకుండా, 
సగటు అమ్మల్లా,
ఎండు కొబ్బర్ల స్థానంలో పూల పిందెల హారాల్తో, 
గుండె లోతుల్లోని నీటి ఊటల సారంతో, 
నిలబడి ఉన్నాయి కొబ్బరిచెట్లు..!! 
కొబ్బరి చెట్ల కొంగు చాటు బిడ్డల్లా,
నీడల్లో పాదాలానుకొనే కంద మొక్కలు.. 
నరికిన స్థానం పక్కనే పిలకల మొలకల్తో కిలకిల్లాడుతూ, 
వృద్దాప్యం, బాల్యం, ఏక కాలంలో అనుభవానికొచ్చే, 
గెలల అరటి చెట్లు,
సోమశిల, కండలేరు పాయల పొడవుకి గడ్డి గెడ్డాల పచ్చని గట్లు..!!! 
బోరకడుపుని దాచుకుని బస్టాండుకు, 
బుట్టలతో పరిగెత్తుకొచ్చే రుచికర దోర జామకాయలు..!!
ఒంటె కడుపులోని నీరులా ఎక్కడ తవ్వినా పైకి ఎగదన్నే, 
బోరునీళ్ళతో కలకల్లాడే రెండో పంట కూరల పైర్లు..!! 
సింహపురుల కంటి తుడుపులు.. !!
వేసవి జ్వరం తగిలి మూల్గుతున్న పొదలకూరు,
ఇటుక బట్టీల్తో చెవులు పట్టేసిన కోవూరు,
ఆకాశాన్నంటే మల్లెపూల ధరల్తో బుచ్చిరెడ్డిపాలెం,
జల జలమను లంఘించే మా పెన్నాను కలుపుకోవడానికి నీళ్ళు లేక 
వెనక్కి పరుగెత్తుకొచ్చే సముద్రం, 
పట్టణ మాలిన్యంతో కన్నె సొగసును కోల్పోయిన సింహపురి పల్లెలివే....!! 
మా సింహపురి కంటి నులుసులు...!!
దేన్నీ వదలని వేసవి సింహపురిని పట్టుపట్టింది..!! 
కాలువల్ని తాగి, ఊటల్ని మింగినా, 
భూమి లోపలిసారం కాలి చిటికెన వ్రేలు కూడా కదపలేక 
వెర్రి మొహం వేసింది..!!! 


పుట్టిపెరిగిన ఊరు కాదండి.. కూసంత మమకారమేక్కువ.. 

Written by : Bobby Nani

రక్షణ కల్పించాల్సిన వాడే నగ్నంగా మారుస్తూ ... ?? నరకయాతనలకు గురిచేస్తుంటే ఇక ఆ ఆడతనానికి దిక్కెవ్వరు..??



రక్షణ కల్పించాల్సిన వాడే నగ్నంగా మారుస్తూ ... ??
నరకయాతనలకు గురిచేస్తుంటే ఇక ఆ ఆడతనానికి దిక్కెవ్వరు..??

మహిళలపై జరిగే దాడులలో అత్యంత భయంకరమైనది, బాధాకరమైనది యాసిడ్ దాడి... మన దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే ఉత్తర భారతదేశంలోని స్త్రీలపైనే అధికంగా జరుగుతున్నాయి... వాటిల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రధమ స్థానంగా పరిగణించబడింది.. 

ఇంత పైశాచికంగా, పాశవికంగా ఎలా ఒక మనిషిపై దాడి చేస్తారో అని ఆలోచిస్తుంటేనే కళ్ళల్లో నీరు ఆగట్లేదు.. ప్రేమించలేదని దాడి, 
ఆమె మరొకరిని పెళ్ళి చేసుకుందని దాడి, 
అడిగింది ఇవ్వలేదని దాడి, 
కోరిక తీర్చలేదని దాడి, 
మోసం చేసిందని దాడి, 
ఇలా ఒకటా రెండా ప్రతీ విషయంలో నలిగేది, నలుగుతున్నది ఆడదే.. 

కొందరు మగవాళ్ళు అంటూ వుంటారు.. 
ఆడవారికే కాదు మగవారు కూడా కస్టాలు అనుభవిస్తున్నారు అని .. 
ఒప్పుకుంటాను.... కాని యెంత శాతం మేర మగవాళ్ళు అనుభవిస్తున్నారు ?? 
మహా అయితే వందలో ఒక 10 శాతం వేసుకుందామా ?? 
ఇక్కడ ఆడవారు అనుభవించే మారణ కాండ 100 లో 95% అని మర్చిపోకండి... 
అన్నీ అనుకూలంగా వారికే వున్నాయని గోల గోల చేస్తుంటాం.. 
అనుకూలతతో పాటు మిగిలినవి కూడా అన్నీ ఎక్కువే అని ఎందుకు మర్చిపోతున్నారు... 
ఇది ఉన్మాదమా విపరీత కాండమా ??

అంతెందుకు మన దేశంలో మహిళల్లో 70 శాతం మంది ఏదో ఒక రూపంలో గృహ హింసను ఎదుర్కొంటున్నారు. 

NCRB ప్రకారం ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి మహిళలపై ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది.
ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకసారి భర్త అత్తమామల రూపంలో వివాహితలు వేధింపులు, హింస బారిన పడుతున్నారు.

పనిచేసే మహిళల్లో (Working women) ఎక్కువ శాతం విధులకు వెళ్లి వచ్చేటప్పుడు తమకు రక్షణ లేదని వెల్లడించారని అసోచామ్‌సర్వే తేల్చింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలతో పాటు ముంబై, పూణె, కోల్‌కతా, హైదరాబాద్‌లోని పెద్ద సంస్థలతో పాటు, మధ్యస్థ చిన్నతరహా కంపెనీల్లో పనిచేస్తున్న 5 వేల మందిని ఈ సంస్థ సర్వే చేయగా, ఏకంగా 92 శాతం మహిళలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బీపీఓ, ఐటి అనుబంధ రంగాలు, హాస్పిటాలిటీ, పౌర విమానయానం, నర్సింగ్‌హోమ్స్ లో పనిచేస్తున్న మహిళలు తమకు తగిన రక్షణ లేదని చెబుతున్నారు.

మహిళలపై నేరాలకు మూలాలేంటి? 
లోపం ఎక్కడుంది? 
వ్యవస్థలోనా? 
వ్యక్తుల్లోనా? 
బాపూ కలల నిర్భయ భారతం ఎన్నాళ్లకి? 
ఎన్నేళ్ళకి సాకారమవుతుంది ?

రక్షణ కల్పించాల్సిన వాడే నగ్నంగా మారుస్తూ ... 
నరకయాతనలకు గురిచేస్తుంటే ఇక ఆ ఆడతనానికి దిక్కెవ్వరు..??

ఇలాంటి ఒక సంస్కార హీనమైన, అంధకారపు సమాజంలో ఒక సాదారణమైన స్త్రీ ఎలా స్వేచ్చగా ఉండగలదు ?? 
ఇలాంటి దుర్భేధ్యంలో వున్న మన పిశాచాల సామ్రాజ్యంలో కొన్ని మనం పాటించడం ద్వారా ఇలాంటివాటిని మనం కొంతమేర అరికట్టవచ్చు అనే సంకల్పంతో ఈ క్రింద వివరిస్తున్నాను దయచేసి చదవగలరు ... 

1. ప్రతి స్త్రీ బాల్యం నుంచే తనను తాను రక్షించుకోవటం ఎలా అన్నది తల్లి ఉగ్గుపాలతోనే నేర్పించాలి. ఎందుకంటే చంటి పిల్లల్ని కూడా (మృగాలుగా వ్యవహారించే, తార్కిక జ్ఞానం కోల్పోయిన) మగవారు అత్యాచారం చేయడానికి వెనకాడటం లేదన్నది వాస్తవం.

