కరువు సీమల
దప్పిక తీర్చేందుకై వచ్చిన వెలిమబ్బును
పొడితెమ్మెర మోహించింది
రెండూ చెట్టాపట్టాలేసుకొని
రేయంతా నడి సంద్రం మీద
వర్షాన్ని స్ఖలించాయి..!!
పచ్చని వర్ణాన్ని రాల్చుకొని
నగ్నంగా నిల్చున్న దశాబ్ధాల మహా వృక్షం
మోడుబారి మరణ వసంతానికై
వేర్లుచాపి నేలకొరిగేందుకు వేచి వున్నది..!!
బీటలువారిన మొండి నేల
పిడచకట్టిన నాలుక వేళ్ళాడేసుకొని
ఒక చుక్క నీటికోసం
తన ఆఖరి శ్వాస తీస్తోంది..!!
వెదురు తడికల ఇంటి వసారాలో
బెదురు మూల్గుల రైతు కంట తడి
గుక్క తీసే బిడ్డల ఏడ్పులలో
ఒక్క గింజైనా దొరకని వైనం..!
గంజినీళ్ళ ఎండు డొక్కలతో
ఎముకుల బొంత కప్పుకున్న
దేహాలకు సజీవ సాక్ష్యాలీ రైతు బ్రతుకులు..!!
Written by: Bobby Aniboyina
Mobile : 9032977985