SOCOTRA
-The Mysterious Island-
మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...
ఏదో ఒకటి చెయ్యాలి .. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటూ తనలో తానె అనుకుంటూ తీవ్రమైన ఒత్తిడికి లోనై మదనపడుతూ గట్టిగా కళ్ళు మూసుకుని తలపైకి పెట్టి తన చేతులు రెండూ చాచి అలానే ఉండిపోయింది మీననేత్రి (జలకూన)..
నా శక్తి ఏంటి? దాన్ని నేనెలా తెలుసుకోవాలి ?
ఎలా ఎలా ఎలా మార్గం ఎలా అంటూ తనలో తానె పదే పదే అనుకుంటూ వుండగా..
తరువాత ఏంటో చూద్దాం పదండి..
33rd Part
ఇదివరకు నేను వచ్చినప్పుడు ఆ మీనాల దగ్గరవరకు కూడా రాలేక ఊపిరి తీసుకోవడం కష్టం అయింది.. ఇప్పుడేమో ఆ మీనాలను దాటుకొని మరి ఇంతలోతులో వున్నాను.. అంటే దానర్ధం నా భయమే నన్ను ఆపుతోందన్నమాట అని తనలో తాను అనుకుంటూ .. కిందకు చూసింది..
కాలానికి మరో ప్రక్కకు వెళ్ళే మార్గాలు (కాలరంధ్రములు- Black Holes) అవి ఈ చంద్రిక కొలను అడుగుభాగంలో ఉన్నాయన్న విషయం తనకు గుర్తుకు వస్తుంది.. శరవేగంగా ఆ రంద్రాలవైపు వెళ్ళింది మీననేత్రి (జలకూన)..
నల్లని చీకటితో ఊపిరి ఆగేంత ఒత్తిడి తో మెలికవంటి మార్గం కలిగిన దారిలో తన భయాన్ని అధిగమించి తను మెల్లిగా ముందుకు వెళ్తుంది.. కొన్ని నిమిషాలు అలా వెళ్ళగా వెళ్ళగా నీలం వర్ణము గల వెలుగు ఒకటి కనిపించింది.. కళ్ళు పెద్దవి చేస్తూ ఆ నీలం వర్ణము గల వెలుగులోనికి తను ప్రవేశించింది.. అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూస్తూ ఆశ్చర్యం తో అలానే స్తబ్ధముగా ఉండిపోయింది..
తనకు కొన్ని గజాల ఎత్తులో .. పదుల సంఖ్యలో సాగర కన్యలు తిరుగుతున్నాయి..
నేనే ఆఖరి మత్స్యక అనుకుంటే ఇక్కడేంటి ఇంతమంది వున్నారు ? అని అనుకుంటూ వారి వైపుగా వెళ్ళింది మీననేత్రి (జలకూన).. వారంతా తనవైపే ఆశ్చర్యంగా చూస్తూ తనని ముట్టుకుంటూ మళ్ళి భయంతో వెనక్కు వెళ్తూ వున్నారు..వారందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళగానే ఓ అందమైన మత్స్యక తననే చూస్తూ తన దగ్గరకు రమ్మని పిలుస్తుంది…
సందేహంగా, కాస్త ఇబ్బందిగా తన ముందుకు వెళ్ళి నిల్చుంది .. ఇది కాల రంద్రములలోని ఒక అందమైన అంతర్భాగము.. ఇక్కడకు ఎవ్వరూ రాలేరు.. ఇక్కడ కాలముతో పనిలేదు.. ఎప్పుడూ ఒకేలా వుంటుంది.. నా పేరు శకులి .. మీ అమ్మ ఆత్మాశి నా సోదరీ.. కొన్ని శతాబ్దాల నాటి సంగతి ఒకటి చెప్పాలి నీకు.. అంటూ ఇలా మొదలు పెడుతుంది..
మా వంశంలో నేను, మీ తల్లి ఆత్మాశి మాత్రమే మిగిలాము.. ఆ శ్వేత మీనాలకు రక్షణగా నన్ను బాధ్యత తీసుకోమన్నారు.. కానీ నాకు అది ఇష్టం లేదు.. నా జీవితాన్ని నేను ఆనందంగా గడపాలని అనుకున్నాను.. నాకన్నా వయస్సులో చిన్నదైన ఆత్మాశి ఆ కార్యానికి ముందుకు వచ్చింది.. నేను తనని ఎంతో వారించాను.. వాటికి రక్షణగా వుండటం అంటే ఆత్మాహుతి తో సమానమని హెచ్చరించాను.. అయినా నా మాట వినలేదు.. దాన్ని తను ఓ బాధ్యత అనుకుంది.. ఇక నేను అక్కడ నుంచి ఈ కాల రంద్రంలో ప్రయాణించి నా శక్తిచే అందమైన ఈ అంతర్భాగమును ఎర్పరుచుకున్నాను.. ఈ పన్నెండు మంది కన్యలు నా పిల్లలు.. మీ అమ్మ ఆత్మాశి నా మాట విని వుంటే ఇవాళ నువ్వు ఇలా భయంతో, గమ్యమెరుగని ఆలోచనలతో సతమతమవుతూ పిచ్చిదానిలా ఎటు వెళ్ళాలో మార్గాన్ని అన్వేషిస్తూ వుండేదానివి కాదు.. అలానే మీ అమ్మ మరణించేది కూడా కాదు అని అంటుంది శకులి..
