ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడుస్తున్న సమస్య..”కరోన” కాదు.. “నిర్లక్ష్యం”
కుటుంబంలో ఒక నిర్లక్ష్యపరుడు వుంటే ఆ కుటుంబానికి తీరని నష్టం వాటిల్లుతుంది.. అలాంటిది దేశం మొత్తం నిర్లక్ష్యపరులు వుంటే ఇక దేశమెలా బాగుపడుతుంది.. దేశానికి చీడపురుగులు రెండే రెండు స్వార్ధం, నిర్లక్ష్యం. ఈ రెండూ మనిషిలో ఉన్నంతవరకు కరోన కాదు రేపు మరోటి వచ్చినా కట్టడి చెయ్యడం మనిషి వల్ల కానిపని.
వ్యక్తిగత భాద్యత చాలా ముఖ్యం.. ఇది ఒకరు చెప్తేనో, నేర్పితేనో వచ్చేది కాదు.. ఎవరికి వారు స్వతహాగా తెలుసుకోగలగాలి..
దూరం దూరంగా వుండండి అంటే వినరు,
జాగ్రత్తలు పాటించండి అంటే పట్టించుకోరు
మీలో సమస్య వుంటే ఇంట్లోనే వుండండి అంటే వుండరు.
కాస్త ఓపిగ్గా వుంటే చాలు బయటకువచ్చి తిరిగెయ్యడం మరో వంద మందికి అది అంటించడం.. అదేమంటే మాకేం కాదు అనే ధీమా.. అవును నీకేం కాదు.. నీ నుంచి సోకినవారు పొతే నీకేంటి.. ఎంతో జాగ్రత్తగా భాద్యతాయుతంగా ఉన్నవారు కూడా నీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. నీకు అర్ధమౌతోందా ..!!
ఓ వారం రోజులు ఇంట్లో వుంటే నీదేం పోతుంది...
నీ ప్రాణాలు ఎలాగో నీకు లెక్కలేదు.. కనీసం చిన్న పిల్లలు, పెద్దవారికైనా విలువ లేదా..
మన భవిష్యత్తు రేపటి పిల్లలు
గతాన్ని చూసివచ్చిన మన పెద్దలు.. మనందరి మార్గదర్శకాలు.. వీరిద్దరూ మనకు ఎంతో ముఖ్యం. వీళ్ళకు ముందు నిలబడి కాచుకోవాల్సిన మనమే వారిని చంపేసుకోవడం శోచనీయం.
నీలో ఈ నిర్లక్ష్యం ఉన్నంతవరకు నీకు, నీ కుటుంబానికే కాదు నీ చుట్టూ ఉన్నవారికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
చిన్న ఉదాహరణ : రోడ్ లో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం, దాన్ని బండ్లు తొక్కడం, ఇంట్లో పిల్లలు వాటిని తెలియక ముట్టుకోవడం అది ఇంటిల్లిపాదికి సోకడం వారినుంచి మరో ఇంటికి ఇదే జరుగుతోంది.. మూలం ఎవరు ఇక్కడ అర్ధమౌతోందా ..!!
నీకు సోకినా కూడా నీ పనులు మాత్రం అస్సలు ఆగకూడదు.. పక్కోడు ఏమైపోతే నీకేంటి.. ఆ పక్కోడి ఇంట్లో వృద్దులు ఉండొచ్చు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉండొచ్చు.. పసిపిల్లలు ఉండొచ్చు నీ వల్ల వారు అకాలమరణం చెందుతున్నారు..నీకు అర్ధమౌతోందా ..!!
మనిషిగా పుట్టినందుకు మనం ఇతరులకు మంచి చెయ్యకున్నా పర్వాలేదు కానీ మనవల్ల ఇతరులకు చెడు మాత్రం జగరకూడదు అనే ఆలోచన లేకపోయింది ఈ రోజుల్లో..
నేడు మానవత్వం అంటే సాయం చేసేటప్పుడు తీసుకునే నాలుగు ఫోటోలు, అది చూసి పదిమంది నిన్ను స్తుతించే నాలుగు ప్రశంసా మాటలు..
నీకన్నీ తెలుసు.. అవును నీకు అన్నీ తెలుసు..!
ఎలా ఉండాలో తెలుసు
ఎలా ఉండకూడదో కూడా తెలుసు
కానీ నిర్లక్ష్యం.. ఎవరేమంటారులే అని..!
పాడి మొయ్యడానికి కూడా నలుగురు కావాలి..అలాటిది కళ్ళముందే ఇద్దరు భయంభయంగా తీసుకెళ్ళి సామూహికంగా తగలెట్టేస్తున్నారు .. మన దేశంలో పుట్టుక కన్నా చావుకు ఎంతో విలువ వుంది.. పది శుభకార్యాలకు పోకపోయినా పర్వాలేదు కానీ.. మనిషి ఆఖరి చూపుకు వెళ్ళాలి వారి మరణాన్ని మనం గౌరవించాలి అని భావించే నా దేశంలో ఈ దుస్థితికి కారకులు ఎవరు .. అర్ధమౌతోందా నీకు..!!
ప్రస్తుత పరిస్థితి మన చేయి దాటిపోయింది..
మిత్రులు పాజిటివ్ న్యూస్ నే పంపండి అని అంటున్నారు మంచి ఆలోచనే కానీ నెగటివ్ న్యూస్ లు జనాలను ఇంత భయపెడుతున్నా కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు కదా.. భయపడేది ఇంట్లో ఉన్నవారు మాత్రమే.. బయట విచ్చలవిడిగా తిరిగేవారు ఎవ్వరూ భయపడట్లేదు..ముందు అది గుర్తుపెట్టుకోండి..!!
దయచేసి అర్ధం చేసుకోండి.. మన నిర్లక్ష్యం విలువ కొన్ని ప్రాణాలు కావచ్చు..
నీకన్నీ తెలుసు.. అవును నీకు అన్నీ తెలుసు..
కాస్త జాగ్రత్త వహించు..!!
స్వస్తి.. __/\__
Written by: Bobby Aniboyina
Mobile : 9032977985