2. బాల్యంలో బాలికలను ముద్దు చేసే దగ్గర బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు వారిని ముట్ట రాని ప్రదేశాలలో నోటితో చేతులతో ముట్టినప్పుడు వారి నుంచి దూరంగా మసలడం పిల్లలకు నేర్పాలి. సాధ్యమయినంతవరకు ఎదుటి వ్యక్తులకు ఆనుకోని, తగులుతూ మాట్లాడకుండా దూరం జరగాలి.

3. చిన్నప్పటి నుంచే ‘అమ్మని, అక్కని, చెల్లిని, మొత్తం స్త్రీ జాతిని గౌరవించాలని మగ పిల్లలకు తల్లితండ్రులు నేర్పాలి. స్త్రీ పురుష సమానతలు, ఒకరు లేకుండా మరొకరు లేరన్న విషయం తెలియజేయాలి.

4. వివక్షతతో చూడకుండా బాల బాలికలను ఒకే రకమైన పాఠశాలలకు పంపడం పౌష్ఠికాహారం, ఆటపాటలు నేర్పించాలి.

5. బాలికలకు ఆత్మరక్షణ విద్యలు అంటే కరాటే, జూడో, క్రికెట్‌, బంతి ఆటలు అన్నీ నేర్పాలి.

6. ఎవరైనా స్త్రీలపై దాడి సంఘటన జరగబోతున్నపుడు తమ దగ్గర సెంటు స్ప్రే డబ్బాల్లో కారంపొడి / మిరియాల పొడి నీళ్ళలో కలిపి వారి కళ్ళలో కొట్టాలి. అప్పుడు దొరికిన సమయంలో తప్పించుకోవాలి.

7. ఆడపిల్లలు ప్రతిరోజూ ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే వారిలో ఆత్మస్థెర్యం పెంపొందుతుంది.

8. ఎక్కడికి వెళ్ళినా తమ సెల్‌ఫోనుల్లో పోలీస్ నెంబరు – 100/1098, దగ్గర పోలీసు స్టేషన్ నెంబరు, దగ్గర బంధువులకు తమ ఉనికిని తెలియ జేయడం, ద్వారా ఆత్మరక్షణ చేసుకోగలుగుతారు.

దేశ జనాభాలో దాదాపు సగభాగం మహిళలు ఉంటే వారి సంక్షేమానికి, భద్రతకు నిర్దేశించిన నిధులు 30 శాతానికి మించడం లేదు. మహిళా సాధికారిత సాధించి, నేర రహిత సమాజ సాధనకు నిధుల కేటాయింపు పెంచాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించేందుకు శిక్ష ఒక్కటే కాదు చట్టాల్లోనూ మార్పులు చేయాలి. మహిళలపై జరుగుతున్న నేరాలుకు గల మూలాలపై పోరాటం చేయాలి. 

సమాజంలోని అన్ని వర్గాల్లోనూ, యువతలోనూ మానసిక పరిపక్వత కల్పించాల్సిన అవసరముంది. నేరం జరిగిన తర్వాత నిందితుణ్ని శిక్షించడం కంటే అది జరగకుండా నియంత్రించడమే ముఖ్యం. అత్యాచారాలు, అఘాయిత్యాలు, యాసిడ్ దాడులు ఎదుర్కొనేలా మహిళలకు అండగా నిలవాల్సిన కనీస బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.

నేటి ఆడతనాన్ని నిలబెట్టుకుందాం..!! 
రేపటి అమ్మతనాన్ని రక్షించుకుందాం.. !!

Written By: Bobby Nani

Wednesday, May 24, 2017

\\\\నెలవంక అందాలు..////



మధురమైన భావ కవిత్వం రాసి చాలా రోజులు అయిందబ్బా ... అందుకే ఈరోజు ఎలా అయినా మిమ్మల్ని అక్షర తాండవంలో నర్తింపజెయ్యాలనుకుంటున్నాను.. 


\\\\నెలవంక అందాలు..//// 
*******************

ఆకాశం నుండి 
విద్యుత్తేజాల మేఘాల నుండి, 
భూమ్యాకర్షణ ఉపగ్రహాల నుండి,
జల్లు జల్లుల హాశాతిరేకం..!!
ధ్వనించే హృదయ రాగం ..!!
మనసు, మనసు అనుసంధానం 
ప్రపంచం ఒక పూలతీగై, 
ప్రతిధ్వనించినప్పుడల్లా సంతోషం జల జలా కురుస్తుంది..!! 
భూమి – ఆకాశం
చెట్టూ – కోనా 
సుమాలూ – ప్రవాహాలు 
గాలీ – గుండే సవ్వడులను వినండి..!! 
మీ నిశ్శబ్దాన్ని విడిచి నాతో రండి..!! 
ఒక వంక “నెలవంక”, 
మరో వైపు జలపాత ఝురీ.. 
పాదం చివర కలువలు సుతిమెత్తగా నిమిరి 
వెన్నెల్లో స్నేహాన్ని ప్రేమగా గుక్కెట నింపుతున్నాయి..!! 
ధ్వని – ధ్వని గల గలా చెవుల్ని ఆప్యాయించే 
మాధుర్య స్వరధుని ఈ ధ్వని.. నా 
చుట్టూ మలయమారుత నేస్తాలు చుట్టివున్నాయి ..! 
ఒక్కాసేపు అవి చెప్పే మాటల్లో వరదయ్యే ఉత్తరాలు...!
ఇవన్నీ చుసిన నాకు.. 
ఎటు చూస్తే అటు 
తెరలు తెరలుగా వేల అక్షరాలు 
నా నించి అటు,
అట్నించి ఇటు, 
ప్రవహించే ఆత్మీయ వారధిలా నా 
చేతి మునివేళ్ళ నుంచి జల జలా రాలుతున్నాయి.. !!
ఓ మేఘమా...
ఓ ఆకాశమా.. 
మీకు కృతజ్ఞతలు..
నాలో ఆగని ధ్వనించే హృదయం, 
హృదయానికందని అతీత సౌందర్యం, 
క్షణాలకు జీవంపోసే ఒకే ఒక శబ్దం, 
నిశ్శబ్దమై పోయినా మారుమ్రోగే నిరంతర స్నేహం... 
మీ వల్ల బావుకత రూపంలో నను కౌగిలించుకొని వుంది .. !!!!


అసలు కవిత్వం అంటే ఏంటి ?? నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి మాములుగా కాకుండా భిన్నంగా ఉండి చదువరుల మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. ఈ సాధన ద్వారా మన కవిత్వాన్ని మనమే మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు.. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం, నిరంతరం కవి హృదిలో జ్వలించే జ్వాల, కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి తీరని హాని చేస్తాయి. కవిత్వంలో చెప్పేదేదైనా బలంగా ఉండాలి... నిజం ఉండాలి ... నంగి మాటలు, నత్తి చేష్టలు, వెటకారపు అక్షరాలు ఉండకూడదు. కవిత్వం రాసేవారిలో ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగానీ ఒక మంచి కవిత జన్మించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. రసమయ ఘడియల్లో సృజించిన కవిత కొన్నాళ్ళాగి చదివితే రాసినప్పటి మానసికస్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో చూసుకోవాలి. అలా తీసుకువెళ్ళినట్లైతే అది నిక్కార్సైన కవిత అయినట్లే... మీరు విజయం సాధించినట్లే.. 

Written by: Bobby Nani

Saturday, May 20, 2017

భ్రూణహత్య


భ్రూణహత్య 
*********

ఆడది పుట్టిందని మరో ఆడదే
పురిటిబిడ్డను వ్యర్ధములో త్రోసినది...
కళ్ళు తెరవని ఆ పసిహృదయం .. 
తల్లి చను మొనలకోసం తడుముకుంది.. 
అర్ధం తెలియని ఆకలి బాధ కోసం వెక్కి వెక్కి రోధిస్తోంది.. 
అలసి సొలసి మైకముతో విధికి తలవంచింది.. 
కనురెప్పలు పుడమికి వాల్చింది ..
రేపటి భవిష్యత్తు నేలకొరిగింది.. 
చదువు, 
జ్ఞానం, 
డబ్బు,
అభివృద్ది, 
పరిజ్ఞానం, 
పళ్ళికిలించి పకపకమని నవ్వుకున్నాయి.. 
మానవత్వం, 
మాతృత్వం, 
కళ్ళు చమర్చేలా రోధిస్తున్నాయి .. 
ఈ మానవుడు సాధించిందిదేనా అని..!!!