నా తల్లి మరణాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను.. అలానే తన బాధ్యతను కూడా నేనే తీసుకుంటాను. నిజానికి భయపడేది నేను కాదు.. బాధ్యతను ఆత్మాహుతి అని భయంతో ఇక్కడకు చేరుకున్న మీరే భయపడుతున్నారు.. ఆ రోజు మీకన్నా చిన్నదైన నా తల్లి భయపడలేదు.. ఈరోజు మీ పిల్లల వయస్సు వున్న నేను భయపడలేదు.. అయినా నేను భయపడేది నా మరణం కోసం కాదు.. ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించలేకుంటే ఎందరో అమాయకులు మరణిస్తారు.. సృష్టి తారుమారు అవుతుంది.. ఆ తప్పు నా వల్ల జరగకూడదు అని నిరంతరం భయపడుతున్నాను.. ఆనందంగా వుండటం అంటే దేహాన్ని అందంగా చూసుకోవడం కాదు..హృదయాన్ని జ్యోతిలా వెలిగించడం..అది మరొకరికి ఉపయోగపడేలా జీవించడం .. వెలుగుతున్న జ్యోతి మాత్రమే మరెన్నో జ్యోతులను వెలిగించగలదు .. ఈ సత్యాన్ని మీరు అర్ధం చేసుకోలేకపోవడం నిజంగా మీ మూర్ఖత్వం.. అయినా ఇన్ని శతాబ్దాలనుంచి ఇక్కడ జీవిస్తున్నారు ఏం సాధించారు.. ?? అని అడుగుతుంది మీననేత్రి (జలకూన)..
శకులి కి నోట మాట రాలేదు.. మౌనంగా ఉండిపోయింది.. సరే ఇక ఇక్కడ నుంచి నేను వెళ్ళాలి.. అంటూ వెనక్కు తిరిగి వెళ్తుండగా.. ఒక్క మాట.. అంటూ ఆపుతుంది..
నీలో నా సోదరి కనిపించింది.. తను ఇంకా సజీవంగా వుంది నీలో..
నీ మాటలు నాకు చాలా చాలా నచ్చాయి.. నీ శక్తిని నీవు తెలుసుకునేందుకు నీకు నేను సాయ పడతాను.. . ఇలా రా అంటూ తన చేయి పట్టి తీసుకెళ్తుంది శకులి..
ఓ దట్టమైన చీకటి ప్రదేశానికి తీసుకెళ్ళింది..
నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలంటే ముందు నిన్ను నువ్వు నమ్మాలి.. అంటూ శకులి తన తోక భాగాన్నిఇలా చూడు అని చూపిస్తుంది..
మన బలం, బలహీనత అంతా ఇక్కడే వుంటుంది..ఎంతటి ప్రమాదం ఎదురైనా ఈ తోక భాగాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.. మన శక్తులన్నీ దానిలోనే ఉంటాయి .. ఆ తోక భాగాన్ని చూస్తేనే అర్ధం అవుతుంది.. తాను ఎంత శక్తివంతమైనదో.. నీ తోక భాగం నాకన్నా రెండు రెట్లు అధికంగా వుంది..నీ శక్తి ఏంటో ఇక వేరే చెప్పనక్కర్లేదు.. ఈ తోక భాగంలోనే మన శక్తులు ఉంటాయన్న విషయం అత్యంత రహస్యమైనది .. అది నీలోనే వుండాలి.. జాగ్రత్తగా గుర్తుంచుకో .. అంటూ.. ఓ మూడు అడుగులు ఎత్తున నిలబడి కళ్ళకు మిరిమిట్లు గొలిపేంత బంగారు వర్ణంలోకి మారి పోతుంది శకులి.. తన కళ్ళు కూడా నీలం రంగులో మారిపోయి వున్నాయి.. తన తోకనుంచి శరీరమంతా ఒక వెలుగును చిందే పొరలా సృష్టించి నువ్వు ఇలా చెయ్ అంటూ మీననేత్రి (జలకూన)ని ప్రోత్సహిస్తుంది.. తను కొన్ని అడుగులు ఎత్తున లేచి తన తోకను ఆడిస్తూ ప్రయత్నించగానే రెండు మీనాల దగ్గర ప్రకాశించిన తెల్లని వెలుగు కన్నా పదిరెట్లు నవనీతపు వెలుగు ఆ ప్రదేశమంతా విస్తరించింది..
