Saturday, April 29, 2017

గత నిశీధము ..



ఓ మిత్రుని కోరిక మేరకు.. “మరణం ఎలా ఉంటుందో రాయమని చెప్పాడు”... కాని ఎలావుంటుందో అనే దానికన్నా ఎలా వుంటే బాగుంటుందో రాయాలనిపించింది.. దయచేసి నా గురించి అని అనుకోకుండా ఓ కవితగా చదవమని అభ్యర్ధన.. __/\__


గత నిశీధము .. 
***********


నిశ్శబ్దం భళ్ళుమంది... 
చీకటి నిగిడి ఒళ్ళు విరిచింది.. 
వెలుగు తన వెనకన నక్కి కూర్చుంది..
కోయిల గ్రొంతుక కర్ణకఠోరమై వినిపించ సాగింది..
మైళ్ళ ఆవలనున్న సంద్రపు కెరటాల భీకర 
ఘోష కర్ణమునకు తాకుతోంది.. 
విధిలించిన రెక్కల చప్పుడు భీషణమై 
భయాన్ని బంధీని చేసింది.. 
వాయువు ప్రచండమై వృక్షాలను 
ఊపి పెకలిస్తోంది.. 
నెలరేడు భీతి చెంది మేఘాల మాటుకు 
బెదరి దాక్కున్నాడు.. 
తారలు తత్తఱపడి వెల వెల బోయాయి..
నిశీధి మృత్యువు పళ్ళికిలించి 
వికటాట్టహాసము గావిస్తోంది... 
పూసిన పువ్వులకు
నవ్వులు కనుమరుగయ్యాయి.. 
నేల కంపిస్తోంది.. 
నీరు విలపిస్తోంది..
ఆకాశం బ్రద్దలౌతోంది.. 
ఎండుటాకులు బద్రము చెప్పి 
స్థానాన్ని విడిచి పరుగెడుతున్నాయి.. 
మండూకములు నాలుకలు వ్రేల్లాడదీసి 
నేలపై పడివున్నాయి.. 
గుడ్లగూబ కళ్ళుమూసి నిద్రిస్తోంది.. 
మిణుగురులు రెక్కలు రాలి ప్రాకుతున్నాయి .. 
చరుక్కు మనే కొరడాల శబ్దం..
పచ్చి నెత్తురు వాసన..
కొరడా అంచులకు వ్రేల్లాడి నేలపై రాలే 
చిక్కని రక్తపు చుక్కలు ...
ఈడుస్తున్న సంకెళ్ళ చప్పుళ్ళు..
హఠాత్తుగా
ఎవరివో అడుగుల అలికిడులు..
గుండె ఝల్లుమనేలా ఓ ఆక్రందన .. 
ఒళ్ళు జల్లుమనేలా కిర్రుమని 
తీసిన తలుపు శబ్దం.. 
హృదయపు కవాటాలను వణికించేస్తున్నాయి.. 
కనురెప్పల మాటున భయం ఆవరించింది..
భారంగా, భయంగా నయనములు తెరిచాను.. 
ఎదురుగా మృత్యువు ప్రచండమై నిలుచుంది.. 
ఆఖరి గడియలు నను చూచి వెక్కిరిస్తున్నాయి.. 
క్షణములు శరములై దూసుకొస్తున్నాయి.. 
మృత్యువు తన జూలువిదిల్చి 
అస్త్రములు నాపై సంధించెను .. 
ఆ క్షణమున నాలో 
భయము లేదు.. 
బెరుకు లేదు.. 
ఉన్నదల్లా నా చేతిలో
సిరా చుక్కలు చిందించే కలము మాత్రమే.. 
అదే నా ఆయుధం.. 
అదే నా కవచం .. 
మృత్యాస్త్రములు కలముకు వంచి 
అడలిపోయి, సడలిపోయి, వడలిపోయి..
చివరికి నా కంఠఁబందు పువ్వారుల అల్లికలై నిలిచెను.. 
మరణం నన్ను తాకింది.. 
తనలో నన్ను ఇముడ్చుకుంది... 
నే విడిచిన అక్షర శరములను తాకలేక పోయింది.. 
అక్షరాలకు “మరణమే” శరణమని నిట్టూర్చింది.. 
అవును ..
నేను గెలిచాను...నా
అక్షరం నను విజేతగా మార్చింది... 
ఇక నా అధ్యాయం ముగిసింది.. 
నిష్క్రమించాను... ఈ లోకం నుంచి 
భావాలు వెల్లువలై ప్రవహించే అనంతంలోకి..

Written by : Bobby Nani

Thursday, April 27, 2017

“అక్షర”మయ్యాను..



"మదిలోని భావాలన్నీ అక్షరాలను వరిస్తాయి…
అక్షరాలన్నీ మదిలోని భావాలను ప్రేమిస్తాయి…"

నిజమే ...

అందుకే నేను “అక్షర”మయ్యాను.. 
శబ్దం నా లక్షణం, 
పదే పదే ప్రయోగిస్తే భావం నా లక్ష్యం.. 
నా లక్షణం తోనే లక్ష్యాన్ని సాధించే మధురక్షణాన్ని.. 
లక్ష్యం నుండే నా జననం, లక్ష్యం లోకే నా పయనం.. 
విడిగా చూస్తే నా జీవితం అర క్షణం.. 
నిఘంటువులో నా లోతు అహోబిలం.. 
నా పరిధి శత సహస్ర జ్యోతిర్వర్షం.. 
శబ్దార్ధ సర్వస్వమూ నా సాక్షాత్కారం..
అరుణ కిరణపు తీక్షనాన్ని, 
ధైర్యవంతుల లక్షణాన్ని నేనే.. !
క్షరాన్ని కాదు నేనక్షరాన్ని ...!!
క్షయాన్ని కాదు నేనక్షయాన్ని..!!
శాఖా గ్రంధాలయాలలో నిక్షిప్తమైన అవక్షేపాన్ని.. 
నవీన విశ్వవిద్యాలయపు ప్రతీ ప్రశాఖలో ..
అలక్ష్యం అవుతున్న అద్బుత నిక్షేపాన్ని...
సాహితీ గావక్షకం నుండి వీక్షిస్తే విరూపాక్షుని విశ్వరూపాన్ని .. 
నా పూర్వ ప్రాభవం గత జన్మపు మోక్షం.. 
పద్యపు పల్లకీ కుదుపులకు సన్నబడిన నుడికారపు నడుమును.. 
నన్నయ నేర్పిన నడకకు, 
తిక్కన తీక్ష నినాదం తోడైతే.. 
పోతన పూసిన తేనె పూతను.. 
శ్రీనాధుని శృంగార నౌషధాన్ని నే నక్షరాన్నే.. 
విశ్వనాధుని కల్పవృక్షం కింద సేదతీరుతూ.. 
కృష్ణశాస్త్రి మందారమారుతాన్ని ఆస్వాదించే నాటికి 
నాది ఫ్రౌఢ వయస్సు.. 
లుప్త శిల్పమై జవసత్వాలుడిగిన 
నాకు తిలోదకాలిచ్చింది తెలుగు త్రిమూర్తులు.. 
వారి అంశతో దత్తాత్రేయుని రూపం వచ్చింది నాకు.. 
శ్రీ శ్రీ రాబందుల రెక్కల చప్పుడుతో నిద్ర లేచా.. 
మైలమ భీమన కలల ఖడ్గ సృష్టి చేశా.. 
దాశరధి అగ్నిధారనై రుధ్రవీణనై వినిపించా.. 
సినారె విశ్వంభరలో నక్షత్రాన్నై దారిచూపా.. 
శేషేంద్రుని శేషజ్యోత్సనై ఎర్ర కోరిక కోరా..
అంతేనా.. 
వెన్నేల్లో ఆడుకునే ఓ అందమైన ఆడపిల్లనైనాను.. 
ప్రేయసి పెదవులపై ప్రణయ వేదాన్నైనాను.. 
తాపసి ఉచ్చ్వాస, నిశ్వాసల ప్రణవ నాదాన్నైనాను...
కవి కలం పడేటి ప్రసవ వేదనని కూడా నేనే ..
ఇప్పుడు, ఇప్పుడు నే నిప్పుడు 
“నాని” నయనం తాకే ప్రతీ భావన ఘీంకారాన్నై .. 
ప్రజా విప్లవ ప్రవాహ తాలోత్తాలపు తరంగాగ్రాన్నై.. 
అక్షుబంధిత ధర్మ దేవతకు ప్రత్యక్ష సాక్షినై..నే నక్షరాన్నయ్యాను.. 
ఇప్పుడు నే ...లక్ష కోణాలతో క్షుద్ర సమాజపు పాప ప్రక్షాళనకై నడుంకట్టిన 
వజ్ర దీక్షావతరాన్ని.. 
అనుమానపు అర్ధ విజ్ఞానం కాదు నేను కోరేది.. 
పునఃపరీక్షతో పరిణతి చెందే పరిపూర్ణ జ్ఞానం..
హెచ్చుతగ్గులకై ప్రతిపాదించిన సాపేక్ష సిద్దాంతాలు 
కాదు కావాల్సింది.. 
ప్రేమపూరిత గురుకులం పొందుపరచిన తడిఆరని 
అక్షరాల ఆపేక్ష సిద్దాంతాలు.. 
అక్షరంలో అంతరిక్షాన్ని.. 
మనోంతఃరిక్షంలోని అక్షర నక్షత్రాన్ని.. 
న్యాయా న్యాయ విచక్షణని ..
విలక్షణమైన లక్షణాన్ని నేనే .. 
అందుకే “అక్షర”మయ్యాను.. !!!

