నన్ను చూసినప్పుడు అతనికి పాతికేళ్ళు లోపు అనుకుంటా
ఏం సాధించాడనో ఆ ఆనందం మునుపెన్నడూ లేనివిధంగా
అతనికి ఇంకేమి అక్కర్లేదు ఈ లోకంలో ఒక్క నేను తప్పా
తడబడుతూ అడుగులేసినప్పుడు చూడాలి
అతని కళ్ళలో ఆ క్షణం మెరిసిన ఆ మెరుపును
పరిగెత్తుకొచ్చి గాల్లో ఎగరేసి తన గుండెలపై నడిపించుకునే వాడు
నాకింకా గుర్తే ఓ ఆరేళ్ళ వయసప్పుడనుకుంటా
తెలియక విసిరిన రాయికి – తగిలిన గాయానికి
మౌనంగా నిల్చొని మాటలు పడ్డాడు..
అతడంటే ఓ ధైర్యం మరి..!!
అందరం సంతోషంగా బయటకు వెళ్ళినప్పుడు
అతడు మాత్రం ముబావంగా ఉంటాడు
అందరూ అనుకుంటారు తీసుకెళ్ళడం ఇష్టంలేదనేమోనని
నిజానికి నేనూ తండ్రి అయ్యాకనే తెలిసొచ్చింది ..!!
తండ్రి అంటే ఓ రక్షణ ..
ఓ కాపుదల
దానికోసం తన చిన్న చిన్న
సరదాలను, సంతోషాలను గప్చిప్గా పక్కన పెట్టేస్తాడు
కంటికి కనురెప్పలా తండ్రి తన కాపుదలలో నిమగ్నమైనప్పుడు
ఇక సరదాగా మనతో ఎలా గడుపుతాడు
అయినా అతని ప్రేమ ఎప్పుడూ పడుకున్నాక
గాయాలకు మందు రాయడంలోనే తెలుస్తుంటుంది
జుట్టు నిమురి తలపై ముద్దు పెట్టుకున్నప్పుడే అనిపిస్తుంటుంది
అమ్మ ప్రేమ కనపడుతుంది
నాన్న ప్రేమ చూడాలంటే నాన్నవై నప్పుడే తెలుస్తుంది..!!