నిజంగా అద్బుతం చేసావు.. చంద్రిక కొలను శక్తి మొత్తం నీలోనే ఇమిడి వున్నట్లు వుంది.. మీ అమ్మను మించిపోయావు అంటుంది శకులి..
వారికి కాస్త దూరంగా వెళ్తున్న ఓ పెద్ద చేపను శకులి తన శక్తితో చంపేస్తుంది.. దాన్ని అలానే తీసుకొచ్చి దీన్ని బ్రతికించు అంటుంది..
మీననేత్రి (జలకూన) ఆశ్చర్యంగా చూస్తూ, అది నేనెలా చెయ్యగలను..
నీలో సప్తధాతువులు ఉన్నాయన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావా ? అని అడుగుతుంది శకులి
వున్నాయని తెలుసు కానీ నా వల్ల అయ్యే పనేనా.. అంటుంది మీననేత్రి
ముందు నిన్ను నువ్వు నమ్మాలి అని చెప్పాను కదా..
సరే నాలోవున్న సప్తధాతువులను నేను ఎలా ప్రేరేపించాలి అంటుంది మీననేత్రి..
నీ శక్తిని నీ చేతుల్లోని తెచ్చుకో .. మనసులో బలంగా తన ప్రాణం పొందాలని కోరుకుంటూ దానిపైనే లగ్నంచెయ్యి.. నీ దృష్టిని ఆ చేప పై కేంద్రీకరించు..తరువాత నీ చేతిని దాని తలపై పెట్టు అనగానే .. చెప్పినట్లే చేస్తుంది మీననేత్రి.. ఉలిక్కిపడినట్లుగా ఆ చేప ఒక్కసారిగా కదిలి చాలా వేగంగా వెళ్ళిపోయింది.. నిజానికి ఇలా నేను చెయ్యలేను… నాకు అంత శక్తి లేదు.. నాశనం చెయ్యడం వరకే నా శక్తి ఉండిపోయింది.. కానీ నీది అలా కాదు.. నాశనం అయిన దాన్ని తిరిగి పునరుద్ధరణ చెయ్యగలిగే అతీత శక్తి నీలో వుంది.. నువ్వు చాలా ప్రత్యేకమైనదానివి.. మొట్ట మొదటిసారిగా నీలాంటి మత్స్యకను చూస్తున్నాను అంటుంది శకులి..
నువ్వు శక్తిని ఉపయోగించేటప్పుడు ఒకటి గమనించాను.. నీ తోకభాగం ఉన్నదానికన్నా ఆ సమయంలో చాలా వెడల్పుగా మారుతూ, తగ్గుతుంది.. దాని అర్ధం నువ్వు త్వరగా అలసిపోవు.. వెంటనే తిరిగి శక్తిని పొందుతావు.. ఇలా నీలో ఎన్నో అతీత శక్తులు దాగున్నాయి.. మన పూర్వీకులందరి శక్తులు ఒక్కొక్కటిగా నీకు సంక్రమించినట్లు ఉన్నాయనిపిస్తుంది అంటుంది శకులి..
ఇక లే..!!
త్వరగా వెళ్ళు..
నీ వాళ్ళను..ఆ చంద్రిక కొలనును రక్షించుకో అంటుంది శకులి..
తనని గట్టిగా హత్తుకొని మళ్ళి నేను తిరిగి వస్తాను అని చెప్పి మెరుపువేగంతో అక్కడనుంచి చంద్రిక కొలనులోకి వెళ్తుంది మీననేత్రి.. అప్పటికే ఆ కన్నీరు కొలను మొత్తం విస్తరించి ఆ రెండు మీనాలు కూడా స్పృహ కోల్పోయి పడివున్నాయి.. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అనుకొని ఆ చంద్రిక కొలను అడుగుభాగానా చాలా వేగంగా వృత్తాకారంలో తిరుగుతుంది మీననేత్రి..
ఆ వేగానికి చంద్రిక కొలనులో భయంకరమైన సుడిగుండం ఒకటి ఏర్పడుతుంది..
To be continued …
Written by : BOBBY
మీరు లవ్ కవితలు ప్రకృతి కవితలు స్త్రీ అంగాంగ వర్ణన సౌందర్య వర్ణన భావోద్రేక వర్ణన అత్యద్భుతంగా మీరు వర్ణిస్తున్నారు వీటిని బట్టి మీరు బాగా పాపులర్ అయ్యారు మేము మీ ఫ్యాన్స్ అయిపోయాం,👌💐👍 కానీ మధ్యలో ఈ స్కూటర్ కథలు మనకు ఎందుకండీ అసలు మాకు నచ్చలేదు.
ReplyDelete