Written by: Bobby Nani

Wednesday, April 26, 2017

//// ఓ మహిళా..!! “చైతన్యము” నీ చిరునామానా ?? \\\\


“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః
యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః ”

“స్త్రీ” ని గౌరవించకున్నా పర్వాలేదు.. కనీసం మనిషిగా అయినా చూద్దాం. 
మనకు రక్త మాంసాలను పంచి పెట్టింది కూడా ఓ స్త్రీ నే అన్న విషయం మనం మరువకూడదు.. 
తొమ్మిది నెలలు తన గర్భాలయంలో సంరక్షించి మనల్ని ఇంతటి వారిని చేసింది .. 
అయిననూ ఆమె అంటే లోకువ, అబల అనే చిన్న చూపు .. ఒక్కసారి చరిత్రను తిరగేస్తే ఆమె లేని అక్షరాలే ఉండవు.. అంతటి చరిత్రను సృష్టించి “సబల” గా నిరూపించి, “అబల” లా అనిగిమనిగి బ్రతకడం ఆమెలో వున్న ఔదార్యాన్ని ప్రజ్వలిమపజేస్తుంది.. ఒక్కసారి వెనక్కి వెళ్లి గతకాలపు పుటలను పరీక్షిస్తే సువర్ణాక్షరాలతో ధగ ధగమని పసిడికాంతులతో విరాజిల్లుచున్నది .. అలాంటి వారిని ఒక్కసారి స్మరించుకుంటూ నా చిరు కవిత.. 


//// ఓ మహిళా..!! “చైతన్యము” నీ చిరునామానా ?? \\\\
****************************************


నవయుగాన, యువజగాన చేతన కేతన మెత్తిన 
ఓ మహిళా ... “చైతన్యము” నీ చిరునామానా ??
కాదని అంటారా ఎవరైనా ??
యుగయుగాలుగా కరుడుకట్టిన చాదస్తభావాలు, 
దుర్మార్గుల, దుస్తంత్రుల కుటిల నీతిమార్గాలు, 
నీ అప్రతిహత, మహిమాన్విత చరితముందు బలాదూర్లు..!


“సీతవై” పత్యనురక్తవై, పవిత్ర మూర్తివై, జగన్మాతవైనావు..!
“ద్రౌపది”వై ధీర, గంభీర ముద్రవై, ధర్మా ధర్మ విదగ్ధవై జ్వలించినావు..!
“సత్య” వై అమిత పరాక్రమోపేతవై, కృష్ణమనరసింహాసనాసీనవై, 
వీర సౌందర్య వైభవోపేతవైనావు..!
“మొల్ల”వై సుమగంధాల వల్లివై, ఆంధ్రదేశ ప్రాంగణ 
రంగవల్లివై, కీర్తి కిరీటాల హరివిల్లువై విరిశావు.. !
“ఝాన్సీ లక్ష్మి”వై చరిత్ర స్థితిగతులను తిరగారాశావు..!
మానవతా కరుణాల ప్రతిబింబానివై, సేవకు నిర్వచనానివై, 
ప్రేమకు సాకారానివై “మదర్ థెరిస్సా” వై తరించావు.. !
రాజనీతి చదరంగంలో ప్రతిభాసంపద్వైభారవ విజ”ఇందిర”వై 
“భారతరత్న”వైనావు..!
సంగీత సామ్రాజ్య రసరాట్టువై, నాదబ్రహ్మోపాసన తపస్వినివై 
వాణీవీణా నిక్వాణరంజిత “సుబ్బలక్ష్మి”వై “పద్మవిభూషిణి”వై నావు..!
లలిత లావణ్య సీమలో సౌందర్య రాశివై, విశ్వ విజేతవై, 
“ఐశ్వర్య” సముపేతవై, కోట్ల జనహృదయాంక ప్రియవై, 
విశ్వగగనాన అందాల సిరులొలికించావు ..!
రసగంగవై, సోయగాల పొంగువై, సరస భారతీనర్తన పదకేళీ 
విన్యాస తరంగవై, చిర “యశస్సు”ముపార్జిత భారంగవై గణుతికెక్కావు..!
అంతరిక్షాన అలుపెరగని ప్రణయాన సాంకేతిక సమున్నత 
జ్ఞానవినీతవై “సునీత”వై విశ్వమానవ వినుత గీతివై, 
విహాయస విహారివై విస్తరించావు..!
ఆకాశమే హద్దని, ఆంక్షలే వద్దని, ఆద్యంతనభారవినీదని 
నాగరికతలోనే “నారి” అని నిరూపించినావు..!
వర్తమానానికి నిర్వచనమై, భారవిష్యత్పదార సోపానమై
సాహసమే సాకారమై, అప్రతిహతంగా సాగుతున్న నీ ప్రస్తానం..!
మా”నవ” చరిత్రలో పొందుతుంది శాశ్వత స్థానం .. !
భారవినీది ! భారవితనీది !
గమనం నీది ! గమ్యం నీది !
రాగం నీది ! వేగం నీది !
ఈ యుగం నీది ! ఈ జగం నీది !
ఓటమి ఎరుగని చరితగా, 
రసహృదయం చిందిన కవితగా, 
కాలం చెక్కిన గతిలో, సువర్ణాక్షరాలు నీ చిరునామా !
ఓ మహిళా ..! 
కాదనగలమా ..!!
ప్రోజ్వల వైభవప్రాభవాలు మరిచేమా.. !!! 


చివరగా : ఓ స్త్రీ మూర్తి కన్నీటికి కారణం ఓ మగాడే అని అంటున్నారు.. 
అదే స్త్రీ మూర్తి ఆనంద కన్నీరుకు కూడా కారణం ఓ మగాడే అని ఎవరూ గుర్తించట్లేదు ఇది శోచనీయం.. 


Written by : Bobby Nani

Saturday, April 22, 2017

//// కవీశ్వరూపం \\\\


//// కవీశ్వరూపం \\\\
****************

ఒక “కవి” కి ఉండాల్సిన విలక్షణమైన లక్షణం ఏంటో తెలుసా.. తను భరించరాని దుఃఖంలో ఉన్నా.. తన నయనాల వెంట కన్నీరు నిరంతర ధారలా ప్రవహిస్తున్నా సరే .. తన భావాలతో ఏ ఋతువులోనైనా ఆమనిని సృష్టించగలడు .. తన రాతలతో మకరందాన్ని స్రవింప జెయ్యగలడు, తన అక్షరాలతో నూతన అధ్యాయానికి తెరదించనూగలడు... అలాంటి కక్షావైక్షకుడు, సంభృతశ్రుతుడు అయిన “కవి” గురించి, తన మనస్తత్వం, తన ఆవేశం గురించి రాయాలనిపించింది. అందరిపై తన అక్షర మాలికలను కుమ్మరించే తనపైనే రాయాలని ఈ “కవి విశ్వరూపం” మీకు అందిస్తున్నాను.. 


సాధారణ మానవుడు 
స్ఫటికంలాంటివాడు 
ప్రక్క రంగులకు లోబడి 
వ్యక్తిత్వం కోల్పోతాడు
కవిని మాత్రం సూర్యునితో 
ఖచ్చితంగా పోల్చవచ్చు
ఏడు వన్నెలు జీర్ణించుకొని 
ఏకవర్ణం చిమ్ముతాడు 
తన అక్షర శరములతో.. !!
మంచుగుడ్డలు కప్పుకున్న 
మానవుల మెదళ్ళలో 
వెచ్చని కిరాణాలందించే
వాడే కవి, 
వాడే రవి...!!
అవనిలోని ప్రత్యనువూ 
కవికొక బ్రహ్మాండం 
అతనిగుండె కదుపలేని అణుశకలం
లేనే లేదు..!!
అణువులోన నిద్రించే 
అతర్జాతీయత్వాన్ని 
పనిగట్టి వీపుదట్టే 
ప్రబల దార్శినికుడు కవి.. !!
పరమాణువు ముఖములోన 
తెరుచుకునే మరణదంష్ట్రల 
మాటలతో కరిగించే 
మహా మాంత్రికుడు కవి..!!
సాటివాళ్ళు మూఢత్వపు 
సారా మైకంలో పడి 
ప్రేలుతుంటే జాగృతి.. దీ 
పాలెత్తిన వాడు కవి..!!
బురదలోన బ్రతికే ...కు 
మ్మరి పురుగుల లేవనెత్తి 
బంభారాలుగా మార్చే 
బ్రహ్మత్వం కవిలో ఉంది ..!!
చెదలు దిన్న హృదయంతో 
మసిబట్టిన మనస్సుతో 
మాటలు గిల్కేవా... 
డేనాటికి కవికాడు ..!!
పరుల బాధ తన బాధగ
పంచుకున్నవాడే కవి.. 
పరుల సుఖంలో శిరస్సు 
పైకెత్తినవాడే కవి.. !!
పుచ్చపూలు గచ్చపొదలు 
జిల్లెడులు, పల్లేరులు 
కవి కలం సోకితేనే 
కల్పవృక్షాలవుతాయి..!!
తుహినాచల శిరం నుండి 
తురగలించే జలపాతాలు 
కవి గుండెలో విధ్యుత్తును 
కల్పించక మానవు..!!
జగత్తులో ఏ మూలో 
పొగచూరిన నరజాతుల 
వీపులపై విరుగుతున్న 
వెండి కొరడా దెబ్బలతో 
కవి కళ్ళలో ఎర్రదాళ్ళు 
పొంగి ప్రవహించును ..!!
పడమటి బెహార్లు హుషారుగా 
పరచిన బంగారు వలల్లో 
పావురాళ్ళ కాళ్ళిరుక్కుంటే 
కవి గొంతుక లోయలోనుంచి 
గర్జించిన చప్పుడు ..!!
పచ్చిగడ్డిలా పెరిగిన పల్లె వాళ్ళపై 
ఆకాశంనుంచి రాకాసులు 
అగ్నివర్షం కురుస్తుంటే 
కవి శిరస్సును చీలుస్తూ 
ఎగుస్తుంది విస్పోటక ప్రతినాదం..!!
ప్రయోజనం లేకుండా పొడిచే 
పగటి చుక్కలకు 
దూరంనుంచి తో .... కాడించే 
ధూమాకేతువులకు, 
ఎవడి కాంతినో అరువు దెచ్చుకొని 
నిగనిగలాడే చంద్రబింబానికి, 
పనిలేకుండా పరిభ్రమించే 
అనంత గ్రహ గోళాలకు,
క్షణం సేపు మిడిసిపడే 
మిణుగురు పుర్వులకు, 
అకారణంగా ముఖం చిట్లించుకునే 
ఆస్తమ సంధ్యకు, 
అణువణువూ ఈ బ్రహ్మాండంలో 
వున్న జీవికీ, మృత్పిండానికి 
కర్మసాక్షి ఈ కవియే 
ఈ కవియే భారవియే...!!
ప్రణయం ఒక తుమ్మెదలా 
మనస్సులో మర్మరిస్తుంటే, 
ప్రేయసి ఒక తుమ్మెదలా 
ఎదలో కదలాడుతుంటే, 
భవిష్యత్తు ముళ్ళులేని 
ప్రసవ పథంలా కనిపిస్తే, 
బ్రతుకొక చక్రాలు లేని 
ప్రసవ రధంలా ఎదురొస్తే, 
కవిగొంతుక తేనే తేనేగా
పల్కక తప్పదు..!!
కవిలో సౌరభాలు 
రెక్కలు విప్పక తప్పదు..!!
శరన్నిశీధాలు పగళ్ళపై 
దురాక్రమణ సాగించి 
మృత్యుభాను ముడికొప్పును
జీవన పురుషుడు సడలించి 
సెలవేసిన విద్వేషాన్ని 
సౌహార్దం కత్తిరించి 
జగత్సర్ప మొక్కమాటు 
సడలిన కుబుసాన్ని విడిస్తే 
కవి హృదయం నాగస్వరమై రవలిస్తుంది.. !!
కవి గీతం రాగాంకురమై రావణిస్తుంది.. !!
పిరికితనం వారసత్వంగా 
సక్రమించిన శరణాగతుల 
పిల్లి గొంతులలో సాహస
భీషణమర్ధల ఘోషలు 
పెకలించే శంఖస్వరం..!
ఇదే కవితా స్వరూపం..!!!
ఇదే కవి విశ్వరూపం.. !!!

