“రాజకీయం” అంటేనే అతి దుర్భేధ్యమైన అత్యంత దుర్గంధమైన చీమునెత్తురులతో ప్రవహిస్తున్న వైతరణి లాంటిది.. ఎందుకో మొదటినుంచి నచ్చదు నాకు .. కనీసం వారిపై ప్రశ్నించేందుకు రాయటానికి కూడా మనసు వచ్చేది కాదు..! అది అలా రాయకుండా వుండటం వల్లనేమో ఓ అగ్నిపర్వతం లా ఏర్పడిపోయింది.. రాజకీయ రాబందులు రెక్కలు చాచి నా దేశాన్ని కబలిస్తున్నాయి.. ఎందుకో మనసు ఆగట్లేదు.. మార్పు రాదని తెలుసు..అయినా కలమును కదిలించి గళమును వినిపిస్తున్నాను.. మారుతారని కాదు.. ఆలోచిస్తారని..!!
ఓ ఓటరా..!!
మారరా..!!
కాకికి పండులా రుచించే ఎద్దుపుండువు నీవు
సర్వం దోచబడి ఉత్తుత్తి ఉచిత పథకంతో
బుజ్జగింపబడుతున్నావు..!
సంతృప్తి చెందబడుతున్నావు..!
జాలేస్తోంది రా ఓటరా..!
గర్భంలో రూపంకూడా దాల్చని పిండానికి
పిండాకూడు పెట్టె నీచమైన రాజకీయ తత్వమిది..!
పులి కనిపించదు, దాని జాడ తెలియదు
పంజా మాత్రం గట్టిగానే తాకుతుంది..!
తరాలు మారినా తలరాతలు యధాతథం
బూచిని భూతద్దంలో చూపించి
తోచిన పతివ్రతల కథలు అల్లేస్తారురా రేయ్..!
ప్రజాస్వామ్యాన్ని అదుపాజ్ఞలో పెట్టాలని
పథకాలను ప్రవేశపెట్టిందీ రాజకీయతంత్రం
తమ వేషం పటాపంచలవుతుందనే భయం వాడికి
నీతి భోదలతో, ఆప్యాయ మాటలతో
మాటల గారడీలు పలికిస్తాడు
లజ్జకే లజ్జేసి తుదకు నీవు కుళ్ళి కుళ్ళి
రోధించేలా చేసే నేర్పరిరా వీడు..!!
ఒరేయ్ ఓటరా..!!
ఇకనైనా మారరా..!!
పావలా నీకిచ్చి
తెలియకుండా పదింతలు
లాక్కునే లౌక్యం వాడిది..!
మీసమున్న ప్రతీవాడు వానికి బానిసైనాడు
ఊహల జీవితాలకు కులాల ఉచ్చులు వేసి
కాలగమన చక్రానికి నిను వ్రేళ్ళాడగట్టాడు
తన అవసరాలకు అనుగుణంగా అచ్చొత్తుకున్నాడు..!!
ఇదేరా రాజకీయం
తెలుసుకోరా వాని తంత్రం..!
అవసరముంటే నేను నీ వాణ్ని అంటాడు
అదికాస్తా తీరితే నీ స్థానాన్ని గుర్తుచేస్తాడు
అధికార మదం వాడిది
అవసరాల తత్వం నీది..!
మారు
ఇప్పటికైనా మారు
మారాల్సింది ప్రభుత్వాలు,
ప్రజాస్వామ్య వ్యవస్థలు కాదు,
మారాల్సింది నువ్వు..!
చిల్లర తీసుకొని నీవు తోకాడిస్తున్నంత సేపు
నీ బ్రతుకు నీది కాదు.. గుర్తుపెట్టుకో..!!
ధైర్యం చేసో దైవ సంకల్ప బలంతోనో
ధరణి మీదకు నువ్వొచ్చింది
వాడికి ఊడిగం చెయ్యడానికి కాదు
నీ తల్లి నిన్ను అందుకు కనలేదు
నీ బ్రతుకు నీ చేతుల్లో ఉండాలి
కడుబీద స్థితిలో కూడా
ఆశ చూపే నాయకుని వైపు చూడకు
ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని
రెపరెపలాడే జెండా లా
ఆత్మాభిమానంతో పొగరెక్కి బ్రతుకు
అదే రా నీ బ్రతుకుకు ఓ అర్ధం..!
బ్రతుకంటే అదే..!!
ఓటుతో వాడి తలరాతను కొట్టు
వాడి నోటు తీసుకొని నిన్ను తాకట్టు పెట్టుకోకు..!!
బడబానలాన్ని హృదిలో దాచిన ఓటరా
ఒక్కటి గుర్తుపెట్టుకో..!
నీవే గనుక విజృంభిస్తే
మనగలుగుట వాడి తరమా..!
బ్రద్దలై భస్మం చేయక
కోమాలో మ్రగ్గిన అగ్ని పర్వతమై
విస్ఫోటించి విలయమై
విప్లవించి శృంఖలాలు త్రెంచురా
ఈ కుటిల కుచర రాజకీయత్వమును..!!
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985