నేను రాసిన ఈ కథ నిజ జీవితంలో జరుగుతున్న యదార్దాలకు తార్కాణం.. చాలా రోజులతరువాత కుటుంబ విలువలతో కూడిన కథ వ్రాసాను.. చదివి అభిప్రాయాలు చెప్తారు కదూ...
“మాతృ” ప్రయాసము
*******************
వేసవికాలం ఇప్పుడిప్పుడే ముగుస్తూ ఉండటం చేత ఆకాశం చాలా నిర్మలంగా ప్రశాంతంగా వుంది..
ఉదయం పావు తక్కువ తొమ్మిది గంటల సమయం కావస్తోంది .. ఇంతలో తలుపులు దబదబామని బాదుతున్న చప్పుడు ..,
వేకువనే ఆరు గంటలకు లేచే అమ్మ ఇంకా నిద్ర లేవలేదు.. !
ఈ ముసలావిడకు ఇంత బద్ధకం ఏమిటి ?
బారెడు ప్రొద్దెక్కినా ఇంకా నిద్ర లేవలేదా ? .. అంటూ కళ్ళు నులుముకుంటూ కోడలు రేవతి నసుగుతూ వచ్చింది.. కొడుకు శేఖర్ తలుపును బాదుతూనే ఉన్నాడు .. యీ లోపు ఇరుగుపొరుగు పోగైంది..
ఇంతసేపట్నుంచి బాదుతున్నా ఉలుకు, పలుకు లేదంటే కొంపదీసి టపా కట్టేసిందేమోరా .. శేఖరా .. ఆస్తి పాస్తి గట్రా ఏమైనా పక్కాగా రాయించుకొని వున్నారట్రా అంటూ ఓ పక్కింటావిడ ..
ఇంకేం ఆస్తి మిగిల్చారు నాకు.. ఉన్న యీ ఒక్క ఇల్లు తప్ప.. అంటూ ఈసడింపుల కొడుకు..
ఇవన్నీ వింటూ గుండెను అరచేతిలో పెట్టుకొని బోరున ఏడుస్తూ, సలసలమని కాగే దేహంతో వణుకుతూ అడుగులో అడుగేసుకొని, ఒపికనంతా కూడగట్టుకొని, తలుపుతీసి కిందకు పడిపోయింది వసంతమ్మ...
అబ్బబ్బబ్బా ఏమీ.. నటనో .. సినీరంగంలోకి వెళ్ళివుంటే మంచి నటి అయ్యేవారు అత్తయ్యా.. అంటూ కోడలు రేవతి వేళాకోళంతో ..వెటకారపు మాటలు.
ఏంటమ్మా ఇందాకట్నుంచి తలుపు బాదుతున్నా వచ్చి తీయలేదు.. మేమేమనుకోవాలి ?? కొట్టి కొట్టి నా చేతులు చూడు ఎంతలా కాయలు కాచిపోయాయో.. అయినా బాలేనప్పుడు మాకు ఒక్క మాట చెప్తే ఏమౌతుంది ? ఏదో ఒకటి చేస్తాము కదా.. ఇలా అందరినీ ఇంటికి పిలిచి ఇబ్బంది పెట్టాలా ?? గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తీసుకురావడం నీకు బాగా అలవాటు అయిపోయింది.. సరే ఇక లేచి అక్కడ కూర్చో.. వెళ్ళి మందులు తీసుకొస్తాను అంటూ అమ్మ తలగడా క్రింద వున్న డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళాడు శేఖర్..
పడక కుర్చీ దగ్గరకు లాక్కొని అందులో కూర్చుంది వసంతమ్మ.. మనిషిలో చలనం లేకున్నా మనసులో మాత్రం ఆలోచనలు కదిలిపోతున్నాయి.. ఇంతలోనే పరుగుపరున వచ్చింది వసంతమ్మ చెల్లెలు ఈశ్వరమ్మ..
ఏంటక్కా ?? ఏమైంది ?
నీకు ఆరోగ్యం బాలేదంట ?
తలుపుతీయకుండా అందరినీ భయపెట్టావంట ?
ఏది కాస్త ఆ మెడ పైకెత్తు అంటూ తన చేతిని మెడపై వుంచి జ్వరాన్ని పరిశీలిస్తూ, వసంతమ్మ కళ్ళలోకి చూసింది.. కళ్ళనిండా నీరే.. ఆ కళ్ళు కూడా మందారంలా ఎర్రగా ఉన్నాయి ..
