Thursday, June 29, 2023

నా దేశం గురించి ఏంత చెప్పినా తక్కువే...


 నా దేశం గురించి ఏంత చెప్పినా తక్కువే...


ఒకప్పుడు ప్రపంచంలోని పదవ ఆర్థిక వ్యవస్థ గా వున్న నా దేశం ప్రస్తుతం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.

make in india, self reliant india అంటూ ప్రపంచపు నలుమూలలా విస్తరిస్తూ ఎన్నో దేశాలతో free trade agreement ఒప్పందాలతో శత్రు దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తూ, కంటి మీద కునుకు లేకుండా చేస్తూ, GDP 2023లో $3.75 ట్రిలియన్లకు చేరుకుని వాయువేగంతో ముందుకు దూసుకుపోతుంది.
ప్రస్తుతం విశ్వగురువు స్థానంలో నా దేశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదంతా దేశం వెలుపల చాలా బాగుంది. చూస్తుంటే చాలా గర్వంగా కూడా వుంది..

నాదేశం లోపల

చేతులు చాచి ఆకాశాన్ని చూస్తూ అర్థించడం నేను ప్రతీ రోజూ చూస్తున్నాను..

మూరెడు బట్ట కరువయ్యి అర్ధ నగ్నంగా కనిపిస్తున్న ఆడబిడ్డలను చూస్తున్నాను ..

గుప్పెడు మెతుకులకు కడుపు చేత పట్టుకొని యాచించే పసి బాల్యాన్ని చూస్తున్నాను ..

ఆకలి కేకలతో జంతువులతో కలిసి వ్యర్ధాలను తినే యౌవనాన్ని నే చూస్తున్నాను ..
ఓ పూట అన్నం కోసం గడ్డంబట్టి బతిమిలాడి వొళ్ళుఅమ్ముకునే స్త్రీ లను చూస్తున్నాను ..

దిగువ మధ్యతరగతి ఆర్ధిక బ్రతుకులు వెన్నువిరిగి ఉరితాళ్ళకు వేళ్ళాడటం నే చూస్తున్నాను ..

కార్పొరేట్ విద్య కనుచూపుమేర కనపడని నిరుపేదల మౌనాన్ని చూస్తున్నాను..

రొమ్ము తడుముకునే బిడ్డల నోట్లోకి పాలకు బదులు రక్తం రావడం నేను చూస్తున్నాను ..

ఇదంతా చూస్తూ వున్నాను చూస్తూనే వున్నాను..!!

ఒక వ్యక్తి స్పందించి ముందుకు వస్తే కొన్ని రోజులు చెయ్యగలడేమో
ఓ సంస్థ కదిలి ముందుకు వస్తే కొన్ని సంవత్సరాలు చెయ్యగలరేమో
అదే నా దేశమే ముందుకు వస్తే వాళ్ళ రాతలనే మార్చెయ్యగలమేమో

మనదేశ రక్షణా విభాగానికి ప్రస్తుతం వచ్చిన ఇబ్బంది ఏమి లేదు..

బ్రహ్మోస్, అగ్ని 1, 2, 3, 4, 5 అని ఇంకా చాలా సూపర్ సోనిక్ మిస్సైల్స్ అని, హైపర్ సోనిక్ మిస్సైల్స్ అని ఇలా వంద వున్నాయి. లేనిదల్లా దేశంలోని రోడ్లపై ఉన్నవారి రక్షణా భాద్యత. లక్షల కోట్లు ఖర్చు చేసే దేశ రక్షణా విభాగానికి ఓ పావువంతు ఈ ఓటులేని నిరుపేదలపై వెచ్చిస్తే దేశం మరింత ముందుకు పోగలదని ఆశిస్తున్నాను.

ప్రపంచస్థాయి లో నా దేశం ఎంత ఎదిగినా దేశం లోపల ఇన్ని సమస్యలతో ప్రజలు ఉన్నప్పుడు దానికి విలువ ఏమాత్రం ఉంటుంది .. "దేశమంటే మట్టి కాదోయ్ .. దేశమంటే మనుషులోయ్" అన్న గురజాడ అప్పారావుగారి మాటలు వృధా అయినట్లే..!!

విలాసపు విశ్రాంతి గదుల్లో వివేకం మరిచిన నేతలు మారనంత కాలం దేశం మారదు..

మారాలని మార్పు రావాలని మనసారా కోరుకుంటూ

స్వస్తి

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

Tuesday, June 27, 2023

వేకువ దృశ్యం...

 


ఎందుకో ఇవాళ
ఆవులిస్తూనే నిద్ర లేచాను
లేచి లేవగానే
రాత్రి కురిసిన అకాల వర్షానికి
బిడ్డలేమైపోయాయా అంటూ
మనసు ఒకటే మెలిపెట్టేసింది
నా ప్రమేయం లేకుండానే నా పాదాలు
పెరడు గుమ్మం వైపు నన్ను లాక్కెళ్ళాయి..!!

