తెలంగాణా రాష్ట్రంలో నా స్నేహితులు చాలా వరకు ఈ మగ్గం నమ్ముకొని జీవించే వారే.. వారి బాధలు, కన్నీళ్ళు, అలానే పత్తి రైతుల బాధలు వింటూ వింటూ కన్నీళ్ళు తుడవడం తప్ప ఏమి చెయ్యలేక పోయాను..కనీసం ఈ చిరు భావన అయినా వారికి ఒక ఓదార్పు ఇస్తే చాలు.. మగ్గాన్ని నమ్మునికి మిగిలినిపోయిన వాళ్ళు, బ్రతకలేక పట్నం పోయినవాళ్ళు, పోయినవాళ్ళ కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలై కాటికి పయనమయ్యే వారు.. నిజంగానే బాదేస్తుంది ఊహిస్తుంటేనే.. చాలా మామూలు విషయంగా అనిపించొచ్చు.. కానీ పడ్డ, పడుతున్న వారికి తప్పక తగుల్తుంది.. అందుకే తెలంగాణా యాసలోనే రాసాను..
ఎట్లుండవు కొడకా..
ఎప్పుడొచ్చినవ్..
పట్నంలా మంచిగుంటివా..!!
నే మంచిగుంటిలే అవ్వా..
నువ్వెట్లుంటివే ?
మంచిగుంటిని కొడకా..
ఈ సారి నువ్వేచ్చేటాల్లకు నేనుంటినో పోతనో
రకతము సల్లారిపాయే కొడకా..!!
తాత పోయినాక
మగ్గం చప్పుడు ఇనపడత లేదు
ఎటూ పోలేక ఇంట్ల గాలి
బీరిపోయినట్టుంది కొడకా..
తాత నేసిన బట్టలెవరూ తీసికొంటలే
రెక్కల కష్టమంతా ఏట్ల బోసినట్లాయే
దారపు కండెలకు దీసుకున్న
అప్పుల తాడు మెడకు బడే
యీదినమా,
మరు దినమా
అన్నట్లు కాటికి కాళ్ళు జాపుకొంటిని..!!
అంతా అయిపోయింది కొడకా..!
వయస్సు పోరగాళ్ళంతా
దేశాలు పట్టి పోయిండ్రు
ముసలి ముతక
యీడనే మిగిలి పోయిర్రి
దినమూ, రేతిరి
కండ్లల్ల వొత్తులేసుకొని
గుండెల్లో బాధతో
ఏడాదికో పీనుగు కాటికిబాయే..!
ఇయ్యాల రేపా అనే వరుసలో ఉన్నాము కొడకా..!!
వరిబియ్యం బువ్వలో
రొయ్యలకారం కలుపుకు
తినాలనుంది కొడకా..
చేసి పెట్టేవారు లేరు..
వున్నా
తిని తట్టుకునే వయసూ లేదు..
ముదుసలితనం ఒక శాపం కొడకా..!!
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985
No comments:
Post a Comment