Tuesday, April 4, 2017

ఉషఃకన్య ..



ఉషఃకన్య .. 
*********

అందమంటే నీ జాతిదేనే.. 
కళ్ళుపట్టనంత సౌందర్యం నీలో నిక్షిప్తము చేసావు...
ఏమని వర్ణించను.. ?? ఎలా వర్ణించను.. ?? 
నాటి నుంచి నేటి వరకు మీ 
“స్త్రీ” సౌందర్యాన్ని 
ఎంత వర్ణించిననూ,
ఎందరు వర్ణించిననూ,
తనివితీరని కౌతుక “మనువు”లం మేము..!!
నీకు తెలుసా ?? 
నిన్ను కూడా నీవు అంతలా చూసుకొని ఉండవు
నా అక్షరాలతో నిను నేను చూసినంతగా..!!
నీ దేహంలోని ప్రతీ అణువణువుని 
నా భావన చూసింది..!!
నే విడిచిన అక్షరం తాకింది..!!
నీకే తెలియని నీ సౌందర్యాన్ని నే చూసాను..!!
నీ ప్రతీ అణువులో అందం తొంగిచూస్తుంది.. 
ప్రతీ కదలికలో సొగసు తొణికిసలాడుతుంది..
నఖశిఖపర్యంతం నిను వర్ణించినా, 
ఇంకా కొంత మిగిలే ఉంటుంది..!!
అందమైన తెల్లని నీ 
మోము చంద్రబింబం అయితే, 
ఆ మోముకు వన్నెతెచ్చే 
మెలికలు తిరుగు నల్లని 
శిరోజాల సొగసు వాటిది...!!
చెలికాడి ముద్దుల కోసం తపించిపోయే 
ఆ మోము అర్ధ చంద్రాకారపు నుదురులా వుంది..
కనురెప్పలు కాదవి, తుమ్మెద రెక్కలు..
నేత్రాలు కాదవి, కలువ రేకులు.. 
నాసిక కాదది, దున్నే నాగలి..
నాగలి అంచున నుండు సన్నని మొన 
యువకుల హృదయక్షేత్రాలను దున్ని 
వలపులను పండిస్తోంది..!!
అధరములా అవి.. కాదు 
యెర్రని మకరందాన్ని చిమ్మే 
బంధూక పుష్పములు.. !!
కంఠమా అది.. కాదు శంఖము.. !!
ఇలా పట్ట పగ్గాలు లేని నీ అందచందాలకు 
ఉందా లేదా అని అగుపించీ అగుపించని 
అరచేతివంటి నడుము.. 
ఆభరణమై నిను మరింత సౌందర్యవతిగా చూపెడుతోంది.. !!
చూసి చూడనట్లు చూసే నీ తుంటరి చూపులు..
ఏమీ ఎరుగనట్లు ఉండే ఆ కొంటె వలపులు.. 
తాకీ తాకనట్లు మనసుని తాకే ఆ సన్నని సూచికలు..
మగఁడుల మదిలో రేగే అలజడులెన్నింటికో మూలాలు...
చూపుల విల్లును ఎక్కుపెట్టి,
కొంటె కన్నుల సన్నన రంగరించి,
బిగబట్టిన నవ్వులకు పదును బెట్టి,
విడిచిన ఆ వలపు బాణాలు,
సూటిగా నా గుండెను తాకితే.. 
విల విల్లాడెను ఈ చిట్టి హృదయం...!!
మన కలయికతో సప్తవర్ణాలు 
అసూయ పడెనే.. ఇంకా ఈ కవితలు, 
వర్ణనలు నీ పై ఎందుకు..? 
దూరాన్ని దూరం చేసిన నీ క్రీగంట చూపులు
దూరం చేసెను వేల ప్రశ్నలను..!!
చిరునవ్వుతో చెప్పెను ఎన్నో సమాధానాలు..!!
తొలి వలపులోని తియ్యనితనం తెలిపిన నీ
ప్రేమ ఇంకా నా
హృదయ లో లోతుల్లోనే పదిలంగా నిలిచి వుంది...!! ఉంటుంది....!!

Written by : Bobby Nani



2 comments:

  1. whaaaa అద్భుతం అన్నయ్య నీ వర్ణన. ...

    ReplyDelete


  2. అద్భుత మన్నయ్యా ! మీ
    సద్బుద్ధిగనన్ జిలేబి సాదర పలుకౌ !
    బుద్బుద జీవిత మందు య
    దద్బుదజమువలె గలవివి తరమగు రీతిన్ !

    జిలేబి

    ReplyDelete