కళ్ళు నులుముతూ మసక మసకగా
రెండు రెప్పల మధ్యనుంచి చూసాను
గుంజీళ్ళుదీస్తూ లేవలేకపోతున్న లేత కనకాంబరం
రాలి నేలకంటుకుపోతున్న దాని పూ రెక్కలు
రుధిరం చిమ్మకుండానే తలలు తెగి
తునిగి పడివున్న ముద్ద మందారం మొగ్గలు
నీరెక్కువై అలసి నీరసించిన గుబురు మల్లె పొదలు
నాకేం కాలేదులే అంటూ నను ఓదార్చే ప్రయత్నం చేస్తూ
మేకపోతు గాంభీర్యం చూపే సన్నజాజి పందిరి
ఎన్ని ముళ్ళుండి ఏం లాభం
వర్షాన్ని ఏమి చెయ్యలేకపోయానే అంటూ
బోరునేడ్చె ఎర్ర గులాబీ
ఒక్కోదానికి ఎన్ని వ్యధలో .. మరిన్ని బాధలో
కొన్ని క్షణాలు వాటిని ప్రేమగా స్పృశించి
వాలిన వాటిని సరిచేసి రాలిన వాటిని ఏరిపారి
కుడిచేతి ప్రక్కన వున్న కాయకూరల దగ్గరకు వెళ్ళాను
ఈ పూట గుత్తివంకాయకని ఎత్తిపెట్టిన
నవనవలాడే వంకాయలన్నీ నీరసించి పడివున్నాయి
ఎంత త్రాగినా దాహం తీరని నిమ్మ కూడా
నాలుక వ్రేళ్ళాడదీసి సన్నగిల్లి పడివుంది
ఆకాశానికి నిక్కబొడిచే లేలేత బెండలు
సత్తువనిగి పుడమిపై వాలి వున్నాయి
రేయంతా నగ్నంగా తడిచిన మిరప, మెంతి,
పొదీనా, కొత్తిమీరాకు కూరలు
ఎక్కడికక్కడే కూలిపడి వున్నాయి
గతరాత్రి ఆకాశపు కారుమబ్బులు భీకర ప్రకంపనం
ఈలగా మారి ఊళగా మారి
రాకాసి గగ్గోలు ఘోష మహమ్మారియై
తిప్పించి, మళ్ళించి ఎత్తి నేలను మొత్తే విధ్వంసకారి అయింది..!!
పిల్లల ఏడుపుల్లా పెరడు మొక్కల విలవిల
పిల్లుల అరుపుల్లా బైటనుంచి చెవుల్లోకి
దూసుకొచ్చే జరజరా హోరు
నిశీధి చీకటిని చీల్చుకొచ్చే వెండి మెరుపుల వర్షపు జోరు
వాన నీరు చలిస్తే దానికి తగ్గట్టు గాలి కసిరి విసిరింది
అకాల వర్షపు అకటా వికట చినుకు తాండవ దృశ్యం..!!

ఓ చిన్న పెరడుకే మనం ఇంతలా బాధపడితే
ఆడా ఈడా అప్పుతెచ్చి పదిపరకా కూడగట్టుకొని
ఎకరాలకెకరాలు పండించే రైతు
తన శ్రమ, సమయం, యావత్తు తన జీవితమే పెట్టి
పంటను పండిస్తున్నాడు..
కాస్త ప్రకృతి కనికరిస్తేనే తనకంటూ ఒక బ్రతుకు
లేదంటే కుటుంబంతో రోడ్డుమీదకు వచ్చేవారు ఎందరో..!!
పైకి కనిపించే ఈ అందాల వెనుక కనిపించని ఓ మహా వేదనే దాగుంది..!!

Written by Bobby Aniboyina
Mobile: 9032977985

Friday, June 23, 2023

రుచిరాంగి..!!




ఎవరివే నీవు ??
కొండమల్లే వోలె వికసించి
సన్నజాజి వోలే పరిమళిస్తున్నావు..!!

ఇందుకు కదటే యుద్దాలు జరిగింది
ఇంత అందానికి కదటే
సన్యాసులు సైతం సమ్మోహనమయ్యేది
ఏ మన్మథుని ఉలి తో చెక్కాడే ఆ విధాత
ఉభయ సంధ్యల హిరణ్మయ రశ్మిని
శరదృతు వెన్నెల శీతలమును
ఏరుకొచ్చి, మేళవించి, దట్టించి, మలిచాడేమోనే
దిందిమి ధ్వనుల దిమిదిమితాండవ సుగాత్రివోలె
రతీఝర సరస రస శృంగిణి వోలె
పురివిప్పిన యౌవన వన మధుకమువై
పుడమిన చెంగు చెంగున తారాడు నిను జూడంగ
అరువు తెచ్చు వేల నేత్రమ్ములు సరిపోవునా...!!
నిను పొందేందుకు నూఱు జన్మలు సరితూగునా..!!