Written by : Bobby Nani

Friday, April 21, 2017

\\\\ విధ్యార్దుల్లారా ఆలోచించండి..////



\\\\ విధ్యార్దుల్లారా ఆలోచించండి..//// 
**************************

నాయకుల జెండాలను మోయడానికేనా విధ్యార్దులుండేది.. ?? 
కండువాలకు కానరారా విద్యార్ధులు.. 

అదేమంటే అనుభవం కావాలట.. నిజమే ఆ అనుభవం ప్రజలకేమో గాని వారికి మాత్రం చాలా అవసరం ఎలా, యెంత వెనకేసుకోవాలా అని.. 


అసలు విద్యార్ధులకు, నాయకులకు సంబంధం ఏంటి ? 


నాయకుడు వస్తే విధ్యార్దులేందుకు రోడ్లమీదకు జెండాలెత్తుకొని వస్తున్నారు.. 


అయినా వాళ్ళని అని ఏం ప్రయోజనం .. 100 పెట్రోల్ కక్కుర్తికి అరపూట ఎండలో మోటారు బైకుపై తిరిగేందుకు ఎగేసుకొని వస్తున్న నిన్ను, నీ వెనుక కూర్చున్న ఆ సన్నాసి ఫ్రెండ్ ని అనాలి ... 


నీ ఫ్రెండ్ చెప్పాడని నీవు వెళ్తావ్.. తను చెప్పాడని మరొకడు... ఇలా ఇదొక చైన్ సిస్టం లా ప్రతీ విద్యార్ధి ఇందులోకి వాడికే తెలియకుండా వస్తున్నాడు.. ఇంతకీ వాడికి అసలు నాయకుడెవరో కూడా తెలియదు.. ఎందుకొస్తున్నామో కూడా తెలియకుండా వస్తున్నారు.. 


నాయకులకు కావాల్సింది యువశక్తి .... మీరు తనవెంట వున్నారనే ధీమా ప్రజలలో కలగాలని మిమ్మల్ని వాడుకొనే అతి నీచమైన నాయకుని పన్నాగం ఇది.. 
బయటకు రండి.. 
మేల్కోండి .. 
నిజాన్ని తిలకించండి.. 
నాయకునికి జెండా పట్టే రోజులు పోవాలి.. 
యువత నాయకుడై నడవాలి.. 
వయసు మళ్ళిన ఈ ముదుసలి నాయకుల పాలనకు స్వస్తి చెప్పాలి.. 


రాజకీయ రణరంగంలో...
జిత్తుల మారి నక్కలవలె ..
రంగులు పులుముకున్న ఊసరవెల్లిల వలె..
పేద ప్రజల రక్తపు కూడు ఆరగించే సునకముల వలె. ..
బడుగు, బలహీన వర్గాల శ్రమను దోచుకునే మానవ మృగమువలె...
సంచరించుచూ, 
మా నెత్తిన ఎక్కించుకున్నందుకు మీరాడే ...
ఈ రాక్షస, రాజకీయపు మరణపు సోపాన పటములో...
పావులుగా జేర్చి వికటాట్టహాసం తో, 
వెకిలి చేష్టలతో, వికృత పనులతో..
అయిదు ఏళ్ళ పాలనను, అరుదైన రీతిలో ...
ఆశ్చర్య పరిచే విధి విధానంతో పాలించడం ...
నభూతో న భవిష్యతి ... 
ఇది మీకే సాధ్యం...

అసలు “నాయకత్వమంటే నిరంతర అబ్యాసనమే.” ఎల్లప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని ఆలోచిస్తూ నేర్చుకుంటూ నిత్య విద్యార్దివలె వేల్లెవాడే నిజమైన నాయకుడు.. 

నిరంతరం సంస్థ ప్రగతి గురించి ఆలోచిస్తూ, తన ఆలోచనలను సభ్యులకర్థమయ్యేల్లా చెప్పి, వారిని అదే విధము గా ఆలోచించేలా చేసి సంస్థను ప్రగతి పధం వైపు నడిపించడమే నాయకుడి ప్రదమ లక్షణం. 

నాయకుడు మొదట తాను మారి చూపించినతరువాత ఇతరులను అనగా అనుచరులను మారమని కోరాలి. విజయం ఏ ఒక్కరివల్లా సాధ్యం కాదు. సమిష్టి కృషివల్లే అది సాధ్యమవుతుంది. నాయకత్వ స్థాయిలో ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తించాలి. ఎంత సామర్థ్యంగల టీమ్‌ లీడరైనా సభ్యులతో కలుపుగోలుగా, స్నేహపూర్వకంగా వ్యవహరించగలగాలి. ఈ విధమైన లక్షణాలు ఉన్నవారే నాయకుడిగా ఎదగుతారు. పురోభివృద్ధికి తోడ్పడుతారు.

క్రమశిక్షణ, 
సమయపాలన, 
నిబద్ధత, 
నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో అతి ముఖ్యమైనవి. 
సమయపాలన లేని వారు విజయాలు సాధించలేరు. 
నాయకుడు పదిమందికి ప్రేరణ కలిగించేవాడై ఉండాలి. 
సానుకూల దృక్పథం అలవరుచుకోవాలి.
నాయకుడు అనేవాడు గొప్ప వ్యూహకర్తగా ఉండాలి. 
దూరదృష్టి కూడా ఉండాలి. 
సమస్యలు గుర్తించడంతోపాటు వాటిని పరిష్కరించే సమయంలో వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. 
అదే సమయంలో టీమ్‌ సభ్యుల, సహచరుల వ్యూహాలనూ కూడా పరిగణనలోకి తీసుకొని పరిశీలించి అవసరమైతే స్వీకరించాలి. 
పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి.

నాయకుడికి ఉండేటటువంటి మొదటి లక్షణము తను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉండటము, దృడ నిశ్చయంతో ముందుకు కదలటము. తను చేసే పనులు, మాట్లాడే మాటలు ఆలోచించే ఆలోచనలు అర్థవంతముగా, పదిమందికి మంచిచేసేవిగా ఉంటాయి. లక్ష్యమునకు కట్టుబడి ఉండటము అనేవి నాయకునికి ఉండే లక్షణాలు. 

ఒక ఏం.ఎల్.ఏ ఎన్నికల అప్పుడు యెంత ఖర్చు చేస్తారో ఎవరికీ లెక్కలు వుండవు..
నోట్లకట్టలకు రెక్కలు వచ్చును,...
మద్యపు సెలఏర్లు ఆవిర్భవించును ... 
సాని నెరజానులు సందెవేలకు ... 
స్థానాన్ని వదిలి సంకర జాతులతో సందడి చేసెను... 
ఓటరు, క్వార్టర్ కు, పచ్చ కాగితానికి ...
తలవొగ్గి, ఆత్మాభిమానాన్ని తాకట్టుగా చేసి... 
అయిదేళ్ళ రాక్షస పాలనకు రంకేసిన ..
ఆంబోతు వలే పచ్చ జెండా ఊపి...
ఒళ్ళు మరిచి, తనని తానే మరిచి, 
కన్నవారిని, 
కట్టుకున్న వారిని, 
కడుపునబుట్టిన వారిని, 
మరిచి,... 
రోడ్ల ప్రక్కన కుక్కల నివాస ...
స్థావరాలలోనే స్తిరపడి సుఖించగా... 
రేపనే రోజున నీకు అన్యాయం జరిగిన నాడు... 
నీ గోడును ప్రశ్నించడానికి ...
కనీసం నీ నాలుకైనా సహకరిస్తుందా .. 
ఓ ఉమ్మెత్త వానరా .... మానరా ఈ ఎంగిలి బతుకులు... 
రాయరా సువిశాలపు భారత రాజ్యాంగపు పేజీలను 
తిరగరాయరా ...
ఆడరా కదంతొక్కి కుళ్ళు రాజకీయపు కుట్రలపై .. 
పాడరా విరహ గీతపు కౌగిలిలో నాయకులను దూర్చి... 

భాద పెట్టేవాడు, భయపెట్టేవాడు కాదురా నాయకుడంటే భరోసా ఇచ్చేవాడే నిజమైన నాయకుడు.. 


ఓ నిత్య విద్యార్ధి...

