Saturday, October 23, 2021

అవ్యక్త ప్రభాత సూర్యోదయం ...



నా ఇంటి బాల్కనీలో
ఉదయిస్తున్న సూర్య కిరణం..!

దూరంనుంచి వినిపిస్తున్న
రెహమాన్ సంగీతం..!

సాదరంగా ఆహ్వానం
పలుకుతున్న పడక కుర్చీ..!

గుప్పుమని వాసనలతో
పొగలు కక్కే చేతికందిన కాఫీ..!

ఊగుతూ పలకరిస్తున్న
కుండీలోని మందారాలు..!

అలజడి విశ్రమించిన వేళ
మది అంతా
ఒక పరాగ సౌఖ్యం ముసిరిన వేళ
ప్రభాతమొక స్వర్ణ హంసమై
రాగమొక ప్రత్యూష పవనమై
హృదయమొక గాలిపతంగమై
స్వేచ్చగా విహరించు సమయాన
రాలుతున్న పూలు రహస్యంగా
గుసగుసలాడటం నే వింటున్నా..!!

ఎండిన చెట్ల కొమ్మల మధ్యన
వసంతం విడిచిన గుర్తులు
ఏ బుడ్డోడో ఎగరవేసిన గాలిపటం
రంగులన్నీ వెలిసి ఇంకా
ఆ కొమ్మల్లో వేలాడుతోంది..

కాళ్ళు బారా జాపి కులాసాగా వాలుకుర్చీలో
కాఫీ తాగుతున్న నాకు ఎన్ని దృశ్యాలో
జీవిత సన్నివేశాలను అద్దంలా చూపించే
అవ్యక్త ప్రభాత సూర్యోదయాలు
ఎంత గమ్మతైనవో..కదా...!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

Friday, October 22, 2021

ఓ అసురసంధ్య వేళ..



ఎవరూ నీ చెంత లేని వేళ
ఎందుకలా ఆలోచిస్తూ కూర్చున్నావ్
పద పో..దాం
ఓ నలభై ఏళ్ళు వెనక్కు.. !!

ఆ ముడతలు పడ్డ
ముదుసలి స్మృతులు
వదిలి రా ...నాతో పాటు
ఆ దేహం మట్టికి
ఎరువవ్వక మునుపే
కదలి రా ...నా తో పాటు

శాలలో తడిసిన ఎండుగడ్డి
పొదుగును జుర్రే లే దూడ
వెన్నెల్లో ఆడిన దొంగాటలు
కలియ తిరిగిన పూ దోటలు
త్రోవ తెలియనితనంలో
తడబడుతూ వేసిన అడుగులు
ఇన్ని ఉండగా ఆ దిగులు ఎందుకు ?

అర్దరాత్రి అడవిలో పరుగెత్తే రైలులా
రహస్య నదీలోయ వంతెన నీడలో
కాలం పంపిన భవిష్య వర్తమాన సందేశాలను
తీరిగ్గా చదువుకుందాం రా..
ఇంకా ఏమంత వయసు అయిందని అంత దిగాలు..!
బంధాలు వదిలెల్లాయనా ..
బాంధవ్యాలు తెగిపోయాయనా
ఇప్పటికైనా నీకు స్వేఛ్చ కలిగింది సంతోషించు..

మృదువుగా తాకుతున్న ఆ
గాలులలోని ఘాడతను చూడు
ఏ తల్లి ఒడిలోనో మైమరిచి
నిద్రిస్తున్న పసిబిడ్డ శ్వాసదో అది ..!!
నీకు, నాకు అందరికీ విడిది
ఉత్తరాన ఉన్నటువంటి మైదానంలోనే
ఈ మాత్రానికే అంత నిర్లిప్తత ఎందుకు ?

ఏడు పదులు దాటినా
నుదుటిపై నాగేటి చారలు పడినా
నువ్వెప్పుడు పసిడికాంతులిడు
పంచముఖముల శోభిణివే..!!
బోసి నవ్వుల చిత్తరువువే..!!

