Wednesday, January 17, 2024

ఆమె..!!


 ఓ స్త్రీ స్థానంలో వుండి ఈ కావ్యాన్ని రాసాను.. ఎంతవరకు రాయగలిగానో నాకు తెలియదు మీరే చెప్పాలి మరి.


ఆమె..!!
*****
నా మౌనాల సూన్యాలను అర్ధం చేసుకోనక్కర్లేదు..
కనీసం నన్ను నాలా అర్ధం చేసుకుంటే చాలు..!!

నా మాటల్లోని మౌనపు శబ్దాలను
నా కదలికల్లోని నిశ్చల భావాలను
నువ్వు నిశితంగా చూడగలిగిన నాడే
నేనేంటో నీకు అర్ధం అవుతుంది..!!
అప్పటిదాకా ప్రాణం వున్న మన రెండు శవాలు
ఒకే గదిలో కలిసి జీవిస్తున్నట్లే
అయినా
బలవంతపు తప్పనిసరి తెరల వెనుక
మాటలూ, కలయికలూ,
ఎప్పుడూ అవాస్తవాలే..!
ఆస్వాదన లేని అసంపూర్ణాలే..!!

దూరంగా నెట్టివేయబడ్డ అల
తీరాన్ని తాకేందుకు పలుమార్లు
సముద్రాన్ని దాటి వచ్చినా
దానికెదురయ్యేది ఎప్పుడూ నిరాశ నిస్పృహలే..
అచ్చం నా మనసు లాగ..!!

జ్ఞాపకాల్ని వెంటాడే నా కంటి తడిని
ఏ వెలుగు చూడగలదు
గ్రహణపు చంద్రుడిలా మసకబారిన
నా కళ్ళను ఏ ఆకాశం అన్వయించగలదు..!
మొదలు, చివర లేని ఎదురుచూపులు నావి..!!

ఇన్నేళ్ళు గడిచాక
అలా ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే
కొన్ని వేల మైళ్ళు ఆవలే
నా కోసం ధ్వనించే ఒ స్వరం
అలసిన గొంతుతో ఎప్పుడో ఆగిపోయివుంది..!
ఇంకిపోయిన కన్నీటి చారకు
అటువైపున నీవు
ఇటువైపున నేను మరి..!!

కాలం చేసే కనికట్టు ఏంటో తెలుసా ?
మన ఇద్దరిమధ్యనే
గతించిన గతం,
కదులుతున్న వర్తమానం,
కనికరం లేని భవిష్యత్తు వుండమే..!!

ఎప్పుడూ అందాన్ని తడిమే ఆ చేతులు
అప్పుడప్పుడైనా అలసిన పాదాలను నొక్కితే తప్పేంటి
డబ్బిచ్చి బంగారు గాజులు కొనుక్కో అనే ఆ మనసు
చొరవగా చెయ్యిపట్టుకేల్లి మట్టిగాజులు నీ చేత్తో వేస్తే తప్పేంటి
ఇలా ప్రతీ ఆడడానికి చిన్న చిన్న కోరికలు ఎన్నో వుంటాయి
తన భర్త బాగా చదువుకున్న వాడు కాకున్నా
తన మనసు చదివితే చాలనుకుంటుంది.. !!
నేనే కాదు
ప్రతీ ఆడది కోరుకునేది ఒక్కటే
మేము బాధలో వున్నప్పుడు
మా చేతుల్ని మీ చేతుల్లోకి తీసుకొని
మెత్తగా నొక్కుతూ కల్లతోనే ఓ సైగ .. నేనున్నానంటూ..!!
అదే కదా మా ధైర్యం.. అదొక్కటి చాలదా చెప్పు..!!
అర్ధం చేసుకుంటావని ఆశిస్తూ .. !!

~ ~ త్రిశూల్ ~ ~

Mobile: 9032977985

Blog: http://bobbynani.blogspot.com/

Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr

No comments:

Post a Comment