Written by : Bobby Nani

SOCOTRA (The Mysterious Island) from Bobby... 16th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

గుడారం పూర్తి అవుతుంది.. 

అందరూ తమ తమ సామాన్లు తో పడుకోవడానికి సిద్దపడుతారు … ఆకాష్ మాత్రం తన పడక సామాన్లు ఆమెకు ఇస్తాడు.. ఇద్దరూ దూరం దూరం గా ఒకరి వైపు మరొకరు తిరిగి పడుకుంటారు .. 

ఆకాష్ లో ఒకటే ఆలోచన .. ఇంత అందమైన అమ్మాయి నా చేయి పట్టుకొని నాతొ ఇంతదూరం ఇంత రాత్రివేళలో ఎలా వచ్చేసింది.. 

ఇంత నమ్మకం నాపై ఏంటి ఈమెకు .. అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ఆకాష్..

తరువాత ఏంటో చూద్దాం పదండి..
16th Part

తెల్లవారుతోంది అనగా ఒక్కసారిగా ఆ అమ్మాయి పెద్దగా గావుకేక పెడుతుంది…

ఆ దెబ్బతో అందరూ ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు… 

ఆకాష్ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి 

ఆకాష్.. ఆకాష్…. 

అంటూ ఆయాసంతో, భయంతో గుటకలు మింగుతూ, 

ముఖాన అంటిన స్వేద బిందువులను తుడుచుకుంటూ .. 

అక్కడ… అక్కడ … రక్తం.. రక్తం పారుతోంది ... 

చూడు ….. చూడు .. నా నడుముకు మొత్తం రక్తమే అంటుకుంది..నాకు భయంగా వుంది అని ఆకాష్ గుండెలపై తలఆన్చి గట్టిగా హత్తుకుంటుంది.. 

ఒక స్త్రీ తనతో ఇంత చనువుగా ఉండటం మొదటిసారి.. 

అందులోనూ నిన్న తన చేయి ముట్టుకున్నందుకే ఆ తన్మయత్వం ఇంకా వదల్లేదు.. అలాంటిది 

అపురూప సౌందర్యవతి అయిన ఓ అమ్మాయి ఏకంగా ఆకాష్ ని కౌగిలించుకొని అతని గుండెలపై తలపెట్టి వుంది ఇక అతని పరిస్థితేంకాను … 

ఆకాష్ తన చేతులతో పట్టుకుంటే బాగోదు అని గ్రహించి తనని తాను నిగ్రహించుకుంటూ ఉండగా .. 

ఆ రక్తం ఎక్కడ నుంచి వస్తుందా అని మోహన్, మరియు మిగిలినవారు కలిసి వెళ్లి చూస్తారు .. …వెళ్ళిన వారు పెద్దగా నవ్వుతూ వస్తున్నారు.. అది చూసి ఊపిరి పీల్చుకున్న ప్రసన్న కుమార్ భాటియా … ఎందుకురా అలా నవ్వుతున్నారు.. అక్కడేముంది ? అని ప్రశ్నిస్తాడు.. 

మీరే ఇటు వచ్చి చూడండి అని చిన్నోడు అంటాడు.. 

అప్పటిదాకా ఆకాష్ గుండెపై వాలి వున్న పడుచుపిల్ల ఒక్కసారిగా లేడిపిల్లలా గెంతుతూ అక్కడనుంచి వెళ్ళిపోయింది.. 

ఆకాష్ కూడా అక్కడేముందో చూడాలని అటువైపుగా వెళ్తాడు.. 

ఈ “SOCOTRA” దీవిలో అతి ముఖ్యమైన వృక్షం “డ్రాగన్ వృక్షం” గా పేరుగాంచింది … 


అది చూసేందుకు ఓ గొడుగు ఆకారంలో ఉంటుంది .. కాని దానికి గాయం తగిలితే మాత్రం దానినుంచి ఓ యెర్రని రక్తం వంటి ద్రవం నిరంతరం కారుతూనే ఉంటుంది.. అలా ఆ వృక్షంలో నుంచి కారిన ద్రవం పల్లం ఇటు వైపు ఉండటం చేత అది నేరుగా ఇటు వైపు వచ్చి ఆమెకు అంటుకొని ఉంటుంది .. అని రెండవ వాడు అయిన లోకేష్ అంటాడు.. 

కాని మోహన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తూ.. ఇలా అడుగుతాడు 

అంతా బాగానే వుంది.. కానీ ఆ వృక్షానికి గాయం ఎలా అయింది ?? అని ప్రశ్నిస్తాడు.. 

నిజమే ఈ ధోరణిలో నేను ఆలోచించనేలేదు .. అని ప్రసన్న కుమార్ భాటియా అంటాడు.. 

అనుకున్నదే తడువుగా ఆ వృక్షం దగ్గరకువెళ్ళి తీక్షణంగా పరీక్షిస్తాడు ప్రసన్న కుమార్ భాటియా .. 

ఆ వృక్షం మీద వున్న గాట్లను చూస్తుంటే జంతువుల దంతాల గుర్తులు లా లేవు, 

అలానే కొండలనుంచి జారిపడిన రాతి గుర్తుల్లా కూడా లేవు.. అని అనుకుంటూ 

మరికాస్త దగ్గరగా చూస్తూ ..ఇది ఖచ్చితంగా ఎవరో ఆటవికులు తమ కత్తితో పెట్టిన గుర్తులు అని నిర్ధారిస్తాడు.. 

ఎలా చెప్పగలరు?? అని మోహన్ మరలా ప్రశ్నిస్తాడు.. 

నేను విజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడను అని మర్చిపోతే ఎలా ?? అని చమత్కారంగా అంటూ.. 

ఇక్కడ బాగా దగ్గరగా వచ్చి చూడండి ఈ గుర్తులు వేరు వేరు ఆకారాలలో కాకుండా ఒకేలా వున్నాయి.. వ్యతిరేక దిశలో చూడండి మీకు అర్ధం అవుతుంది అని అంటూ .. ఆ గుర్తులనుండి ఓ మూడు అడుగుల పై నుంచి మీ తలను ఆ చెట్టుకు ఆనించి క్రిందకు చూడండి అని చెప్తాడు.. 

మోహన్ వెళ్లి చూడగానే నాకేమి అర్ధం కావట్లేదు .. ఏంటి ఆ గుర్తులు అని ప్రశ్నిస్తాడు.. 

ఆ గుర్తులన్నీ వారి చుట్టూవున్న పరిసరాలు, ప్రాంతాలు వారు కొత్తదారిని అన్వేషిస్తూ వచ్చినప్పుడు ఆ గుర్తులను వారు ఇలాంటి వృక్షాలపై పొందుపరుస్తారు.. ఈసారి వాళ్ళు ఇటువైపు వచ్చినప్పుడు దారి తప్పిపోకుండా అవి వారికి మార్గదర్శకాలుగా ఉంటాయి .. అంతే కాకుండా మరో తెగవారు ఇటువైపు వచ్చినా ఇక్కడ వారు వుండకూడదు ఈ ప్రాంతం మాది అనే సంకేతాలకు కూడా అవి ముఖ్య కారకాలుగా ఉంటాయి.. అందుకే వారు ఇలాంటి మార్గాన్ని అనుసరిస్తున్నారు అని ప్రసన్న కుమార్ భాటియా అంటాడు.. 

అద్బుతం అండి ప్రసన్న కుమార్ గారు అని మోహన్ ప్రశంసిస్తాడు.. 

ఒక్క విషయం అంటూ ప్రసన్న కుమార్ భాటియా మరలా మొదలు పెడతాడు.. 

ఇక్కడ ఆటవికులు ఉన్నారంటే ప్రమాదం పొంచి ఉందనే అర్ధం.. అందువల్ల మనం వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వెయ్యాలి.. అందరూ కలిసే ఉండాలి అని అంటాడు.. 

ప్రమాదం అంటే ?? ఎలాంటిది అని చిన్నోడు ప్రశ్నిస్తాడు.. 

ఇక్కడ Man Eaters అంటే మనుషుల మాంసానికి రుచిమరిగిన భయంకరమైన వ్యక్తులు కొందరు వున్నట్లు నేను విన్నాను అని ఆ పిల్లాడు అంటాడు.. 


భగవంతుడా … ఇది నిజమా ?? అని భయపడుతూ అడుగుతుంది ఆ అమ్మాయి.. 

నిజమే అని నా నౌకలోని వారు అన్నారు .. అందువల్ల మనం మరికాస్త జాగ్రత్త వహిస్తే మనకే మంచిది అని ఆ పిల్లాడు అంటాడు.. 

ఈ సాయంత్రానికల్లా మనం ఓ సురక్షితమైన ప్రాంతాన్ని వెతకాలి అని మోహన్ అంటాడు.. 

ఇక అందరూ అక్కడనుంచి “SOCOTRA” దీవిలోకి ముందుకు కదులుతారు.. 

దారి పొడవునా వింత వింత ఆకారంగల జీవులు, విచిత్రమైన వృక్షాలు దూరాన కనిపిస్తున్న ఎన్నో ఏళ్ళ సంవత్సరాలనుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి కాపలా కాస్తున్న పెద్ద పెద్ద వృద్ద పర్వతాలు… నిజంగా భూమి పైనే వున్నామా ?? లేక ఏదైనా గ్రహం మీదకు వచ్చిపడ్డామా … అనేంతలా ఉన్నటువంటి ఈ దీవిని కళ్ళు, నోరు రెండూ పెద్దవిగా చేసి చూస్తూ ముందుకు కదులుతున్నారు.. 20 మిలియన్ సంవత్సరముల వంటి చరిత్ర కలిగిన “డ్రాగన్ వృక్షాల” మధ్యన నడుచుకుంటూ వెళ్తున్నారు.. భానుడి వేడి కిరణాలను వారిపై పడకుండా ఉండేందుకు ఛత్రము వలె తెరిచి వారి తలపై పెట్టినట్లుగా కనపడుతున్నాయి ఆ వృక్షాలు.. 