Written by : Bobby Nani

Friday, May 19, 2017

\\\\ చంద్రవదన ////



\\\\ చంద్రవదన ////
**************


చంద్రునికైనా మచ్చుంటుందేమో కాని .. ఈ 
చంద్రవదనకు మచ్చుకు కూడా కానరాదేందో .. 
ఓయ్ పద్మినీ .. 
నిన్నే.. 
అవి అధరములా ... ఊ... హు.. సరస నవరస మధురిమలు.. 
జుంటే తేనెలో నానబెట్టిన... తియ్యని మధుర రస చక్కెర తొనలు.. 
నడిరేయి అమావాస్యన నీ మోము 
వెన్నెలలు పూచే చంద్ర బింబపు కాంతులేనే సఖి.. !!
పున్నమి రేయిన చిమ్మ చీకట్లను మురిపించే 
నీలవర్ణ కేశ సౌందర్యములే కదా నీవి ..!! 
ఆ చొట్టబుగ్గల చెక్కిలిలో చిక్కుకుని ఇరుక్కుపోయిన చిన్నవాణ్ణి .. 
చెంత జేరి .. చేరదీయరావే చెలి.. 
నీ అధర తాళపత్రాలపై లిఖించనా 
నా యెవ్వన ప్రేమ మధురిమల చుంబనసంతకములతో.. 
నీ శ్వాసే వేయి సుగంధాల పరిమళఁబులు వెదజల్లే 
వేసవి తాపాల చిరుజల్లులే ప్రియా.. 
ఒదిగిపోనా నీ కౌగిళ్ళ వెచ్చని శ్వాసలలో .. 
నలిగిపోనా నీ ఇరుకైన నడుఁ మడతలలో...
చుట్టుకుపోనా ఆపాదమస్తకం నిను స్పృశిస్తూ లతాఁగినై ...
మిళితమై పోనా ద్విశరీరాలు ఏకమై.. ఏకస్తులమై.. !!!

Written by: Bobby Nani

Wednesday, May 17, 2017

యావత్ ప్రపంచాన్నంతా ప్రస్తుతం గడ గడలాడిస్తున్న ఒకే ఒక్క పదం “WannaCry”


యావత్ ప్రపంచాన్నంతా ప్రస్తుతం గడ గడలాడిస్తున్న ఒకే ఒక్క పదం “WannaCry” 

ఈ “WannaCry” అనే వైరస్ “Ransomware” అనే విధ్వంసకరమైన సాఫ్ట్ వేర్ నుండి “cryptoviral” అనే ప్రోగ్రామింగ్ ద్వారా రూపుదాల్చింది.. ఇది ఎందరో అనుభవజ్ఞులైన హ్యకర్స్ చేసిన దారుణమైన విధ్వంశకాండ... 


ఈ నెల 12వ తేది శుక్రవారం రోజున “WannaCry” అనే వైరస్ ను హాకర్స్ ప్రపంచం మొత్తానికి పరిచయం చేసారు.. అందులో మొదటి పది దేశాలలో మన భారతదేశం కూడా ఉంది.. 150 దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాపించింది.. షుమారు 2,30,000 (రెండు లక్షలా ముప్పై వేల) కంప్యూటర్స్ దీని బారిన పడ్డాయి అని అంచనా.. ఈ దాడిలో అన్నీ దేశాలకంటే “ఇంగ్లాడ్” దేశమే చాలా భారీమూల్యం చెల్లించాల్సి వచ్చింది.. 


మన దేశంలో షుమారు 48,000 వ్యవస్థలలో ఈ వైరస్ సోకినట్లు భారత సెక్యూరిటీ సంస్థ పేర్కొనింది.. 48,000 వ్యవస్థలలో అంటే ఒక్కో వ్యవస్థలో ఎన్ని ఆఫీస్ లు వుంటాయి?? ఆ ఆఫీస్ లలో ఎన్ని కంప్యూటర్స్ ఉంటాయి..?? అంతే కాదు పశ్చిమ బెంగాల్, వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ఉన్న కార్యాలయంలోని స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యొక్క కంప్యూటర్లు కూడా ప్రభావితమయ్యాయని తెలిపారు... మరియు కేరళలోని వయనాడ్ జిల్లాలో పంచాయతీ కార్యాలయాలు కూడా ప్రభావితమయ్యాయని నిర్ధారించారు.. కొన్ని రాష్ట్రాలలో ATM లు కూడా నివారణ చర్యగా మూసివేయబడ్డాయి. భారతదేశంలో ప్రభావితమైన మొదటి ఐదు నగరాల్లో కోల్కత, తరువాత ఢిల్లీ, భువనేశ్వర్, పూణే మరియు ముంబై ఉన్నాయి.
దాడి ఎలా జరుగుతుంది ??



OS (ఆపరటింగ్ సిస్టం) ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో వాడే ఆపరటింగ్ సిస్టం ఒక్క windows దీన్నే హ్యకెర్స్ టార్గెట్ చేసారు... ఈ ఆపరటింగ్ సిస్టం లో కూడా Windows XP మరియు Windows Server 2003 ఎక్కువగా గురి అయ్యాయి.. ఇదివరలోనే Windows XP మరియు Windows Server 2003 లను బ్యాన్ చేస్తున్నాం .. ఇక వాడకండి అని మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించింది అయిననూ కొన్ని ఫైల్స్ ఈ os లలోనే రన్ అవుతుండటం చేత అందరూ ఆ విషయంపై అంత శ్రద్ద వహించలేకపోవడమే ఇందుకు గల ముఖ్య కారణం అని తెలుస్తుంది... తరువాత Windows Vista, Windows 8, Windows Server 2008, windows embedded posready 2009 ఇవన్నీ స్వల్పంగా అయినప్పటికీ వైరస్ ప్రభావం ఉంది .. కాని ఒక్క Windows 10 ఆపరటింగ్ సిస్టం ని మాత్రం ఆ వైరస్ తాకలేకపోయింది. 

దాడి ఎందుకు జరుగుతోంది ?? 

ఇదంతా ఓ బిజినెస్.... వైరస్ సృష్టించేది వారే దానికి యాంటి వైరస్ అనే విరుగుడును కనుగొనేది కూడా వారే.. కాకపోతే మూడు రోజుల లోపల ౩౦౦ బిట్స్ రూపంలో ధనమును చెల్లించాలట ఒక్క బిట్ ఎంతో తెలుసా?? మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల 1,17,000 ఈ రేటు నిమిష నిమిషానికీ మారుతూ ఉంటుంది... ఈ వైరస్ బారిన పడిన సంస్థ మూడు రోజులలో ౩౦౦ బిట్స్ కి అయిన మొత్తం అనగా 3,51,00,000/- చెల్లించాలి గడువు దాటితో ఆరు రోజులు గడువు ఇచ్చి రెండింతల డబ్బును డిమాండ్ చేస్తున్నారు ఈ “WannaCry” హ్యాకర్స్.. ఒకవేళ డబ్బు చెల్లించకుంటే మీ కంప్యూటర్స్ లో డేటా 0 అవుతుందని హెచ్చరికలు పంపారు..ఇదంతా భారీ మొత్తం వసూళ్ళకు శ్రీకారం.. 

దాడి ఎలా జరుగుతోంది ?? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. 