ఎలా బ్రతికినదానివి .. ఎలా అయిపోయావ్ అక్కా .. ! అంటూ..
తన చీర అంచుతో కన్నీరు తుడుచుకుంటూ... అందరూ ఒకే ఇంట్లో వుంటారనే కాని .. ఈ చిన్న రూములో నీ బ్రతుకు నీదై పోయింది అక్కా..
కొడుకు కోడలు వున్నారనే కాని ఎవరిదారి వారే యమునా తీరే అన్నట్లు వుంటుంది.
ఎన్ని సార్లు చెప్పాను నీకు ... నాతోపాటు ఇంటికి వచ్చేయమంటూ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. పద నీకు నేను వున్నాను.. కలిసే పుట్టాము..కడదాకా నీతో కలిసే ఉంటాను
అక్కా..దయచేసి నాతోపాటు రా..
అంటూ వసంతమ్మ గడ్డం పట్టుకొని బ్రతిమిలాడింది.. ఈశ్వరమ్మ.
వణుకుతున్న కంఠముతో .. నీతోపాటు నేను వస్తే వీళ్ళను ఎవరు చూసుకుంటారే ..!!
అయినా మా ఇంటి రామాయణం నీకు తెలియనిదా..
ఒక్కగానొక్క బిడ్డ అని చిన్న నాటినుంచి వాడికి శ్రమ తెలియకుండా పెంచాడు మీ బావగారు..,
ముందునుంచి నేను చెప్తూనే వున్నాను .. కష్టం విలువ, ఆ కష్టం నుంచి వచ్చిన ధనం విలువ రెండూ వాడికి తెలియాలండీ అని.. నా మాట విన్నారా ఆయన.. ? ఇప్పుడు అనుభవించకతప్పడం లేదు..
ఆయనకేం ఉన్నన్నాళ్ళూ సకల సేవలు చేయించుకొని... కళ్ళు మూసాడు.
ఇక్కడ నేను ఒక్కదాన్నే బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతూ, భగవంతుని పిలుపుకోసం ఎదురు చూస్తూ నా జీవితాన్ని ఈ ఇంటిని ఇలా భారంగ నెట్టుకొస్తున్నాను ..అంటూ కన్నీళ్ళను తుడుచుకుంది వసంతమ్మ.
చదువుకున్నాడనే కాని వాడికి ఏ ఒక్క పనీ చేతకాదు... పెళ్ళి చేస్తే అయినా మారుతాడు, బాధ్యతగా మసలుకుంటాడని మా దూరపు చుట్టాలమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేస్తే ఆ అమ్మాయి కూడా వాడికి గంతకు తగ్గ బొంత అయింది.. వాడికి చెప్పి చెప్పి అలసిపోయాను.. చెప్పే సమయం, వినే పరిస్థితి వాడెప్పుడో దాటిపోయాడు..ఇప్పుడు కూడా నేను గుమ్మం దగ్గర పడితే .. నాకు ఎలా వుందని అడగడం కానీ, నన్ను లేపడం కానీ చెయ్యలేదు వాడు.. !
వాడి చిన్నప్పుడు దోమకాటు జ్వరం వస్తే ..
వాడికి ఏమీ కాకూడదని నూటయెనిమిది ప్రదక్షిణలు మోకాళ్ళతో చేసాను..
నా కాళ్ళనుంచి రక్తం పోతున్నా నాకసలు ఏమీ అనిపించలేదప్పుడు ..వాడు పుట్టాక ఆ ఆక్షణమే నా గురించి ఆలోచించడం మర్చిపోయాను..
పిల్లల్ని కని, పెంచడం వరకే మన బాధ్యత .. వారు మనల్ని చూస్తారని, ఏదో చేస్తారని మాత్రం వారి నుంచి ఆశించకూడదే ఈశ్వరీ.. ఇది నేను అనుభవపూర్వకంగా చెపుతున్న యదార్ధమే అని మెల్లిగా లేవబోయింది పడక కుర్చీనుండి వసంతమ్మ!