ఇప్పటివరకు వారు చుసిన జీవరాసి ఒక్కటి కూడా ఇక్కడ కనిపించట్లేదు …. ప్రతీ జీవి అక్కడ ప్రత్యేకమైనదిగా, భయంకరమైనదిగా కనపడుతోంది .. 

ఏంటి ఈ ప్రాంతం ఇంత భయంకరంగా ఉంది … 

ఇలాంటి దీవిలో మనం మనుగడ సాగించగలమా ?? అని ఆకాష్ అంటాడు.. 

మనం ఈ సాయంత్రానికల్లా ఆ కనిపిస్తున్న కొండల ప్రాంతానికి కనుక చేరుకోగలిగితే అప్పుడు ఆలోచించవచ్చు.. ప్రస్తుతానికి అయితే నాకేమి అర్ధం కావట్లేదు అని మోహన్ అంటాడు.. 

మనం అనుకున్న దానికన్నా ఈ దీవి చాలా దారుణంగా ఉంది అని ప్రసన్న కుమార్ భాటియా అంటాడు.. 

అందుకే నేను వద్దు అని వారించాను అని రెండవ వాడు అయిన లోకేష్ అంటాడు.. 

అబ్బా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ?? ఇక్కడకు ఎలాగోలా వచ్చేసాం కదా.. ముందు ఇక్కడ ఎలా బ్రతకాలో ఆలోచించండి అన్నయ్యలు అని చిన్నోడు అయిన సంతోష్ అంటాడు.. 

మోహన్ అన్న చెప్పింది అక్షరాల నిజం .. 

ముందు మనం ఆ పర్వతాల దగ్గరకు వెళ్ళాలి .. అక్కడే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మా నౌక లో మాట్లాడుకునే వారు .. మనం అక్కడకు వెళ్తేనే మనకో ప్రణాళిక, మార్గం, అన్ని తెలుస్తాయి అని నౌకనుంచి వచ్చిన పిల్లాడు అంటాడు.. 

ఇక వారికి గల ఏకైక మార్గం ఆ పర్వతాల వైపుగా వెళ్ళడం.. అలానే వారి ప్రయాణం సాగుతుంది.. 

సూర్యుని ఉష్ణ తాకిడికి వారు విల విల లాడుతూ, కాళ్ళు ఈడుస్తూ, నడవలేక నడుస్తూ వెళ్తుండగా .. ఆకాష్ వద్ద గల మ్యాప్ లో కనిపించిన విధంగా అక్కడో పెద్ద రాతి గుట్ట కనిపిస్తుంది.. వెంటనే ఆకాష్ తన వద్దగల మ్యాప్ తీసి అందరికీ చూపిస్తాడు .. ఇదిగోండి ఈ మ్యాప్ లో ఉన్నట్లుగా ఆ రాతిగుట్ట అదే.. అక్కడకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దాం పదండి అని ఆకాష్ అంటాడు.. ఆకాష్ ఆ మాట అన్నదే ఆలస్యం అందరి అడుగులు అటువైపు నడిచాయి.. 

ఓ వీళ్ళు బాగా అలసిపోయినట్లు ఉన్నారే ...అని ఆకాష్ అనుకొని... తనుకూడా ఆ రాతి గుట్ట వైపుగా కదలసాగాడు.. 

ఆ రాతి గుట్ట లోపల మొత్తం సున్నపురాయితో నిర్మాణాలు చేసున్నారు.. లోపల చాలా బొరియలు ఉన్నట్లుగా అక్కడక్కడా గుంటలు ఏర్పడి వున్నాయి.. అందరూ అక్కడ వున్న ఓ పెద్ద రాతి మీదకు వచ్చి కూర్చుంటారు.. ఆ సున్నపురాతి వల్లనేమో ఆ ప్రదేశం అంతా చల్లగా ఉంది .. భానుడి ఉష్ణ తాకిడి ఆ సున్నపురాతి గుట్టను ఏమి చెయ్యలేక పోతోంది. 

ప్రసన్న కుమార్ భాటియా దృష్టి అక్కడ గోడలపై వున్న అతిపురాతన కళాఖండాలపై పడింది..వాటిదగ్గరకు వెళ్లి వాటిని చేత్తో స్పృశిస్తూ.. ఆహా యెంత అద్బుతమైన కళాఖండాలు అని అంటూ.. ఇవి నాకు తెలిసి షుమారుగా 9వ, 10వ శతాబ్దం మధ్యలో వున్నవి అనుకుంటున్నాను అని అంటాడు.. 

అవునా..!! నాన్న గారు అంటూ చిన్నోడు అయిన సంతోష్ అమితాశ్చర్యంతో దగ్గరగా వచ్చి అడుగుతాడు.. 

మనం అందరం కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఈ రాతి గుట్ట ఏంటో ఎవరికైనా తెలుసా ?? అని అందరివైపుకు తిరిగి ప్రసన్నకుమార్ భాటియా ప్రశ్నిస్తాడు … 

ఈ చుట్టూ ఉన్నవాటిని గమనిస్తే ఇదొక శిధిలమైన కట్టడంలా వుంది.. ఈ కట్టడంలో సదుపాయాల్లాంటివి నాకేమి కనపడలేదు.. అప్పట్లో పరదేశీయులు ఉండటానికో లేక వర్తకులు, అమ్మకందారులు రాత్రివేళ బసచేసి తెలవారున వెళ్లేందుకు ఏర్పాటు చేసిన కుటీరంలా నాకనిపిస్తోంది. అని మోహన్ అంటాడు.. 

అలాంటప్పుడు ఈ కళాఖండాలు ఎందుకు ఏర్పాటు చేసినట్లు ?? అని ఆకాష్ అందుకుంటాడు.. 

ఇది దీవి అని కాస్త ఆలోచించండి … చుట్టూరా నీరు వున్న ప్రాంతంలో జనాలే లేకుంటే ఈ అమ్మకందారులు, కొనుగోలుదారులు ఎక్కడనుంచి వచ్చారు అని మధ్యలోవాడు అయిన లోకేష్ ప్రశ్నిస్తాడు.. 

నిజమే లోకేష్ అని మోహన్ అంగీకరిస్తాడు.. 

ఎమ్మా నీ కేమనిపిస్తుంది అని ప్రసన్నకుమార్ భాటియా ఆ అమ్మాయిని ప్రశ్నిస్తాడు.. 

అయ్యో .. నాకేమి తెలియదండి.. నాకు బయటి ప్రపంచం గురించి తెలియదు… కాని ఈ కట్టడం నాకు కోవెలలా అనిపిస్తుంది అని చెప్తుంది.. 

కోవెల.. అంటూ అందరూ వెటకారంగా నవ్వడం ప్రారంభిస్తారు.. 

నవ్వకండి అని కోపంగా ప్రసన్నకుమార్ భాటియా అందరినీ వారిస్తాడు.. 

ఆమె చెప్పింది అక్షరాల నిజం .. అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

ఆ మాటతో ఆశ్చర్యపోయిన వారంతా ఎలా చెప్పగలిగారు అని ఆమెను ప్రశ్నిస్తారు.. 

ఏమి లేదు ఈ ప్రదేశం చూడటానికి చాలా ప్రశాంతంగా, చుట్టూరా విశాలంగా వుంది.. అదికాక సముద్రమట్టానికి చాలా ఎత్తులో వుంది..ఇక్కడనుంచి చూస్తే చూట్టూరా చాలా మైళ్ళు దూరంవరకు మొత్తం కనిపిస్తుంది.. కోవెలను ఇలానే నిర్మించేవారు నాటి రోజుల్లో .. అన్నిటికన్నా ముఖ్యం ఆ గోడలపై మన భారతదేశం యొక్క బ్రహ్మలిపి చెక్కబడి వుంది.. ఈ లిపి కేవలం పవిత్రమైన గోడలపైనే చెక్కుతారని శాస్త్రం చెప్తోంది.. కోవెల కన్నా పవిత్రత మరేమి ఉంటుంది .. ఇలా నాకు అనిపించింది అని ఆ అమ్మాయి సమాధానం ఇస్తుంది.. 


ఇవి విన్న వారంతా కళ్ళు అలానే పెద్దవి చేసి ఆమెనే చూస్తూ ఉండిపోయారు .. 