ముందుగా మీ యొక్క ఈమెయిల్ కి మీకు తెలియని మెయిల్స్ వచ్చినట్లు అయితే వాటిని టచ్ కూడా చెయ్యకండి.. మీకు వచ్చే ఈ మెయిల్స్ కూడా చాలా ఆకర్షణీయంగా వుంటాయి.. మిమ్మల్ని ప్రేరేపించే విధంగా ఉంటాయి ఇవన్నీ ట్రాప్స్ అని గుర్తుంచుకోండి.. మీ కంప్యూటర్ లో మీరు ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు కాని మరేదైనా వెబ్సైటులో వర్క్ చేస్తున్నా కాని రైట్ సైడ్ బాటమ్ లో కొన్ని లింక్స్ మీకు తెలియకుండానే వస్తుంటాయి వాటిని మాత్రం అస్సలు ముట్టుకోకండి.. అవే కొన్ని సెకండ్స్ వ్యవధిలో క్లోజ్ అయిపోతాయి.. కనీసం క్లోస్ చెయ్యడానికి కూడా ప్రయత్నించకండి ఒక్క మౌస్ క్లిక్ చాలు వారికి మీ కంప్యూటర్ పై పూర్తి అధికారం రావడానికి అన్న విషయం మర్చిపోకండి.. 

డబ్బులు పెట్టి కొన్న మంచి యాంటీ వైరస్ నే వాడండి..ట్రయిల్ వర్షన్స్ ని అనుమతించకండి.. మీరు వాడుతున్న బ్రౌజరులో ప్రైవసీని ఖటినతరం చెయ్యండి.. ఎప్పటికప్పుడు మీ ముఖ్యమైన ఫైల్స్ ని మరో హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకుంటూ వుండండి.. ప్రతీ నెల మీ కంప్యూటర్ ని పూర్తిగా ఫార్మాట్ చేసి వేస్తూ వుండండి.. Automatic updating status ని remove చెయ్యండి.. unwanted softwares ని అనుమతించకండి.. ఇలా మనం మనవంతు జాగ్రత్తలో ఉంటే మన సమాచారాన్ని మనం పోగొట్టుకోవడానికి ఆస్కారం చాలా స్వల్పంగా ఉంటుంది.. 
కొన్నిరోజులు Online Transactions పెద్ద మొత్తంలో జరపకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం .. జాగ్రత్త వహించండి.. మనమేం చేసినా మనల్ని ఓ కన్ను గమనిస్తుందని అర్ధం చేసుకోండి.. 

దీనిగురించి మరింత సమాచారాన్ని మీకు త్వరలో అందిస్తాను.. మీ మిత్రులను అప్రమత్తం చెయ్యండి... 

స్వస్తి __/\__

Written by : Bobby Nani

Saturday, May 13, 2017

\\\\ కలమడిగిన ప్రశ్న ////



\\\\ కలమడిగిన ప్రశ్న ////
******************


దూరాన అందియల చప్పుళ్ళు ఘల్లుఘల్లుమని 
కర్ణములకు తాకుతున్నాయి ..! 
వెంటనే అందం మీద కవిత రాద్దామనుకున్నా..!!
కానీ,
అందం కన్నా, ఆవేదనలే కనపడుతున్నాయ్..!
వినపడుతున్నాయ్..!!
కవితా హృదయం భళ్ళున చెరిగిపోయింది..! 
కన్నీటి ఊట కన్నులకు అంటింది..! 
కలము భారంగా అశ్రువులను విడవ సాగింది,
కాగితమనే హృదయ వేదికపై..! 
ఇంతై.. ఇంతింతై .. అంతై.. అనంతమై 
అక్షర బిందువులు చిమ్మ బడ్డాయి..!! 
కానీ,
ఆవేదన ఆగలేదు..! 
నయన ప్రవాహం ఆగేలా లేదు...! 
అక్షరాలే ఒదార్పునివ్వలేక వలసబాట పట్టాయి..! 
నాకు దూరమైపోయాయి..! 
అయినా, 
నా కలం నుంచి నూతన అక్షర మాలికలు 
జల జలమని ఏకధాటిగా అహోరాత్రులూ 
రాలుతూనే ఉన్నాయి..!!
ఆవేదనలు, ఆనందాలుగా మారాయి..!!
వలస వెళ్ళిన అక్షరాలే ఈ మార్పునకు కారణ భూతాలయ్యాయి..!! 
కలం ఆగింది..!
కవి గుండె తేలికపడింది..! 
కవి కళ్ళలో ఆనందాల అశ్రువులు నేల రాలుతున్నాయి..! 
పుడమి పులకరించి పోయింది..! 
సమాజం సగర్వంగా నిగిడి కూర్చుంది..! 
లోకులు లక్షనులయ్యారు..! 
కవిని
కలం ఓ కోరిక కోరింది ..! 
ఇక నాతో పనేముందని.. 
కాలం, కెరటం అవిశ్రాంతులు..! 
కవి కలం కూడా, 
విరామమెరుగని అక్షర ఉత్పతితులనే సమాధానం, 
కవి నోటివెంట రాలింది ..!!!

Written by : Bobby Nani

Friday, May 12, 2017

\\\\నవరస మాధుర్యం ////



అన్ని రసాలు ప్రాముఖ్యమైనప్పుడు ఒక్క శృంగార రసానికి మన పూర్వికులు ఎందుకింత ప్రాముఖ్యత కల్పించారు అనే విషయం పై నా వివరణ ఇది.. వ్యాసం చదివాక దయచేసి మీ అభిప్రాయాల్ని వెలిబుచ్చాలని కోరుతున్నాను.. 

\\\\నవరస మాధుర్యం ////
*****************

రసాలు తొమ్మిది అని అందరికీ విదితమే...

శృంగారం, వీర, కరుణ, అద్బుత, హాస్య, భీభత్స, భయానక, రౌధ్ర, శాంత ఇలా తొమ్మిదిని మనం పేర్కొనవచ్చు.. అయితే ఈ తొమ్మిదీ ఒకదానికొకటి తీసిపోనివి.. సమాన ప్రతిపత్తి కలవి కాబట్టే “నవ రసాలు” గా పేర్కొనబడ్డాయి...పెరుగావించబడ్డాయి... అయినా ప్రాచీన కాలంలోనే ప్రముఖ సాహిత్య శాస్త్రజ్ఞులు “శృంగారంరసరాజం” అన్నారు.. వారిమాట తేలిగ్గా తీసుకోలేకపోయాను అలానే త్రోసిపుచ్చడానికి కూడా మనసు ఒప్పుకోలేదు.. దీనికి సరైన వివరణ తెలుసుకోవాలనిపించింది.. 

నా ప్రశ్న ఏమిటంటే... 

రసాలన్నీ ఒక్కటేనన్నప్పుడు రసరాజంగా కేవలం ఒక్క రాసానికే విశిష్టస్థానం, ప్రాముఖ్యతను ఏవిధంగా ఇచ్చారు ఈ పండితులు అని ?? 

ఇంతకీ వారు ప్రధమ స్థానం ఇచ్చింది ఏ రసానికో మీకు ఈపాటికే తెలిసేవుంటుంది అదేనండి “శృంగార రసం” దీనిపై చాలారోజులనుంచి వివరణకోసం నా నయనములు వెతుకుతున్నాయి.. అందుకోసం పరితపిస్తున్నాయి.. చివరికి నేను మిగులుపడే సమాధానం నాకు దొరికింది.. 

రసాలన్నిటికీ మానవుని జీవితంతో సంబంధం వున్నది.. కాని శృంగారేతర రసాల కంటే ఒక్క శృంగార రాసానికి మాత్రమే మానవుని జీవితాలలోనే కాదు.. సమస్త ప్రాణకోటి బ్రతుకులలోనే.. కాదు కాదు.. అసలు సృష్టిలోనే ప్రత్యేకమైనదిగాను. అసాధారణమైన, అఖండమైన స్థానం కలిగి ఉన్నది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు... 