అందరి పిల్లల బాధ్యత తల్లితండ్రులకు ఒక సమయం దాకానే వుంటుంది.. కాని వీడి బాధ్యత నాకు నేను పోయేదాకా ఉంటుందేమో.. కడుపులో బిడ్డను తల్లి తొమ్మిది నెలలే మోస్తుంది.. నేను ఇప్పటిదాకా వీడిని మోస్తూనే వున్నాను..
వీడు పుట్టినప్పటినుంచీ అన్నిటికీ మారామే..
నా కోడలు రేవతి అయిన వాడిని దారిలో పెట్టలేకపోయింది.. వాడికి మరింత సోమరితనాన్ని అలవాటు చేసింది.. ఇద్దరు సోమరిపోతులు అయ్యారు కాని నా మనసులోవున్న వేదన ఒక్కటే .. రేపు నేను పోతే..బాధ్యత తెలియని నా పిల్లలు ఎమైపోతారోనని! అయినప్పటికీ ఎన్ని కన్నీళ్లను చిందించిన వారు మారుతారేమోనన్న ఆలొచన ఆశ నాకు లేదమ్మ ఈశ్వరి అంటూ తన చేతిని పట్టుకొని మెల్లిగా నడుస్తూ మంచం మీద కూర్చుంది వసంతమ్మ.
ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోకతప్పదు
రానీ వాడి సంగతి చెప్తా..!! ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి..అంటూ ఈశ్వరమ్మ బిగ్గరగ.. అమ్మాయ్ రేవతి కాస్త ఇటురావమ్మా.. అంటూ రేవతిని పిలిచింది..ఇంతలో వసంతమ్మ కొడుకు శేఖర్ కూడా మందులు తీసుకొని వచ్చాడు .. ఇద్దరు గదిలోకి ఒకేసారి వచ్చారు.
ఏరా శేఖర్ అమ్మ పడుతున్న కష్టం అనుభవిస్తున్న
బాధ మీ ఇద్దరికీ కనిపించట్లేదారా.. ??
కనిపించకపోగా ఆమెపై ఇంతలా పెత్తనం చేస్తూ...నువు నీ బార్య ప్రతినిత్యం అవమానిస్తున్నారు మాటలతో కృంగదీస్తున్నారు ...
ఏనాడు మీ ఇద్దరి అంతరాత్మ మిమ్మల్ని ప్రశ్నించలేదా ??
అయిదు ఎకరముల భూమిని తానొక్కతే దున్ని, పంటపండిస్తూ ఆత్మాభిమానంతో ఇంటిని మిమ్మల్ని పోషిస్తుందే దీనికి ప్రతిఫలంగా మీరు ఇచ్చే గౌరవం మర్యాద ఇదేనా?.
మీ అమ్మ .. మీ అయ్యలా మారి మీ కోసం గాడేద్దులా దుక్కిదున్నుతోంది నీకు కనిపించట్లేదా రా..ఇక ఎప్పటికి తెలుసుకుంటావు ? మీ అమ్మ అంతరంగాన్ని..తనొక విశ్రమించని కెరటమని !!
మీ నాన్నగారు పోయి ఇప్పటికి ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా.. ఇంత వయస్సు వచ్చిన నీకు ఇంకా కష్టం తెలియకుండానే పెంచుతోంది.. నీకు అర్ధమౌతోందా..!! నువ్వు ఇంకా మీ అమ్మ కొంగుచాటునే నిల్చుని వున్నావ్ రా .. ఎప్పుడు వస్తావ్ ఆ కొంగు వదిలి ముందుకు.. అమ్మా నేను ఉన్నాను అని ధైర్యంగా.. ఎప్పుడు కలిగిస్తావ్ ఆమెకు నీ ధైర్యాన్ని..
ప్రతీ రాత్రి కన్నీళ్ళతో కాపురం చేస్తుంది రా మీ అమ్మ .. ఆమె మనోవేదనతో రోజు తడిచి ముద్దౌతున్న ఒక్క తలగడకు మాత్రమే తెలుసు.. ఆమె నుంచి బయటపడిన నీకు తెలియట్లేదా.. ?
శేఖర్ తలవంచుకొని మౌనంగా ఉండిపోయాడు.. రేవతి లో కూడా అదే మౌనం...అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించిపోయింది. ఈశ్వరమ్మ తన కళ్ళను తుడుచుకుంటూ ..మీ అమ్మ రోజువారి జీవితం ఎలా గడుస్తుందో మీకు అస్సలు తెలియదు కదా.. ఈ రోజు నేను చెప్తాను.. వినండి.. విన్నాక అయినా నీలో నీ బార్యలో మార్పు రాకపోతే ఇక భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి..
