Friday, April 14, 2017

SOCOTRA (The Mysterious Island) from Bobby... 15th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

అక్కడకు వెళ్ళగానే చాలా ఆశ్చర్యం కలిగింది .. ఆ ఆకుపచ్చని కాంతి ఒక వలయంలా ఉంది … ఆ వలయంలో శ్వేతవర్ణము గల రెండు చేపలు తిరుగుతూ ఉన్నాయి …. ఇక నాకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అనిపించి తిరిగి వచ్చేసాను.. అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను.. ఏదో శక్తి అక్కడ వుంది అని మాత్రం చెప్పగలను.. ఆ శక్తే ఈ “చంద్రిక కొలను”కు కేంద్ర బిందువు.. ఆ రెండు చేపలు మామూలు చేపలు లా లేవు.. పైన చంద్రుని కాంతి అంత లోతులో వున్న ఆ చేపలపై పడుతోంది.. మరో విషయం ఏంటంటే ఆ చేపలకు వయస్సు నాకు తెలిసి శతాబ్దాలు ఉండొచ్చు… ఇక ఈ విషయం మనం ఇంతటితో మర్చిపోదాం.. ఆ రహస్యాన్ని అలానే ఉంచేద్దాం.. మనవల్ల అది మరొకరికి తెలిసి ఈ అద్బుతమైన కొలనుకు ఆటంకం కలగటం నాకు ఇష్టం లేదు అని ఆ పాప నాకు చెప్పింది…. అంతే కాదు … అంత లోతుకు వెళ్ళినా కూడా నేల అడుగుభాగమే తనకు కనిపించలేదని కూడా చెప్పింది…

అలా చెప్పి ఆ రోజు వేకువనే తన సాగరంలోకి వెళ్ళిపోయింది ఆ పాప .. అది జరిగిన రెండవరోజు నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఈ షిప్ లో పడేశారు.. ఇది నా జీవితం అని చెప్తుంది.. 

మరి పెళ్లి కాసేపట్లో జరుగుతుందనగా నిన్ను వీళ్ళు ఎత్తుకొచ్చారని ఇందాక చెప్పావ్.. అని ఆకాష్ అడుగుతాడు.. మొదట మీ చూపులు నాకు భయాన్ని కలిగించాయి అందుకే అలా అబద్దం చెప్పాను.. ఆడపిల్లను నా జాగ్రత్తలో నేను వుండాలి కదా అని సమాధానం ఇస్తుంది..

అంటే ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు .. అలానే ప్రియుడు కూడా లేడు ఇక మనోడు ఆకాష్ ఊరుకుంటాడా  ?? 

ఏం చేస్తాడో చూద్దాం పదండి..
15th Part
ఆకాష్ ఎరిగి గంతులేస్తున్నాడు మనసులో .. 

తన ముఖకవళికలు మార్పు చెందుతూ వుండగా ఇలా అడుగుతాడు .. 

మరి ఇప్పుడు మమ్మల్ని ఎలా నమ్మి ఇదంతా చెప్పావు.. ?? 

ఇప్పుడు మా చూపుల్లో నీకేం కనిపిస్తోంది ?? 

దానికి ఆ అమ్మాయి .. మీ మాటల్లో ధైర్యం, మీ కళ్ళల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోంది అందుకే అన్నీ మీకు వివరించాను… అని చెప్తుంది.. 


ఇందాక ఆ సాగర కూన నీకో హారం ఇచ్చిందని చెప్పావ్ ఏంటి అది.. 

దాని ప్రత్యేకత ఏంటి ?? 

ఇప్పుడు నీదగ్గర అది ఉందా.. ?? అని మోహన్ అడుగుతాడు… 

అనుకున్నా ఈ విషయాన్ని మీరు తప్పక అడుగుతారని … అని తను అంటుంది.. 

అదేంటి తన మెడలోనే వుంది కదా ఆ తాబేలు హారం అని ఆకాష్ అంటాడు.. 

తన మెడలో హారం ఉందా ?? 

ఏది ఎక్కడా ?? 