వీర, కరుణ, అద్బుత, హాస్య, భీభత్స, భయానక, రౌధ్ర, శాంత ఈ ఎనిమిది రసాలలో ఏ రసం లేకపోయినా ఈ యావత్తు అష్ట రసాలు లేకపోయినా సృష్టిలో వచ్చే వైపరీత్యం ఏమీ ఉండదు, ఉండబోదు.. అయితే శృంగారమే లేకపోతే సామాన్యంగా మానవుని బ్రతుకుకే కాదు, అసలు సృష్టికే – ప్రత్యేకించి ప్రాణకోటి సృష్టికే వైపరీత్యం ఏర్పడుతుంది... రసోత్పత్తి మీద ఆధారపడి సృష్టి కార్యం అంతా జరుగుతున్నది.. ఇది కొరవడినప్పుడు ప్రాణి సృష్టికే స్థంబన ఏర్పడుతుంది. పవిత్ర శృంగారం నీచము కాదు... అది ఓ మహత్తర బృహత్కార్యం.. శృంగారం అనేది ప్రాణి సృష్టి స్వభావానికి ప్రతిబింబం కేంద్ర బింబం కూడాను.. అది కేవలం ప్రకృతి స్వభావం.. అటువంటి దాన్ని మనం ఆపాలని ప్రయత్నిస్తే మనమే ఓటమిని అంగీకరించక తప్పదు.. ప్రకృతి సిద్దమైన దాంపత్య జీవితాలకు బౌద్ద మతం స్వస్తి చెప్పినందువల్లనే క్రమంగా బౌద్ధారామాలలోనే పతనస్థితి ఏర్పడి చివరికి బౌద్డమే దెబ్బతినింది.. ఎక్కడో ఎవరో “తురీయాశ్రమ స్వీకరణ”తో ఏ ఒక్కరో, ఇద్దరో, పదుగురో సృష్టి కార్యాన్ని దీక్షగా పడితే నష్టం ఉండదు, ఉండబోదు.. కానీ అదే ఒక ఉద్యమం రూపుదాల్చి కనపడిన ప్రతీ వ్యక్తికీ సన్యాసాశ్రమం ప్రసాదించే పరిస్థితి వస్తే ప్రకృతి సిద్దమైన, స్వభావ బద్ధమైన శృంగారానికి లోబడగాక తప్పదు.. సన్యాసం కళంకాంకితం కాకా తప్పదు..ప్రకృతిసిద్దమైన శృంగారపరమైన శక్తిని ఆపడం సృష్టికే విరుద్దం.. సృష్టి వ్యవస్తతోనే శృంగారానికి అవినాభావ సంబంధం, అఖండమైన సంబంధం ఉంది.. 

అందువల్లనే మన పూర్వికులు, ప్రాచీనులు, సకల శాస్త్రోత్తములు, సంభృతశ్రుతులు “శృంగారం రసరాజం” అని వాగ్ధాటించారు.. వాస్తవానికి అది రసరాజం మాత్రమే కాదు రసనైజం, నైజరసం శృంగార రసానికున్న ఈ వైశిష్ట్యాన్ని దృష్టిలో పెట్టుకునే మన పూర్వికులు ప్రధమ స్థానం అందించారు..

Written by : Bobby Nani

Thursday, May 11, 2017

\\\\ నయన జలం ////



విదేశాలకు పయనమౌతూ మొదటిసారి విమానమెక్కి భయం భయం గా కూర్చొని అప్పటిదాకా తన పుడమిని అంటిపెట్టుకొని ఉన్నవారు ఒక్కసారిగా ఏదో తెలియని బంధం నుంచి దూరం అవుతున్న అనుభూతికి లోనౌతారు .... విమానం ఒక్కసారిగా గాలిలోకి లేవగానే కళ్ళల్లో తెలియకుండానే నీరు ప్రవాహ ధారలా చిమ్ముతుంది .. ఆ ఆత్మీయపు బంధాన్ని రాయాలనిపించింది..

\\\\ నయన జలం ////
***************


గాల్లో 
ఎగరడం ప్రారంభించాక గానీ 
పుడమి మీద ఏమి 
వదలి వచ్చామో 
తెలియదు.. 
నేలమీద తిరుగుతున్నంత సేపూ 
ఏమి పోగొట్టుకున్నామో తెలిసి ఉండదు .. 
విమానం లోహపు రెక్క లార్చుకుని 
రాక్షస యంత్రాల నోరు తెరిచి
వీడ్కోళ్ళ చివరి ఆనవాళ్ళను 
మింగేశాక గానీ 
మూసుకున్న కన్రెప్పల 
వెనుక
చూడలేకపోయిన దృశ్యం 
అగుపడదు.. 
చుట్టూ స్ప్రుశించలేని 
నీటిపొర దిగాలుగా వ్యాపిస్తేగాని 
వణుకుతున్న చేతులతో 
ముఖాన్ని తడిమిన 
మట్టి ఆత్మీయత 
అర్ధం కాదు... 
మనది కాని 
ఒక శబ్ద ప్రపంచం 
మన భాషయ్యాక 
పోగొట్టుకున్న 
పలకరింపుల ఆర్తి వెనుక 
అనుబంధాల గాద్గదిగత 
వినపడదు.. 
ఎన్ని ముఖాల చిరునవ్వులు 
ఎన్ని చేతుల స్పర్శలు 
ఎన్ని కంఠస్వరాల ఆర్ద్రతలు
దేన్నీ సంభాషించలేని 
“హలో” లుగా ముగిసిపోయాయో .. 
చేతుల్లోంచి 
చివరిగా జారిపోయిన 
ఇసుకరేణువు గరుగ్గా తగిలినప్పుడు 
కానీ తెలియలేదు.. 
ఇప్పుడు అంతా మాయమైనట్టే 
ఉంటుంది.. 
అన్నీ కనబడకుండా పోయినట్లే 
ఉంటాయి .. 
మళ్ళి మఖ్ మల్ తెరలు 
గరగరలాడుతూ
పైకిలేచినప్పుడు గానీ 
అర్ధం కాదు 
నాటకం కొత్త అంకం మొదలైందని...!!

కన్నీటిని రెప్పల మాటున దాచి విదేశాలలో బ్రతుకుతున్న సన్నిహితులకు నా ఈ అక్షరాలు అంకితం...

Written by : Bobby Nani

Wednesday, May 10, 2017

//// “హంస యాన” \\\\



//// “హంస యాన” \\\\


అధరం సుధా మధురం... సదా “అమృత” తుల్యం.. 
నీ కన్నుల వెలుతురులో .... నే
కన్నులు తెరిచాను...!!
కన్నులు తెరిచి నేనిది .... భూ 
లోకమనే మరిచాను..!!
నీ “అమృత” అధరములను జిహ్వతో స్పృశించినాను..
నను నేనే మరిచినాను..!!
మరచి ఇంద్రలోక సుధా 
మాధురిలో నిలిచినాను.. !!
ఓ హరిత నేత్రములు కలదానా ..
వింటున్నావా ..??
ప్రేమ రసవృష్టి కురిపింతువని ఆశించి
నా హృదయ క్షేత్రాన చల్లితిని 
మంజులాశయ బీజముల నెన్నో.. నెన్నింటినో.. !! 
ఈ ప్రవాసపుట వర్షమును కడతేర్చవే .. !!
విడిపోని నీ వలపు బిగుతు కౌగిళ్ళలో నను బంధించి,
రసరాగ, మధుర స్వర్గము ప్రసాదింతువని 
దేవతలా కాదు..... 
నా రతీదేవి లా నిను కొల్చితిని..
ఎడబాటు నరకాన పడియుంటిని.. 
నీ చేతి ఆపాదమస్తక చుంబన అధర స్పర్శలతో 
ఈ విరహపు సంకెళ్ళను విడిపింపుమా.. !! 
నీ అందియల గల గలలు
నీ గాజుల జల జల లు 
నీ చకోర నడక చప్పుళ్ళు 
విని ఎన్ని దినాలైనదో .. !!
కళ్ళలోనే నీ జ్ఞాపకాలు నిలుపుకొంటిని సఖీ.. 
బేగిరావే నా చెంతకు.. ఓ “హంస యాన”.. !!
కల్పించి వ్రాసినది కాదీ కావ్యమ్ము.. 
కాలిపోయే గుండె జాలి మొరలే ప్రియా..!! 
పిల్ల గాలిసోకి ఎర్రబడే నీ,
చెక్కిలి సాక్షిగా 
నీ శృంగార నడుమును విల్లుఁగ జేసి.. 
యౌవన కన్నె ప్రాయములను శరముగా మార్చి 
సంధిస్తున్నా నిదిగో సరస శృంగార రసాస్వాదామృతం .. !!! 