మీ అమ్మ రాత్రిళ్ళు ఎప్పుడు పడుకుంటుందో మీకు తెలియదు.. కాని ఉదయాన మాత్రం ఆరు గంటలకే ఇంట్లో పనులు అన్నీ చక్కబెట్టి .. పొలం దగ్గరకు వెళ్తుతుంది. అసలు మీకు మీ తాత గారి పొలం ఎక్కడవుందో కూడా తెలియదు.. ఏనాడైనా బాధ్యతగా ఒకసారి వెళ్ళి మీకు చూడాలనిపించలేదా.. ? అందులో మీ ముత్తాతల కాలంనాటి బావి వుంది.. అందులో నుంచి మోటారు ద్వారా ఆ.. అయిదు ఎకరముల భూమిని తడుపుతుంది..ఒక్కోసారి కరెంట్ కోతలు కలిగినా, మోటారు రిపేర్లు వచ్చినా ఇక ఆరోజు ఆమె పడే కష్టం అంతాఇంతా కాదు.. మీభూమి ఆనుకొని వేరొకరి భూమికి పారుదల కాలువ వుంది కాని వారి పొలంలో నుంచి మీ పొలంలోకి రానివ్వరు .. వారితో గొడవకు పోలేక మీ అమ్మ అలానే పొలం పనులు చేసుకుంటుంది.. అసలే అది వేరుశనగ పంట...దానికి నీరు బాగా అవసరం ఉంటుంది. అన్నీ సక్రమముగా వుంటే మీ అమ్మకు రోజులో ఒక అరపూట నీరు తడపడానికే పడుతుంది.. అది అయిపోయాక రెండు ముద్దలు తిని కాలువగట్లు అన్నీ సరిచేస్తూ సంధ్యాస్తమయం దాకా వంచిన నడుము పైకెత్తకుండా పని చేస్తుంది.. రోజు ఇంతకష్టపడి పంట చేతికొచ్చాక ఆడదే కదా అనే చులకన భావంతో పంట కోసేవాడు దగ్గరనుంచి దళారీల దాకా ఆమెను పీక్కుతినేవాడే.. అంతాపోను మిగిలిన డబ్బును మీ కొరకే ఖర్చు చేస్తూ మీ చేతనే మాటలు పడుతూ గడిపేస్తుంది.., కంకణాలు వేసుకున్న ఆ చేతులు నేడు కాయలుకాసి కందిపోయి వున్నాయి... కట్టిన కోక తిరిగి కట్టకుండా పెరిగిన ఆ వైభవం నేడు రెండే రెండు చీరలతో కాలం గడుపుతోంది.. నాడు పదిమంది కడుపులు నింపిన ఆమెకు నేడు ప్రేమతో పెట్టె పది పచ్చడి మెతుకులు దొరకడమే భారమైనది..
ఏమమ్మా రేవతి నిన్ను మీ అత్తగారు ఏనాడైనా పల్లెత్తుమాటైనా అన్నదా ..నలుగురిలో నిన్ను ఎంత గొప్పగా చెప్పుకుంటుందో నీకేమి తెలుసు..?
ఊరువాడా అమ్మలక్కలు ఏకమై కోడలికా నువ్వు రోజు వండిపెట్టేది అని అడిగినప్పుడు...అది ఇంక చిన్న పిల్లే కదా అంటూ నవ్వుతో అక్కడనుంచి మాటలు తప్పించుకొని వచ్చేసే మీ అత్తయ్యనా నువ్వు ఇంతలా వేళాకోళం చేసేది..అని ప్రశ్నిస్తూ
బిడ్డల్ని కనగలమే కానీ వారి తలరాతలు కాదుగా.., నేనూ ఒక తల్లిగా చెప్తున్నాను.. ఇలాంటి బిడ్డలు కనకున్నా బాగుండేమోననిపిస్తుంది.. అంటూ వసంతమ్మ భుజాన్ని నిమురుతూ మంచమీద నుండి నిలబడుతూ ఇంక ఇలా ఎన్ని రోజులు మీ అమ్మను బాధపడెతారో మీకే తెలియాలి అంటూ ఆవులకు మేత వేసి వస్తాను అని ఇంటికి బయలుదేరింది వసంతమ్మ చెల్లెలు ఈశ్వరమ్మ.