To be continued …

Written by : BOBBY

Tuesday, April 18, 2017

//// స్వప్నిక \\\\



//// స్వప్నిక \\\\
*************
అలసి తాళ వృక్షానికి తలవాల్చాను.. 
దాడి తరువాత యుద్దరంగంలా ఉంది ఆ బయలు.. 
రాత్రి తన నిశ్శబ్దపు నల్లని ముసుగు ముడతల్లో 
కప్పింది జీవరాసులను..
కానరాని చెయ్యేదో నా భుజం నొక్కినట్లు అనిపించింది..
కనురెప్పలు భారంగా ముడతలు పడుతున్నాయి.. 
ఆత్మ శృంఖలాలను తెంచుకుంది..
భూమి ఊగుతోంది..
ఆకాశం వణుకుతోంది.. 
నన్నేదో మంత్రశక్తావరించింది..
మనవుడెన్నడూ చూడని 
అందాల ఉద్యానవనంలో ఊడిపడ్డాను ..
ఆ దేవుడు పంపిన అందాల భరణిలు 
సౌందర్య రాసులు, ఆణిముత్యాల్లాటి కన్యలు 
వందలకొలది కమ్ముకున్నారు నా చుట్టూ.. 
ప్రేమ గీతాలను వల్లిస్తూ, 
తాంబూలములను నోటికందిస్తూ,
బంగారు వీణలను మీటుతూ ఉండగా 
ఇంతలో కనిపించింది అకస్మాత్తుగా 
నవరత్నాలు పోదిగించిన బంగారు సింహాసనం..
మెరిసే నగలతో శృంగారించి 
రంగు రంగుల వస్త్రాలతో 
రమణీయమైన హొయలుతో 
వచ్చి ఆసీనురాలైంది 
ఒక అందాల భరణి ఆ సింహాసనం పై.. 
అంతా నిశ్శబ్దం ..
అప్పుడు మాట్లాడింది ఆమె.. !!
“నేను స్వప్న దేవతను”
స్వప్న అనుభవాలకు రాణిని 
నిన్ను పిలిపించాను 
మానవులకు సందేశం పంపడానికి .. 
ఈ స్వప్న నగరం ఒక పెళ్ళి విడిది, 
పెళ్ళి బట్టలతోనే ప్రవేశం ఇక్కడకు 
ఈ నగరం స్వర్గతుల్యం 
“ప్రేమ” అనే దేవదూత కాపలా కాస్తుంది.. 
నుదుట ప్రేమతిలకం లేనిదే లేదు ప్రవేశం 
మీ నరులకు ఇలా చెప్పు అంటూ మొదలెట్టింది ..
“ఇక్కడ నదుల్లో అమృతం ప్రవహిస్తుంది 
పొలాల్లో బంగారం పండుతోంది 
పక్షులు ఆకాశంలో ఎగురుతూ, 
దేవదూతలతో కలిసి పాడుతాయి సంగీత గమకములు .. 
ఇక్కడి పుష్పాల సుగంధాన్ని వాళ్ళకు అందించు 
స్వప్న కుమారుడికే ఈ పసిడి తివాసి బయల్లులో ప్రవేశం 
అని చెప్పు”.. !!
మరొక్క విషయం మరవకుండా మరీ మరీ చెప్పు మనిషికి.. !!
“అందిచ్చాను మనిషికి, 
ఆనందించమని సంతోష కలశాన్ని,
మూర్ఖత్వంతో కాలదన్ని పారబోశాడు దాన్ని ...
చీకటి రక్కసులు నింపారు.. ఆ 
కలశాన్ని దుఃఖ రసంతో.. !
ఆస్వాదించాడు మనిషి దానిని ఆతృతతో ...!
మారిపోయాడు తాగుబోతుగా..!
అయ్యాడు మత్తుకు దాసుడుగా”... !!
“కలలు కనడమే దేవలోకానికి రహదారి” అంటూ 
నన్ను దగ్గరకు పిలిచి ముద్దులిచ్చి..
“స్వప్న లోకంలో కాలం గడపనివాళ్ళు 
పగటికి బానిసలని చెప్పు” అంది 
నా చెవికి దగ్గరగా వచ్చి.. 
అంతలో అందాల దేవకన్యలు 
ఒక్కొక్కరిగా బారులు తీరి పైకి వెళ్ళిపోయారు.. 
మళ్ళి భూమి ఊగినట్లు 
ఆకాశం వణికినట్లు అనిపించింది.. 
మెలుకువపోర నాపై ఉషఃకాంతులను చిలకరించింది.. 
కళ్ళు తెరవగానే 
తాటిచెట్టు క్రింద దుమ్ము ధూళిలో 
మాగంటి కునుకుతో మేలుకున్నాను.. 
చిరునవ్వుల ఉదయ కిరణాలను తిలకిస్తూ.. 
“స్వప్న లోకంలో కాలం గడపనివాడు 
పగటికి నిజంగా బానిసే” అనే మాటలు 
వెలువడ్డాయి నా పెదవుల్లో నుండి.. 

Written by : Bobby Nani

Saturday, April 15, 2017

నా చిత్రిణీ ..



నా చిత్రిణీ ..
*********

రవ్వంటి ఈ సిన్నదాని 
నవ్వులే నాకు వెలలేని సొమ్ములు..!

పసుపు రంగు కోక చుట్టి,
గులాబీ రంగు రవిక కట్టి, 
ఊపుకు తిరిగే నా చిత్రిణీ 
ఒంపు సొంపులను జూడ 
జొన్నముక్కే జివ్వు జివ్వుమనెగిరి పడే.. 
తన కంటి చూపుల్లో దాగున్న సింగారం,
వంటి చూపుల్లో నిండియున్న యౌవ్వనం, 
ఈ కొంటెగాడి గుండెల్లో ప్రవహించు రక్తాన్ని 
సలసల మనిపించు ఉరకలు వేయించు.. !!
గొంతెత్తి పాడు నీ పాటకు కోకిలలు ఆగి చూచు..
సప్త స్వరాలూ ఝురుల వలె ఉప్పొంగి 
నలుదిశల పరువు లెత్తు.. !!
నీ నోటి మాట ముత్యాల మూట 
వెదురు గోల పాట ..!!
ఊరించి ఊరించి అందాలు పంచె 
నేర్పున్న దానివే నెరజాణవే...!!
ఏది ..... ఇలా, ఓ మారు వచ్చిపోరాదు.. 
నీ యెర్రని బుగ్గలపై పూచిన కెంపులు
నా చేతులతో దాచనీవే..!!
వణికే నీ క్రింది పెదవి పైన 
ఒక్కసారి నను వెచ్చఁగ ముద్దాడ నీవే.. !!
సిగ్గేలనే ... చిత్రిణీ ... 
వాల్జడ తోడ నడుమును దాచ 
వీలను కొంటివా .. కాదది సాధ్యము..
హెచ్చిన సిగ్గుతో నీ కాళ్ళు తడబడి
విచ్చుకొనెను నీ కోక కుచ్చిళ్ళ ముడులు.. 
పాలూ నీరూ కలిసిపోవా.. 
పూవు, తావీ వేరగునా 
నీవు, నేనూ ఒకటై పోయే.. 
ఆ రోజు ఈ రోజనుకోవే చిత్రిణీ .. 

Written by : Bobby Nani

Friday, April 14, 2017

నీవు విడిచిన జ్ఞాపకాలు ...



నీవు,
నను వీడిన క్షణమున .. ప్రతీ 
క్షణమొక యుగమాయె .. 
నిశ్శబ్దం నాట్యమాడే నా 
హృదయ వేధికపై ..!!
గుండె బరువాయె.. !
అశ్రువులు నేల రాలె ..! 
గొంతు మూగబోయె .. !
చెవికి తాకిన ప్రతీ అందియల చప్పుల్లల్లో నీ 
అడుగులే వినిపిస్తున్నాయి.. !!
కనులారా గాంచిన నీ రూపమే,
కళ్ళముందు కదలాడుతోంది..!! 
నీ కురులనుంచి వెదజల్లే 
గంధపు పరిమళములే ఇంకా నా నాశికను అంటుకొని వున్నాయి.. !!
నీవు విడిచిన జ్ఞాపకాలే 
నను బ్రతికిస్తున్నాయి.. !!
అర్ధమౌతోందా నీకు.. !!
సాక్ష్యాలు చూపమంటావా .. !!
పెరట్లోని మన నవ్వుల పువ్వులు, 
నేడు ఎండుటాకులై పెళ పెళమని చప్పుడు చేస్తున్నాయి.. !!
మన అల్లరితో నిండిన వరండా, 
నేడు బూజుల ధూళితో బేవురమంటోంది..!! 
ముద్దు మురిపాలతో అలలారిన మన ఏకాంత గది 
నేడు కన్నీటితో ముద్దైన తలగడలతో బాధపడుతోంది.. !!
చిలిపిసరసాలతో నిలయమైన వంటగది 
నేడు సాలిగూడ్ల వశమైనాది .. !!
ఒకే దేహమైన మన స్నానాలగది
నేడు కన్నీటితో నిండిపోయింది.. !!
కరుణించి కదలివస్తావో ...
కారాగృహ బంధీని చేస్తావో .. 
నీ ఇష్టం.. 
ఈ విరహపు సంకెళ్ళు ఎన్నాళ్ళైనా భరిస్తా.. 
నీకై తపించే ఓ ప్రాణం ఇక్కడ మరణం అంచుల వరకు 
పురుడు పోసుకుంటూనే వుంటుంది.. !! 
గుర్తుపెట్టుకో.. 
నా మరణం ఎక్కడో లేదు.. 
నీవు విడిచే కన్నీటి బిందువులోనే ఉంది .. 
ఆ బిందువుని జారనివ్వకు .. !!!!

Written by : Bobby Nani

SOCOTRA (The Mysterious Island) from Bobby... 15th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

అక్కడకు వెళ్ళగానే చాలా ఆశ్చర్యం కలిగింది .. ఆ ఆకుపచ్చని కాంతి ఒక వలయంలా ఉంది … ఆ వలయంలో శ్వేతవర్ణము గల రెండు చేపలు తిరుగుతూ ఉన్నాయి …. ఇక నాకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అనిపించి తిరిగి వచ్చేసాను.. అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను.. ఏదో శక్తి అక్కడ వుంది అని మాత్రం చెప్పగలను.. ఆ శక్తే ఈ “చంద్రిక కొలను”కు కేంద్ర బిందువు.. ఆ రెండు చేపలు మామూలు చేపలు లా లేవు.. పైన చంద్రుని కాంతి అంత లోతులో వున్న ఆ చేపలపై పడుతోంది.. మరో విషయం ఏంటంటే ఆ చేపలకు వయస్సు నాకు తెలిసి శతాబ్దాలు ఉండొచ్చు… ఇక ఈ విషయం మనం ఇంతటితో మర్చిపోదాం.. ఆ రహస్యాన్ని అలానే ఉంచేద్దాం.. మనవల్ల అది మరొకరికి తెలిసి ఈ అద్బుతమైన కొలనుకు ఆటంకం కలగటం నాకు ఇష్టం లేదు అని ఆ పాప నాకు చెప్పింది…. అంతే కాదు … అంత లోతుకు వెళ్ళినా కూడా నేల అడుగుభాగమే తనకు కనిపించలేదని కూడా చెప్పింది…

అలా చెప్పి ఆ రోజు వేకువనే తన సాగరంలోకి వెళ్ళిపోయింది ఆ పాప .. అది జరిగిన రెండవరోజు నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఈ షిప్ లో పడేశారు.. ఇది నా జీవితం అని చెప్తుంది.. 

మరి పెళ్లి కాసేపట్లో జరుగుతుందనగా నిన్ను వీళ్ళు ఎత్తుకొచ్చారని ఇందాక చెప్పావ్.. అని ఆకాష్ అడుగుతాడు.. మొదట మీ చూపులు నాకు భయాన్ని కలిగించాయి అందుకే అలా అబద్దం చెప్పాను.. ఆడపిల్లను నా జాగ్రత్తలో నేను వుండాలి కదా అని సమాధానం ఇస్తుంది..