Written by : Bobby Nani

Tuesday, May 9, 2017

\\\\ మా నెల్లూరును తాకిన పరామృతము ////



\\\\ మా నెల్లూరును తాకిన పరామృతము ////
*********************************


అబ్బా ఎన్ని పెర్ఫ్యూమ్ లో తడిస్తే వస్తుంది ఈ కమ్మటి మట్టి వాసన.. 
ఘర్మజలాభిషేకములతో 
సతమతమవుతున్న ఓ రిక్షా వాలాను జూచి 
ఆకాశం ఓ పథకం వేసింది..!!
భానుడను దాచేసిన 
మేఘాలు ధగ, ధగ మనే మెరుపులతో, 
వెన్నంటే వచ్చే ఢమ, ఢమమనే ఉరుములతో, 
తమ విజయ గర్వాన్ని ప్రదర్శిస్తున్నాయి... !!
శ్రమ జీవుడు పడే చెమట చుక్కలకు 
ఆకాశం కరిగి తన కన్నీటిని జోరుమని విదిల్చింది..!! 
పుడమితల్లి తడిచి ముద్దైంది .. !!
శ్రమ జీవుని చెమట వర్షపు ఝల్లులకు 
నీరుగార్చింది.. !!
అప్పుడే ..!
అప్పుడే ..!
భూమిపై మానవుడు సృష్టించలేని 
కమ్మని పెర్ఫ్యూమ్ 
హు..మ్ ....హు...మ్ 
అంటూ పీలుస్తున్న చల్లని పిల్లగాలిలో 
మిళితమై నాశికా రంద్రాలకు మత్తుగా తాకింది. ..!!
ఇంకేముంది ?
ఒళ్ళు ఝల్లుమని పులకరించింది..!
పెదవులు నవ్వులను చిందించాయి.. !
కాళ్ళక్రిందకు ప్రవాహము తానె కదలి వచ్చేను..! 
పిల్లల కాగితపు పడవల అల్లరి స్వయముగా నడిచి వచ్చేను .. !
ఆవిరైన ఊట బావులలో, 
గిలక చప్పుళ్ళు మొదలయ్యేను.. !!
జోడేద్దుల గజ్జెల చప్పుళ్ళు విరిసేను..!! 
మట్టిలోకి మెత్తగా నాగలి చొచ్చుకుపోయే..!! 
పచ్చని పైరు తివారీగా మారే ..!! 
మలయమారుతపు పిల్ల తెమ్మెరలకు..!!
పైరు లయబద్దంగా నర్తిస్తోంది.. ఆ 
కదలికల్లోని నయగారాల ఒంపు సొంపులను జూచి 
శ్రామికుని కళ్ళలో ఆనంద సంకేత కన్నీరు 
జల జలమని రాలేను ..!!
అందరి ఆకలి తీరేను .. !!!

Written by : Bobby Nani

//// నా ఆరోవేలు \\\\



//// నా ఆరోవేలు \\\\
***************


నా చేతికి వున్నవి ఆరువేళ్ళు 
ఆరోవేలికి గోరు లేదు..! 
అయిదు వేళ్ళు ముడుచుకున్నప్పుడే 
ఆరోవేలు కదులుతుంది...! 
దానికి 
కేశనాళాలు లేవు..!
రక్త ప్రసరణ జరగదు..! 
దానిలో
భావపాదం పరుగులు తీస్తుంటుంది..!
ఆవేశపు విధ్యుత్తు 
అక్షరావిరులను ఎగజిమ్ముతుంటుంది..! 
కాగితం దాని క్షేత్రం.. 
కావ్యం దాని గోత్రం..
అది 
రక్త బీజాలను నాటుతుంది..!
ఎర్రపూల మొక్కలుగా మొలిపిస్తుంది..!
అగ్నిఫలాలను కాయిస్తుంది...!
రక్తమనే నా సిరా తో, 
లక్ష మస్తిష్కాలకు ప్రకంపనలను తెప్పిస్తుంది.. !
అప్పుడప్పుడూ అది 
నా చేతినుంచి విడిపోతుంది..! 
నా జేబు గుండెల్లో ఇమిడిపోతుంది..! 
అక్కడ 
ఆ ప్రాణంలేని నా వేలిలో 
ఈ ప్రపంచం గుండె విశ్రాంతిగొంటుంది..! 
అది నా కలం..!
అదే నాకున్న బలం..! 
మరో ప్రపంచానికదే మూలం.. !!
నా రక్తం ఆవిరయ్యే వరకు ఈ కలం నర్తిస్తూనే ఉంటుంది.. !!!

Written by : Bobby Nani

Thursday, May 4, 2017

//// భారతమ్మ ప్రసవవేదన \\\\



//// భారతమ్మ ప్రసవవేదన \\\\
***********************


అలసిన కళ్ళు అద్ది, 
పుండైన కాళ్ళు కడిగి,
బడలిన ఒళ్ళు రుద్ది, 
“భారతదేశ”మనే ఓ పుణ్యస్త్రీ 
అభ్యంగనస్నాన మాచరిస్తూ వుంది..!!
ఊచల్లోంచి చూడొద్దు..
ఊచల్లోపల ఉండొద్దు.. 

“సమ్మెల” తలనీళ్ళు ఒత్తి, 
“తగాదాల” తడివొళ్ళు తుడిచి,
“వివాదాల” చేతులు విదిల్చి 
“భారతదేశ”మనే మంగళాంగిణి 
కోక మార్చుకుంటూ వుంది..!!
అటు తిరగొద్దు ..
ఆ వైపు లేకుండా పోవద్దు..

ఎండే “పొలాల పెదవులు” తడిసి 
తడబడే అడుగులు నిలిపి 
గర్భంలో పంటల కాంతులు దాల్చి 
“భారతదేశ”మనే పవిత్రాత్మ 
సిగ్గు శరీరంలో అదుముకుంది.. !!
నవ్వొద్దు..
నవ్వులపాలు కావద్దు..

“కాశ్మీర” ముఖం చిట్లించి.. 
“ఉత్తరప్రదేశ్” కంఠం ఉబ్బించి..
“బీహార్, బెంగాల్” చేతులు బిగపట్టి 
“ఆంధ్ర, తెలంగాణా” ఉదరమును నొక్కుతూ.. 
“కేరళ, తమిళనాడు” నిగిడ్చిన కాళ్ళు పగలదీసి..
“భారతదేశ”మను ఓ గర్భిణీ స్త్రీ 
ప్రసవవేదన పడుతూ వుంది.. !!
పరాచికాలు ఆడొద్దు.. 
పరాభవం పొందోద్దు..

“దారిద్ర్యం” ఒళ్ళు తిమ్మిరెక్కి 
“కుల, మతాల” రక్త నాళాలు మంటపుట్టి 
“అసహనం, అశాంతి” నరాలు పోటెత్తి
అల్లాడిన పుత్రవతి 
కొత్త నెత్తురు పట్టి 
గుండె ఊటలు పుట్టి 
ఆనందంలో పరవశించింది..!!
మోసం చెయ్యొద్దు.. 
మోసమై పోవద్దు.. 

“భారతదేశము” పచ్చి బాలింత 
తీసుకురండి 
సహనము, శాంతియను పళ్ళూ, పుష్పాదులు..! 
ధర్మం, న్యాయమను పసుపు, కుంకుమలు.. !
స్వతంత్ర భారతికి 
కట్టండి నీతి భవనాలు, నిజాయితీ తోరణాలు.. 
నాటండి సమైక్య బీజాలు, స్వేచ్ఛాంకురాలు ..
వెలిగించండి సహజీవన దీపాలు, సామాన్యుల జీవితాలు.. 