సముద్రాల మీదనుంచి
మహా నగరాల దాకా అల్లుకున్న
ముసురుమబ్బును చూడు
ఊగిసలాడే లేత వరిపోచలపైన
మిలమిలలాడే నీటి ముత్యాలను చూడు
అందని రేగుపండు కోసం
ఆలోచిస్తూ కూర్చున్నావు
నిన్నను మరిచి
నేటిని వదిలి
రేపటిని ఆస్వాదించు
లే..
పైకి లే..
ఊతము వదిలి
నా చేయి పట్టుకో..
నేనో కలల వర్తకుడను..
నీ బాల్యాన్ని నీకే కొత్తగా చూపెడతా..
రా.. నాతో పాటుగా..రా.. !!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

Thursday, October 14, 2021

నేను రాసిన దుర్గమ్మ సాంగ్..


ఒక గమ్మత్తైన ఆలోచన వచ్చింది.. ఈ విజయదశమికి మంచి దుర్గమ్మ సాంగ్ రిలీజ్ చెయ్యాలని.. వెంటనే మల్లీశ్వరి క్రియేషన్స్ గుండేటి సాయి కృష్ణ గారికి కాల్ చేసాను.. చెప్పి చెప్పగానే తప్పకుండా చేద్దాం మీరు రాయండి అని నన్ను ముందుకు తోసేసారు.. అప్పటిదాకా మాములుగా వున్న నాకు ఒక్కసారిగా బాహువులు బరువుగా అనిపించాయి.. ఎంతో భాద్యత నాపై వుంది. దానికి వందశాతం నేను న్యాయం చెయ్యాలి. ఇదే నా ఆలోచన..



ఇక ఆలోచించడం మొదలు పెట్టాను..
నేను విన్నవి చూసినవి చాలావరకు అన్నీ ఒకేలాంటి పదాలు, ఒకేలాంటి రాగాలు, ఒకేలాంటి అభిరుచులు గల పాటలే వున్నాయి.. డిఫరెంట్ గా ఎవ్వరూ చెయ్యట్లేదు.. దానికి కారణం ఒక్కటే మనది విజయం సాధిస్తుందో లేదో అనే భయం ..
ఒక సాంగ్ హిట్ అయితే అదే తరహాలో మిగిలినవన్నీ క్యూ కడుతున్నాయి.. ఈ పద్దతి నాకు ఎందుకో నచ్చలేదు..
ఒకరిలా మనం చేసేది ఏంటి ?
మనకంటూ ఒక ఆలోచన లేదా ?
మనకంటూ ఒక గుర్తింపు లేదా ?
అందుకే నా ఇన్నేళ్ళ సాహిత్యాన్ని మొత్తం రంగరించి దుర్గా మాత మీద ఈ సాంగ్ రాసాను... ఎలా వుంది అన్న విషయం మీరే చెప్పాలి మరి!!
మన మల్లీశ్వరి క్రియేషన్స్ పతాకం పై “సిన్ని తరువాత” మరో సాంగ్ అమ్మవారిది రావడం చాలా ఆనందంగా వుంది.. అలాగే ఇందులో దుర్గమ్మ గా నటించిన నా ఆత్మీయ మిత్రులు, గొప్ప ఆర్టిస్ట్ అయిన కోట ప్రసన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు .. అలానే చక్కటి గాత్రంతో పాడిన వినీల గారికి, రోమాలు నిక్కపొడిచేలా సంగీతాన్ని అలకరించిన మహేందర్ గారికి, కోరియోగ్రఫీ సురేష్ గారికి, డైరెక్టర్ విరాట్ క్రియేషన్స్ గారికి, కెమెరామెన్ గారికి, మేకప్ ఆర్టిస్ట్ గారికి నా హృదయపూర్వక
అభినందనలు
..
మీకు నచ్చితే కనుక షేర్ చేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి ...
మీకు నచ్చితే మాత్రమే చెయ్యండి..
మీకు తప్పకుండా నచ్చుతుంది...
మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించి మీ వంతు సహకారాలు అందించమని అభ్యర్ధన 🙏🙏

https://youtu.be/ARPwzzEZjJI