అంటే ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు .. అలానే ప్రియుడు కూడా లేడు ఇక మనోడు ఆకాష్ ఊరుకుంటాడా  ?? 

ఏం చేస్తాడో చూద్దాం పదండి..
15th Part
ఆకాష్ ఎరిగి గంతులేస్తున్నాడు మనసులో .. 

తన ముఖకవళికలు మార్పు చెందుతూ వుండగా ఇలా అడుగుతాడు .. 

మరి ఇప్పుడు మమ్మల్ని ఎలా నమ్మి ఇదంతా చెప్పావు.. ?? 

ఇప్పుడు మా చూపుల్లో నీకేం కనిపిస్తోంది ?? 

దానికి ఆ అమ్మాయి .. మీ మాటల్లో ధైర్యం, మీ కళ్ళల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోంది అందుకే అన్నీ మీకు వివరించాను… అని చెప్తుంది.. 


ఇందాక ఆ సాగర కూన నీకో హారం ఇచ్చిందని చెప్పావ్ ఏంటి అది.. 

దాని ప్రత్యేకత ఏంటి ?? 

ఇప్పుడు నీదగ్గర అది ఉందా.. ?? అని మోహన్ అడుగుతాడు… 

అనుకున్నా ఈ విషయాన్ని మీరు తప్పక అడుగుతారని … అని తను అంటుంది.. 

అదేంటి తన మెడలోనే వుంది కదా ఆ తాబేలు హారం అని ఆకాష్ అంటాడు.. 

తన మెడలో హారం ఉందా ?? 

ఏది ఎక్కడా ?? 

నాకు కనిపించట్లేదు.. అని మోహన్ అంటాడు.. 

ఆమె ఆశ్చర్యం తో… ఆకాష్ మీకు నా మెడలో వున్న హారం కనిపిస్తుందా ?? అని అడుగుతుంది.. 

ఆకుపచ్చని తాబేలు ఆకృతి .. 

దాని చుట్టూరు పసిడి కాంతులు వెదజల్లుతూ శఖం వంటి మీ శృంగార మెడను కౌగిలించుకొని అలసి, సొలసి మీ ఎదపై సేదతీరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది అని అంటాడు ఆకాష్.. 

ఆ మాటలకు ఆమె కళ్ళల్లో కోటి కాంతులు ఒక్కసారిగా ప్రసరించాయి.. నిన్ను వివాహమాడబోయే వాడికి మాత్రమే నీ హారం కనిపిస్తుంది అని చెప్పిన ఆ పాప మాటలు నిజమయ్యాయనే ఆనందంతో కంటినుంచి నీరు ధారలా జర జరా కారుతోంది.. 

ఆ హారం యొక్క ప్రత్యేకత గురించి ఇప్పటికైనా చెప్పండి అని మోహన్ అడుగుతాడు.. 

చెప్పకూడదు అని ఆ పాపకు మాట ఇచ్చి ఉన్నాను… అందువల్ల దానిగురించి చెప్పలేను.. సమయం వచ్చినప్పుడు ఆకాష్ కి మాత్రం తప్పకుండా చెప్తాను అని చెప్తుంది.. 

ఇక మనం యెంత మాత్రమూ, ఆలస్యం చెయ్యకూడదు ..ముందు ఇక్కడ నుంచి అందరం వెళ్లిపోవాలి అని మోహన్ అంటాడు.. అన్నదే ఆలస్యంగా ఆకాష్ తన చేతులతో ఆ అమ్మాయి చెయ్యిని పట్టుకొని ఇలారా నాతొ అంటూ ఆ గదినుంచి తీసుకెలుతుండగా … ఆ సమయంలో ఆమె అన్నిటినీ మర్చిపోయి అలా ఆకాష్ ని తన కళ్ళనిండా నింపుకొని తన వైపే చూస్తూ తన చేతి స్పర్శ తాకిడికి తన్మయత్వంతో సగం మూతపడిన రెప్పలతో ఊహల్లో మునిగిపోతుంది... 

ముందు మోహన్ చుట్టుప్రక్కలా గమనించుకుంటూ వెళ్తూ .. ఎలాగోలా ఆ నౌక అడుగుభాగంలో వున్న వారి గదిలోకి వెళ్ళిపోతారు.. 

ఆకాష్ ఆమె చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకొస్తున్న దృశ్యాన్ని చూసిన ప్రసన్నకుమార్ భాటియాకు, మిగిలిన ఆకాష్ సోదరులకు ముచ్చెమటలు పట్టాయి.. 

ఎంట్రా ఆ హడావిడి .. 

ఎవరీ అమ్మాయి ?? అంటూ ప్రశ్నలు వేస్తున్న ప్రసన్నకుమార్ భాటియాను 

అన్నీ నిదానంగా చెప్తాను ముందు అందరూ ఎవరి వస్తువులను వారు సర్దుకోండి ఇక్కడ నుంచి మనం వెంటనే బయటపడాలి అంటాడు ఆకాష్.. 

నౌక అడుగు భాగం దగ్గర గది తాళం అందించిన పిల్లాడు ఓ పడవను పెట్టుకొని సిద్దంగా ఉంటాడు.. 


అందరూ అక్కడికి చేరుకొని హడావిడి పడుతుంటే… 

మీరేమి కంగారు పడకండి… అందరూ నిద్రపోతున్నారు.. ఇప్పుడల్లా లేవరు .. 

వాళ్ళకు ఓ చేప నుంచి తయారుచేసిన రసాయనాన్ని కలిపి తాగించాను .. అదీ కాక ఈ నౌక ఆ దీవికి వెళ్ళకుండా సముద్రం మధ్య భాగానికి వెళ్ళేలా నమోదు చేసి వచ్చాను.. మనం వెంటనే ఈ పడవలో ఆ దీవికి చేరుకోవాలి రండి అంటూ ఆ పిల్లాడు అంటాడు.. 

నువ్వు గడుగ్గాయివి రా అబ్బాయ్ అంటూ ప్రసన్నకుమార్ భాటియా ప్రశంసిస్తాడు.. 

అందరూ కలిసి ఆ పడవలో “SOCOTRA (The Mysterious Island)” వైపుగా పయనిస్తారు... 


ఆకాశం వైపు ఉవ్వెత్తుగా ఎరిగిపడే కడలి కెరటాలతోనూ, 

ఆ అలల తాకిడికి చలిస్తున్న తీరం, 

ఆ పరిసరాల్లోని వనాలు, 

ఆ వనాలలోని వానరమూకల అల్లరి, 

ఆ పడవచుట్టూ వీరికోసం తిరుగాడే సొగసిరి సొరచేపలు… 

దూరాన సేద తీరుతున్న ఉప్పు నీటి ముసల్లు.. 

పడవ బోర్లా పడితే క్షణాలలో విందుభోజనం ఆరగించేందుకు సిద్దంగా ఉన్న వేల రకాల జలచరాలు వారిని సాగనంపుతున్నట్లుగా వారివెంట వస్తున్నాయి … 

నింగిన ఉన్న సూర్య భగవానుడి కిరణాలకు ప్రవాహం లా రాలుతున్న ఘర్మజలం .. 

ఇలా వారి ప్రయాణానికి ఎన్నో ఆటంకాలు కలిగిననూ వెనక్కి తిరిగి చూడకుండా నిర్విరామంగా వారి ప్రయాణాన్ని వారు కొనసాగిస్తూ వెళ్తున్నారు.. 

మరో కొంచం దూరం వారి ప్రయాణం ఉందనగా మెల్లిగా చీకటి పడుతోంది.. 

ఆ చీకటి వేళ సంద్రం మరింత భీకరంగా కనిపిస్తోంది.. 


నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకొనే వీరుని రొమ్ము పైకి, కిందకు ఎలా శ్వాసిస్తుందో అలా సముద్రం కదులుతోంది.. 

భీకర అలల ఉధృతి చంద్రున్ని అమాంతం కప్పేసి చిమ్మ చీకట్లను రేపుతోంది..

తొణకకుండా, వొణకకుండా, బెదరకుండా, అధరకుండా వారి పడవ ముందుకు సాగుతూనే వుంది..

అందరిలోనూ నిశ్శబ్దం నాట్యమాడుతోంది .. 

సముద్ర కెరట ఘోష వారిని భయబ్రాంతులకు గురిచేసి .. గమ్యం చేరుకోగలమో లేదో అనే అనుమానానికి తెరతీస్తోంది.. 

ఒక్కసారిగా పడవ భారంగా మారిపోయింది.. 

అందరి గుండెలు జారిపోయాయి.. 

హృదయం వేగం పుంజుకుంది.. 

భయం భయంగా వున్న వారికి అసలు విషయం అర్ధం అవుతుంది.. వొడ్డుకు చేరుకున్నారని.. 

ప్రక్కన వున్న మనిషి కూడా కనపడని చిమ్మ చీకటి 

ఆ చీకట్లోనే వారి వారి సామాన్లు తీసుకొని ఓ లాంతరు వెలిగించి, 

వారు వచ్చిన పడవ మరెవరైనా చూస్తారేమో అని దాన్ని పొదలు చాటున దాచి ఓ చిన్న గుడారం వేసేందుకు సిద్దమౌతారు .. 

అందరూ గుడారం పనిలో ఉండగా … లేలేత లాంతరు వెలుగుల మధ్యన ఆకాష్ తన మనసులో మాటను ఆ అమ్మాయికి చెప్పాలని అనుకుంటాడు.. 


అప్పుడు పట్టుకున్న చెయ్యి … ఇంకా విడువకుండానే వున్నాడు ఆకాష్.. 

గరుకైన ఓ మనసుపడిన మగాడి చెయ్యి కింద తన కోమలమైన ఈ సుందరాంగి చెయ్యి నలుగుతున్నందుకు ముసి ముసి నవ్వులతో … ఆ ఆనందాన్ని అనుభవిస్తూ మౌనంగా ఉండిపోయింది.. 