ఆకలైన పసితండ్రి 
ఆక్రందనలు విన్నారా..??
ఆనందంతో పిచ్చి కన్న
కేరింతలు చూశారా ??

ఈ శబ్దం హిమగిరి ఒడిలో జారి
వింధ్య చెక్కిలి తాకి 
తూర్పు పడమర కనుమల్లో 
మార్మ్రోగుతూ వుంది.. 

ఈ శబ్దం 
కృష్ణ నుంచి యమునకు
గంగానుంచి గోదావరికి 
తుంగభద్ర నుంచి కావేరికి 
బ్రహ్మపుత్ర నుంచి పెన్నకు ప్రాకి 
నాల్గు దశల్లో తీరాల్లో 
సముద్ర ఘోషా శంఖంలో 
ప్రతిధ్వనిస్తూ ఉంది.. 

ఈ శబ్దం 
సింధూ లోయలో మొలచి 
గంగ మైదానంలో పండి 
డక్కను పీఠభూమిలో మర్పిడై 
దేశమంతా పాతరయింది .. 

ఈ శబ్దం కుంభవృష్టిగా కురిసి 
చెత్తా, చెదారం
ఆకులు, అలములు తోసుకుపోతే 
దేశమంతా తోమిన రాగిపత్ర వలె 
తళ, తళమని అగుపించాలి 
గొంగళి సీతకోకలా మారాలి.. !!

ఆ ధ్వని ఆర్తుల గుండె ధ్వనై మారాలి..!!
ఆ శబ్దం చైతన్య పునఃప్రారంభమై మారాలి..!! 

Written by : Bobby Nani

Wednesday, May 3, 2017

\\\ మన “బాహుబలి” లు.. ///



\\\ మన “బాహుబలి” లు.. ///
*********************


“బాహుబలి” భారతీయ చలనచిత్ర రంగంలో ఓ నూతన అధ్యాయం... 
ఇది చిత్రం కాదు “చరిత్ర” ... తెలుగు వాడు దద్దోజన భోజనప్రియుడు కాదని, కారాడని “ఇషయం” ఉన్నోడని యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా, ప్రతీ తెలుగువాడు రొమ్మువిరిచి గర్వించేలా, అవే సోది కథలు, అవే సోది ప్రేమ కథలు, అవే సోది చిత్రాలను తీస్తున్న దర్శకులకు ఓ చెంపపెట్టుగా రాజమౌళి గారి మెదడులో ఊపిరి పోసుకొని మన ముందుకు వచ్చిన ఈ చిత్రం మీతోపాటు నాకు మిక్కిలి ఆనందదాయకం... 


“బాహుబలి” అంటే ప్రజల అవసరాలను తీర్చేవాడు అని అర్ధం.. అలాంటి అవసరాలను మనం పక్క దిగిన దగ్గరనుంచి పాన్పు ఎక్కేదాకా ఎంతమంది బాహుబలి గా మారి మన అవసరాలను తీరుస్తున్నారో తెలుసా.. ?? అసలెప్పుడైనా వారి గురించి ఏకాంతంలో అయినా ఆలోచించామా.. ?? ఆ కనిపించని బాహుబలి ల గురించి ఓ సారి తెలుసుకుందాం.. 


మనం లేవగానే చేతిలో “టీ” లేదా “కాఫీ” ఉండాలి.. 
నువ్వు కళ్ళు తెరవగానే నీ దగ్గరకు రావడానికి అక్కడ ఓ బాహుబలి తన నిద్రను పక్కనపెట్టి పొద్దు పొడవక ముందే వచ్చి తన భాద్యత తను నిర్వర్తిస్తున్నాడు.. అందుకే మనం కళ్ళు తెరిచే సమయానికి మన చేతిలో వేడి వేడి “కాఫీ” ఉంటుంది..


ఎక్కడో భూ అడుగుభాగంలో ఉన్న నీరుని పై అంతస్తులో వున్న కోళాయిలోకి మనం సుకుమారంగా అలా తిప్పగానే ఎలా వస్తున్నాయి.. 
అక్కడనుంచి ఇక్కడ దాకా ఈ నీరు ప్రవహించడానికి ఎందరు బాహుబలి లు శ్రమ చేసి స్వేదం చిందించి ఉంటారో తెలుసా.. ??ఎప్పుడైనా ఆలోచించావా ?? 


రంగు రంగుల వస్త్రములు, నూతన వస్త్రములు, నలగని వస్త్రములు వేసుకుంటున్నాం.. 
వాటి వెనక ఎందరి బాహుబలి ల నలిగిన కష్టం ఉంటుందో తెలుసా.. ?? రంగు బాలేదని పక్కన పడేస్తాం.. ఎందుకంటె నిమిషాలలో డబ్బు పెట్టి కొన్నాము కదా.. ఆ కష్టం మనకు తెలియదు.. నువ్వు ప్రక్కన పారేసేది వస్త్రాన్ని కాదు కష్టపడి చేసే ఓ బాహుబలి శ్రమను.. 
నువ్వు తినే ధాన్యపు గింజలు కష్టపడి సంపాదించావ్ అని సంబరపడుతుంటావ్.. నీది కష్టమా ?? 
ఈతముల్లు వంటి చేలలో చెప్పులు లేకుండా విత్తు నాటకముందు నుంచి కోత కోసి గింజ తీసేవరకు రైతు పడ్డ కష్టం వుంది చూసావా అది కష్టం అంటే.. వాన కోసం నింగిని, మొలక కోసం పుడమిని కళ్ళు కాయలు కాచేలా చూస్తాడు ఈ బాహుబలి ... చినుకు చిందేదెలా, నేల తడిచే దెలా, కడుపు నిండే దెలా అని నిరంతరం ప్రాకులాడుతూ తన కన్నీటితో పండించి మనకు పంపుతున్నాడయ్యా రైతు.. అది కష్టం అంటే..


ఇలా ఒకటా రెండా మనం వాడే చెప్పుల దగ్గరనుంచి నెత్తికి పులుముకునే “బ్రిల్” క్రీముల వరకు ఎందరో బాహుబలి లు వారి శ్రమను మనకోసం వెచ్చిస్తూనే ఉన్నారు.. నిరంతరం వారి భాద్యతను నిర్వర్తిస్తూనే ఉన్నారు.. అలాంటివారు మచ్చుకి సైతం మనకు గుర్తుండరు కాదు కదా.. గుర్తుకు రారు కూడా.. ఎందుకంటె ధనం తో వారి శ్రమకు మనం ఏనాడో విలువ కట్టేశాం కదా.. 


నిజమైన బాహుబలి లను ఎలానో బ్రతికించలేం .. కనీసం వారి శ్రమను అయినా గుర్తిద్దాం.. 
కాలు కదపకుండా నోటి దగ్గరకు అన్ని తెచ్చి పెడుతున్న ఈ బాహుబలి లకు నా పాదాభివందనం __/\__
మీరు లేనిదే మేము లేము.. సాహోరే బాహుబలి సాహో..

Written by : Bobby Nani

Monday, May 1, 2017

తుమ్మెదల అనుషంగము...



శృంగారం అనేది తప్పుకాదు.. విచ్చలివిడి శృంగారమే తప్పు.. ఇది ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే ఓ మధుర ఘట్టం... “చిత్రిణీ” జాతి స్త్రీ అయిన ఓ కన్నెతనాన్ని “శశ జాతి” పురుషుడు అయిన ఓ పుంగవుడు ఎలా అందుకుంటున్నాడో చుడండి.. 