నాకు కనిపించట్లేదు.. అని మోహన్ అంటాడు.. 

ఆమె ఆశ్చర్యం తో… ఆకాష్ మీకు నా మెడలో వున్న హారం కనిపిస్తుందా ?? అని అడుగుతుంది.. 

ఆకుపచ్చని తాబేలు ఆకృతి .. 

దాని చుట్టూరు పసిడి కాంతులు వెదజల్లుతూ శఖం వంటి మీ శృంగార మెడను కౌగిలించుకొని అలసి, సొలసి మీ ఎదపై సేదతీరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది అని అంటాడు ఆకాష్.. 

ఆ మాటలకు ఆమె కళ్ళల్లో కోటి కాంతులు ఒక్కసారిగా ప్రసరించాయి.. నిన్ను వివాహమాడబోయే వాడికి మాత్రమే నీ హారం కనిపిస్తుంది అని చెప్పిన ఆ పాప మాటలు నిజమయ్యాయనే ఆనందంతో కంటినుంచి నీరు ధారలా జర జరా కారుతోంది.. 

ఆ హారం యొక్క ప్రత్యేకత గురించి ఇప్పటికైనా చెప్పండి అని మోహన్ అడుగుతాడు.. 

చెప్పకూడదు అని ఆ పాపకు మాట ఇచ్చి ఉన్నాను… అందువల్ల దానిగురించి చెప్పలేను.. సమయం వచ్చినప్పుడు ఆకాష్ కి మాత్రం తప్పకుండా చెప్తాను అని చెప్తుంది.. 

ఇక మనం యెంత మాత్రమూ, ఆలస్యం చెయ్యకూడదు ..ముందు ఇక్కడ నుంచి అందరం వెళ్లిపోవాలి అని మోహన్ అంటాడు.. అన్నదే ఆలస్యంగా ఆకాష్ తన చేతులతో ఆ అమ్మాయి చెయ్యిని పట్టుకొని ఇలారా నాతొ అంటూ ఆ గదినుంచి తీసుకెలుతుండగా … ఆ సమయంలో ఆమె అన్నిటినీ మర్చిపోయి అలా ఆకాష్ ని తన కళ్ళనిండా నింపుకొని తన వైపే చూస్తూ తన చేతి స్పర్శ తాకిడికి తన్మయత్వంతో సగం మూతపడిన రెప్పలతో ఊహల్లో మునిగిపోతుంది... 

ముందు మోహన్ చుట్టుప్రక్కలా గమనించుకుంటూ వెళ్తూ .. ఎలాగోలా ఆ నౌక అడుగుభాగంలో వున్న వారి గదిలోకి వెళ్ళిపోతారు.. 

ఆకాష్ ఆమె చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకొస్తున్న దృశ్యాన్ని చూసిన ప్రసన్నకుమార్ భాటియాకు, మిగిలిన ఆకాష్ సోదరులకు ముచ్చెమటలు పట్టాయి.. 

ఎంట్రా ఆ హడావిడి .. 

ఎవరీ అమ్మాయి ?? అంటూ ప్రశ్నలు వేస్తున్న ప్రసన్నకుమార్ భాటియాను 

అన్నీ నిదానంగా చెప్తాను ముందు అందరూ ఎవరి వస్తువులను వారు సర్దుకోండి ఇక్కడ నుంచి మనం వెంటనే బయటపడాలి అంటాడు ఆకాష్.. 

నౌక అడుగు భాగం దగ్గర గది తాళం అందించిన పిల్లాడు ఓ పడవను పెట్టుకొని సిద్దంగా ఉంటాడు.. 


అందరూ అక్కడికి చేరుకొని హడావిడి పడుతుంటే… 

మీరేమి కంగారు పడకండి… అందరూ నిద్రపోతున్నారు.. ఇప్పుడల్లా లేవరు .. 

వాళ్ళకు ఓ చేప నుంచి తయారుచేసిన రసాయనాన్ని కలిపి తాగించాను .. అదీ కాక ఈ నౌక ఆ దీవికి వెళ్ళకుండా సముద్రం మధ్య భాగానికి వెళ్ళేలా నమోదు చేసి వచ్చాను.. మనం వెంటనే ఈ పడవలో ఆ దీవికి చేరుకోవాలి రండి అంటూ ఆ పిల్లాడు అంటాడు.. 

