Saturday, January 30, 2021

అస్తమఉషోదయం....



కాలుతున్న చితిలోంచి
బూడిదై ఎగిరే రేణువులోంచి
ఎగిసి దూకి మీ ముందుకొచ్చి నిల్చున్నా..
ఈ యుగానికి నవ గ్రాంథిక రచన గావించేందుకు..!!

నా
నుదుటినంటిన స్వేద బిందువుల్లో
కాంతి కిరణాలు
తమ చెక్కిళ్ళు చూసుకుంటాయి
ఆ చెక్కిళ్ళ మీది మహా గాయాలను
మాన్పడానికి కాలంతో కలిసి
భావాల తైలం పూసుకుంటుంటాను..!!

మైళ్ళు విస్తరించే మర్రిచెట్టు ప్రాణం
పక్షి మలంలో ఎండిన బీజంలో గప్చిప్గా
దాక్కునివుంటుంది..!
రేపెమౌతుందో ఎవరికేం ఎరుక...
విశ్వాసంతో ముందుకెళ్ళడమే కడదాక..!
విశ్వాసం లేకుంటే అమ్మ గర్భాన్నే ద్వేషించే లోకమిది
అవిశ్వాసంతో బతికిన బతుక్కి ఇంతకాలం
ఊడిగం చేస్తున్న వాళ్ళం కదా..!!
మారని రాతలు
మార్పురాని బ్రతుకులు మనవి..!!

అక్షరాన్ని విల్లుగా ధరించిన వాడికి
దుఃఖపు కడలి వెన్నంటే పొంచి వుంటుంది
నేనెప్పుడూ ఒంటరినే మరి
చీకటి రాగానే నా
నీడ కూడా నన్నొదిలిపోతుంది
విభ్రమ నేత్రాలతో
ఎత్తైన శిఖరమంచున కూర్చుంటాను
నా నుంచి..
రాత్రంతా లోయలోకి
లోలోని భావాలు
ఒక్కొక్కటిగా రాలుతుంటాయి..!!

వాటిని అనుసరిస్తూ లోపలకెల్తే
బరువైన సంకెళ్ళ చప్పుడు
ఫెళ్లుమని తాకే కొరడా దెబ్బ
చిట్లిన చర్మపు ఛాయ
చిప్పిల్లిన వెచ్చని రుధిరం
గుప్పుమన్న మృత్యువాసన
కన్నీళ్ళు వెలసిన
దిగ్భ్రమాకాశంలో
రేపటి నవోదయానికి నోచుకోని
ఉషోదయాన్ని నేను చూస్తుంటాను..!!

భావాలను పొందిగ్గా పట్టుకొని
ప్రతీ చరణంలో పల్లవిలా పాడాను..
అక్షరాల్ని పిల్లపులుల్లా
వెంటేసుకొని బయల్దేరాను
విత్తు మొలకై,
మొలక వృక్షమై,
రేపటి ఆకాశాన్ని
ముద్దాడుతూ,
అనంత సూర్యాస్తమయంలో
ఆహుతి అయ్యేందుకు..!!

Written by : BOBBY Aniboyina
Mobile : 9032977985

Saturday, January 23, 2021

మరణ పర్యంకం...



గుప్పుమనే
అగరొత్తుల వాసన
రెండు బొటనవేళ్ళను
కలిపి కట్టిన దారం
మిణుకుమిణుకు మంటూ
వెలిగే తలదగ్గర దీపం
నిశ్శబ్దానికి చోటే లేని
గుండెలలిసే రోదన
శోకంతో కన్నీరు కార్చే నయనాలు
పూరించే శంఖం చప్పుడు
ఆగి ఆగి మ్రోగే కాంస్యపు గంటలు
సువాసన వదిలిన పూలు
చిట్టచివరి ప్రయాణానికి
సిద్దంగా వున్న నాలుగు కాళ్ళ పాడే
అది మోసేందుకు
తడి ఆరిన గొంతుకలతో
ఎదురు చూస్తున్న నాలుగు భుజాలు
మొలతాడు తెంచేందుకు
తయారుగా వున్న నూతన వస్త్రాలు
నీ అనుకున్న నీ వాళ్ళు వేసే
ఆఖరి పిడికెడు మట్టి..!!
నాలుగు మెతుకుల కోసం నేలని నమ్ముకునే శరీరం
ఆ నేలకు కూడా ఆఖరి క్షణాల దాకా లొంగదు
కడుపులోంచి పుట్టిన శరీరం
ఊపిరి ఆవిరైపోయి స్మశానాన్ని చేరాక మాత్రం
స్వచ్ఛమైన మట్టి వాసనను ఆస్వాదిస్తుంది..!!