తుమ్మెదల అనుషంగము
*******************


తుమ్మెదలు బారులు తీస్తున్నాయి .. నీ 
పెదవి కొసల జాలువారు మధువును జుర్రుకొనుటకై .. !!
సంపెంగెలు తహతహలాడుతున్నాయి.. నీ 
ఊరువులపై తకదిమ్మి, తద్దిమ్మి, దిమిదిమ్మియను 
ముద్దుల మర్దనలు గావించేందుకు...!!
పిల్లగాలి పై పైకి ఎగబాకుతోంది.. నీ 
బిగుతు పరువాలను ఆపాదమస్తకం స్ప్రుసించడానికి..!!
మయూరము మూతి ముడుచుకు కూర్చుంది.. నీ 
కురుల పించపు సొగసు భూషణములకు..!!
కుసుమములు కలవరుతున్నాయి.. నీ 
చెక్కిలినంటిన మెత్తని ప్రత్తి పింజెల సొగసులకు.. !! 
అందమంటే నీదేనే జాణ.. 
ఆ పెదవుల మధురిమలు.. 
ఆ నేత్రత్రయములు..
ఆ నెమలి కంఠపు సవరదనములు.. 
ఆ లలాట లావణ్యములు..
ఆ కనుబొమ్మల కౌశికాయుధములు.. 
ఆహా సఖీ .. 
మతుండే చేశాడో .. లేక 
మత్తెక్కి చేసాడో ఆ ఆదికవి ..
నీ కళ్ళలో కన్నె రసము స్రవిస్తుంది.. 
పెదవులలో ద్రాక్షరసం కారుతోంది.. 
మెడ వంపులలో అమృతరసం కురుస్తోంది..
నడుమొంపులలో నవనీతము ఊరుతోంది ..
మధుర పానీయ ఫలములు నీ 
చెంతనే దాచి పెట్టుకుంటివే చెలి.. 
ఎద పూ బంతులపై నేరేడుల నయగారములు..
మర్కములపై ఇసుకతిన్నెల సౌందర్యములు..
వెన్నుపై యెవ్వన నాగ భంగిమలు.. 
బాహువులపై సౌష్ఠవసరాగములు .. 
నడుము మధ్యన లోతే తెలియని శృంగార నాబీయము.. 
చిగురుటాకై ముడుచుకునే కన్నె పూ రెమ్మల తన్మయత్వము..
అబ్బో సఖీ ఇక తాలలేనే .. 
వెచ్చని కౌగిళ్ళ మధురిమల నడుమన 
సరస సయ్యాటల సమర ఖేళిలో 
పూరించుతున్నానిదిగో శృంగార యుద్ధ సంకేతనం .. 
రసోద్బవ సరస మధురిమల పరిష్వంగములలో... 
మూల్గుల నిట్టూర్పులతో.. 
నలిగిపోమా.. 
స్వేదములతో తడిచిపోమా.. 
శ్వాసలతో ఒక్కటై పోమా.. 
ద్విశరీరాలతో సమిష్టిమై పోమా..

Written by : Bobby Nani

కార్మిక, కర్షక సోదరులకు "మేడే" శుభాకాంక్షలు...



ఎండ తీవ్రత చాలా ఎక్కువగా వుంది... బైక్ లో వెళ్తూ వున్నాను ....

ఇంట్లో బైక్ ఎక్కిన దగ్గరనుంచి ఈ ఎండ తీవ్రతను తలుచుకుంటూనే చిరాకు పడుతూనే వస్తూ వున్నాను... మెదడులో ఒకటే ఆలోచన త్వరగా వెళ్లిపోవాలి అని .. 

అబ్బా నా వల్ల కావట్లేదు అనుకొంటూ వస్తున్న నాకు ట్రాఫిక్ స్థంబించడం మరో గుదిబండలా గోచరించింది... చచ్చానురా దేవుడా..!! అంటూ ఒకచెట్టు కనపడితే అక్కడ బండి ఆపి సేద తీర్చుకుంటూ వుండగా నా కళ్ళకు ఒక దృశ్యం కనిపించింది...

అక్కడ కొత్త బిల్డింగ్ ఒకటి కడుతూ వున్నారు... ఎందరో “కార్మిక సోదరులు” మండుటెండలో ఎంతో శ్రమ చేస్తూ కనిపించారు...వాళ్ళ వంటిమీద స్వేదం నది ప్రవాహమై పరువల్లు తొక్కుతున్నట్లు గా వుంది... అంతే ఒక్కసారిగా నా మీద నాకే అసహ్యం కలిగింది... 

ఇందాక నేను ఇలా ఎందుకు ఆలోచించాను ? 
సుఖాలకు అలవాటుపడి ఇలాంటి మాటలెలా వచ్చాయి నాకు ? 

ఒకప్పుడు స్నేహితులతో కలిసి అన్నపానాదులు మరిచి మండుటెండలో క్రికెట్ ఆడేవాళ్ళం ... ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయాను అని అనుకున్నాను.... కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని మర్చేస్తుంటాయి.. కాని చిత్రమేమిటంటే మనం మారామని మనకే తెలియకపోవడం...

నా లానే మీలో కూడా కొందరు వున్నారని నాకు తెలుసు. ఎందుకంటె మనమంతా ఒక్కటే.. కాకపోతే మన పరిస్థితులు మనల్ని ఇలా సుకుమారంగా చేస్తాయి.. కాని మనం అది తొందరగా తెలుసుకోగలిగితే చాలు... 

వాళ్ళని వుద్దరించమనలేదు... 

వాళ్ళలా మీరు కష్టపడమని చెప్పట్లేదు.. 

మనపని కోసం కష్ట పడే వాళ్ళను హీనంగా చూడకండి... వాళ్ళలా మనం ఒక్క గంట కూడా కష్టపడలేం... 

వాళ్ళను మనుషుల్లా చూడండి ... 

మీరు డబ్బు ఇస్తున్నంత మాత్రాన అలా చూడటం కరెక్ట్ కాదు... 

డబ్బు అన్నిటికీ మూలంకాదు, శాశ్వతం కాదు అని గ్రహించండి ...

కష్టమేమిటో ఎరగని వాడికి సుఖం విలువ తెలియదు. నష్టమేమిటో ఎరుగని వాడికి లాభం విలువ తెలియదు. కాలమేమిటో తెలియని వాడికి జీవితం విలువ తెలియదు.

అంతా బాగానే వుంది కాని ఈ "మేడే" అంటే ఏంటి ?? ఎంతమందికి తెలుసు ?
"మేడే" అంటే ఆపదలో ఉన్నాం... రండి ...మమ్మల్ని రక్షించండి అని అర్థం...
శ్రీ శ్రీ గారు ఒకటి ఇలా అన్నారు... 

“రైతు, కూలీ రక్తం కలిస్తేనే నవ ప్రపంచం.. 
రక్తాన్ని చెమటగా మార్చి మరో ప్రపంచాన్ని బాటలు వేసే వారి ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడు” అని... అంతటి మహానుభావుడు ఒక అద్బుతమైన నిజాన్ని చాటి చెప్పాడు....

ఈ రోజు నా జీవితంలో నేను చదివి మర్చిపోయిన ఒక పేజీ ని మళ్ళి రివిజన్ చేయించారు ఈ కార్మిక సోదరులు... మీ శ్రమ అంతులేనిది, అతీతమైనది, దృఢమైనది, నిశ్చలమైంది, మీరు లేకుంటే ఈ అభివృద్దే లేదు.. ఏదన్నా ప్రమాదం జరిగితే మొదట మేమే నిలబడతాం అని గర్వంగా యావత్ ప్రపంచానికి చాటిచెప్పే మీ ధైర్యానికి, తెగింపుకు నా శిరస్సు వంచి మీకు వందనాలు తెలుపుతున్నాను...

అన్నా.. 
నీవు రాల్చే ఈ చెమట చుక్కల్లోనే 
ఈ రంగురంగుల నిర్మాణ సౌధాలు వెలిశాయి .. 
నీ త్యాగం అనిర్వచనీయము..
నీ కృషి అజరామరం... __/\__

కార్మిక, కర్షక సోదరులకు "మేడే" శుభాకాంక్షలు...

Written by : Bobby Nani