ఓ వర్షం పడుతున్న సాయంత్రం
ఉరుముతున్న ఆకాశాన్ని చూస్తూ
ముఖము నిండా - నిండైన ఆనందాన్ని
పులుముకున్నాను..!!
కానీ
గుండెల్లో ఏదో దిగులు
వర్షపు తుంపర్ల మీంచి వీస్తున్న
చల్లని గాలి మేనుకు తాకినా
చలించలేకున్నాను..!!
ఒకప్రక్క
దారుణంగా క్రమ్ముకుంటున్న
మేఘాచ్చాదిత గగనం
కారుమేఘాలతో చీకటిని చేస్తూంటే..!
మరోప్రక్క
బాధల భల్లూకాలు గుర్తొచ్చి
నిలువునా కంపించి వేస్తున్నాయి.. !
కుండపోతగా కురుస్తున్న వర్షంలో
అన్నార్తుల కన్నీటి వరదల్ని చూస్తూ
కళ్ళను కప్పిన చీకటి పొరల్ని
చీల్చుకుంటున్నాను..!
ఓదార్చే మాటలు రెండు
మాటలైనా రాలుద్దామని
గొంతు సవరించాను
కానీ
గొంతు పెగలటం లేదు
మాట వెలికి రావటం లేదు..!!
కడుపు చేత బట్టుకొని
నిండుగా తడిచి
చిపో, ఛ పో అంటూ
చీదరించబడి
మూలాన వణుకుతున్న
పసివాడే కళ్ళమ్మట కనిపిస్తున్నాడు...!!
మారని రాతలు,
మార్పు రాని బ్రతుకులు వారివి
స్పందించని పీనుగుల హృదయాలు
ముఖాలపై అందాల ఉన్నికంబళ్ళు కప్పుకొని
ఇనప్పెట్టెలలో మూల్గుతున్న నోట్ల కట్టలతో
సుఖంగా కళ్ళుమూసుకొని
వెచ్చగా నిద్రపోతున్నారు..!!
వినపడకుండా మ్రోగే నా రుధిరం
కనపడకుండా కాగుతోంది నా
నరాల తీగల్లో..!
దశాబ్దాలు మారుతున్నా
వాళ్ళ జీవితంలో రవ్వంత కన్నీరు కార్చే
వెచ్చదనం కూడా కరువైపోయింది..!!
మనం సాధించింది ఇదేనా..
భావితరాలకు చూపించేది ఇదేనా..
వాళ్ళవే కాదు
మనవి కూడా
మారని రాతలు,
మార్పు రాని బ్రతుకులే మరి..!!
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985
మీయొక్క అక్షారారణ్యం పచ్చని అడవిలా(కనుల విందులా ) ఉన్నది.
ReplyDelete