ఈ సాయంత్రం
ఎందుకో చాలా కొత్తగా కనిపిస్తోంది..!
రాసుకున్న
ప్రేమలేఖలన్నీ గదిలో ఒక్కొక్కటిగా ఎగురుతున్నాయి
అక్షర మక్షరంగా ముద్రించిన జ్ఞాపకాల పరంపర
తరంగాలుగా తాకుతున్న తపనల మధ్యన,
ఓ అంతరంగ స్వర్గానుభూతి ఏదో
నా పెదవంచులపై మంచులా కురుస్తోంది..!
నా కళ్ళ నిండా జ్ఞాపకాల నీలి తెరలు
అల్లుకుపోతున్న ఒకనాటి
రహస్య సమాగమాల చిత్తరువులు
వాటినుంచి గుప్పున వీచే జ్ఞాపకాల పరిమళాలు..!
మనసును మెలితిప్పి మరీ వెనక్కు లాక్కెళ్తున్నాయి..!!
ఇన్నాళ్లూ దేనికోసం నీరీక్షించానో
జీవితం ఎక్కడ మొదలైందో గుర్తురావటం లేదు..
ఎన్నో ఆలోచనలతో గాలి తెరకి కదుల్తున్న
నావలా ఊగుతూ గడిచిన సంద్రంలో
జ్ఞాపకాల వర్ణాలను ఏరుకోవాలని
ప్రయత్నిస్తోందీమనసు..!!
అప్పుడే విచ్చుకుంటున్న ఆకాశంలోని నక్షత్రాలు
మిణుకు మిణుకు మంటూ నా కళ్ళ ముందు
పువ్వుల్లా వికసిస్తున్నాయి
ఎన్నాళ్ళైందో ఇలాంటి వెన్నెలను మనసారా శ్వాసించి
క్షణం కూడా విడువక కళ్ళార్పకుండా అలానే చూస్తున్నాను
మబ్బుతెర దించేసుకొని ఆకాశంలో వెలిగి వెలిగి
అలసిపోయిన తారలు మెల్లిగా నిద్రలోకి జారుకున్నాయి..!!
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985
No comments:
Post a Comment