గాలిని తోసేసే నీడలు,
నీడల్ని నమిలేసే చీకటి
నీ ఇంట్లో ఆరిన దీపం
చీకట్లో వెలిగి చీకట్లోనే కలిసిపోయే
మిణుగురుల జీవితం ఇది..!
ఏనాటికైనా నిశ్శబ్దంగా నేలను
కౌగిలించుకోవాల్సిందే..!!

Written by: BOBBY Aniboyina

Friday, January 22, 2021

అక్షరారణ్యం


 


అక్షరారణ్యం
*********

ఇవాలేంటో
ఆలస్యంగా లేచాను
లేచీ లేవగానే
ఆకురాయిని చేతబూని
అక్షరాలను సానపెట్టాను..!
ఇవాల్టికి రెండే రెండిటినైనా
జేబులో వేసుకుపోదామని..!!

అప్పుడే రాలుతున్న
లేలేత హిరణ్మయ రశ్మిని
ఓపిగ్గా పోగు చేస్తూ
అక్షరాలపై కాస్త జల్లి
వాటిని మనోహరంగా మలిచాను..!!

పదబంధాలకోసం
ఎక్కడెక్కడో తిరిగే వాడిని
మానవ ప్రపంచాన్ని వీడి
మనోప్రపంచానికి చేరి
సుదూర తీరాల వెంబట వెతికే వాడిని
ఎన్నెన్ని నిద్ర లేని రాత్రులు
కళ్ళముందు గప్చిప్గా కరిగిపోయాయో
ఎన్ని నిశీధములు భళ్ళుమని
వెక్కిరించి వెళ్ళాయో
ఎన్ని వేకువలు వస్తూ వస్తూ
చులకనగా చూస్తూ సాగాయో
ఒక్క అక్షరాన్ని మలచడానికి
కేవలం
ఒకే ఒక్క అక్షరాన్ని మలచడానికి
ఎన్ని పురిటినొప్పులు పడ్డానో..
ఒక్క నాకు మాత్రమే తెలుసు..!!

రా .. నా ప్రపంచానికి
నా,
మనోప్రపంచంలో
వలసపోతున్న పక్షుల గుంపు రెక్కల శబ్దంలో కూడా
సున్నితమైన జార్జ్ సంగీతం దాగుంటుంది..!!

కొమ్ములతో కుమ్ముతూ
వొళ్ళు విరుచుకుంటూ మట్టిని ఎగరకొడుతున్న
పోట్ల గిత్తలో కూడా ఓ మహాకవి కనిపిస్తాడు..!!

నగర ఎతైన భవనాలమీంచి
పైకి లేచే చంద్రబింబం
పాలకడలి మధనంలో తృళ్ళిపడ్డ
అమృత చుక్క వలె కనిపిస్తుంది..!!

మీద పడ్డ చినుకు
వెన్నుపూస లోంచి
జిల్లుమంటూ జారిపోయే
వణుకుపాటు కూడా
మనోహరంగా ఉంటుంది..!!

అక్షరాన్ని కాస్త కోపంగా రాస్తే చాలు
చీకటి రహస్యాల మాటున
చిరిగిన కాగితపు వర్షంలోంచి వచ్చి
నా జేబులోని అక్షరాల మధ్యన
బిక్కుబిక్కుమంటూ దాక్కుంటాయి..!!