నువ్వు గడుగ్గాయివి రా అబ్బాయ్ అంటూ ప్రసన్నకుమార్ భాటియా ప్రశంసిస్తాడు.. 

అందరూ కలిసి ఆ పడవలో “SOCOTRA (The Mysterious Island)” వైపుగా పయనిస్తారు... 


ఆకాశం వైపు ఉవ్వెత్తుగా ఎరిగిపడే కడలి కెరటాలతోనూ, 

ఆ అలల తాకిడికి చలిస్తున్న తీరం, 

ఆ పరిసరాల్లోని వనాలు, 

ఆ వనాలలోని వానరమూకల అల్లరి, 

ఆ పడవచుట్టూ వీరికోసం తిరుగాడే సొగసిరి సొరచేపలు… 

దూరాన సేద తీరుతున్న ఉప్పు నీటి ముసల్లు.. 

పడవ బోర్లా పడితే క్షణాలలో విందుభోజనం ఆరగించేందుకు సిద్దంగా ఉన్న వేల రకాల జలచరాలు వారిని సాగనంపుతున్నట్లుగా వారివెంట వస్తున్నాయి … 

నింగిన ఉన్న సూర్య భగవానుడి కిరణాలకు ప్రవాహం లా రాలుతున్న ఘర్మజలం .. 

ఇలా వారి ప్రయాణానికి ఎన్నో ఆటంకాలు కలిగిననూ వెనక్కి తిరిగి చూడకుండా నిర్విరామంగా వారి ప్రయాణాన్ని వారు కొనసాగిస్తూ వెళ్తున్నారు.. 

మరో కొంచం దూరం వారి ప్రయాణం ఉందనగా మెల్లిగా చీకటి పడుతోంది.. 

ఆ చీకటి వేళ సంద్రం మరింత భీకరంగా కనిపిస్తోంది.. 


నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకొనే వీరుని రొమ్ము పైకి, కిందకు ఎలా శ్వాసిస్తుందో అలా సముద్రం కదులుతోంది.. 

భీకర అలల ఉధృతి చంద్రున్ని అమాంతం కప్పేసి చిమ్మ చీకట్లను రేపుతోంది..

తొణకకుండా, వొణకకుండా, బెదరకుండా, అధరకుండా వారి పడవ ముందుకు సాగుతూనే వుంది..

అందరిలోనూ నిశ్శబ్దం నాట్యమాడుతోంది .. 

సముద్ర కెరట ఘోష వారిని భయబ్రాంతులకు గురిచేసి .. గమ్యం చేరుకోగలమో లేదో అనే అనుమానానికి తెరతీస్తోంది.. 

ఒక్కసారిగా పడవ భారంగా మారిపోయింది.. 

అందరి గుండెలు జారిపోయాయి.. 

హృదయం వేగం పుంజుకుంది.. 

భయం భయంగా వున్న వారికి అసలు విషయం అర్ధం అవుతుంది.. వొడ్డుకు చేరుకున్నారని.. 

ప్రక్కన వున్న మనిషి కూడా కనపడని చిమ్మ చీకటి 

ఆ చీకట్లోనే వారి వారి సామాన్లు తీసుకొని ఓ లాంతరు వెలిగించి, 

వారు వచ్చిన పడవ మరెవరైనా చూస్తారేమో అని దాన్ని పొదలు చాటున దాచి ఓ చిన్న గుడారం వేసేందుకు సిద్దమౌతారు .. 

అందరూ గుడారం పనిలో ఉండగా … లేలేత లాంతరు వెలుగుల మధ్యన ఆకాష్ తన మనసులో మాటను ఆ అమ్మాయికి చెప్పాలని అనుకుంటాడు.. 


అప్పుడు పట్టుకున్న చెయ్యి … ఇంకా విడువకుండానే వున్నాడు ఆకాష్.. 