చెప్పడానికి ఆకాష్ కి ధైర్యం సరిపోవట్లేదు.. 

కాపాడగానే ఇలా ప్రేమించానని చెప్తే అసహ్యంగా చుస్తుందేమో అని తన భయం.. 

గొంతు సవరించుకుంటూ 

మీ … మీ … మీ కో … వి ష .. యం.. చెప్పాలి అని అంటాడు. 

ఏంటి ?? చెప్పండి అని కళ్ళు పెద్దవిగా చేస్తూ మళ్ళి ఆకాష్ ముఖములోనికి ఎప్పుడు చూస్తానో అనే ఆత్రుత తోటి చూపుల బాణాలను సందిస్తూ, కళ్ళతోటే నవ్వులు చిందిస్తూ, కోటి పున్నమి వెలుగులు ఒక్కసారిగా వికసించినట్లు అడుగుతుంది.. 

తన కళ్ళను చూడగానే టక్కున క్రిందకు దించేసి 

వామ్మో.. ఇదేంటి ఇంత పెద్దగా చూస్తోంది.. నంజుకు తినేలా వుంది అని మనసులో అనుకుంటూ నిదానంగా తన చేతిని వదిలేసి.. 

మీ …. మీ… మీ అంటూ ఉన్న ఆకాష్ ని చూసి 

ఏంటి మీ .. అని ఆ అమ్మాయి అడగగానే 

అదే మీ పేరు ఏంటి ? అని అడుగుతాడు.. 

దీనికా ఇంత నసుగుడు అని అందమైన తన పెదవులతో రెండుసార్లు అటు, ఇటు తన మూతిని తిప్పుతుంది.. 

నేను చెప్పను …. నువ్వే కనుక్కో (మనిషిని ఈడ పెట్టుకొని ఈడికి పేరు కావాలంట అని మనసులో అనుకుంటూ) అని ఓ చమత్కార బాణాన్ని వదుల్తుంది .. 

సరేలే నీ పేరు ఏదైతే ఏంటి.. నేను పిలిచేది పిలుస్తా ..!! అని ఆకాష్ అంటాడు.. 

ఇవన్ని గమనిస్తున్న ప్రసన్నకుమార్ భాటియా మిగిలిన కుమారులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకొని అన్నయ్యకు సరైన జోడి దొరికింది .. వదిన మాటకు మాట బలే ఇస్తోంది అని నవ్వుకుంటూ వుంటారు.. 

గుడారం పూర్తి అవుతుంది.. 

అందరూ తమ తమ సామాన్లు తో పడుకోవడానికి సిద్దపడుతారు … ఆకాష్ మాత్రం తన పడక సామాన్లు ఆమెకు ఇస్తాడు.. ఇద్దరూ దూరం దూరం గా ఒకరి వైపు మరొకరు తిరిగి పడుకుంటారు .. 

ఆకాష్ లో ఒకటే ఆలోచన .. ఇంత అందమైన అమ్మాయి నా చేయి పట్టుకొని నాతొ ఇంతదూరం ఇంత రాత్రివేళలో ఎలా వచ్చేసింది.. 

ఇంత నమ్మకం నాపై ఏంటి ఈమెకు .. అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ఆకాష్..

To be continued …

Written by : BOBBY

Tuesday, April 11, 2017

“పల్లె” పిలుస్తోంది..



“పల్లె” పిలుస్తోంది.. 
**************


కాటువేసే కాలుష్య సర్పం 
పచ్చదనం నాగస్వరం ముందు తలవాలుస్తుంది..! 
పర్యావరణం పరదా విప్పుకొని 
పసిమి ఛాయ ముఖంతో ఎదురొస్తోంది.. !
పల్లె శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తే,
పసిడి నవ్వుల పెదవి పేరు పేరునా పలకరిస్తుంది..!
పల్లె మన తరతరాల వారసత్వ సంపద .. !
పల్లె మన పంచప్రాణాల చెలికాడు.. !
తాటి ముంజెలా, 
చెరుకు పానకంలా,
నిమ్మపూల వాసనలా,
పల్లె నవ్వు ఎంత కమ్మగా ఉంటుంది.. !
పల్లెలో వీధి, వీధినీ కలిపే రహదారి,
మనిషినీ, మనిషినీ కలిపే కరచాలనంలా ఉంటుంది.. !
నగరమంతా తిరిగి, తిరిగి 
పలకరింపుల పరామర్శకు మొహం వాచి 
పల్లె ఒడికి చేరగానే,
పెదవి మీద గుమ్మపాల ధార కురుస్తుంది.. !!
ఉట్టిలోని వెన్నగిన్నె వీపు నిమిరుతుంది.. !!
మజ్జిగ చిలికే కవ్వం చప్పుడు గుండె సంగీతమవుతుంది..!!
పైరు సముద్రం నడుమ దీవిలా ఉంటుంది పల్లె.. !!
పాపాయి గుండె మీద పచ్చల హారంలా ఉంటుంది పల్లె.. !!
తాటాకు చాప మీద ఆరబెట్టిన మామిడి తాండ్ర తోనూ, 
అవ్వ గంపలోని ఉడకబెట్టిన చిలగడ దుంపలతోనూ, 
చూపు జతకట్టినప్పుడు.. 
పల్లె మన భుజం మీద చెయ్యేసి బాల్యంలోకి లాక్కుపోతుంది.. !!
మస్తాన్ తాత భుజం సవారీ ఇప్పటికీ గుర్తొస్తుంది.. !!
డేవిడ్ మామ సైకిల్ గంట చెవుల్లోనే కాపురముంటుంది ..!!
తాటిచెట్టు మీద కల్లు గీసే యువకుడూ,
పొలంలో నడుం వంచిన అమ్మాయీ,
కనుపాపల్లో బొమ్మల కొలువు తీరుతారు..!!
పట్టె మీదుగా కాలువ దాటుతున్న పాదాల కదలికలు.. !!
అత్యంతాద్భుత అవ్యక్తానుభూతి కావ్యాల్ని నిర్మిస్తాయి..!!
నగరంలోకి సూర్యుడు పల్లెను పలకరించే వస్తాడు.. 
వెన్నెల పల్లెలోని పడుచుపిల్ల ముక్కుపుల్లలా మెరుస్తుంది.. !!
రైల్లోనో, బస్సులోనో పల్లెను స్పృశిస్తూ పోతున్నప్పుడు, 
గొప్ప క్షణాలేవో జారిపోతున్నట్టు, 
గుండెలో గొడవ గొడవై పోతుంది..!!
మామిడి కొమ్మకు వ్రేలాడే తేనెపట్టూ, 
జామకాయను కోరికే రామచిలుకా, 
ఈతమట్ట చివరన ఊగే పిచ్చుక గూడూ,
చెంగు చెంగున గెంతే కోడెదూడా,
చేప పిల్లను వేటాడే తెల్లకొంగా, 
ఏ కుంచెకూ అందని సజీవ చిత్రాలై చూపుల్ని కట్టేస్తాయి..! 
శ్రమజీవన తాత్వికత పునాదిగా పల్లె, 
ఒక విశ్వాస ఛత్రం నీడలోకి ఆహ్వానిస్తుంది..!!


అనిర్వచనీయమైన ఆత్మీయుతా దృశ్యాల వేదిక – మన పల్లెటూరు .. !!

దేశం చుట్టూ పేరుకున్న ఓజోన్ పొర – మన పల్లెటూరు .. !!

Written by : Bobby

Sunday, April 9, 2017

"ప్రేమ" అంటే ఏంటి ??



"ప్రేమ" అంటే ఏంటి ?? 


తెలుసుకోవడం కోసం ఎంతో దూరం వెళ్లాను.. !!
ఎందరినో కలుసుకున్నాను.. !!!

అలా తెలుసుకునే మార్గ మధ్యంలో ...

ప్రేమంటే ఏమిటని ప్రశ్నించాను ??

గులాబీల వికసింపే ప్రేమయని 
ఉద్యానవనం అన్నది.. 
వసంత పర్వమే ప్రేమయని 
ఋతువు చెప్పింది.. 
పరిమళయుతము, శాశ్వతమైన పాటయే ప్రేమ అని 
కోకిల పలికింది..
నదీ ప్రవాహానికై ఆశతో ఎదురుచూసే లిల్లీయే ప్రేమని 
కడలి తెలిపింది.. 
అగ్ని స్వీకారమే ప్రేమని 
జాలరి నుడివినాడు...
మన జీవిత సౌరభమే ప్రేమని 
గాయకుడు వచించినాడు.. 
ముసుగులో సుందర దృశ్యమే ప్రేమని 
చిత్రకారుడు చెప్పినాడు.. 
దైవం ప్రసాదించిన ప్రాణాంతకమైన వరమే ప్రేమని 
ఆలోచనా పరుడైన తాత్వికుడు నిర్వచించినాడు .. 
కారగారాన్ని పుణ్యస్థలంగా భావించే చిత్రమైన ఆలోచనే ప్రేమని 
దేశభక్తుడు అన్నాడు..
మంటను చూస్తూ మరణానికి గురియయ్యే శలభమే ప్రేమని 
సాధువు పలికినాడు.. 
మరణం ఆసన్నమైనప్పుడు యౌవనుల కండగానుండు రక్షకుని చిరునవ్వే ప్రేమని 
త్యాగి ప్రవచించినాడు.. 
ఎడారి ఇసుకలో సుందరమైన అరణ్యాన్ని సృష్టించే వర్ణనే ప్రేమని 
కవి వర్ణించాడు.. 
స్వార్ధ చింతన నుంచి తప్పించుటకు స్వామి తగిలించే సంకెళ్ళే ప్రేమని 
జ్ఞాని ప్రవచించినాడు..
అనంతమైన త్యాగంతో సుందర నిర్మాణమును గావించు భగవంతుడి సమ్మేళనమే ప్రేమని 
యోగి విశదీకరించినాడు.. 
రెండు ప్రాణుల మధ్య ఏర్పడే చిరు బంధనమే ప్రేమని 
నాకు అనిపించింది... 

Written by : Bobby Nani