అగరు ధూపము లిడు ఏకాంత వేళ
మల్లెలు వికసించు రసమయ సమయమున
గుప్పున గుబాళించు నీ కన్నె పరిమళమ్ములు
ఒక్కొక్కటిగా నను ఆఘ్రాణింౘు తమకమున
రసరమ్యమగు నీ రూపు రేఖలు
అచంచలములగు నీ రస తనువులు
వర్ణింప సఖ్యమా..!!
అధరాలు కాదే అవి
సుధా రస మధుర ఫలములు
నగవుకులుకులు కాదే నీవి
బిగువు బింకముల తుంటరి సిగ్గులు
తుమ్మెద మెరుపులు కాదే అవి
వొంపుల నడుముకు ముద్దుల వడ్డాణమ్ములు..!!

తడి కురుల తన్మయత్వములు
దోర గోరింట పారాణి పాదమ్ములు
నడుమును ముద్దాడే నీలి కురులు
నతనాభిని గిల్లాడే పిల్ల తెమ్మెరలు
కులుకు సిగ్గులొలుకు నవనీతమ్ములు
ఇలా ఎన్నని చెప్పను ఏమని చెప్పను..!!

నిజమేనే రుచిరాంగి
నీ అందాల అధరాలపై మునిపంటి ముద్దులిడువగ
నీ శంఖపు కంబుకముపై రస పెదవుల మీటింపగ
నీ విశాల వక్షస్సుపై పూర్ణకుంభమున చుంబింపఁగ
నీ కాటుక కుచాగ్రములపై దోర జిహ్వన నలుపంగ
నీ నత నాభీయముపై నడుం నొక్కులు సవరింపఁగ
నీ అశ్వ గజ ఊరువులపై మేడ్రమున మర్ధించగ
నీ ఘన నితంబములపై ఇరు కరములు సలుపంగ
నీ బహుమూల రోమాళిపై చిరుపెదవితో దూయంగ
నీ వికసిత పూరెమ్మలపై నాలిక కొసన విచ్చదీయంగ
తమకమున ఇరు మనసులు, తనువులూ మత్తిల్లు వేళా,
రస దేహములు ఏకమై దందశూకములా పెనవేయు సమయాన
రాగమొక తాళమై, తాళమొక నాదమై
నాదమొక వేదమై, వేదమొక గానమై
గానమొక వాచ్యమై, వాచ్యమొక హావమై
హావమొక భావమై, భావమొక రూపమై
రూపమొక గాంధర్వమై నఖశిఖ పర్యంతం నిను ఆఘ్రాణించగన్..!!

నీ నిండైన స్త్రీ తత్వంలో
క్రీడించినా, రమించినా,
తుదకు మరణించినా.. సరే..
కానే కాదే తప్పు కించిత్తైనన్..!!

Written by : Bobby Aniboyina
Mobile: 9032977985

Tuesday, June 20, 2023

చిత్తరువు...


ఈ సాయంత్రం
ఎందుకో చాలా కొత్తగా కనిపిస్తోంది..!
రాసుకున్న
ప్రేమలేఖలన్నీ గదిలో ఒక్కొక్కటిగా ఎగురుతున్నాయి
అక్షర మక్షరంగా ముద్రించిన జ్ఞాపకాల పరంపర
తరంగాలుగా తాకుతున్న తపనల మధ్యన,
ఓ అంతరంగ స్వర్గానుభూతి ఏదో
నా పెదవంచులపై మంచులా కురుస్తోంది..!

నా కళ్ళ నిండా జ్ఞాపకాల నీలి తెరలు
అల్లుకుపోతున్న ఒకనాటి
రహస్య సమాగమాల చిత్తరువులు
వాటినుంచి గుప్పున వీచే జ్ఞాపకాల పరిమళాలు..!
మనసును మెలితిప్పి మరీ వెనక్కు లాక్కెళ్తున్నాయి..!!

ఇన్నాళ్లూ దేనికోసం నీరీక్షించానో
జీవితం ఎక్కడ మొదలైందో గుర్తురావటం లేదు..
ఎన్నో ఆలోచనలతో గాలి తెరకి కదుల్తున్న
నావలా ఊగుతూ గడిచిన సంద్రంలో
జ్ఞాపకాల వర్ణాలను ఏరుకోవాలని
ప్రయత్నిస్తోందీమనసు..!!

అప్పుడే విచ్చుకుంటున్న ఆకాశంలోని నక్షత్రాలు
మిణుకు మిణుకు మంటూ నా కళ్ళ ముందు
పువ్వుల్లా వికసిస్తున్నాయి
ఎన్నాళ్ళైందో ఇలాంటి వెన్నెలను మనసారా శ్వాసించి
క్షణం కూడా విడువక కళ్ళార్పకుండా అలానే చూస్తున్నాను
మబ్బుతెర దించేసుకొని ఆకాశంలో వెలిగి వెలిగి
అలసిపోయిన తారలు మెల్లిగా నిద్రలోకి జారుకున్నాయి..!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985