ఇక శేఖర్, రేవతి కూడా అక్కడ నుంచి లేచి మౌనంగా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు..
మరుసటిరోజు ఉదయం ఆరు గంటలౌతోంది.. వసంతమ్మ అప్పుడే తన రెండు చేతులను రుద్దుకొనిచూస్తూ పైకి లేచి కూర్చుంది.. ఈ రోజేంటో కొత్తగా అనిపించింది వసంతమ్మకు.. ఏదో తెలియని మానసికానందం.. పక్షుల అరుపులు కూడా చాలా కొత్తగా వినిపిస్తున్నాయి.. బహుశా నిన్నటి రోజున పూర్తిగా విశ్రాంతి తీసుకున్నందుకేమో అని అనుకుంటూ తలుపు తీసింది.. ,కోడలు రేవతి ఎలా ఉంది అత్తయ్యా ఇప్పుడు మీ ఆరోగ్యం అంటూ నవ్వుతూ పలకరించింది.. ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసింది.
శేఖర్ మాత్రం కనిపించలేదు..
రేవతిని అడిగే ధైర్యం చెయ్యలేకపోయింది..వసంతమ్మ. ఇంతలో రేవతే చొరవ తీసుకొని .. అత్తయ్యా నన్ను క్షమించండి...!
మీ అంతరంగాన్ని నేను గ్రహించలేక పోయాను... నన్ను ఏనాడు మీరు కోడలుగా చూడలేదు.. మీ కూతురుగానే భావించారు .. అలాంటిది అర్ధం చేసుకోక మిమ్మల్ని నేను ఎంతో కష్టపెట్టాను.. దుఃఖపెట్టాను.. అంటూ పాదాలను తాకుతుండగా .. తన భుజాలను పట్టుకొని పైకి లేవదీసి నవ్వుతూ తన కోడలను హత్తుకుంది వసంతమ్మ..
అత్తయ్యా ఇప్పటివరకు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మసిబారిన మీ జీవితమే కనిపిస్తోంది.. ఇకపై ఈ క్షణం నుంచి మీకు మధురమైన జ్ఞాపకాలు మాత్రమే ఉండేలా చూసుకుంటాను... అంటూ వసంతమ్మ ఎదురుగా నిలబడి చేతులు జోడించి పశ్చాత్తాపంతో చెప్పసాగింది రేవతి.
మీరు ఇద్దరూ నా బిడ్డలే..మీరు బాగుండాలనే కదా నేను కష్టపడేది..ఎప్పుడూ బాధతో వచ్చే కన్నీళ్ళే కాని .. మొదటిసారి ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి... చాలు అమ్మాయ్ రేవతి ఈ జన్మలో చూడలేననుకున్నది చూసేసాను.. ఈ క్షణం నేను కళ్ళు మూసిన చాలు మరేం దిగులు లేదు అంటూ తన కళ్ళను తుడుచుకుంది ఆనందంతో వసంతమ్మ.
ఇంతలో తలపాగ కట్టుకొని మోకాళ్ళ ఎత్తున పంచ కట్టుకొని కొత్తగా కనపడ్డాడు శేఖర్.. ఆ దృశ్యం చూడగానే వసంతమ్మ ముఖములో ఓ వెలుగు.. ఎంట్రా ఈ అవతారం అంటూ పలకరించింది వసంతమ్మ..
పొలం వెళ్ళి పారుదల నీటిని మన పొలం లోకి మళ్ళించి వస్తున్నాను అమ్మా.. ఇప్పటి నుండి నువ్వు పొలంకి వెళ్ళవలసిన అవసరం లేదమ్మా అంతా నేను చూసుకుంటాను అని అన్నాడు శేఖర్.
వసంతమ్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.. కొడుకు నుంచి నిజమైన ఆనందాన్ని చవిచూడడానికి వసంతమ్మకు ముప్పై ఐదేళ్ళు పట్టింది..!!
నిరుత్సాహం పడవద్దు ఏనాటికైన సహానం, ఓర్పు, నిస్వార్దం, నిజాయితీ, నిజమైన ప్రేమ గెలుస్తుంది అనడానికి వసంతమ్మ జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణగ చెప్పవచ్చు.
Writtenby: Bobby Aniboyina
Mobile: 9032977985