Saturday, February 29, 2020

“జీవితం”


“జీవితం”
నువ్వు అనుకున్నట్లు అది ఒక వాక్యం కాదు 
దాని రహస్యం నీకెప్పటికీ బోధపడదు..!!

కొందరు మాత్రం తీరంవెంబడి పల్లీలు తింటూ,
తీరిగ్గా ఆడాళ్ళ పై అక్షరాల్ని పారబోసుకుంటూ ఉంటారు..
చుట్టూ వున్న వారి కన్నీళ్ళు వాళ్ళకు అక్కర్లేదు..!!

భయపెట్టి గాండ్రించే సంద్రమే 
ఒక్కోసారి నీ కన్నీళ్ళు చూసి 
నిను దగ్గరకు పిలుస్తుంది.. 
దాన్ని నువ్వు ఎన్నటికీ గుర్తించలేవు ..!!

నీ పాదాలకింద మెత్తగా నలిగే 
పుడమి నిను హత్తుకోవాలనిచూస్తుంది 
దాన్ని నువ్వు ఎప్పటికీ చూడలేవు..!!

నీ తలపై 
నిత్యం వికసించే అపూర్వ పుష్పం ఆకాశం .. 
తలెత్తి చూసినా ఆ సౌందర్యాన్ని 
ఎన్నటికీ వీక్షించలేవు..!!

నీ చూట్టూ ఎందరు వున్నా 
నీలోని జీవితం తాను వొంటరినేనని తెలుసుకుందో ఏమో 
భోరున కురిసే చిమ్మ చీకట్లలో నీకోసం పెడబొబ్బలు పెడుతూనే ఉంటుంది.. 
అనంత దుఖంలా నిలవబడ్డ ఆ జీవితం 
నీలో ఆశలు తెగిన పక్షిలా, 
కడుపులోనే... రగిలే చిచ్చును దిగమింగుతూ, 
అప్పుడప్పుడు పరామర్శకొచ్చే 
నీ జీవితంలోని సంతోషాలను, ఆనందాలను 
తన విషాద గీతాలతో భయపెడుతూనే ఉంటుంది.. 
నిను ఉలిక్కి పడేలా చేస్తూనే ఉంటుంది..!!

Written by: Bobby Nani

Friday, February 7, 2020

స్వప్నంలో సుగాత్రి


ఇది కేవలం భావకవిత్వం మాత్రమే.. కాకపోతే వచనను, ఉత్ప్రేక్షల ను అతి స్వల్పంగా రంగరించాను.. భావకుడు తన దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో స్వప్నంలో వుండగా సుగాత్రిని దర్శించడం ఆమె అందానికి ముగ్ధుడవ్వడం, తన అందాన్ని ఆస్వాదించడం, గంధర్వ కన్య అని పొరపడటం, తరువాత మాయదారిమబ్బు ఆకాశాన్ని కమ్మినట్లు ఆమె కనుమరుగై హటాత్తుగా స్వప్నంలోనుంచి బయటకు రావడంతో ఈ కవితకు పరదా పడుతుంది.. పాఠకులు ఒక భావనతో ప్రయాణించేలా ఈ కవిత సాగుతుంది. నా ఈ కవిత కొందరినైనా అలరిస్తుందని ఆశిస్తూ ..!!


స్వప్నంలో సుగాత్రి
*************

ఏముందని నా ఈ జీవితంలో 
శూన్యం తప్ప.. !!
చీకటి అగాధాలలో, 
విశ్రమించని మృత్యుకీలపై, 
స్వప్న పేటికలో పడున్నాను.. 

ఇంతకీ ..!
నేను సజీవంగానే వున్నానా ? 
మృత్యువంటే మరో జీవన ద్వారం తెరుచుకోవడమేనా ?

సుప్తావస్థలో వున్న నాలోని అగ్ని సర్పం 
మళ్ళి నా నేత్రాల మధ్యలో తిరిగి ఎప్పుడు ఉదయిస్తుందో ..!!
చీకటీ, శూన్యం తప్ప మరేదీ కనిపించని నా 
జీవితంలో ఓ వసంత స్వప్నం తళుక్కున మెరిసింది.. 
నన్ను ఏకాంతపరిచే రహస్య నాదమేదో ఒకటుందని, 
శ్వేత నక్షత్రం తన తలుపులు తెరిచి ఆహ్వానించేదాకా నాకూ తెలియలేదు..!!

నా కనురెప్పలపై ఆశల నక్షత్రాలను 
కొవ్వొత్తులుగా అమర్చుకుని చూస్తున్నాను
దీపంనుండి ఉదయాంతరకోశం దాకా..!!

మంచుబిందువుల ముసుగులో మల్లెపూవువోలె..
మదనపంచమి చినుకుల్లో చిగురుటాకు వోలె..
పూర్ణిమచంద్రిక తరంగాలుప్పొంగు ఆత్మీయ తరంగిణి వోలె.. 
నా కంటిముంగిట కొచ్చి నిలుచుంటివి .. 
నినుజూచి నా మనసు ఉయ్యాల వెన్నెల్లో ఉర్రూతలూగింది..!!

క్షీరములో నవనీతమువై, 
పువ్వులో పుప్పొడివై,
మధువు లో మధురిమవై, 
ఝుంఝూమారుత ఝర్ఘరీయధ్వనులు జముకు జముకు 
అలలై, లయల కెరటాల రీతి నర్తించు నీ పాద పద్మములను చూచి 
గంధర్వ కన్యకని విభ్రమ చెందితిని..!!

నూతనాకాశాల నీడ 
పుష్పించు దివ్య కుసుమములా తళుక్కున అలరించావు
కాలపు చెక్కిళ్ళ మీద 
ఆకాశం రాల్చే కన్నీటిచుక్కలను చూచి 
కెవ్వున కేక వేసి లేచి కూర్చున్నాను 
కల కన్న పసిబాలుడిలా..!!

Written by: Bobby Nani