Friday, October 22, 2021

ఓ అసురసంధ్య వేళ..



ఎవరూ నీ చెంత లేని వేళ
ఎందుకలా ఆలోచిస్తూ కూర్చున్నావ్
పద పో..దాం
ఓ నలభై ఏళ్ళు వెనక్కు.. !!

ఆ ముడతలు పడ్డ
ముదుసలి స్మృతులు
వదిలి రా ...నాతో పాటు
ఆ దేహం మట్టికి
ఎరువవ్వక మునుపే
కదలి రా ...నా తో పాటు

శాలలో తడిసిన ఎండుగడ్డి
పొదుగును జుర్రే లే దూడ
వెన్నెల్లో ఆడిన దొంగాటలు
కలియ తిరిగిన పూ దోటలు
త్రోవ తెలియనితనంలో
తడబడుతూ వేసిన అడుగులు
ఇన్ని ఉండగా ఆ దిగులు ఎందుకు ?

అర్దరాత్రి అడవిలో పరుగెత్తే రైలులా
రహస్య నదీలోయ వంతెన నీడలో
కాలం పంపిన భవిష్య వర్తమాన సందేశాలను
తీరిగ్గా చదువుకుందాం రా..
ఇంకా ఏమంత వయసు అయిందని అంత దిగాలు..!
బంధాలు వదిలెల్లాయనా ..
బాంధవ్యాలు తెగిపోయాయనా
ఇప్పటికైనా నీకు స్వేఛ్చ కలిగింది సంతోషించు..

మృదువుగా తాకుతున్న ఆ
గాలులలోని ఘాడతను చూడు
ఏ తల్లి ఒడిలోనో మైమరిచి
నిద్రిస్తున్న పసిబిడ్డ శ్వాసదో అది ..!!
నీకు, నాకు అందరికీ విడిది
ఉత్తరాన ఉన్నటువంటి మైదానంలోనే
ఈ మాత్రానికే అంత నిర్లిప్తత ఎందుకు ?

ఏడు పదులు దాటినా
నుదుటిపై నాగేటి చారలు పడినా
నువ్వెప్పుడు పసిడికాంతులిడు
పంచముఖముల శోభిణివే..!!
బోసి నవ్వుల చిత్తరువువే..!!

సముద్రాల మీదనుంచి
మహా నగరాల దాకా అల్లుకున్న
ముసురుమబ్బును చూడు
ఊగిసలాడే లేత వరిపోచలపైన
మిలమిలలాడే నీటి ముత్యాలను చూడు
అందని రేగుపండు కోసం
ఆలోచిస్తూ కూర్చున్నావు
నిన్నను మరిచి
నేటిని వదిలి
రేపటిని ఆస్వాదించు
లే..
పైకి లే..
ఊతము వదిలి
నా చేయి పట్టుకో..
నేనో కలల వర్తకుడను..
నీ బాల్యాన్ని నీకే కొత్తగా చూపెడతా..
రా.. నాతో పాటుగా..రా.. !!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

2 comments:

  1. కాలం పంపిన భవిష్య వర్తమాన సందేశాలు - 👌👌👌

    ReplyDelete
  2. చాలా చాలా బాగుంది 👌👌👌

    ReplyDelete