గరుకైన ఓ మనసుపడిన మగాడి చెయ్యి కింద తన కోమలమైన ఈ సుందరాంగి చెయ్యి నలుగుతున్నందుకు ముసి ముసి నవ్వులతో … ఆ ఆనందాన్ని అనుభవిస్తూ మౌనంగా ఉండిపోయింది.. 

చెప్పడానికి ఆకాష్ కి ధైర్యం సరిపోవట్లేదు.. 

కాపాడగానే ఇలా ప్రేమించానని చెప్తే అసహ్యంగా చుస్తుందేమో అని తన భయం.. 

గొంతు సవరించుకుంటూ 

మీ … మీ … మీ కో … వి ష .. యం.. చెప్పాలి అని అంటాడు. 

ఏంటి ?? చెప్పండి అని కళ్ళు పెద్దవిగా చేస్తూ మళ్ళి ఆకాష్ ముఖములోనికి ఎప్పుడు చూస్తానో అనే ఆత్రుత తోటి చూపుల బాణాలను సందిస్తూ, కళ్ళతోటే నవ్వులు చిందిస్తూ, కోటి పున్నమి వెలుగులు ఒక్కసారిగా వికసించినట్లు అడుగుతుంది.. 

తన కళ్ళను చూడగానే టక్కున క్రిందకు దించేసి 

వామ్మో.. ఇదేంటి ఇంత పెద్దగా చూస్తోంది.. నంజుకు తినేలా వుంది అని మనసులో అనుకుంటూ నిదానంగా తన చేతిని వదిలేసి.. 

మీ …. మీ… మీ అంటూ ఉన్న ఆకాష్ ని చూసి 

ఏంటి మీ .. అని ఆ అమ్మాయి అడగగానే 

అదే మీ పేరు ఏంటి ? అని అడుగుతాడు.. 

దీనికా ఇంత నసుగుడు అని అందమైన తన పెదవులతో రెండుసార్లు అటు, ఇటు తన మూతిని తిప్పుతుంది.. 

నేను చెప్పను …. నువ్వే కనుక్కో (మనిషిని ఈడ పెట్టుకొని ఈడికి పేరు కావాలంట అని మనసులో అనుకుంటూ) అని ఓ చమత్కార బాణాన్ని వదుల్తుంది .. 

సరేలే నీ పేరు ఏదైతే ఏంటి.. నేను పిలిచేది పిలుస్తా ..!! అని ఆకాష్ అంటాడు.. 

ఇవన్ని గమనిస్తున్న ప్రసన్నకుమార్ భాటియా మిగిలిన కుమారులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకొని అన్నయ్యకు సరైన జోడి దొరికింది .. వదిన మాటకు మాట బలే ఇస్తోంది అని నవ్వుకుంటూ వుంటారు.. 

గుడారం పూర్తి అవుతుంది.. 

అందరూ తమ తమ సామాన్లు తో పడుకోవడానికి సిద్దపడుతారు … ఆకాష్ మాత్రం తన పడక సామాన్లు ఆమెకు ఇస్తాడు.. ఇద్దరూ దూరం దూరం గా ఒకరి వైపు మరొకరు తిరిగి పడుకుంటారు .. 

ఆకాష్ లో ఒకటే ఆలోచన .. ఇంత అందమైన అమ్మాయి నా చేయి పట్టుకొని నాతొ ఇంతదూరం ఇంత రాత్రివేళలో ఎలా వచ్చేసింది.. 

ఇంత నమ్మకం నాపై ఏంటి ఈమెకు .. అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ఆకాష్..

To be continued …

Written by : BOBBY

4 comments:

  1. Nice Bobby garu.but thank you ma kadani malli maa munduku techinanduku.inka continue aa or malli break istaraa.break ranivvakandi plzzzzzzz

    ReplyDelete
  2. మొత్తానికి మళ్ళీ కొనసాగిస్తున్నారు.... కథనం బావుంది

    ReplyDelete
  3. సూపర్బ్ సర్ 👌👌👌 కానీ బ్రేక్ లేకుండా ఉంటే బాగుణ్ణు అనిపించింది...

    ReplyDelete