కాగితంపై నే రాసే అక్షరాలు
మంత్రాక్షరాలై నాలో పగటి కలల్ని సృష్టిస్తాయి
స్వప్నంలోంచి కనపడే కలకలం నాలో
రంగురంగుల ఇంద్ర ధనుస్సుల్ని పుష్పిస్తుంది..!
సూత్రం తెగిన గాలి పతంగిలా
నా కలం యదేచ్చగా పయనిస్తుంది..!!
ఇదే నా అక్షర అరణ్యం..!
నా అక్షరారణ్యం..!!

Written by: BOBBY Aniboyina

Friday, January 8, 2021

చేజారిన సుగంధం...


 నీ

నుంచి రాలిన
మహాసుగంధం కోసం
ప్రాచీన పర్వతాలన్నీ వెతికాను..!

పక్కన
నువ్వు వున్నప్పుడు
నా గుండెకు
నీ గుండె చప్పుడు
తాకుతున్నా తెలియరాలేదు..!
ఊపిరి మల్లెల సుగంధమై
నను అల్లుకున్నా తెలియరాలేదు..!
మెత్తని నీ శృంగార స్పర్శ
సమ్మోహన పరుస్తున్నా నాకు తెలియరాలేదు..!
వంటరిగా నా చెయ్యిని
నువ్వు వదిలేసినప్పుడు
చీకటి నన్ను అలుముకుంది..!
గది మూలన బూజు
వేళ్ళాడుతూ వెటకరించింది..!
నా మది నిండా కమ్ముకున్న
ప్రచండ తుఫాను
తీరం దాటే దేనాటికో..!!

నా
ఇంద్రియాల్ని
అదృశ్య సంకెళ్ళతో బంధించుకున్నాను
ఒంటరిగా తచ్చాడుతూ,
దేవదారు తరు పంక్తుల మధ్య
ఓ సాయం సంధ్యా వేళలో
కొద్ది కొద్దిగా హిరణ్యరశ్మిని
ఏరుకుంటూ అనుభవాల్ని
తవ్వుకున్నాను..!!

నా
మది పుస్తకంలో
నే అపురూపంగా
దాచుకున్న నెమలీకవి నీవు..!
గాలి కెగురుతున్న నీ
నీలి రంగుల శిరోజాలు
నా రెండు కళ్ళ మధ్యన
ఇంకా ప్రకంపిస్తూనే వున్నాయి ..!
ఆ రోజులన్నీ మన మధ్య ఇక వెళ్ళినట్లే నేమో
కాలానికి అటువైపున నీవు
ఇటువైపున నేను..!!

మహావలయ మాయా కల్పిత నా
జీవిత జగన్నాటకంలో
అనుకోని అతిథిగా నీవొచ్చి నిల్చున్నావు
చీకటి మొగ్గ వెలుగు రెక్కలు విప్పుకున్నట్లు
నా జీవితం ఒక్కసారిగా ప్రకాశవంతమైంది
సైకిల్ పై ఇంటికి చేరే ప్రేమ లేఖలా
తోటలోంచి ఎగిరొచ్చే బొండు మల్లె సువాసనలా
మురిపించావ్, మైమరిపించావ్..!
ఆ సుగంధమే కరువైందీనాడు..!!

ఎక్కడని వెతకను ?
ఎంత దూరమని తిరగను ?
ఇన్నేళ్ళ మన ప్రయాణంలో
మార్పేదైనా ఉందా అని చూసా
ఆలోచనల్లో లేదుకానీ
సమయాన్ని కేటాయించడంలోనే వచ్చింది చిక్కంతా..!
రాకేం చేస్తుంది లే..
ఎదురుగానే వున్నా
సంద్రానికి అటువైపున నీవు,
ఇటువైపున నేను..!!

నిశితంగా చూడు
వెచ్చని వెలుతురును
చిక్కని చీకటి కప్పుతూ వస్తుంది
నువ్వు కూడా బంధమనే మలుపు దగ్గర
బాధ్యతనే రేపటికోసం వెళ్ళిపోయావ్ కదా..!!

విభ్రమ నేత్రాలతో చేజారిన
సుగంధాన్ని ఇక వెతకడం మాని
గడిచిన నీ మధుర జ్ఞాపకాలతోనే
ఇకపై నా ప్రస్థానం ముగుస్తుంది..!!

Written by: BOBBY Aniboyina