Tuesday, November 15, 2022

కలల వర్తకుడు ...



నేనొక కలల వర్తకుడను
నన్ను “కవి” అనకండి
రాత్రి కలలకోసమే నిద్రపోతాను
వేకువన కవితనై మేల్కొంటాను..!!

వర్షించే మబ్బుల పందిరి కింద
రంగురంగుల వస్త్రాలు కట్టిన
సీతాకోకచిలుకలు ముచ్చట్లాడుతున్నాయ్
గానభజానాతో గొంతు సవరిస్తూ
కోకిలలు పాటకచ్చేరికి సన్నద్దం చేస్తున్నాయ్
పువ్వుల పుప్పొడి మనసులను కొల్లగొట్టి
తేనెటీగలు వయ్యారాలు పోతున్నాయ్
ఝంఝామారుత జోరీగలై
తుమ్మెదలు సరాగాలాడుతున్నాయ్..!!

వేకువనే ఆహారం కోసం
దూర తీరాలకు వెళ్ళిన తల్లిపక్షి
రాత్రి కురిసిన వర్షానికి
ఎక్కడో తలదాచుకున్నట్లుంది
ఈ హంగామాతో మేల్కొన్న
గుడ్డులోని ఒంటరి పసి పిల్ల
పిగిలడానికి సిద్దమౌతోంది..!!

ఆ రెండు చెట్ల మధ్యన విశ్రమిస్తున్న
చిట్ట చివరి చంద్రుని కిరణం
ఏదో చెప్పాలని రేయంతా ఆరాటపడింది
రెప్పలు మూసుకుపోయే పాడు నిద్ర
తనకి ఆ అవకాశం ఇవ్వలేదు..!
అలిగిన చంద్రుడు ప్రక్కరోజు
అమాసై మౌనంగా ముసిఱాడు..!!

రాత్రంతా పహారా కాసిన చెట్ల కొమ్మలు
పొద్దున్నే చేతులు చేతులు కలుపుకొని
ప్రేమగా కబుర్లాడుతున్నాయి
ఒకే మట్టిని తిన్న చెట్ల వేర్లు
రుచికరమైన ఎన్నో ఫలాలను పంచుతున్నాయి
ఒకే గాలిని నింపుకున్న వేణువు
సప్త రాగాలను పలుకుతాయి
విభ్రమ నేత్రాలతో
తలచి తలచి చూడాలే కాని
కనిపించే ప్రతీది ఓ అద్బుతమే..!!

లోకబాంధవ్యుని కోట్ల వీర్య కిరణాలతో
ప్రకృతి కాంత పులకరించి పోతుంది
సమస్తమూ పచ్చదనముతో మురిసిపోతుంది..!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

Tuesday, November 8, 2022

ఓయ్ లేక్షణ ...



ఓయ్ లేక్షణ
ఇన్నేళ్ళ మన్వంతరాల
మన ప్రయాణంలో
మనం కలుసుకున్న
ఆ ఒక్క సందర్భం నీకు గుర్తుందా
శ్వేత వస్త్రములో నేనై
నిశీథ కాంతిలో నీవై
కాటుక కురులు
నడుమును తాకే వేళ
జత పెదవులు
కలిసి నర్తించే వేళ
ఇరు శ్వాసలు ఏకమై
ఒకే ఊపిరైన వేళ
నీ నుంచి అశ్రువులు
నక్షత్రాలై ప్రేమగా
రాలడం నేను చూసాను..!!

 

 
ఎవరో
ఏ లోకంలోనో వెలిగించిన
దీపంలా చంద్రుడు చూడు
మనల్నే ఎలా చూస్తున్నాడో
మన ఎడబాట్లే కదా
ఈ అమాస పున్నములు..!!

 

 
అయినా ఏమాట కామాటేలే
నిన్ను కనులారా చూడాలంటే
మొగ్గ పువ్వై పరిమళిస్తున్న వేళ
గొంగళి సీతాకోకై బయటకొచ్చే వేళ
గోవు గోముగా అరచేతిని ముద్దాడే వేళ
కానుగచెట్టు చివుళ్ళతో నిగనిగలాడు వేళ
సాయంసంధ్యా రశ్మిని శిశిరము ఏరే వేళ
వసంతం రాబోతున్న సాయంకాలంలా
వేయి కళ్ళ ఉద్యానవనంలా
నేను ఎదురుచూస్తూ వుంటాను..!!
మరోసారి మళ్ళి వచ్చి కలుస్తావ్ కదూ..!!

         Written by: Bobby Aniboyina

Mobile: 9032977985